Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తాశీత్యధిక శతతమోధ్యాయః.

అథ ఏకాదశీవ్రతాని

అగ్ని రువాచ :

ఏకాదశీవ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదాయకమ్‌ | దశమ్యాం నియతాహారో మాంసమైథునవర్జితః. 1

ఏకాదశ్యాం స భుఞ్జీత పక్షయోరుభయోరపి | ద్వాదశ్యేకాదశీ యత్ర తత్ర సన్నిహితో హరిః. 2

తత్రక్రతుశతం పుణ్యం త్రయోదశ్యాం తు పారణ | ఏకాదశ్యాం కలా యత్ర పరతో ద్వాదశీ గతా. 3

తత్ర క్రతుశతం పుణ్యం త్రయోదశ్యాం తు పారణ | దశ##మ్యేకాదశీ మిశ్రా నోపోష్యా నరకప్రదా. 4

ఏకాదశ్యాం నిరాహారో భుక్త్వా చైవాపరే హని | భోక్ష్యేహం పుణ్డరీకాక్ష శరణం మే భవాచ్యుత. 5

ఏకాదశ్యాం సితే పక్షే పుష్యర్థం తు యదా భ##వేత్‌ | సోపాష్యాక్షయ్యఫలదా ప్రోక్తా సా పాపనాశినీ. 6

ఏకాదశీ ద్వాదశీయా శ్రవణన చ సంయుతా | విజయా సా తిథిః ప్రోక్తా భక్తానాం విజయప్రదా. 7

ఏషైవ ఫాల్గునే మాసి పుష్యర్షేణ చ సంయుతా | విజయాప్రోచ్యతే సద్భిః కోటికోటిగుణోత్తరా. 8

ఏకాదశ్యాం విష్ణుపూజా కార్యా సర్వోపకారిణీ | ధనవాన్పుత్రవాన్‌ లోకే విష్ణులోకే మహీయతే. 9

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ఏకాదశీవ్రతనిరూపణం నామ సప్తాశీత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని పలికెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రదాయక మగు ఏకాదశీవ్రతమును గూర్చి చెప్పెదను. దశమియందు నియతాహారవంతుడై మాంసమైథునములను వర్జించవలెను. రెండు పక్షములందును ఏకాదశులందు భోజనము చేయగూడదు. ఏకాదశీ ద్వాదశులు కలిసిన దినముస శ్రీహరి సన్నిహితుడై యుండును. ఆ రోజున ఉపవాసము చేసి త్రయోదశినాడు పారణము చేసినచో నూరు యజ్ఞముల చేసిన ఫలము లభించును. ఏకాదశినాడు కొంచెము ఏకాదశి ఉండి పిదప ద్వాదశి వచ్చినచో, అపుడు ఉపవాసము చేసి త్రయోదశినాడు పారణము చేసినవానికి నూరు యజ్ఞముల ఫలము లభించును. ఏకాదశినాడు దశమి కలసినచో ఉపవాస ముండరాదు. నరకము వచ్చును. ఏకాదశినాడు ఉపవాస ముండి మరుచటి రోజున --''పుండరీకాక్షా! నేనీ రోజున భుజింతును; నాకు రక్షకుడవు అగుము.'' అని ప్రార్థించి భోజనము చేయవలెను. శుక్లైకాదశియందు పుష్యమి నక్షత్రము ఉన్నపుడు ఉపవాస మున్నచో అది అధికఫల ప్రదము. పాపవినాశకము. ఏకాదశీద్వాదశీతిథులు శ్రవణ నక్షత్రయుక్తము లైనచో అది విజయతిథి. భక్తులకు జయప్రదము. ఫాల్గుణమాసమున పుష్యమీనక్షత్రయుక్త మగు ఏకాదశికూడ విజయాతిథి. ఆది అనేక కోట్ల రెట్టింపు ఫలము నిచ్చునది. ఏకాదశినాడు విష్ణుపూజ చేయవలెను. అది అందరికిని ఉపకారకము అట్లు చేసినవాడు ధనపుత్రాదిమంతుడై విష్ణులోకమునందు పూజింపబడును.

అగ్ని మహాపురాణమునందు ఏకాదశీవ్రతనిరూపణ మను నూట ఎనుబదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters