Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్విశతతమో7ధ్యాయః

అథ దీపదానవ్రతమ్‌

అగ్నిరువాచ :

దీపదానవ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదాయకమ్‌ | దేవద్విజాతికగృహే దీపదో7బ్దం స సర్వభాక్‌. 1

చతుర్మాసం విష్ణులోకే కార్తికే స్వర్గలోక్యపి | దీపదానాత్పరం నాస్తి న భూతం న భవిష్యతి. 2

దీపేనాయుష్యచక్షుష్మాన్దీపాల్లక్ష్మీసుతాదికమ్‌ | సౌభాగ్యం దీపదః ప్రాప్య స్వర్గలోకే మహీయతే. 3

విదర్భరాజదుహితా లలితా దీపదాత్మభాక్‌ | చారుధర్మక్ష్మాపపత్నీ శతభార్యాధికా7భవత్‌. 4

దదౌ దీపసహస్రం సా విష్ణోరాయతనే సతీ | పృష్టా సా దీపమాహాత్మ్యం సపత్నీ భ్య ఉవాచ హ. 5

లలితోవాచ :

సౌవీరరాజస్య పురా మైత్రేయోభూత్పురోహితః | తేన చాయతనం విష్ణోః కారితం దేవికాతటే. 6

కార్తికే దీపకస్తేన దత్తః సంప్రేరితో మయా | వక్త్రప్రాన్తేన నశ్యన్త్యా మార్జారస్య తదా భయాత్‌. 7

నిర్వాణవాన్‌ ప్రదీప్తో7భూద్వర్త్యా మూషికయా తదా | మృతా రాజాత్మజా జాతా రాజపత్నీ శతాధికా. 8

అసఙ్కల్పితమప్యస్య ప్రేరణం యత్కృతం మయా | విష్ణ్వాయతనదీపస్య త స్యేదం భుజ్యతే ఫలమ్‌. 9

జాతిస్మరా హ్యతో దీపాన్ప్రయచ్ఛామి త్వహర్నిశమ్‌ | ఏకాదశ్యాం దీపదో వై విమానే దివి మోదతే. 10

అగ్నిదేవుడు పలికెను : ఇపుడు భుక్తిముక్తిప్రద మగు ''దీపదానవ్రతమును'' గూర్చి చెప్పెదను దేవాలయమునందు గాని, బ్రాహ్మణగృహమునందు గాని ఒక సంవత్సరము దీపదానము చేయువాడు సకలకామములను పొందును. చాతుర్మాస్యమునందు దీపదానము చేయువాడు విష్ణులోకమునకును, కార్తికమున దీపదానము చేయువాడు స్వర్గమునకు పోవును. దీపదానమును మించిన వ్రత మేదియు పూర్వము లేకుండెను. ఇపుడు లేదు, ఉండబోదు. దీపదానముచే అయుర్దాయము, నేత్రజ్యోతియు లభించును. ధనపుత్రాదిప్రాప్తి కలుగును. దీపదానము చేయువాడు సౌభాగ్యవంతుడై స్వర్గమున దేవతలచే పూజింపబడును. విదర్భరాజకుమారి యగు లలిత దీపదానపుణ్యుముచేతనే చారుధర్మమహారాజుకు భార్యయై ఆతని నూర్గురు రాణులలో ప్రముఖురాలైనది. ఆ వతివ్రత ఒక పర్యాయము విష్ణ్వాలయమున సహస్రదీపముల దానముచేసెను. ఆమె సవతులు దీపదానమాహాత్మ్యమును గూర్చి ప్రశ్నించగా ఆమె ఇట్లు చెప్పెను. లలిత చెప్పెను : పూర్వము సౌవీరరాజువద్ద మైత్రేయు డను పురోహితుడుండెను. అతడు దేవికానదీతీరమున శ్రీమహావిష్ణువునకు ఆలయము కట్టించెను. కార్తికమాసమున అతడు దీపదానము చేసెను. పిల్లికి భయపడి పారిపోవుచున్న ఒక ఆడుఎలుక అకస్మాత్తుగ, తన ముఖాగ్రముతో ఆ దీపపు వత్తిని పైకి త్రోసెను. అట్లు చేయుటచే ఆరిపోవుటకు సిద్ధముగానున్న దీపము ప్రజ్వలించెను. మరణానంతరము ఆ ఆడుఎలుకయే రాజకుమారిగ జన్మించి రాజధర్ముని నూర్గురు రాణులలో ప్రధానురా లైనది. ఈ విధముగ అనుకొనకుండగనే నేను విష్ణ్వాలయమునందలి దీపపు వత్తిని ఎగసనత్రోయుటచే కలిగిన పుణ్యమునకు ఫలమును అనుభవించుచున్నాను. దీనివలననే నాకు పూర్వజన్మస్మృతికూడ లభించినది. అందుచే నేను సదా దీపదానము చేయుచున్నాను. ఏకాదశినాడు దీపదానము చేసినవాడు స్వర్గమున విమానారూఢుడై ఆనందించుచుండును.

జాయతే దీపహర్తా తు మూకో వా జడ ఏవ చ | అన్దే తమసి దుష్పారే నరకే పతతే కిల. 11

విక్రోశమానాంశ్చ నరాన్యమకింకర ఆహతాన్‌ | విలాపైరలమత్రాపి కింవోవిలపితైః ఫలమ్‌. 12

యదా ప్రమాదిభిః పూర్వమత్యన్తసముపేక్షితః | జన్తుర్జన్మసహ స్రేభ్యో హ్యేకస్మిన్‌ మానుషో యది. 13

తత్రాప్యతివిమూఢాత్మా కిం భోగాననువధాతి | స్వహితం విషయాస్వాదైః క్రన్దనం తదిహాగతమ్‌. 14

భుజ్యతే చ కృతం పూర్వమేతత్కిం వో న చిన్తితమ్‌ | పరస్త్రీషు కుచాద్యఙ్గం ప్రీతయే దుఃఖదం హి వః.

ముహూర్తవిషయాస్వాదో7నేకకోట్యబ్దదుఃఖదః | పరస్త్రీహారి యద్గీతం హా మాతః కిం విలప్యతే. 16

కో7తిభారో హరేర్నామ్ని జిహ్వయా పరికీర్తితే | వర్తితైలే7ల్పమూల్యే7పి యదగ్నిర్లభ్యతే సదా. 17

దానాసక్తైర్హరేర్దీపో హృత స్తద్వో7స్తి దుఃఖదమ్‌ | ఇదానీం కిం విలాపేన సహధ్వం యదుపాగతమ్‌. 18

అగ్నిరువాచ :

లలితోక్తం చ తాః శ్రుత్వా దీపదానాద్దివం యయుః | తస్మాద్దీపప్రదానేన వ్రతానామధికం ఫలమ్‌. 19

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దీపదానవ్రతం నామ ద్విశతతమో7ధ్యాయః.

దీపమును హరించినవాడు మూగవాడు. బుద్ధివిహీనుడు అగును చీకటితో నిండిన దాట శక్యముగాని నరకములో పడును. అక్కడ విలపించుచున్నవారిని చూచి యమకింకరుడు ఇట్లు అనును-''ఇక్కడ ఏడిచి ఏమి ప్రయోజనము మీరు ఏమరచి మీ ధర్మమును ఉపేక్షించినారు. కొన్ని వేల జన్మలలో ప్రాణి మనుష్యుడుగా పుట్టును. అపుడు కూడ మూఢబుద్ధియై భోగాలకొరకు పరుగెత్తును. పూర్వము మీరు అనుభవించిన విషయభోగాల ఫలితంగా ఇక్కడ ఏడ్వవలసివచ్చినది. చేసిన పాపముల ఫలము అనుభవించవలసి ఉండునని మీరు ముందుగానే ఎందుకు ఆలోచించలేదు.? పరభార్యలకుచమర్దనము మీకు సుఖకరముగ కనబడినది. అదే ఇపుడు మీ కుదుఃఖహేతు వైనది. పరస్త్రీలపను ఆవహరించి మీరు చేసిన కర్మలను గూర్చి నేను చెప్పి ఉన్నాను. ఇపుడు అయ్యో! అమ్మా! అనుచు ఎందుకు ఏడ్చెదరు? శ్రీమహావిష్ణువు నామము నాలుకకు ఏమి భారము? తైలము, వత్తి చాల స్వల్పమూల్యము కలవి. అగ్నియైతే అంతటను లభించునదే. ఐనను మీరు దీపదానము చేయక విష్ణ్వాలయమునుండి దీపమును హరించితిరి. అదియే మీకిపుడు దుఃఖము నిచ్చుచున్నది. విలపించి ఏమి ప్రయోజనము? వచ్చిన యాతనను అనుభవింపుడు''.

అగ్నిదేవుడు చెప్పెను. లలిత సవతు లందరు ఆమెచెప్పిన ఉపాఖ్యానము విని దీపదానప్రభావముచే స్వర్గము పొందిరి. అందుచే దీపదానము అన్నివ్రతములకంటెను విశేషఫలదాయకము.

అగ్నిమహాపురాణమునందు దీపదానవర్ణనమను రెండు నూర్లవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters