Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకాదశోత్తరశతతమోధ్యాయః

అథ ప్రయాగమాహాత్మ్యమ్‌.

అగ్నిరువాచ :

వక్ష్యేప్రయాగమాహాత్మ్యం భుక్తిముక్తిప్రదం పరమ్‌ | ప్రయాగే బ్రహ్మవిష్ణ్వాద్యా దేవా మునివరాః స్థితాః.

సరితః సాగరాః సిద్దా గన్దర్వాప్సరసస్తథా | తత్ర త్రీణ్యగ్నికుణ్డాని తేషాం మధ్యే తు జాహ్నవీ. 2

వేగేన సమతిక్రాన్తా సర్వతీర్థపురస్కృతా | తపనస్య సుతా తత్ర త్రిషు లోకేషు విశ్రుతా. 3

గఙ్గాయమునయోర్మధ్యం పృథివ్యా జఘనం స్మృతమ్‌ | ప్రయాగం జఘనస్యాన్తరుపస్థమృషయోవిదుః. 4

ప్రయాగం సప్రతిష్ఠానం కమ్బలాశ్వతరావుభౌ | తీర్థం భోగవతీ చైవ వేదీప్రోక్తా ప్రజాపతేః. 5

తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూర్తిమన్తః ప్రయాగకే | స్తవనాదస్య తీర్థస్య నామసంకీర్తనాదపి. 6

మృత్తికాలమ్భనాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే | ప్రయాగేసంగమే దానం శ్రాద్ధం జప్యాది చాక్షయమ్‌. 7

న వేదవచనాద్విప్ర న లోకవచనాదపి | మతిరుత్క్రమణీయాన్తే ప్రయాగే మరుణం ప్రతి. 8

దశతీర్థసహస్రాణి షష్టికోట్యస్తథాపరాః | తేషాం సాన్నిధ్యమత్రైవ ప్రయాగం పరమం తతః. 9

వాసుకేర్భోగవత్యత్ర హంసప్రపతనం పరమ్‌ | గవాం కోటిప్రదా నాద్యత్త్య్రహం స్నానస్య తత్ఫలమ్‌. 10

ప్రయాగే మాఘమాసే తు ఏవమాహుర్మనీషిణః | సర్వత్ర సులభా గఙ్గా త్రిషు స్థానేషు దుర్లభా. 11

గఙ్గాద్వారే ప్రయాగే చ గఙ్గాసాగరసంగమే | అత్ర దానాద్దివం యాతిరాజేన్ద్రో జాయతే7త్ర చ. 12

వటమూలే సంగమాదౌ మృతో విష్ణుపురం వ్రజేత్‌ | ఊర్వశీపులినం రమ్యం తీర్థం సన్ధ్యావటస్తథా. 13

కోటితీర్థం చాశ్వమేధం గఙ్గాయమున ముత్తమమ్‌ | మానసం రజసా హీనం తీర్థం వాసరకం పరమ్‌. 14

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రయాగమాహాత్మ్యం నామ ఏకాదశాధిక శతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను : వసిష్ఠా ఇపుడు ప్రయాగమాహాత్మ్యమును గూర్చి చేప్పెదను. ఇది భుక్తిముక్తిప్రదమైనది. అత్యుత్తమము, బ్రహ్మవిష్ణ్వాది దేవతలును, గొప్ప మునీశ్వరులును ప్రయాగలో నివసింతురు. నదులు, సముద్రము, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు కూడ ఈ తీర్థమునందు నివసింతురు ప్రయాగలో మూడు అగ్నికుండములున్నవి. గంగ సకలతీర్థములను వెంట గైకొని ఈ కుండముల మధ్యనుండి మహావేగముతో ప్రవహించుచున్నది, త్రిభువన విఖ్యాతము, సూర్యపుత్రియు అగు యమున కూడ అచట నున్నది. గంగాయమున మధ్యభాగము పృథివీజఘన మనియు, ప్రయాగజఘనమధ్యభాగమునందలి ఉపస్థ యనియు ఋషులు చెప్పుదురు. ప్రతిష్ఠానసహిత మగు ప్రయాగ, కంబలము, అశ్వతరము, నాగము, భోగవతీతీర్థము- ఇది బ్రహ్మయజ్ఞవేది యని చెప్పబడుచున్నది. వేదములను, యజ్ఞములును ప్రయాగలో మూర్తి ధరించి నివసించును. ఆ తీర్థమును స్తుతించుట చేతను, నామ సంకీర్తనము చేయుటచేతను, అచటి మట్టిని స్పృశించినంత మాత్రముచేతను మనుష్యుడు సకల పాపవిముక్తుడగును. ప్రయాగలో గంగాయమునాసంగమునందు చేసిన దాన-శ్రాద్ధ-జపాదులు అక్షయము లగును. వసిష్ఠా! వేదము చెప్పినను, లోకము చెప్పినను గూడ అంతమునందు ప్రయాగములో ప్రాణములు విడువవలె ననెడు ఆలోచనను విడువరాదు. అరువది కోట్ల పదివేల తీర్థములు ప్రయాగలో ఉండును. అందుచే అది అన్నింటికంటెను శ్రేష్ఠమైనది. వాసుకి స్థానమైన భోగవతీతీర్థము, హంసప్రపతనము ఉత్తమతీర్థములు. వీటియందు మూడు దినములు స్నానము చేయుటచే కోటి గోదానములు చేసిన ఫలము లభించును. ''గంగ అనేక స్థానములందు లభించవచ్చును. కాని మాషుమాసమునందు, గంగాద్వారమునందును, ప్రయాగయందును, గంగాసాగరసంగమము నందును గంగ లభించుట చాల కష్ఠము'' అని పండితులందురు. ప్రయాగలో దానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళి తిరిగి భూలోకమునకు వచ్చిన పిదప రాజాధిరా జగును. అక్షయవటమూలసమీపమునను, సంగమాదులందును మరణించినవాడు విష్ణులోకమును పొందును. ప్రయాగలో అతి సుందర మగు ఊర్వశీపులినము, సంధ్యావటము, కోటితీర్థము, దశాశ్వమేధఘట్టము, గంగాయమునా సంగమము, రజోహీన మగు మానసతీర్థము, వాసరకతీర్థము-ఇవి ఉత్తమమైనవి.

అగ్నిమహాపురాణమునందు ప్రయాగమాహాత్మ్యవర్ణన మను నూటపదకొండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters