Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతురశీత్యుత్తర శతతమోధ్యాయః

అథాష్టమీవ్రతాని

అగ్ని రువాచ :

బ్రహ్మాదిమాతృయజనాజ్జపేన్మాతృగణాష్టమీమ్‌ | కృష్ణాష్టమ్యాం చైత్రమాసే పూజ్యాబ్దం కృష్ణమర్థభాక్‌.1

కృష్ణాష్టమీవ్రతం వక్ష్యే మాసే మార్గశిరే చరేత్‌ | నక్తం కృత్వా శుచిర్భూత్వా గోమూత్రమం ప్రాశ##యేన్నిశి. 2

భూమిశాయీ నిశాయాం చ శఙ్కరం పూజయేద్ర్వతీ |

పౌషే శమ్భుం ఘృతం ప్రాశ్య మాఘే క్షీరం మహేశ్వరమ్‌. 3

మహాదేవం ఫాల్గునే చ తిలాశీ సముపోషితః | చైత్రే స్థాణుం యవాశీ చ వైశాఖేథ శివం యజేత్‌. 4

కుశోదాశీ పశుపతిం జ్యేష్ఠే శృఙ్గోదకాశనః | ఆషాఢే గోమయాశ్యుగ్రం శ్రావణ సర్వకర్మభుక్‌. 5

త్ర్యమ్బకం చ భాద్రపదే బిల్వపత్రాశనో నిశి | తణ్డులాశీ చాశ్వయుజే చేశం రుద్రం తు కార్తికే. 6

దధ్యాశీ హోమకారీ స్యాద్వర్షాన్తే మణ్డలే యజేత్‌ | గోవస్త్రహేమ గురవే దద్యాద్విప్రేభ్య ఈదృశమ్‌. 7

ప్రార్థయిత్వా ద్విజాన్భోజ్య భుక్తిం ముక్తిమవాప్నుయాత్‌ |

నక్తాశీ త్వష్టమీషు స్యాద్వత్సరాన్తే చ ధేనుదః. 8

పౌరన్దరం పదం యాతి స్వర్గతివ్రతముచ్యతే | అష్టమీ బుధవారేణ పక్షయోరుభయోర్యదా. 9

తదా వ్రతం ప్రకుర్వీత హ్యథ వా సగుడాశితీ | తస్యాం నియమకర్తారో న స్యుః ఖణ్డితసమ్పదః. 10

అగ్నిదేవుడు పలికెను : చైత్రకృష్టపక్షమున అష్టమీ వ్రత మాచరించి ఆ దినమున బ్రాహ్మాదిదేవతలను, మాతృగణమును పూజించవలెను. ఒక సంవత్సరము పాటు కృష్ణపక్షాష్టములందు శ్రీకృష్ణపూజ చేయువాడు సంతానమును పొందును. ఇపుడు కాలాష్టమీవ్రతము చెప్పెదను. ఈ వ్రతము మార్గశీర్షకృష్ణాష్టమినాడు చేయవలెను. రాత్రి యైనపిదప వ్రతము చేయువాడు స్నానాదులచే పవిత్రుడై శివుని పూజించి గోమూత్రముచే వ్రతపారణము చేయవలెను. రాత్రియందు భూమిపై శయనించవలెను. పుష్యమాసమునందు శివుని పూజించి ఘృతాహారమును, మాఘమున మహేశ్వరుని పూజించి దుగ్ధాహారమును తీసికొనవలెను. ఫాల్గునమునందు మహాదేవుని పూజించి, ఉపవాసము చేసి తిలలు ఆహారముగా గ్రహించవలెను. చైత్రమునందు 'స్థాణువును' పూజించి యవలు భుజించవలెను. వైశాఖమున 'శివుని' పూజించి కుశజలముతో పారణ చేయవలెను. జ్యేష్ఠమున పశుపతిని పూజించి నదీజలము త్రాగవలెను. ఆషాడమున ఉగ్రుని పూజించి గోమయమును భక్షించవలెను. శ్రావణమున శర్వుని పూజించి మందారపుష్పము భుజించవలెను. భాద్రపదమునందు రాత్రిత్ర్యంబకుని పూజించి బిల్వపత్రమును భుజించవలెను. ఆశ్వయుజమున ఈశుని పూజించి బియ్యమును, కార్తికము నందు రుద్రుని పూజించి పెరుగు భుజించవలెను, సంవత్సరాంతమున హోమము చేసి, సర్వతోభద్రలింగమును నిర్మించి శంకరుని పూజించవలెను. పిదప ఆచార్యునకు గో-వస్త్ర-సువర్ణదానము చేయవలెను. ఇతరులకు గూడ అది దానము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టినవాడు భుక్తిముక్తులను పొందును. ప్రతిమాసమునందును, అష్టమీతిథులందు రాత్రిమాత్రమే భోజనము చేసి సంవత్సరాంతమునందు గోదానము చేయవలెను. ఇట్లు చేసినవాడు ఇంద్రపదమును చెందును. దీనికి స్వర్గతివ్రతమని పేరు. శుక్లపక్షమునందు గాని, కృష్ణపక్షమునందు గాని అష్టమీబుధవార యోగము కలిగినపుడు వ్రతమాచరించి ఒక మారు భోజనము చేయవలెను. అష్టమీవ్రతము చేయువానికి గృహైశ్వర్యాదులకు లోప ముండదు.

తణ్డులస్యాష్టముష్టీనాం వర్జయిత్వాఙ్గులీద్వయమ్‌ | భక్తం కృత్వా చామ్రపుటే సకుశే సకులామ్బికామ్‌. 11

సాత్త్వికం పూజయిత్వాఙ్గం భుఞ్జన్తి చ కథాశ్రవాత్‌ | శక్తితో దక్షిణాం దద్యాత్కర్కంటీం తణ్డులాన్వితామ్‌.

ధీరో ద్విజోస్య భార్యాస్తి రమ్భా పుత్రస్తు కౌశికః | దుహితా విజయా తస్య ధీరస్య ధనదో వృషః. 13

కౌశికస్తం గృహీత్వా తు గోపాలశ్చారయన్వృషమ్‌ | గఙ్గాయాం స్నానకృత్యే7థనీతశ్చౌరైర్వృషస్తథా. 14

స్నాత్వా వృషమపశ్యన్స వృషం మార్గితుమాగతః | విజయా భగినీ యుక్తో దదర్శ స సరోవరే. 15

దివ్యస్త్రీయోషితాం బృన్దమబ్రవీద్దేహి భోజనమ్‌ | స్త్రీవృన్ధమూచే వ్రతకృద్భుజ్వ త్వమతిథిర్యతః. 16

వ్రతం కృత్వా స బుభుజే ప్రాప్తవాన్‌ వనపాలకమ్‌ | గతో ధీరః సవృషభో విజయాసహిత స్తదా. 17

ధీరేణ విజయా దత్తా యమాయాన్తరితః పితా | వ్రతభావాత్కౌశికోపి హ్యయోధ్యాయాం నృపోభవత్‌.

పిత్రోస్తు నరకే దృష్ట్వా విజయార్తిం యమే గతా | మృగయామాగతం ప్రోచే ముచ్యతే నరకాత్కథమ్‌. 19

వ్రతద్వయాద్యమః ప్రోచే ప్రాప్య తత్కౌశికో దదౌ | బుధాష్టమీద్వయఫలం స్వర్గతౌ పితరౌ తతః. 20

విజయా హర్షితా చక్రే వ్రతం భుక్త్యాదిసిద్దయే | అశోకకలికాశ్చాష్టౌ యే పిబన్తి పునర్వసౌ. 21

చైత్రే మాసి సితాష్టమ్యాం న తే శోకమవాప్నుయుః | త్వమశోక హరాభీష్టం మధుమాససముద్భవ. 22

పిబామి శోకసన్తప్తో మామశోకం సదా కురు | చైత్రాదౌ మాతృపూజాకృదష్టమ్యాం జయతే రిపూన్‌. 23

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అష్టమీవ్రతనిరూపణం నామ చతురశీత్యధిక శతతమోధ్యాయః.

రెండు వ్రేళ్ళు విడచిన పిడికిలితో ఎనిమిది పిడికిళ్ళ బియ్యముతో అన్నము వండి కుశయుక్త మైన మామిడాకుల దొన్నెలో ఉంచవలెను. కులాంబికాసమేతు డగు బుధుని పూజించి, బుధాష్టమీవ్రతకథ విని భోజనము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు తండులసహిత మగు కర్కటి దానము చేసి, యథాశక్తిగా దక్షిణ ఇవ్వవలెను. (బుధాష్టీమీవ్రత కథ): ధీరు డను ఒక బ్రాహ్మణు డుండెను. అతని భార్య పేరు రంభ; పుత్రుని పేరు కౌశికుడు. అతనికి విజయ అను ఒక పుత్రిక కూడ ఉండెను. అతనికి ధనదము అను ఒక ఎద్దు ఉండెను. కౌశికుడు అ ఎద్దును మేపుటకై గోపాలకులతో కలసి వెళ్లెను. కౌశికుడు గంగలో స్నానాదికార్యములు చేసికొనుచుండగా ఒక దొంగ ఆ ఎద్దును అపహరించెను. స్నానము చేసి వచ్చిన కౌశికుడు ఎద్దును కానక దానిని వెదకుటకై సోదరి యగు విజయతో కలిసి బయలుదేరెను. ఇత డొక సరోవరము నందు కొందరు దేవతాస్త్రీలను జూచి భోజనము పెట్టమని అడిగెను. అపుడా దేవతాస్త్రీలు ఇట్లు పలికిరి - ''నీవు మాకు అతిథిగా వచ్చినావు; అందుచే వ్రతము చేసి భోజనము చేయుము''. అపుడు కౌశికుడు బుధాష్టమీవ్రతము చేసి భోజనము చెసెను. వనరక్షకుని వద్దకు వెళ్ళి తన ఎద్దును తీసికొని విజయతో తిరిగి వచ్చెను అతడు యథాకాలమున విజయకు వివాహము చేసి మరణానంతరము యమలోకమునకు పోయెను. వ్రతప్రభావముచే కౌశికుడు అయోధ్యకు రాజుఆయెను. తన తల్లదండ్రులు నరక యాతనలనుభవించుట చూచి, విజయ యముని శరణుజూచ్చెను. కౌశికుడు వేటకొరకై వనమునకు వెళ్ళి నపుడు-'' నా తలిదండ్రులు నరకమునుండి విముక్తులెట్లగుదురు'' అని ప్రశ్నించెను. అపుడు యముడు ప్రత్యక్షమై ''రెండు బుధాష్టమీవ్రతముల ఫలముచే విముక్తులగుదురు'' అని చెప్పగా కౌశికుడు రెండు బుధాష్టమీవ్రతముల ఫలములను తలిదండ్రులకు ధారపోసెను. వారు స్వర్గమునకు వెళ్ళిరి. విజయకూడ సంతసించి భోగమోక్షాదిసిద్ధికై ఈ వ్రతము నాచరించెను. చైత్రశుక్లాష్టమి పునర్వసునక్షత్రయుక్త మైనపుడు ఎనిమిది అశోకపుష్పముల మొగ్గల రసము త్రాగినవాడు ఎన్నడును శోకము పొందడు. చైత్రమునందు వికసించు ఓ అశోకమా! నీవు శంకరునకు చాల ఇషమైనదానవు. నేను శోకసంతప్తుడ నై నీ కలికల రసమును త్రాగుచున్నాను. నీ వలెనే నన్ను కూడ శోకరహితుని చేయుము'' అను అర్థము గల 'త్వామశోక' ఇత్యాదిమంత్రము చెప్పుచు కలికారసపానము చేయలెను. చైత్రాద్యష్టములందు మాతృగణ పూజ చేయువాడు శత్రువులపై విజయమును సాధించును.

అగ్ని మహాపురాణమునందు వివిధాష్టమీవ్రతవర్ణన మను నూట ఎనుబదినాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters