Satyanveshana    Chapters   

జ్ఞానయోగము

శ్రీమత్‌ భగవద్గీతలో ప్రబోధితములైన కర్మభక్తి మార్గముల కొంతకొంత గ్రహింపయత్నించితిమి. ఆ యోగములలో విడదీయరాని సంబంధము కలదని చెప్పబడిన జ్ఞానమార్గమననేమి? అనునది పరామ ర్శింతము భక్తిమార్గమున భగవంతుడున్నాడని నమ్మి, సర్వకాల సర్వావస్థలయందు ఆ భగవంతునియందే అచంచలభక్తీతో నుండిన మానవుడు ముక్తుడగుననియు స్థూలముగ గ్రహించితిమి. అటులనే భగవంతుడున్నాడను నమ్మకముతో, నిష్కామప్రవృత్తితో, స్వధర్మము నెఱవేర్చుచు, పరధర్మముల పరిత్యజించు, కర్మయోగి ముక్తుడగునని గ్రహించితిమి. ఆ రెంటియందుకూడ పరమాత్మయున్నాడని అంగీకరించితిమేకాని, ఆ పరతత్త్వమును గురించిగాని, ఆ పరమాత్మకు, జీవాత్మకుగల సంబంధము గాని పరామర్శించుట కవసరము మనకు గలుగలేదు. జ్ఞానమార్గమటుల కాదు. జ్ఞానమనగనే పరమాత్మని తెలిసికొనుట అని అర్థము.

అందుచే జ్ఞానయోగము ఆత్మానాత్మవిషయము. ఆత్మపరమాత్మలకు గల సంబంధమును గ్రహించుటకు నియమితమైన సాధనమార్గమైనది. అనగా దివ్యజ్ఞాన సంపత్తిచే ఈ సృష్టిరహస్యమును గ్రహించుటకు చేయుసాధన. యధార్థస్థితి నెఱుంగుటకు చేయు యత్నము. అందుచే జ్ఞానయోగము అన్నియోగములకు మూలమైనది; నిర్ణయించునదియైనది.

ఆధ్యాత్మికభావము పెంపొందినకొలది మానవుడు బ్రహ్మావస్థ, అనగా బ్రహ్మముకాక మరియేఇతరము లేదను భావము నందును. అట్టి బ్రహ్మజ్ఞాని అన్వేషింపవలసినది కోరదగినది; మఱమియు కనబడదు. ఆతడు; 'అహం బ్రహ్మస్మి' యనుస్థితికి వచ్చును. ఆత్మనాత్మవిచారము పరమాత్మకు ప్రకృతికిగల సంబంధము, జీవాత్మపరమాత్మలకుగల సంబంధము అన్వయించుకొని సమన్వయించుకొనుట చాల క్లిష్టమైనకృషి. ఆ కృషి జ్ఞానయోగముచే సాధితము. నేటిశాస్త్రజ్ఞులు ప్రకృతిని పరిశోధించి దానిరహస్యముల వెలిబుచ్చుటకు విశ్వప్రయత్నము చేయుచున్నారు. ఆ ప్రయత్నములో ఆ ప్రకృతిరహస్యములు మానవుల కెంతవఱకు నుపకరించును. అనుదృష్టియే కనబడుచున్నది. అది బౌధికము. అటులగాక తపోసంపన్నులగు ఋషులు, ఆత్మపరిశోధనలో ఈ ప్రకృతి యుద్భవించుటకు మూలకారణమేది? దానిని పాలించునదేది, దానికిని పరాత్పరునకు గల సంబంధమేమి? మొదలగు సూక్ష్మాతి సూక్ష్మమైన మూలవిషయముల గ్రహించి ఆత్మానాత్మసంబంధము నిర్ణయించినారు. అది యొక మహాశాస్త్రము. మహాతపస్సు. మానవుడు ప్రకృతియందలి వివిధములగు వస్తువులకు నామగుణముల నాపాదించుచున్నాడు. అసలు మానవతత్త్వమేమి? బాహ్యప్రపంచతత్వమేమి? రెంటికినిగల సంబంధమేమి? అట్టి సంబంధము కల్పించిన శక్తియేది? అను విషయవిచారణ, చిరంతన చింతనజేసి నిజతత్వమును గ్రహించుటయే జ్ఞానయోగము. ఈ విషయమునే ఉపనిషత్తులు బోధించునది.

సామాన్యమానవునకు కనబడు ప్రాపంచిక విషయములే ప్రధానములు. పుట్టుట పెరుగుట, తినుట, త్రాగుట; కులాసాగా తిరుగుట, మరణించుట. కాని తాత్వికునకటుగాదు, తాత్వికదృష్టిలో జీవితమునకు ఒక ప్రత్యేక ప్రయోజనమున్నది. అది నిరంతరకృషిచే జీవుడు జీవిత పరంపరల తరించి, గమ్యస్థానముచేరుటకు సాధనకాలము. అందుచే జ్ఞానులు - ఈ జీవితమే శాశ్వతమని భావించరు. ఆ జీవితమును సాధనమార్గముగ నుపయోగింతురు. ప్రతిసాధకుడు ఆత్మశుద్ధికి, ఆత్మానుభూతితో - పరమాత్మానుభూతి గలుగుటకు, ఆత్మానాత్మసంబంధము గ్రహించి, ఆత్మపరమాత్మతో ఐక్యమగుటకు మార్గమన్వేషించుచునే యుండును. అట్టి సాధన జ్ఞానమార్గము. అటుగాక స్వధర్మనిర్వహణలోను ఆత్మానాత్మవిచారణలోను తనజీవితము గడపనివాడు ఆత్మహంతకుడు.

అంతఃకరణశుద్ధి కలవారికి జ్ఞానమార్గము చెప్పబడినది. యత్యాశ్రమము స్వీకరించుటకు ముందు, కర్మ భక్తిమార్గముల చిత్తశుద్ధి బడసి శ్రవణ మనన ధ్యాననిష్ఠాదుల ఏకాగ్రమనస్కులైన తాపసులు కావలయును అట్టివారికి జ్ఞానమార్గము సుగమము. యత్యాశ్రమవిధుల వివరించుటలో జ్ఞానమార్గముకూడ కొంతవఱకు సూచనప్రాయముగ చర్పించితిమి. జ్ఞానమును గుఱించి కాశీఖండములో నిటులున్నది.

గీ. జ్ఞానముగాని మోక్షంబు సంభవింప

దతివ జ్ఞానమనంగ వేదాంత వాక్య

సంభవంబైన నది సుజ్ఞానమందు

రితరమజ్ఞాన మీ సూత్రమెరిగికొనుము.

గీ. అఖిల వేదాను సరణంబు యజ్ఞపరత

బ్రహ్మచర్యైక నిష్ఠ దపంబు శమము

శ్రద్ధ యుపవాసదీక్ష పారతంత్ర్యంబుదమము

కలశసంభవ విజ్ఞానకారణములు.

జ్ఞానమార్గము అసిధారావ్రతము. అది అందరికి సాధ్యమైనది కాదు. అశబ్ధ, అస్సర్శ, అరూప, అరస, అగంధ, నిరాకార, నిర్గుణ, అవాఙ్మయగోచర, అవర్ణనయ మయ్యు, నిత్యం, అనాద్యంతం, ధృవం, సత్యం, అయిన పరతత్త్వానుభూతి నందుటకు గమించుమార్గము. ఏమాత్రము పొరపాటు అలక్ష్యముచేసిన తప్పక యోగభంగము గలుగును. జ్ఞానమార్గమున చరించువారికి బాహ్యప్రపంచజ్ఞానము, పంచేంద్రియజ్ఞానము నశించి అంతర్దృష్టి కలిగి ఆత్మావలోకన చేయగలశక్తి పెంపొందవలయును నిరాగికానివానికి జ్ఞానయోగము దుర్లభము. వైరాగ్యమనగా ప్రకృతిసంబంధమైన అన్ని విషయములందు విముఖత్వము. జ్ఞానయోగమున వైరాగ్యము, వివేకము, సదసంపత్తి, శాంతము, మనోనిగ్రహము, దమము, వాంఛారాహిత్యము, ఓర్పు, శ్రద్ధ, మొదలగునవి ముఖ్యము. జ్ఞానమనునది వేదములు పఠించినంతమాత్రమున గలుగదు. తర్కమీమాంసాది శాస్త్రవాదములు పఠించినంతమాత్రమున గలుగదు. తర్కమీమాంసాది శాస్త్రవాదముల లభ్యముకాదు. చారువాక్కుల సాధింపబడదు. ఇవి యన్నియు లోకమును భ్రమ పెట్టుటకుమాత్రమే యుపకరించును మానసిక నిగ్రహములేక, పంచేంద్రియములను మాత్రము నిగ్రహించి తపముగాని ధ్యానముగాని చేయువాని శ్రమయంతయు నిష్ఫలము. అది ఆత్మ వంచన అట్టివారిని చూచి లోకులు వారు మహాజ్ఞానులని, యోగులని, భ్రమించుటకు ఆస్కారముండుటచే, అట్టివారు లోకవంచకులగుదురు. మనోనిగ్రహము, ఏకాగ్రత అలవడినవారికి పంచేంద్రియజ్ఞానమే యుండదు. అట్టివారికి జ్ఞాన నేత్రము వికసించును. అంతట సామాన్యులకు అందరాని దివ్యానుభూతులు వారికి కలగును.

జ్ఞాని సుఖదుఃఖముల స్వీయపరభేదముల గమనించడు. పరవస్తు వులయెడ ద్వేషము, భయము, ఈర్ష్య, అనురాగము నశించును. సమతా భావ మేర్పడును అట్టివాడు అచంచలుడై బ్రహ్మమునందు, కేంద్రీకృత మనస్కుడై, చనిపోయినవారి విషయమునకాని, చనిపోవువారి విషయమై కాని దుఃఖింపడు. అహంకార మమకారముల వీడినవారకే జ్ఞానయోగము సాధ్యముగా చెప్పబడినది.

నిర్వికారముగ బ్రహ్మమునందు మనసును కేంద్రీకరించుట యోగము. జ్ఞాని దేహమునకు ఆత్మకూగల భేదము గ్రహించిననాడు 'దేహము అశాశ్వతము నశించునది. ఆత్మ నశింపనిది' అని జ్ఞానయోగి యెరుంగును. అందుచే శరీరమునకు సంబంధించిన విషయములందు శ్రద్ధచూపడు. వానికి బాహ్యానుభావములన్నియు బాధలుగ గన్పట్టవు వాటివి ఒక తమాషాగా భావించి నిర్లిప్తతతో హసించును శరీరబాధలు కలిగినను అవి తనకు కావని భావించును. జ్ఞానికీ సర్వము ఆనందమయము. స్థితప్రజ్ఞుడగుటచే జ్ఞాని విషయవాంఛల మనసునకు తగులనీయక, ఎల్లపుడు బ్రహ్మసాక్షాత్కారమున బ్రహ్మానంద మనుభవించును. సర్వము సర్వావస్థలయందు తన మనసును భగవంతునియందు నిలుపుట జ్ఞానయోగము. అట్టి జ్ఞానికి మృత్యువనని భయములేదు. మృత్యువనునది పరిణామావస్థలో ఒక మెట్టు ఒక మెట్టునుండి మరొక మెట్టునకు పోవుట సాధనము. అటుల పై మెట్టు నకు కారణభూతమైన మృత్యువు మిత్రమే యగును.

మానవునకు ప్రకృతి బంధకారణము కాకూడదు. దానికి అతీతుడు కావలయును. తన ఆత్మశక్తిచే ప్రకృతి కల్పించు సర్వ మాయావాగురుల భ్రమల, నిగ్రహించవలయును సర్వసంగపరిత్యాగియై తన విషయములో అన్ని విధముల నిర్లిప్తుడుగా నున్న జ్ఞాని, ఇతరులకు నుపయోగించునెడల తన శరీరమును ప్రాణమునుగూడ నర్పించును. తన శరీరమందలి మాంస ఖండముల నర్పించిన శిబి, తన శరీరమును ప్రాణములనుగూడ నర్పించిన, జీమూతవాహనుడు, వెన్నెముక ఇచ్చినదధీని, మొదలగువారందరు జ్ఞానయోగులు.

ఒకడు జ్ఞానయోగి యగుటకు అరిషడ్వర్గముల నిగ్రహించి మనో నైర్మల్యము కలవాడు కావలయును. పరమశాంతమే అనుసరణీయము. అంతర్ముఖత్వము సాధనమార్గము. జ్ఞాని ఆత్మానాత్మభేదము గ్రహించిన మహనీయుడు. అతడు గంభీరుడు అచంచల సంకల్పము కలవాడు. అత్యావశ్యకములైన పదార్థముల ననుభవించునప్పుడు సహితము వేటి యందును మమకారము, ఆసక్తి చూపడు దేహధారణకు మాత్రమే అవి యని భావించును. అటుల మానసిక సన్యాసము కలుగును. జ్ఞానయోగి యగుటకు సాధన. బ్రహ్మచర్యాశ్రమమున ప్రారంభ##మై, గృహస్థు వాన ప్రస్థాశ్రమముల, కర్మ భక్తి యోగముల పరిపుష్టి చెందును. బ్రహ్మజ్ఞాను లైన జనకుడు, అశ్వపతి, ప్రియంవదుడు మొదలగువారు కర్మలాచరించుట మానలేదు. కర్మయోగులైనవారు జ్ఞానయోగులు కాలేదా? జ్ఞానిగా నుండువాడు గుణములను, కర్మలను విభజించి తెలిసికొని, ప్రకృతివికారములైన ఇంద్రియములు, ప్రకృతిలో సంబంధము కలవియేగాని ఆత్మకు, ప్రకృతి విషయములకు సంబంధములేదని తెలిసికొనును. జనకాదులు అట్టివారు. శద్ధాభక్తులు కలవానికి మాత్రమే ఇది సాధ్యము. మూఢునకు సంశయము కలవానికి, ఆత్మవిశ్వాసము లేనివానికి, నమ్మకములేనివానికి, జ్ఞానయోగము సాధ్యముకాదు. జ్ఞానము వెలుపటినుండి మానవుడు సాధించునది కాదు. అది అంతరంగ సాధనమూలమున పొందదగినది. జ్ఞాని అంతర్ముఖుడై, నిమీలితనేత్రుడైనప్పుడు - జ్ఞాననేత్రము విప్పారును. ఫాలాక్షుని మూడవ కంటివేడిమికి కాముడు దహించిపోయినటుల, అంతర్ముఖుడై బ్రహ్మానుభూతిగలిగిన తపస్వి, జ్ఞాననేత్రాగ్నికి ఐహికవాంఛలు తలంపులు భస్మీపటలమగును. అందుచే జ్ఞానయోగి ఫాలలోచన సముండనదగు అట్టి జ్ఞాననేత్రము విప్పారిన మహాత్మునకు సర్వము బ్రహ్మమయముగా గన్పడును. ఒకవిధమగు అనిర్వచనీయమగు బ్రహ్మానందము కలుగుటచే ఆతడు పరవశుడగును. అట్టిజ్ఞాని సమదర్శనుడు. జీవకారుణ్యము, భూతదయ, జ్ఞానికి లక్షణములు, ఎవరికి ఏ హాని గలిగినను అది పరమాత్మకే జరిగినటుల భావించి బాధపడును. జ్ఞాని త్రిగుణాతీతుడు, జ్ఞానయోగికి జ్ఞాననిష్ఠయు పరమాత్మ స్వరూపము నెరుంగు మార్గము, బ్రహ్మప్రాప్తిమార్గము, గీతయందు చెప్పబడినవి ఉత్తమాధికారికీ జ్ఞానయోగము సాధ్యము.

ఆత్మయందు పరమాత్మోపలబ్దియే దీనిఫలము. ధ్యాన ధారణ సమాధులవలన బ్రహ్మానుభూతినంది బ్రహ్మైక్యర నందుటయే పరమావధి.

చిరంతర యోగాభ్యాసమునగాని సమాద్యవస్థ కలుగదు. అది కలుగనిది బ్రహ్మానుభూతి కలుగదు. ఏకనిష్ఠతో నిజస్వరూపమును ఉపాసించినప్పుడే సాక్షాత్కారము లభించును. ప్రతి యుపాసకునకు భగవంతునిదగు ఏదో రూపమునందు మనసు లగ్నమగును. ఆ రూపమునే ధ్యానించుచు, ఉపాసించును. ముందు స్తోత్రాదుల, తరువాత మననాదుల ఆత్మ శుద్ధికావించుకొనవలయును. మనసును చిక్కబట్టి యోగాభ్యాసమున సమాధ్యవస్థ పొందవలయును. జ్ఞానికి సర్వరూపములు, స్థావర జంగమములగు, సకల జీవులు - చరాచర ప్రపంచమంతయు, రసమూర్తియైన, భగవంతుని చిద్విలాసములుగ గన్పట్టును అప్పుడు 'ప్రకృతి శాశ్వతము' అను భావము పోయి, అందుకు కారణమగు 'పరమాత్మ సత్యము నిత్యము' అనుభావము దృఢమగును. జ్ఞానయోగమున ముఖ్యముగా మానసికోపాసనయే ప్రధానముగ నెంచబడినది.

నేను అను వృత్తి ఇది, అది, అను వృత్తులు అన్నియు, భగవంతుడే యనువారు అద్వైతసిద్ధులగు జ్ఞానులు. వారు నిరంతరము నిర్విశేష, నిత్యనందైక, రసమయ పరబ్రహ్మమునే చింతన చేయుచుందురు లోపలను వెలుపలను నేను, ఈ సమస్తము సర్వము బ్రహ్మమేయని భావించి ఉపాసించువారు జ్ఞానయోగులు. అనగా - తమ సమస్తమును బ్రహ్మమందును. బ్రహ్మమును తమయందును, సమస్త వస్తుచయము నందును, దర్శించువారు నిత్యాభియుక్తులు అట్టి యధికారియగు మహాత్మునకు బ్రహ్మజ్ఞానము సులభ##మే. పునర్జన్మ లేనిదియు, అనంతము, అఖండానందుమ, అద్వయమునైన, మోక్షమనెడి, జ్ఞానఫలమున్ను అతి సులభ##మే.

జ్ఞాని సగుణోపాసన విధానమునకు, అగ్న్యారాధనాది క్రతువులకు అతీతుడు. వాటివలన పొందగలిగిన ఫలముకంటె, అతిశయమైన ఫలమును పొందగలడు. సర్వమునకు సర్వకారణమగు బ్రహ్మమునందు ఐక్యమగు శక్తివంతుడు అయినను కొన్ని కర్మల నేలచేయవలయునో, చేయుచుండునో మున్నే గ్రహించితిమి. మానవుడు బ్రహ్మవిదుడగుటకు జ్ఞానయోగము ముఖ్యసాధనము బ్రహ్మవిదుని లక్షణముల నెఱుంగుదుము ఆతడు సర్వాత్మదర్శియగు బ్రహ్మ నిత్యమనుట, సర్వదృశ్య విలక్షణమైన బ్రహ్మము నేనే యనెడుభావము. 'అహంబ్రహ్మస్మి' యనగల శక్తి యుతుడు ఆభావము కలిగినవారికి దేహాదులపై నేను అనెడి భావముండదు. నాదియనుభావము కూడ నశించును.

జ్ఞానయోగి పాపకార్యముల చేయలేడు జీవహింస విశృంఖలస్వేచ్ఛాచరణజ్ఞానయోగ లక్షణములు కావు. బ్రహ్మానుభూతికలిగి, బ్రహ్మ సాక్షాత్కారము గలిగిన జ్ఞానయోగి, నిత్యసంతుష్టుడు. అనుక్షణము బ్రహ్మాను భూతి గలుగుచుండుటచే వానిమనసు దివ్యలోకముల చరించుచు, దివ్యానంద మనుభవించుచునే యుండును. అట్టి జ్ఞానయోగము నియమాదులతోను, త్యాగముతోను, నిగ్రహముతోను, సాధనచేసినగాని శ్రవణ మనసధ్యాన సమాధి నిష్టవలనగాని, సిద్ధింపదు. అట్టి దివ్యానుభూతులకు, బ్రహ్మాను సంధానమునకు కారణభూతమైన జ్ఞానమార్గము ఉత్తమమైనదనియు, అట్టి జ్ఞానమార్గమే యత్యాశ్రమమునకు ప్రధానముగా చెప్పబడియుండుటయు, అన్నియాశ్రమములలోను యత్యాశ్రమమే పరమోత్తమమైనదని చెప్పుటలో అసంభ్యావము ఏమీయులేదు. కాని అదియొక్కటియే మోక్షసాధన మనియు, యత్యాశ్రమము స్వీకరించనివారికి జ్ఞానలబ్ధిలేదనియు కర్మయోగులగు గృహస్థాశ్రమపరులకు ముక్తిలేదనియు అనువారి వాదము సర్వసమ్మతము కాదు. కర్మయోగి తన విహితకర్మల భక్తి శ్రద్ధలతో నిర్వహించి చిత్తశుద్ధి నంది జ్ఞానియగుననుట సర్వాంగీకరామే నిషాము పర తంత్రనలో సర్వకర్మఫలము పరమేశ్వరార్పణము చేయుచు ప్రతిఫలము కోరకయే నిత్యనైమిత్తికర్మలు - వేదవిహిత స్వధర్మములని భావించి, ఆచరించి, పరధర్మముల పరిత్యజించు కర్మయోగి జ్ఞానియేకదా. ఏ ఆశ్రమ మున నున్నను అట్టి జ్ఞాన పరతంత్రుడు ముక్తుడగునని ఏల అంగీకరించ రాదు? శ్రీకృష్ణపరమాత్మ కర్మయోగ ప్రాశస్త్యమును వివరించి జ్ఞానయోగముతో సమాన ప్రతిపత్తి గలదనియేకదా విశదీకరించెను.

సరియైన జ్ఞానికి మోక్షము ప్రాప్తించును, ప్రాప్తించదు, అను ప్రశ్నతో పనిలేదు. మనోవాక్కాయకర్మల భగవంతునిమీద భారముంచి తన ధర్మమును తన విధులను యధావిధిగ నెఱవేర్చుటయే తన కర్తవ్యముగా భావించవలయును. కానీ అటులచేసినముక్తీవచ్చును. ఇటులచేసిన ముక్తివచ్చును, అటులచేసిన రాదు, అను ఆలోచన అనవసరము అటుల సందేహించుట యజ్ఞానచిహ్నము. యజ్ఞరూపుడు, యజ్ఞకర్త, యజ్ఞఫలము నందువాడు భగవంతుడే. సృష్టి స్థితి లయములకు కారణభూతుడు ఉత్తమ గతిగాంచుటకు మానవుడు సమయముగా కృషిచేయవలయును. ఆ యత్నమును సక్రమమార్గమున నడుపునది మతము ప్రమాణములు వేదములు శాస్త్రములు, అందు ముఖ్యముగా ప్రస్థానత్రయము వానిని విపులపఱచు నది బుధవాక్యము. ఉపదేశించునది సద్గురువు. అట్టి సద్గురువు దొరుకుట పూర్వపుణ్య విశేషము.

ఎన్ని చెప్పినను కర్మ భక్తి జ్ఞానమార్గములు మూడును పరస్పర సంబంధముగల సాధనమార్గములే అయినను, అధికార తారతమ్యమును బట్టి ఆచరణలో వివిధములుగ చెప్పబడినవి. ఏమార్గముననైన సక్రమ ముగ గమించువారు గమ్యస్థానము చేరుదురు. ఆచరణ లోపమున్న కర్మ భక్తిజ్ఞానమార్గములలో ఏ ఒక్కటియు మోక్షహేతువు కాజాలదు. ఇది మంచిదా - అది మంచిదా. ద్వైతము మంచిదా, అద్వైతము మంచిదా, ఏ ఉపాసనావిధానము మంచిది, అను తర్కవితర్కములతో శుష్కవాదములతో కాలము వృధాపుచ్చక ప్రతిమానవుడు తనజీవిత కాలములో, ఏదో ఒక మార్గము శాస్త్రసమ్మతమైనదానిని స్వీకరించి, బుధులు నిర్ణయించినటుల, శ్రద్ధతో తన విధికృతకర్మల ఈశ్వరార్పణ బుద్ధితో చేయుటయే తరుణోపాయము.

వాగ్రూపమునకాక, క్రియారూపమున, ధర్మ నిర్వహణ యుండవలయును. అప్పుడే మోక్షార్హత కలుగుటకు సాధన క్రమముగ సాగుటకు, ఆస్కారముకలదు. మానవులందరు అన్ని ఆశ్రమములందు, సర్వకాల ముల అన్నివేళల - ఈ సత్యమును మరువక, స్వధర్మనిష్ఠాగరిష్ఠులై నిష్కామప్రవృత్తి చరించుచు, సర్వము బ్రహ్మార్పణ మను భావముతో నుండు టయే జ్ఞానయోగమునకు మార్గము.

___________________________________________

వ్యక్తి యెంత గొప్పవాడైనను, భ్రాంతికిలిగినట్లయితే, దానివల్ల కలుగు దుఃఖము అతని ప్రవృత్తిని ప్రతిబంధించి తీరును.

విద్యానందస్వామి

Satyanveshana    Chapters