Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుఃసప్తతితమోధ్యాయః

శివ పూజావిధిః.

ఈశ్వర ఉవాచ :

శివపూజాం ప్రవక్ష్యామి ఆచమ్య ప్రణవార్ఘ్యవాన్‌ | ద్వారమస్త్రామ్బునా ప్రోక్ష్య హోమాదిద్వారపాన్‌ యజేత్‌. 1

గణం సరస్వతీం లక్ష్మీ మూర్ధ్వోదుమ్బరకే యజేత్‌ | నన్దిగఙ్గే దోక్షిణథ స్థితే వామగతే యజేత్‌. 2

మహాకాలం చ యమునాం దివ్యదృష్టినిపాతితః | ఉత్సార్య దివ్యాన్‌ విఘ్నాంశ్చ పుష్పక్షేపాన్తరిక్షగాన్‌. 3

దక్షపార్షిత్రిభిర్ఘాతైర్భూమిష్ఠాన్యాగమన్దిరమ్‌ | దేహలీం లఙ్గయేద్వామశాఖామాశ్రిత్య వై విశేత్‌. 4

ప్రవిశ్య దక్షపాదేన విన్యస్తాస్త్రముదుమ్బరే | ఓం హాం వాస్త్వధిపతయే బ్రహ్మణ మధ్యతో యజేత్‌. 5

మహేశ్వరుడు చెప్పెను : స్కందా! ఇపుడు శివపూజా విధానమును చెప్పుచున్నాను. ఆచమనము చేసి ప్రణవ జపము చేయుచు సూర్యునకు అర్ఘ్య మీయవలెను. పిమ్మట పూజామండపద్వారమును 'ఫట్‌' అను మంత్ర ముచ్చరించుచు ఉదకముతో తడిపి, ప్రారంభమున 'హాం' బీజముతో నంది మొదలగు ద్వారపాలకులను పూజింపవలెను. ద్వారముపై ఉదుంబరవృక్షము స్థాపించి, లేదా భావన చేసి, దాని పై భాగముపై గణపతి - సరస్వతీ - లక్ష్మీ దేవులను పూజించవలెను. దక్షిణభాగమున నందిని, గంగను, వామభాగమున మహాకాలుని, యమునను పూజింపవలెను. పిమ్మట దివ్యదృష్టి ప్రసరింప చేసి దివ్యవిఘ్నములను తొలగించుకొనవలెను. వాటిని ఉద్దేశించి పుష్పములు విసరి, ''ఆకాశచారివిఘ్నము లన్నియు తొంగిపోయినవి.'' అని భావన చేయవలెను. కుడి మణవతో మూడు పర్యాయములు భూమిపై కొట్టి, ఇట్లు చేయుటచే భూతములపై నున్న సర్వవిఘ్నములు తొలగి నట్లు భావన చేయవలెను. పిమ్మట యజ్ఞమండపము యొక్క కడప దాటవలెను. ఎడమ కొమ్మ పట్టుకొని లోపల ప్రవేశించి, ఉదుంబరవృక్షమున అస్త్రన్యానము చేసి, మండపమధ్యమున పీఠాధారభూమిపై ''ఓం హాం వాస్త్వధిపతయే బ్రహ్మణ నమః'' అను మంత్రముతో వాస్తుదేవతాపూజ చేయవలెను.

నిరీక్షణాధిభిః శ##సై#్త్రః శుద్ధానాదాయ గడ్డుకాన్‌ | లబ్ధానుజ్ఞః శివాన్మౌనీ గఙ్గాదికమనువ్రజేత్‌. 6

పవిత్రాఙ్గః ప్రజప్తేన వస్త్రపూతేన వారిణా | పూరయేదమ్బుధౌ తాంస్తాన్గాయత్ర్యా హృదయేన వా. 7

గన్ధకాక్షతపుష్పాది సర్వద్రవ్యముచ్చయమ్‌ | సన్నిధీకృత్య పూజార్థం భూతశుద్ధ్యాది కారయేత్‌. 8

దేవదక్షే తతో న్యస్య సౌమ్యాస్యశ్చ శరీరతః | సంహారముద్రయాదాయ మూర్ధ్ని మన్త్రేణ ధారయేత్‌. 9

భోగ్యకర్మోపభోగార్థం పాణికచ్ఛుపికాఖ్యయా | హృదమ్బుజే నిజాత్మానం ద్వాదశాన్తపదేథవా. 10

నిరీక్షణాశస్త్రములచే శుద్ధము చేయబడిన గడ్డుకములను చేతిలో గ్రహించి, భావన ద్వారా శివాజ్ఞ గైకొని, సాధకుడు మౌనముగా గంగాది నదీతటమునకు వెళ్ళి, అచట తన శరీరమును పవిత్రము చేసికొని గాయత్రి మంత్రజపము చేయుచు వస్త్రముతో వడగట్టిన జలముతో జలాశయమునందు ఆ గడ్డుకములను నింపవలెను. లేదా హృదయబీజమును (మనః) ఉచ్చరించుచు నింపవలెను. పూజకై కావలసిన గంధ - అక్షత - పుష్పాది సకలద్రవ్యములను దగ్గర ఉంచుకొని, భూశుద్ధి మొదలగు కర్మలు చేయవలెను. ఉత్తరాభిముఖుడై, ఆరాధ్యదేవతకు కుడి ప్రక్క శరీరాంగములపై మాతృకాన్యాసము చేసి, సంహారముద్రతో అర్ఘ్యముకొరకై ఉదకము గ్రహించి మంత్రోచ్చారణపూర్వకముగ శిరస్సుకు తగల్చి, దానిని దేవతకు సమర్పించుటకై దగ్గర ఉంచుకొనవలెను. పిమ్మట భోగ్యము లగు కర్మల భోగమునకై కూర్మముద్రను ప్రదర్శించి ద్వాదశ దల హృదయకమలమున తన ఆత్మను ధ్యానించవలెను.

శోధయేత్పఞ్చ భూతాని సఞ్చిన్త్య సుషిరం తనౌ | చరణాంగుష్ఠయోర్యుగ్మాన్సుషిరాన్తర్బహిః స్మరేత్‌. 11

శక్తిం హృద్వ్యాపినీం పశ్చాద్ధూఙ్కారే పావకప్రభే | రన్ధ్రమధ్యస్థితే కృత్వా ప్రాణరోధం హి చిన్తకః. 12

నివేశ##యేద్రేచకాన్తే ఫడన్తేనాథ తేన చ | హృత్కణ్ఠతాలుభ్రూమధ్యబ్రహ్మ రన్ధ్రే విభిద్య చ. 13

గ్రన్దీన్నిర్భిద్య హూఙ్కారం మూర్ధ్ని విన్యస్య జీవనమ్‌ | సంపుటం హృదయేనాథ పూరకాహితచేతనమ్‌. 14

హూం శిఖోపరి విన్యస్య శుద్ధం బింద్వాత్మకం స్మరేత్‌ | కృత్వాథ కుమ్భకం శమ్భావేకోద్ఘాతేన యోజయేత్‌. 15

పిమ్మట శరీరమునందు రంధ్రములను (శూన్యమును) భావించి, క్రమముగ పంచభూతశోధనము చేయవలెను. ముందుగ పాదముల అంగుష్ఠములను పైనుండియు, లోపలినుండియు ఛిద్రమయముగ భావనచేయవలనెను. పిదప కుండలినీ శక్తిని మూలాధారమునుండి లేపి, హృదయకమలముతో చేర్చి, ''హృదయరంధ్రమునందున్న, అగ్నితుల్యతేజఃశాలి యగు 'హూం' బీజమునందు కుండలినీశక్తి విరాజిల్లుచున్నది'' అని భావనచేయవలెను. కుంభక ప్రాణాయామము చేసి, రేచకముచేసిన పిమ్మట, 'హుం ఫట్‌' అని ఉచ్చరించుచు క్రమముగ ఉత్తరోత్తర చక్రములను భేదనము చేయుచు, కుండలిని హృదయ - కంఠ - తాలు - భ్రూమధ్య - బ్రహ్మరంధ్రములకు చేర్చి ఆచట స్థాపించవలెను. ఈ గ్రంథులను భేదించి, కుండలినితో, హృదయ కమలమునుండి బ్రహ్మరంధ్రమునుండి వచ్చిన 'హూం' బీజరూపజీవుని అచటనే బ్రహ్మరంధ్రమునందు లేదా సహస్రారము నందు స్థాపించవలెను. హృదయమునందున్న 'హూం' బీజముతో సంపుటీకరించిన జీవునిలో, పూరక ప్రాణాయామము ద్వారా చైతన్యము జాగృతము చేయబడును. శిఖకు పైన 'హూం' న్యాసము చేసి శుద్ధబిందురూప జీవుని భావించవలెను. పిమ్మట కుంభకముచేసి ఏకమాత్ర చైతన్యరూపు డగు జీవుని శివునితో కలిపివేయవలెను.

రేచకేన బీజవృత్త్యా శివే లీనేథ శోధయేత్‌ | ప్రతిలోమం స్వదేహే తు బిన్ద్వన్తం తత్ర బిందుకమ్‌. 16

లయం నీత్వా మహీవాతౌ జలవహ్నీ పరస్పరమ్‌ | ద్వౌ ద్వౌ సాధ్యౌ తథాకాశమవిరోధేన తచ్చృణు. 17

పార్థివం మణ్డలం పీతం కఠినం వజ్రలాఞ్ఛితమ్‌ | హౌమిత్యాత్మీయబీజేన తన్ని వృత్తికలామయమ్‌. 18

పాదాదారభ్యమూర్ధాన్తం విచిన్త్య చతురస్రకమ్‌ | ఉద్ఘాతపఞ్చకేనైవ వాయుభూతం విచిన్తయేత్‌. 19

ఈ విధముగ శివునిలో లీనుడైన సాధకుడు సబీజరేచక ప్రాణాయామముతో శరీరమునందలి భూతముల శోధనము చేయవలెను. శరీరమునందు పాదములనుండి బిందువువరకును ఉన్న అన్ని తత్త్వములను విలోమక్రమమున చింతనచేయవలెను. బిందురూపజీవుని బింద్వంతమునందు లీనము చేసి పృథ్వీవాయువులను ఒకదానిని మరొకదానిలో లీనము చేయవలెను. అగ్ని - జలములను కూడ ఒక దానిలో ఒకటి విలీనము చేయవలెను. ఈ విధముగ పరస్పర విరోధముగల రెండు భూతములను ఒకదానిలో ఒకటి లీనము చేయవలెను. ఆకాశమునకు దేనితోడను విరోధము లేదు. ఈ భూతశుద్ధికి సంబంధించిన విశేషవివరణము వినుము. భూమండల స్వరూపము చతుష్కోణాకారము. దాని రంగు సువర్ణము వలె పచ్చగా ఉండును. అది కఠిన ముగ నుండుటయే గాక వజ్రచిహ్నముతోను, 'హాం' అను తన బీజముతోను కూడికొని యున్నది. దీనిలో 'నివృత్తి' అను కళ ఉన్నది. (శరీరమున పాదములు మొదలు మోకాళ్లవరకును భూమండల మున్నది.) ఈ విధమున పాదములు మొదలు శిరస్సువరకు శరీరమునందు పంచమహాభూతముల భావన చేయవలెను. ఈ విధముగ పంచగుణయుక్తము లగు వాయు - భూ మండలముల చింతకన చేయవలెను.

అర్ధచన్ద్రం ద్రవం సౌమ్యం శుభ్రమమ్భోజలాఞ్భితమ్‌ | హ్రీమిత్యనేన బీజేన ప్రతిష్ఠారూపతాం గతమ్‌. 20

సంయుక్తం వామమన్త్రేణ పురుషాన్తమకారణమ్‌ | అర్ఘ్యం చతుర్భిరుద్ఘాతైర్వహ్నిభూతం విశోధయేత్‌. 21

ఆగ్నేయం మణ్డలం త్ర్యస్రం రక్తం స్వస్తికలాఞ్ఛితమ్‌ | హూమిత్యనేన బీజేన విద్యారూపం విభావయేత్‌.

ఘోరాణుత్రిభిరుద్ఘాతైర్జలభూతం విశోధయేత్‌ | షడస్రమణ్డలం వాయోర్బిన్దుభిః షడ్భిరఙ్కితమ్‌. 23

కృష్ణం హోమితి బీజేన జాతం శాన్తికలామయమ్‌ | సంచిన్త్యోద్ఘాతయుగ్మేన పృథ్వీభూతం విశోధయేత్‌. 24

జలస్వరూపము అర్ధచంద్రాకారము. అది ద్రవస్వరూపము. చంద్రమండలమయము. దానివర్ణము ఉజ్జ్వలము. అది రెండు కమలములచే చిహ్నితము. 'హ్రీం' బీజముతో కూడినది. ''ప్రతిష్ఠా'' అను కల గలది. వామదేవ-తత్పురుషమంత్రములతో సంయుక్తమగు జలతత్త్వము నాలుగు గుణములతో కూడినది. దానిని ఈ విధముగ (మోకాళ్లు మొదలు పాదాల వరకు) చింతనము చేయుచు వహ్ని స్వరూపమునందు లీనముచేసి శోధన చేయవలెను. అగ్ని మండలము త్రికోణాకారము. రంగు ఎరుపు. (అది నాభినుండి హృదయమువరకును ఉండును). అది స్వస్తికచిహ్నయుక్తము. దానియందు 'హూం' బీజము అంకిత మై యుండును. అది విద్యాకలాస్వరూప మైనది. దాని మంత్రము అఘోరమంత్రము. ఇది మూడు గుణములతో కూడిన జలభూతము. ఈ విధముగ భావించి అగ్ని తత్త్వమును శోధించవలెను. వాయుమండలము షట్కోణాకారము (హృదయము మొదలు కనుబొమ్మలవరకును ఉండునది) అది ఆరు బిందువులచే చిహ్నితమైనది. రంగు నలుపు. 'హైం' బీజము తోడను, సద్యోజాతమంత్రముతోడను యుక్తమై యున్న అది శాంతికలాస్వరూపమైనది. దానిలో రెండు గుణములున్నవి. అది పృథ్వీభూతము. ఈ విధముగ భావన చేసి వాయుతత్త్వమును శోధింపవలెను.

నభోబిన్దుమయం వృత్తం బిన్దుశక్తవిభూషితమ్‌ | వ్యోమాకారం సువృత్తం చ శుద్ధస్ఫటికనిర్మలమ్‌. 25

హూంకారేణ ఫడన్తేన శాన్త్యతీతకళామయమ్‌ | ధ్యాత్వైకోద్ఘాతయోగేన సువిశుద్దం విభావయేత్‌. 26

ఆప్యాయయేత్తతః సర్వం మూలేనామృతవర్షిణా | ఆధారాఖ్యమనన్తం చ ధర్మజ్ఞానాది పఙ్కజమ్‌. 27

హృదాసనమిదం ధ్యాత్వా మూర్తిమావాహయేత్తతః | సృష్ట్వా శివమయం తస్యామాత్మానం ద్వాదశాన్తతః.

అథ తాం శక్తిమన్త్రేణ వౌషడన్తేన సర్వతః | దివ్యామృతేన సంప్లావ్య కుర్వీత సకలీకృతమ్‌. 29

హృదయాది కరాన్తేషు కనిష్ఠాద్యఙ్గులీషు చ | హృదాదిమన్త్రవిన్యాసం సకలీకరణం మతమ్‌. 30

ఆకాశము వ్యోమాకారము! నాదబిందుమయము, గోలాకారము, బిందుశక్తి విభూషితము, శుద్ధ స్ఫటికనిర్మలము. (శరీరమున భ్రూమధ్యము మొదలు బ్రహ్మరంధ్రము వరకు ఆకాశస్థానము). అది ''హౌం ఫట్‌'' అను బీజముతో కూడినది. శాంత్యతీతకలామయము. ఒక్క గుణము కలది. పరమవిశుద్ధము. ఈ విధముగ చింతనము చేసి ఆకాశతత్త్వమును శోధన చేయవలెను. పిమ్మట అమృతవర్షిమూలమంత్రముచే సర్వమును పరిపుష్టము చేయవలెను. పిమ్మట ఆధారశక్తిని, కూర్మమును అనంతుని పూజించవలెను. పిమ్మట పీఠముయొక్క ఆగ్నేయ పాదము (కోడు) నందు ధర్మమును, నైరృతి పాదమున జ్ఞానమును, వాయవ్యమున వైరాగ్యమును, ఈశాన్యపాదమున ఐశ్వర్యమును పూజించవలెను. పిమ్మట పీఠమునకు పూర్వాది దిశలందు క్రమముగ అధర్మ - అజ్ఞాన - అవైరాగ్య - అనైశ్వర్యములను పూజించవలెను. పీఠమధ్యభాగమున కమలమును పూజించవలెను. ఈ విధముగ మనస్సులోనే పీఠముపై నున్న కమలాసనమును ధ్యానించి దానిపై సచ్చిదానందఘనుడగు శివుని ఆవాహనము చేయవలెను. ఆ శివమూర్తియందు శివస్వరూపాత్మను చూచి, ఆసనమును, పాదుకాద్వయమును, తొమ్మిది పీఠశక్తులను ధ్యానించవలెను. శక్తిమంత్రము చివర ''వౌషట్‌'' చేర్చి దానిని ఉచ్చరించుచు పైన చెప్పిన ఆత్మమూర్తిని దివ్యామృతములో ముంచి, సకలీకరణము చేయవలెను. హృదయము మొదలు హస్తముల వరకును ఉన్న అవయవములందును, కనిష్ఠిక మొదలు వ్రేళ్లయందును హృదయమంతర (నమః) న్యాసమునకు సకలీకరణ మని పేరు.

అస్త్రేణ రక్ష ప్రాకారం తన్మన్త్రేణాథ తద్బహిః | శక్తిజాలమధశ్చోర్ధ్యం మహాముద్రాం ప్రదర్శయేత్‌. 31

ఆపాదమస్తకం యావద్భావపుషై#్పః శివం హృది | పద్మే యజేత్పూరకేణ ఆకృష్టామృతసద్ధృతైః. 32

శివమన్త్రైర్నాభికుణ్డ తర్పయేత శివానలమ్‌ | లలాటే బిన్దురూపం చ చిన్తయేచ్ఛుభవిగ్రహమ్‌. 33

ఏకం స్వర్ణాదిపాత్రాణాం పాత్రమన్త్రామ్బుశోధికతమ్‌ | బిన్దురూపం పీయూష రూపతోయాక్షతాదినా. 34

హృదాపూర్యషడంగేన పూజయిత్వాభిమన్త్రయేత్‌ | సంరక్ష్య హేతిమన్త్రేణ కవచేన విగుణ్ఠయేత్‌. 35

రచయిత్వార్గ్యమష్టాఙ్గం సేచయేద్ధేనుముద్రయా | అభిషిఞ్చేదథాత్మానం మూర్ధ్ని తత్తోయబిన్దునా. 36

తత్రస్థం యాగసంభారం ప్రోక్షయేదస్త్రవారిణా | అభిమన్త్ర్య హృదా పిణ్డౖస్తనుత్రాణన వేష్టయేత్‌. 37

'హుంఫట్‌' అను మంత్రముచే ప్రాకారమును భావన చేసి, ఆత్మరక్ష ఏర్పరచుకొనవలెను. దీని బైట, వెలుపల, క్రింద, మీద, భావన ద్వార శక్తి జాలమును విస్తరింపచేయవలెను. పిమ్మట మహాముద్రాప్రదర్శనముచేసి, పూరకప్రాణాయామముతో హృదయకమలమునందున్న శివుని ధ్యానించి, ఆనందామృతమయ మకరందముతో, (నిండిన) భావమయపుష్పము లతో శివునకు పాదములనుండి శిరస్సు వరకును అంగపూజ చేయవలెను. శివమంత్రములతో నాభికుండమునందున్న శివ స్వరూపాగ్నిని తృప్తుని చేయవలెను. ఆ శివానలమే లలాటమున బిందురూపములో నున్నది; దాని విగ్రహము మంగలమయము (అని) భావన చేయవలెను. స్వర్ణపాత్రము గాని, రజతపాత్రము గాని, తామ్రపాత్రము గాని అర్ఘ్యము నిమిత్తమై గ్రహించి దానిని అస్త్రబీజము (ఫట్‌) ఉచ్చరించుచు కడగవలెను. బిందు రూపశివునినుండి అమృతము ఆవిర్భవించుచున్నట్లు భావనచేసి హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, దానితో కలిసిన జలాక్షతాదులతో ఆ పాత్రను నింపవలెను. దానికి షడింగ పూజ చేసి, దేవతామూలమంత్రముచే అభిమంత్రించవలెను. అస్త్రమంత్రము (ఫట్‌) చే దాని రక్ష చేసి, కవచబీజ (హుమ్‌) ముచే దానిని కప్పవలెను. ఈ విధముగ అష్టాంగార్ఘ్యము ఏర్పరచి, ధేనుముద్రచే దానికి అమృతీకరణముచేసి, ఆ జలమును అన్ని వైపులను చల్లవలెను. తన శిరస్సుపై కూడ చల్లుకొనవలెను. పూజాసామగ్రిమీద కూడ అస్త్రబీజము నుచ్చరించుచు చల్లవలెను. హృదయబీజముతో అభిమంత్రించి, 'హుమ్‌' బీజముచే (లేదామత్స్యముద్రచే) దానిని ఆచ్ఛాందిచవలెను.

దర్శయిత్వామృతాం ముద్రాం పుష్పం దత్త్వా నిజాసనే |

విధాయ తిలకం మూర్ధ్ని పుష్పం మూలేన యోజయేత్‌. 38

స్నానే దేవార్చనే హోమే భోజనే యాగయోగయోః | ఆవశ్యకే జపే ధీరః సదా వాచంయమో భ##వేత్‌. 39

నాదాన్తోచ్చారణాన్మన్త్రం శోధయిత్వా సుసంస్కృతమ్‌ |

పూజనేభ్యర్చ్య గాయత్ర్యా సామాన్యార్ఘ్యముపాహరేత్‌. 40

బ్రహ్మపఞ్చకమావర్త్య మాల్యమాదాయ లిఙ్గతః | ఐశాన్యాం దిశి చణ్డాయ హృదయేన నివేదయేత్‌. 41

ప్రక్షాళ్య పిణ్డికా లింగే అస్త్రతోయే తతో హృదా | అర్ఘ్యపాత్రామ్బునా సిఞ్చేదితి లింగవిశోధనమ్‌. 42

అమృత (ధేను) ముద్ర ప్రదర్శించి, తన ఆసనముపై పుష్ప ముంచి, లలాటముపై తిలకము ధరించి, మూల మంత్రముతో దేవతకు పుష్పము అర్పించవలెను. సాధకుడు - స్నాన - దేవతాపూజా - హోమ - భోజన - యజ్ఞా - నుష్ఠాన - యోగ సాధన - ఆవశ్యక జపసమయములందు, స్థిరబుద్ధి యై మౌనముగా ఉండవలెను, నాదపర్యంతము ప్రణవోచ్చారణముచేయుచు మంత్రశోధనము చేయవలెను. ఉత్తమసంస్కారముక్తుడై దేవపూజా ప్రారంభము చేయవలెను. మూలగాయత్రిచేత గాని, రుద్ర గాయత్రిచేత గాని అర్ఘ్యపూజనము చేసి ఆ సామాన్యార్ఘ్యమును దేవతకు సమర్పింపవలెను. బ్రహ్మపంచకము (పంచగవ్యములు, కుశోదకముతో చేసిన బ్రహ్మకూర్చము) సిద్ధముచేసికొని, శివలింగమునుండి పుష్పనిర్మాల్యమును తీసివేసి, ఈశాన్యము నందు ''చండాయ నమః'' అని చెప్పుచు చుండునకు సమర్పించవలెను. బ్రహ్మపంచకముతో పిండికా శివలింగములకు స్నానము చేయించి, 'ఫట్‌' అని ఉచ్చరించుచు, మరల ఉదకముతో స్నానము చేయించవలెను. ''నమో నమః'' అని ఉచ్చరించుచు అర్ఘ్యపాత్రగతజలముతో ఆ శివలింగమునకు అభిషేకము చేయవలెను. ఇది లింగశోధన విధానము.

అత్మద్రవ్య మన్త్రలింగశుద్ధౌ సర్వాన్‌ సురాన్‌ యజేత్‌ | వాయవ్యే గణపతయే హాం గురుభ్యోర్చయేచ్ఛివే.

ఆధార శక్తిమఙ్కు రనిభాం కూర్మశిలాస్థితామ్‌ | యజేద్బ్రహ్మశిలారూఢం శివస్యానన్తమాసనమ్‌. 44

విచిత్ర పేశ ప్రఖ్యానమన్యోన్యం పృష్ఠదర్శినః | కృతత్రేతాదిరూపేణ శివస్యాసనపాదుకామ్‌. 45

ధర్మం జ్ఞానం చ వై రాగ్యమైశ్వర్యం చాగ్నిదిఙ్ముఖాత్‌ | కర్పూరకుఙ్కుమస్వర్ణకజ్జలాభాన్యజేత్క్రమాత్‌.

పద్మం చ కర్ణికారమధ్యే పూర్వాదౌ మధ్యతో నవ | వరదాభయహస్తాశ్చ శక్తయో ధృతచామరాః. 47

వామా జ్యేష్ఠా చ రౌద్రీ చ కాలీ కలవికారణీ | బలవికారణీ పూజ్యా బలప్రమథనీ క్రమాత్‌. 48

హాం సర్వ భూతదమనీ కేసరాగ్రే మనోన్మనీ | క్షిత్యాది శుద్ధవిద్యాం తు తత్త్వవ్యాపకమాసనమ్‌. 49

న్యసేత్సింహాసనే దేవం శుక్లం పఞ్చముఖం విభుమ్‌ | దశబాహుఞ్చ ఖణ్డన్దుం దధానం దధానం దక్షిణౖః కరైః.

శక్త్యృష్టిశూలఖడ్గాఙ్గవరదం వామకైః కరైః | డమరుం బీజపూరం చ నీలాబ్జం సూత్రముత్పలమ్‌. 51

ఆత్మ - ద్రవ్య - మంత్రలింగ శుద్ధులు చేసిన పిమ్మట సకల దేవతలను పూజించవలెను. వాయువ్యమునందు, ''ఓం హాం గణపతయే నమః'' అని ఉచ్చరించుచు గణపతిని పూజించవలెను. ఈశాన్యమునందు ''ఓం హాం గురుభ్యో నమః'' అని చెప్పుచు గురు - పరమగురు - పరాత్పరగురు - పరమేష్ఠిగురువులను గురుపరంపరను పూజించవలెను. కూర్మరూప మగు శిలపై ఉన్న అంకురతుల్య మగు ఆధారశక్తిని పూజించి, బ్రహ్మశిలపై కూర్చున్న శివుని ఆసనమైన అనంతదేవుని ''ఓం హాం అనన్తాయ నమః'' అను మంత్రముతో పూజింపవలెను. శివుని సింహాసనముగా నున్న మంచమునకు నాలుగు కోళ్ళు ఉండును. వాటి ఆకారము సింహాకారమున విచిత్రముగా నుండును. ఈ సింహములు మండలాకారమున నిలచి ఎదుట నున్నదాని పృష్ఠభాగమును చూచు చుండును. ఇవి సత్య - త్రేతా - ద్వాపర - కలియుగములకు ప్రతీకములు. పిమ్మట శివుని ఆసనపాదుకలను పూజించవలెను. పిమ్మట ఆగ్నేయాది విదిశలలో నున్న ధర్మ - జ్ఞాన - వైరాగ్య - ఐశ్వర్యములను పూజింవలెను. వీటి రంగులు వరుసగ కర్పూర - కుంకుమ - సువర్ణ - కజ్జలము (కాటుక)లతో సమానముగ నుండును. వీటి నాలుగు కాళ్ళకును పూజ చేసి ఆసనముపై నున్న అష్టదలకమలము నందలి క్రింది దళములను, పై దళములను మొత్తము కలమలమును పూజించి, ''ఓం హాం కర్షికాయై నమః'' అను మంత్రముతో కర్ణికామధ్య భాగమును పూజించవలెను. ఆ కమలము యొక్క ఎనిమిది పూర్వాది దళములందును, మధ్యభాగమునందును తొమ్మండుగురు శక్తులను పూజించవలెను. ఆ శక్తులు హస్తములలో చామరములు ధరించి యుందురు. వరద - అభయముద్రలు కూడ ఉండును. వామా-జ్యేష్ఠా-రౌద్రీ-కాలీ-కలవికారిణీ - బలవికారిణీ - బలప్రమథనీ - సర్వభూతదమనీ - మనోన్మనీ ఆను ఎనమండుగురు శక్తులను అష్టదలముల పైనను. మనోన్మని యను శక్తిని కమలకేసరములందును ''హాం కామాయై నమః'' ఇత్యాది మంత్రము లుచ్చరించుచు పూజించవలెను. పిమ్మట పృథివ్యాద్యష్టమూర్తులను, విశుద్ధవిద్యాదేహమును భావించుచు పూజ చేయవలెను. శుద్ధవిద్యను, తత్త్వవ్యాపక ఆసనమును పూజించవలెను. ఆ సింహాసనముపై కర్పూరము వలె తెల్లగా ఉన్నవాడును, సర్వవ్యాపియు, ఐదు ముఖములు గలవాడును అగు మహాదేవుని ప్రతిష్ఠ చేయవలెను. ఆయనకు పది భుజము లుండును. శిరస్సున అర్ధచంద్రు ఉండును. కుడి చేతులలో శక్తి - ఋష్టి - శూల - ఖట్వాంగ - వరదముద్ర లుండును. ఎడమ చేతులలో డమరు - బీజపూర - సర్పన - అక్షసూత్ర - నీలకమలము లను ధరించి యుండును.

ద్వాత్రింశల్లక్షణోపేతాం శైవీం మూర్తిం తు మధ్యతః |

హాం హాం హాం శిమూర్తయే స్వప్రకాశం శివం స్మరన్‌. 52

బ్రహ్మాదికారణత్యాగాన్మన్త్రం నీత్వా శివాస్పదమ్‌ | తతో లలాటమధ్యస్థం స్ఫురత్తారాపతిప్రభమ్‌. 53

షడఙ్గేన సమాకీర్ణం బిన్దురూపం పరం శివమ్‌ | పుష్పాఞ్జలిగతం ధ్యాత్వా లక్ష్మీమూర్తౌ నివేశ##యేత్‌. 54

ఓం హాం హౌం శివాయ నమః ఆవాహన్యా హృదా తతః |

ఆవాహ్య స్థాప్య స్థాపన్యా నన్నిధాయాన్తికం శివమ్‌. 55

విరోధయేన్నిష్ఠురయా కాలకాన్త్యా ఫడన్తతః | విఘ్నానుత్సార్య విష్ఠ్యాథ లిఙ్గముద్రాం నమస్కృతిమ్‌. 56

హృదావగుణ్ఠయేత్పశ్చాదావాహః సన్ముఖీతతః | నివేశనం స్థాపనం స్యాత్సపన్నిధానం తవాస్మి భోః. 57

ఆకర్మకాణ్డపర్యన్తం సన్నిధేయోపరిక్షయః | స్వభ##క్తేశ్చ ప్రకాశో యస్తద్భవేదవగుణ్ఠనమ్‌. 58

సకలీకరణం కృత్వా మన్త్రైః షడ్భిరథైకతామ్‌ | అఙ్గానామఙ్గినా సార్థం విదధ్యాదమృతే కృతమ్‌. 59

చిచ్ఛక్తిహృదయం శమ్భోః శివ ఐశ్వర్యమష్టధా | శిఖావశిత్వం చాభేద్యతేజః కవచమైశ్వరమ్‌. 60

ప్రతాపో దుఃసహశ్చాస్త్రమన్తరాయాపహారకమ్‌ | నమః స్వధా చ స్వాహా చ వౌషట్చేతి యథాక్రమమ్‌. 61

హృత్పురస్సరముచ్చార్య పాద్యాదీని నివేదయేత్‌ |

పాద్యం పాదామ్బుజద్వన్ద్వే వక్త్రే చాచమనీయకమ్‌. 62

అర్ఘ్యం శిరసి దేవస్య దూర్వాపుష్పాక్షతాని చ | ఏవం సంస్కృత్య సంస్కారైర్దశభిః పరమేశ్వరమ్‌. 63

యజేత్పఞ్చోపచారేణ విధినా కుసుమాదిభిః | ఆభ్యుక్ష్యోద్వర్త్య నిర్మృజ్య రాజికాలవణాదిభిః. 64

అర్ఘ్యోదబిన్దు పుష్పాద్యైర్గన్ధకైః స్నాపయేచ్ఛనైః |

ఆసనముపై ఆసీనుడై యున్న శివుని దివ్యమూర్తి ముప్పదిరెండు లక్షణములతో ప్రకాశించుచున్నదని చింతనము చేయుచు, శివస్మరణము చేయుచు, ''ఓం హాం హాం హాం శిమూర్తయే నమః'' అను మంత్ర ముచ్చరించుచు నమస్కారము చేయవలెను, బ్రహ్మాది కారణ త్యాగ పూర్వకముగు మంత్రమును శివుని యందు ప్రతిష్ఠితము చేయవలెను. లలాట మధ్య భాగమున చంద్రుడు వలె ప్రకాశించుచున్న బిందు రూప పరమ శివుడు హృదయాదు లగు ఆరు అంగములతో సంయుక్తుడై పుష్పాంజలిలోనికి దిగి వచ్చి నట్లు భావన చేసి ఆయనను పూజింపనున్న మూర్తియందు స్థాపించవలెను. పిమ్మట ఆవాహనీముద్రతో ''ఓం హాం హౌం శివాయ నమః'' అను మంత్ర ముచ్చరించుచు, మూర్తిపై శివుని ఆవాహనము చేయవలెను. స్థాపనీముద్రచే స్థాపనము చేసి, సంనిధాపనీముద్రతో సన్నిహితుని చేసి, సంనిరోధనీముద్రతో ఆ మూర్తి పై కదల కుండు నట్లు చేయవలెను. పిమ్మట ''నిష్ఠురాయై కాలకల్యాయై ఫట్‌'' అను మంత్రము ఉచ్చరించుచు ఖడ్గముద్రతో భయమును చూపుచు విఘ్నములను పారద్రోలవలెను. పిమ్మట లింగముద్రను చూపి నమస్కారము చేయవలెను. 'నమః' అని అవగుంఠనము చేయవలెను. ఇష్టదేవతను తన వైపునకు అభిముఖముగ నున్నట్లు చేయుటయే ఆవాహనము. దేవతను అర్చా విగ్రహముపై కూర్చుండబెట్టుట స్థాపనము, ''ప్రభూ! నేను నీవాడను'' అని పలుకుచు భగవంతునితో అతి సన్నిహిత సంబంధము నేర్పరచుకొనుటయే సంనిధానము''. శివపూజకు సంబంధించిన కర్మకాండ అంతయు పూర్తి అగువరకు భగవత్సంనిధాన ముండునట్లు చేయుట ''నిరోధము'' భక్తులు కాని వారికి శివతత్త్వము తెలియకుండు నట్లు చేయుట అవగుంఠనము. పిమ్మట సకలీకరణము చేసి 'హృదయాయ నమః' ఇత్యాదిమంత్రములతో హృదయాద్యంగములకు అంగులతో ఏకత్వమును స్థాపించుటయే 'అమృతీకరణము' చైతన్య శక్తి శంకరుని హృదయము, ఎనిమిది విధములైన ఐశ్వర్యము శిరస్సు, వశిత్వము శిఖ, అభేద్యమగు తేజస్సు కవచము, దుస్సహమైన ప్రతాపమే సమస్త విఘ్నములను నివారించు అస్త్రము హృదయముతో ప్రారంభించి ''నమః, స్వధా, స్వాహా, వౌషట్‌ అనునవి ఉచ్చరించుచు పాద్యాదులను నివేదించవలెను. ఆరాధ్యదేవత యొక్క చరణారవిందములపై పాద్యమును, ముఖారవిందమున ఆచమనమును, అర్ఘ్య - దూర్వా - పుష్ప - అక్షతాదులను శిరస్సునను ఉంచవలెను. ఈ విధముగ పది సంస్కారములచే పరమేశ్వరుని సంస్కారము చేసి, గంధ పుష్పాది పంచోపచారములతో యథా విధిగ పూజింపవలెను. మొదట దేవతా విగ్రహమునకు ఉదకముచే అభిషేకము చేసి, రాజికాలవణాదులతో ఉద్వర్తన మార్జనములు చేయవలెను. పిమ్మట అర్ఘ్య జలబిందువులు, పుష్పములు మొదలగు వాటితో అభిషేకము చేసి ఘటములో నున్న ఉదకముతో మెల్లమెల్లగ స్నానము చేయించవలెను.

పయోదధి ఘృతక్షౌద్ర శర్కరాద్యైరనుక్రమాత్‌. 65

ఈశాదిమన్త్రితైవ్యైరర్చ్య తేషాం విపర్యయః | తోయధూపాన్తరైః సర్వైర్మూలేన స్నపయేచ్ఛివమ్‌. 66

విరూక్ష్య యవచూర్ణేన యథేష్టం శీతలైర్జలైః | స్వశక్త్యా గన్ధతోయేన సంస్నాప్య శుచివాససా. 67

నిర్మార్జ్యార్ఘ్యం ప్రదద్యాచ్చ నోపరి భ్రామయేత్కరమ్‌ |

న శూన్యమస్తకం లిఙ్మగం పుషై#్పః కుర్యాత్తతో దదేత్‌. 68

చన్దనాద్యైః సమాలభ్య పుషై#్పః ప్రార్చ్య శివాణునా | ధూపభాజనమన్త్రేణ ప్రోక్ష్యాభ్యర్చ్య శివాణునా. 69

అస్త్రేణ పూజితాం ఘణ్టాం చారాయ గుగ్గులం దదేత్‌ | దద్యాదాచమనం పశ్చాత్స్యధాన్తం హృదయాణునా. 70

ఆరార్తికం సముత్తార్య తథైవాచామయేత్పునః | ప్రణమ్యాదాయ దేవాజ్ఞాం భోగాఙ్గాని ప్రపూజయేత్‌. 71

పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార - వీటిని వరుసగ ఈశానతత్పురుష - అఘోర - వాసుదేవ - సద్యోజాత మంత్రములతో అభిమంత్రించి, వాటితో మాటిమాటికి స్నానము చేయించవలెను. వాటిని కలిపి పంచామృతము చేసి, దానితో భగవంతునకు స్నానము చేయించవలెను. దీనివలన భోగమోక్షములు, లభించును. పైన చెప్పిన క్షీరము మొదలైనవాటిలో జలధూపములు కలిపి, మూలమంత్రముతో శివునకు అభిషేకము చేయవలెను. పిదప యవపిష్టముతో జిడ్డుపోవు నట్లు చేసి శీతలజలముతో స్నానము చేయించవలను. యథాశక్తిగ చందన - కేసరాదయుక్త మగు ఉదకముతో స్నానము చేయించి వస్త్రముతో విగ్రహమును బాగుగా తుడవవలెను. పిదప అర్ఘ్యము సమర్పింపవలెను. దేవత మీద హస్తము త్రిప్పగూడదు. శివలింగము తలపై ఎన్నడును పుష్పము లేకుండ ఉంచగూడదు. పిదప ఇతరోపచారములు సమర్పించి చందనాద్యను లేపనము చేయవలెను. శివమంత్రము జపించుచు పుష్పార్పణ చేసి పూజించవలెను. అస్త్రమంత్రము (ఫట్‌)తో ధూపపాత్రను ప్రోక్షించి, శివమంత్రముతో ధూపముచే పూజించవలెను. అస్త్రమంత్రముచే పూజింపబడిన ఘంట మ్రోగించుచు గుగ్గులు ధూపము వేయవలెను. ''శివాయ నమః'' అను మంత్రము నుచ్చరించుచు అమృతమధుర మగు జలముతో ఆచమనము సమర్పించవలెను. పిమ్మట ఆరతి ఇచ్చి ఆచమనము చేయించవలెను. నమస్కరించి, దేవత అనుమతి గైకొని భోగాంగముల పూజ చేయవలెను.

హృదగ్నౌ చన్ద్రభం చైశే శివం చామీకరప్రభమ్‌ | శిఖాం రక్తాం చ నైరృత్యే కృష్ణం వర్మ చ వాయవే. 72

చతుర్వక్త్రం చతుర్బాహుం రలస్థాన్పూజయేదిమాన్‌ | 73

దంష్ట్రాకరాలమప్యస్త్రం పూర్వాదౌ వజ్రసన్నిభమ్‌.

మూలే హౌం శివాయ నమః ఓం హాం హూం హీం హోం శిరశ్చ |

హ్రూం శిఖాయై హైం వర్మ హశ్చాస్త్రం పరివారయుతాయ చ 74

శివాయ దద్యాత్పాద్యం చ ఆచామం చార్ఘ్యమేవ చ | గన్ధం పుష్పం ధూపదీపౌ నై వేద్యాచమనీయకమ్‌. 75

కరోద్వర్తనతామ్బూలం ముఖవాసం చ దర్పణమ్‌ | శిరాస్యారోప్య దేవస్య దూర్వాక్షత పవిత్రకమ్‌. 76

మూలమష్టశతం జప్త్వా హృదయే నాభిమన్త్రితమ్‌ | చర్మణావేష్టితం ఖడ్గం రక్షితం కుశపుష్పకైః. 77

అక్షతైర్ముద్రయా యుక్తం శివముద్భవసంజ్ఞయా | గుహ్యాతిగుహ్యగుప్త్యర్థం గృహాణాస్మత్కృతం జపమ్‌.

సిద్ధిర్భవతుమే యేన త్వత్ర్పసాదాత్త్వయి స్థితే |

ఆగ్నేయమునందు చంద్రుడు ఉజ్జ్వలమైన హృదయమును, ఈశాన్యమునందు సువర్ణసమాన కాంతి గల శిరస్సును నైరృతియందు ఎఱ్ఱని రంగు గల శిఖను, వాయవ్యమునందు నల్లని రంగు గల కవచమును పూజింపవలెను. అగ్ని వర్ణ మగు నేత్రమును, కృష్ణ పింగల వర్ణమగు అస్త్రమును పూజించి, కమలముపై చతుర్ముఖు డగు బ్రహ్మయు, చతుర్భుజుడగు విష్ణువు, ఇతర దేవతలును ఉన్నట్లు భావన చేసి వారి పూజ చేయవలెను. పూర్వాదిదిక్కులందు కోరలతో భయంకరము లగు వజ్రతుల్యాస్త్రములు పూజించవలెను. ''ఓం హాం హూం శివాయ నమః'' అను మంత్రముతో మూల స్థానమునందు పూజ చేయవలెను. ''ఓం హాం హృదయాయ నమః'' ''హీం శిరసే హ్వహా'' అను మంత్రముతో హృదయ శిరస్సులను ''హూం శిఖాయై వషట్‌'' అను మంత్రముతో శిఖను ''హై కవచాయ హుం' అను మంత్రముతో కవచమును ''హః అస్త్రా య ఫట్‌'' అని అస్త్రమును పూజించవలెను. పిమ్మట పరివారసమేతు డగు ఈశ్వరునకు క్రమముగ పాద్య - ఆచమన - ఆర్ఘ్య - గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్య - ఆచమనీయ - కరోద్వర్తన - తాంబూల - ముఖవాస - దర్పణము లను మసర్పించవలెను. పిమ్మట ఆ దేవాధి దేవుని శిరస్సుపై అక్షతలను, పవిత్రకమును ఉంచి, హృదయముచే (నమః) అభి మంత్రిత మగు మూలమంత్రమును నూట ఎనిమిది సార్లు జపించవలెను. పిమ్మట కవచము చుట్టినదియు, అస్త్రముచే రక్షితమును అగు అక్షత - కుశలను, పుష్పములను, సమర్పించి ఉద్భవమగు ముద్రతో శివుని - ''ఓ ప్రభూ! గుహ్యాతి గుహ్యమును రక్షించుటకై, నేను చేసిన జపమును గ్రహింపుము దానిచే నీవుండగా, కృపచే నాకు సిద్ధి లభించు గాక'' అని ప్రార్థించవలెను.

భోగీ శ్లోకం పఠిత్వాధ్యం దక్షహస్తేన శంభ##వే. 79

మూలాణునార్ఘ్యతోయేన వరహస్తే నివేదయేత్‌ | యత్కిఞ్చిత్కుర్మహే దేవ సదా సుకృతదుష్కృతమ్‌. 80

తన్మే శివపదస్థస్య హూం హః క్షేపయ శంకర | శివో దాతా శివో భోక్తా శివః సర్వమిదం జగత్‌. 81

శివో జయతి సర్వత్ర యః శివః సోమహేవ చ | శ్లోకద్వయమధీత్యైవం జపం దేవాయ చార్పయేత్‌. 82

శివాఙ్గానాం దశాంశం తు దత్త్వార్ఘ్యం స్తుతిమాచరేత్‌ | ప్రదక్షిణీకృత్యనమేత్సాష్టాఙ్గం చాష్టమూర్తయే. 83

నత్వాధ్యానాదిభిశ్చైవ యజేచ్చిత్రేనలాదిషు |

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే శివపూజావిధిర్నామ చతుఃసప్తతితమోధ్యాయః

భోగేచ్ఛ గల సాధకుడు పై శ్లోకము పఠించుచు, మూలమంత్ర ముచ్చరించుచు కుడి చేతిలో ఆర్ఘ్యోదకము గ్రహించి, దానిని భగవంతుని వరముద్రతో కూడిన హస్తములో విడువవలెను. మరల ఈ విధముగ ప్రార్థించవలెను. ''మహాదేవా! కల్యాణ స్వరూపుడవగు నీ పాదములను శరణు జొచ్చినాను. నేను చేసిన శుభాశుభ కర్మల నన్నింటిని తొలగింపుము. ''హూ క్షః శివుడే దాత. శివుడే భోక్త శివుడే ఈ సకల ప్రపంచము, సర్వత్ర శివునకు జయ మగు గాక. శివుడే నేను'' ఈ రెండు శ్లోకములు చదువుచు చేసిన జపమును శివునకు సమర్పింపవలెను. పిమ్మట పూర్వము చేసిన శివ మంత్రజపములో దశాంశము మరల జపించవలెను. (హోమపూర్తికి ఇది అవసరము) మరల అర్ఘ్యమిచ్చి భగవంతుని స్తుతించవలెను. పిమ్మట అష్టమూర్తి యగు శివునకు ప్రదక్షిణము చేసి సాష్టాంగ ప్రణామము చేయవలెను. నమస్కరించి శివద్యానము చేసి, చేత్రమునందు గాని, అగ్న్యాదులందు గాని శివుని ఉద్దేశించి హోమ - పూజాదులు చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు శివపూజావిధి వర్ణన మను డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters