Satyanveshana    Chapters   

సనాతన ధర్మములు

ధర్మస్వరూపము నిర్ణయించుటకు, ధర్మాధర్మవివేచన చేయుటకు, శాస్త్రములు ప్రమాణములంటిమి. మహర్షుల వాక్కులును ప్రమాణములే. వారు సర్వమానవకళ్యాణము గోరియే ఆ యా ధర్మముల నిర్ణయించిరి. అట్టి ధర్మముల స్థూలముగా సనాతనధర్మములనియు, యుగధర్మములనియు, ద్వివిధములుగ విభజింపవచ్చును. అందు యుగధర్మముల వర్ణాశ్రమ ధర్మములుగ విభజింపవచ్చును. ఈ ధర్మములే కాక సర్వకాలికములగు ఋతుధర్మములు కలవు సూర్యచంద్రాది గ్రహములు, గతులు తప్పకుండ సంచరించుచు తమ ధర్మముల వీడకున్నవి. సముద్రము తన ధర్మమునకు కట్టుబడి, చెలియలికట్ట దాటకున్నది. జగత్ర్పాణుడు సదావీచుచు తనధర్మమును అనుష్ఠించుచున్నాడు. మేఘుడు కాలానుసారముగ వర్షించు చున్నాడు. ఈ విధముగ సృష్టియందలి సమస్తవస్తువులు తమ ధర్మముల నెఱవేర్చుచునే యున్నవి. ధర్మవర్తనకు భంగముకలిగిన ప్రళయమువచ్చినట్లే. ఋతుధర్మములు గతులుతప్పిన, అనగా మండువేసవిలో వర్షము; నడివర్షాకాలమున అనావృష్ఠి, ఎండలు; శీతాకాలములో వడగాడ్పులు వీచుట మొదలగునవి అక్రమము. సర్వప్రాణులకు బాధాకరము ఋతు ధర్మములు తారుమారగుటకు మానవుల అక్రమవర్తనయే కారణమని శాస్త్రములు చెప్పుచున్నవి. సామాన్యులు కూడ అటులను కొనుట పరిపాటే.

సనాతనధర్మములు అన్ని కాలముల, అన్ని దేశముల, అన్ని మతములకు సర్వసామాన్య ధర్మములగుట. అవి మానవధర్మములనీయు, సఛ్చీలుని ధర్మములనియు చెప్పబడుచున్నవి. అవి యన్నియు వేదవిహితములే. మనము పూర్వము గమనించినటుల సర్వులకు సత్యము, దయ, ఉపవాసము, తపము, శౌచము, సైరణ, సదసద్వివేకము, మనోనియమము, సంతోషము, తృప్తి, మహాజనసేవ,గ్రామ్యంబులగు కోరికలందు విముంత్వంబును, అర్జువము, అహింస, సర్వప్రాణులయందు సమభావము, మొదలగునవన్నియు సనాతనధర్మములు. మఱియు క్షమ,మౌనము, బ్రహ్మచర్యము, ద్వందములయెడ సమత్వము, సర్వమందును, సద్రూసమును, ఆత్మవీక్షణమును, నియందతృత్వరూపమున, నీశ్వరాన్వీక్షణమును, ఏకాంతశీలత్వము, గృహాద్యభిమానరాహిత్యము, యధాలాభ సంతోషము, ఇతరుల నిందింపకుండుట, దూషణభూషణంబులకు కలంగ కుండుట సనాతనధర్మములే. అట్టి సనాతనధర్మములు సర్వులచే సర్వకాలముల దేశకాలవిచక్షణలేకుండ, అనుసరిణీయములేయని అంగీకరించవలయును. ఈ విషయమున ఏ మతమువారికి, ఏ దేశమువారికి, ఏ వర్ణము వారికి అభిప్రాయభేదముండదు.

ఇక యుగధర్మములన్ననో అవి కాలమును బట్టి, దేశమునుబట్టి ప్రజలను బట్టి కొంత కొంత మార్పులు చెందుచుండును. అవి ఆచరణయందు వాటి తొంటి రూపములలో కూడ మార్పులు చెందుటయు సంభవమే. ఎన్ని మార్పులు కూర్పులు జరుగుచున్నను అన్నిధర్మములకు ప్రాతిపదిక సనాతన ధర్మములే. ఆ మార్పులు మానవధర్మములకు భంగకరము కాకూడదు. అట్టి మార్పులు యుగయుగముల ఘటించినవారు తపశ్శాలురగు మహాఋషులు. స్మృతికర్తలగు పరాశరుడు, యాజ్ఞసల్క్యులు, మనువు మొదలగు తపశ్శాలురు. వారు భగవదంశసంభూతులు. ప్రజాహితమును, మానవాభ్యదయమును గోరినవారు. వారు ధర్మములను విధినిషేధములతో నిబంధించిరి అట్టి ధర్మములు అన్నియుగముల నొకేరీతి నుండవు. కృతయుగమున నాల్గుపాదముల, త్రేతాయుగమున మూడు పాదముల, చెలు వొందిన ధర్మము ద్వాపరయుగమున రెండు పాదముల, కలియుగమున ఒకపాదమున మాత్రమే యుండునని గదా పురాణవచనము ః శీతోష్ణస్థితుల బట్టియు, దేశ భేదములబట్టియు ధర్మాచరణ భేదముండును. ఆచారవ్యవహారములలో, అన్నపానీయాదులలో, నిత్యవిధులలో,వస్త్రాలంకారములలో భేదములుండును. ఉష్ణప్రాంతముల సూర్యోదయమునకు పూర్వమే శీతోదకస్నానము, సూర్యోపాసన, నిత్యవిధియైన అవి శీతలమండలముల దుష్కరముకదా. సూర్యుడే కనబడని ప్రాంతములుకలవే. కొందఱికి శాఖాహారము విధింపబడిన, శాఖాహారము దొరకని ప్రాంతముల మాంసాహారము తప్పదు కదా! ఇట్టివి దేశకాలములబట్టి మాఱుధర్మములు కనుక ఒక యుగమునాటి ధర్మములు మఱొకయుగమందుండునని గాని, ఒక దేశమున నిత్య జీవవనమునకు విధింపబడిన ధర్మములు అన్ని దేశములందు అనుష్ఠనీయములే యనుటకాని సమంజసముకాదు. అటుల లేవని చింతింపరాదు. ఈ ధర్మములు యుగయుగములకు మారుచుండుననుటకు పరాశరమను స్మృతులే సాక్షి.

ధర్మము, స్వధర్మము, విధర్మము, పరధర్మము, ఆభాసధర్మము, ఉపమాధర్మము, చలధర్మము, అధర్మము అను భేదములుకలది. ఏది వేదవిహితమో, ఏది శాస్త్రసమ్మతమో అది స్వధర్మము. అది వ్యక్తులకు సంబంధించినది. ఆ వ్యక్తి స్వధర్మమునకు హానికావించునది విధర్మము. ఇతరులకు విహికమైనది తనకుకానిది అయినధర్మము పరధర్మము. అది పరిత్యజింపదగినది. ధర్మమువలె దోచియు దనార్థము లోకమును వంచించుటకు చేయబడినది. దంభముతో కూడినది, దంభముతో చేయబడినది, శాస్త్రబోధనారహితమై ఇచ్ఛానుసారముగ నొకనిచే ననుష్ఠింపబడు ధర్మము ఆభాసధర్మము వేదవిరుద్ధమైన పాషండము ఉపమాధర్మము. దానిని యుపధర్మమని గూడ నందురు. చలధర్మము రెండువిధముల : అవి అర్ధచలనము, శబ్దచలనము. గోదానముచేయవలయునను ధర్మమును పాటించుటకు మరణించుటకు సిద్ధముగనున్న లేక మరణించుచున్న, గోవును దానమిచ్చి ధర్మము నిర్వహించితి ననుకొనుట. ఇది అర్ధచలధర్మము. పదుగురుకు తక్కువకాకుండా భోజనముపెట్టుట ధర్మమని, పదిమందికి చాలీచాలని అర్ధాన్నభోజనముపెట్టుట శబ్దచ్ఛలధర్మము; పది మంది అనుశబ్దము నెఱవేరినంతమాత్రమున ధర్మము నెఱవేరినదని భావింపరాదు. కొందరు ఈ విధమగు ధర్మములాచరించుచు ధర్మమార్గమున గమించుచున్నామని భ్రమించి, చిత్తశాంతి గాంచుచుందురు. కాని అది నిష్ర్పయోజనము. ధర్మాచరణ మనిపించుకొనదు. ఇక అధర్మమన నేమి? ఏది వేదవిహిత, శాస్త్రసమ్మత విధులకు విరుద్ధమో అది అధర్మము. ప్రాణరక్షణ ధర్మము. ప్రాణిహింస అధర్మము. సత్యవ్రతము ధర్మము. అసత్యమాడుట అధర్మము. సాత్వికగుణకర్మలు ధర్మములు. తామన భావకర్మలు అధర్మములు. శాస్త్రములపఠించి జాగ్రత్తగ అన్వయించు కొని బుధవాక్యముల నాలించి ధర్మాధర్మ నిర్ణయమునకు రావలయునేగాని, తనకు తోచినదే ధర్మమనుకొనుట తాబట్టిన కుందేటికి మూడేకాళ్లు అను పిడివాదము వంటిది. కాన ధర్మాధర్మనిర్ణయము ఏ ఒక్కరి మాట మీద ఆధారపడినది కాదు. ఆ నిర్ణయమ చేయవలసినవి, చేయగల శక్తి వంతములు వేదములు.

ఇక కులధర్మములు చెప్పబడినవి. ఇచట ఒక మాట గమనింపవలయును. కులములు సంఘకట్టుబాట్లపై వృత్తులపై ఆధారపడియున్నవి. సంఘముయొక్క సక్రమ వర్తనకు కావలసిన వివిధ వృత్తులు, వర్ణవిచక్షత యున్న మాత్రమున మానవులలో భేదములున్నవని భావించరాదు. అటుల భావించుట పాపమునకు ఒడిగట్టుటయే. అందుఱను భగవంతుని సృష్టియే. శరీరమునందలి అవయవములవలె, సంఘమను దేహములో వివిధ వర్ణములు వివిధాంగములు. ఏ అంగములేకున్నను లేక బలహీన మైనను సంఘము సక్రమముగ జరుగదు. వర్ణనిర్ణయమంతయు, సంఘసుఖవ్యాపారమునకు మానవులు పంచుకొనిన కృషిభేదమే కులవిభాగము. ఇట్టి భేదములు ఏదోరూపమున అన్ని దేశములందును కలవు. అజ్ఞానులు, స్వలాభాపరులు, మతభేదముల, వర్ణభేదముల,గోరంతలు కొండంతలు చేసి, అంతఃకలహములు పెంచి, సంఘకట్టుబాటులను ఛిన్నాభిన్నము చేయయత్నింతురు. రాజకీయ లౌకికపరిస్థితులలో వారికి అనుకూలమగునటుల దుష్ప్రచారము చేసి సంఘకట్టుబాటులను కలుషితము చేయుచున్నారు. అట్టివారు లోకవంచకులు. స్వప్రయోజనార్థము ప్రజలక్షేమమును బలియిత్తురు. అట్టి వారి ప్రచారమును జాగ్రత్తగ పరిశీలన చేయవలయును.

యుగయుగములకు కాలముబట్టి మూలసూత్రములగు సనాతన ధర్మముల ప్రాతిపదికమీదనే ధర్మములు మారుచుండునంటిమి. ఒక్కొక్కకాలమునకు ఒక్కొకటి ధర్మము. అందుచే కృతయుగమున జరిగిన విషయములు ఈనాడు విడ్డూరముగ తోచవచ్చును నాటి పరిస్థితులు వేఱు; నేటి పరిస్థితి వేఱు. అందుచే ఈ కాలపరిస్థితులకు వాతావరణకు సంఘకట్టు బాటులకు అలవాటయిన నవీనులమగు మనము కృతయుగము నాడో, త్రేతాయుగమునాడో జరిగినవని పురాణములవలన మనకు తెలియవచ్చిన విషయముల విమర్శించి ఆనాటివారిని దుయ్యపట్టుట దూషించుట సమంజస మనిపించుకొనదు. అంతవఱకు ఎందులకు మొన్న మొన్నటి వరకు భ్రూణహత్య పరమకిరాతక కృత్యముగ భావించినవారే, ప్రభుత్వ ప్రోత్సాహమున సంతాననిరోధము కొఱకు గర్భస్రావములకు కూడ నామోదించుచున్నారు. అది అవినీతి ప్రోత్సాకరమగునేమో యను భయము లేదు. మనోనిగ్రహమువలన, నైతిక జీవనమున ధర్మబద్ధమగు శాస్త్రసమ్మతములగు నిషేధనియమములచే సాధింపదగిన సాధ్యమైన పరిమిత సంతానోత్పత్తి, లౌకికమైన యంత్రతంత్రసామగ్రి సహాయమున సాధింపనున్నారను. భార్యభర్తల వైవాహికబంధము అతి పవిత్రమైనది అనిన ఈ దేశములోనే, సంఘములోనే విడాకుల చట్టము ప్రచారములోనికి వచ్చినది. ఇదియంతయు పాశ్చాత్య నాగరకతావ్యామోహమేమో! కొంత కాలము జరిగిన తరువాత మరల చట్టములలో మార్పులు రావచ్చును. ఆ కాలమున వచ్చువారు ఈ కాలపువారిని అజ్ఞానులని నీతినియమములు లేనివారని అందురేమో. అటులనుటయు సహజమే. కనుక ఒక యుగమునాటి ధర్మములను మఱొక యుగమువారు విమర్శించి ఖండించుట సమంజసము కాదంటిమి. అది ఒకరు మఱియొకరి మనస్సునకు బాధను కలిగించుటయే.

సంఘమున దిన దినవ్యవహారములు జరుగుటకు కులము లనునవి యేర్పడినవనిగదా యంటిమి. వృత్తులమీద ఆధారపడియున్న వర్ణములకు మతమునకు సంబంధములేదు. హిందూమతమున వర్ణభేదమున్నదనుట పొరపాటు. భారతీయసంఘము వివిధ వర్ణములతో నున్నదనవచ్చును. వివిధ వృత్తుల మూలమున కలిగిన వర్ణములవారు ఒకరి మీద మఱొకరు ఆధారపడవలసినవారే పరస్పరసహకారముతో జీవయాత్ర సాగింపవలసినవారే. అట్టిచో ఏల ఈ కులతత్వజనిత ద్వేషము లుండవలయును? ఈశ్వర ఆస్తికతను అంగీకరించి 'ఆత్మవత్‌ సర్వభూతాని' యని చెప్పుచునే ఒక కులమువారు మఱొక కులమువారిని ద్వేషించుట అవివేకము. అట్టి ద్వేషము లౌకికవృత్తులందు తటస్థించు పోటీలవలన ఏర్పడినది కావచ్చు. లేక ఒకరి మీద మఱొకరు స్వలాభముకోరి పెత్తనము చేయనెంచుటవలన కావచ్చు. లేక ఒకరి మీద మఱొకరు స్వలాభముకోరి పెత్తనము చేయనెంచుటవలన కావచ్చు. రాజకీయస్పర్ధలు ఈ కులమతద్వేషమునకు దోహదకారులు కావచ్చు. సహృదయులందరు ఈ విషయము గ్రహించినవారే. సర్వ మానవ సౌభ్రాతృత్వము నంగీకరించినవారే. 'పండితః సమదర్శణ' అను దానికి బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానముకలవాడు. తనయందు బ్రహ్మ మును, బ్రహ్మమునందు తనను, అఖిలభూతములందు పరబ్రహ్మమును చూచువాడని యర్ధము భగవంతుడు సర్వసముడు, జ్ఞానియు, సమదర్శనుడు. కాని సమదర్శనశబ్ధమునకు కొందఱు విపరీతవ్యాఖ్య చెప్పుచున్నారు. సమదర్శన అనగా అందరితో కలిసి విందులారగించుట యునియు, వర్ణాంతరవివాహముల నొనరించవలయుననియు చెప్పుదురు. అటుల తలంచుట పొరపాటు. సమదర్శన యనునది, భావాద్వైతమునే సూచించుచున్నది.కాని క్రియా ద్వైతమును కాదని శ్రీమత్‌ శంకరాచార్యాది మతప్రవక్తలు అన్వయించిరి. సమదర్శన అనుపదమునకు సమవర్తన అను భావము కూడ ఉన్నదని భావించరాదు. పిపీలికాది సర్వజీవులను ద్వేష భావములేకుండ సమదృష్టితో చూడవలయునేగాని వానివలె వర్తించవలెనని కాదుగదా భావము ! సమదర్శనుడైనంత మాత్రమున మనుజుడు కుక్కలవలె పందులవలె వర్తించవలయునని ఎంతటి మూర్ఖుడైన తలంచునా? అంతా బ్రహ్మము అని, దానికి జాతిమతవిచక్షతలేక వర్ణాశ్రమధర్మముల త్యజించి మెలగవచ్చుననుట కేవలము వితండవాదము. ఒకే మానవుడు తనయింటిలోని వారినందఱిని ఒకే భావమున చూడడుకదా! భార్యను భార్యగాను, తల్లిని తల్లిగాను, బిడ్డను బిడ్డగను చూచునేగాని అన్యధా భావింపడు. వర్ణాశ్రమధర్మముల ననుష్ఠించుచునే అందఱియందు అన్నికులముల వారియందు సమరసభావమున నుండవలయును. ఒకరు ఎక్కువ అని గాని, ఒకరు తక్కువ అనిగాని, భావించరాదు. ఆత్మజ్ఞానముకల ఛండాలునైనను గురువుతో సమానముగా చూడవలయునుకనుక, స్త్రీపురుషులెల్లరు వర్ణాశ్రామాచారబద్ధులై మానవసేవయే మాధవసేవ యని భావించి లోకకళ్యాణమునకు కృషి చేయవలయును. ఎవరియెడ ద్వేషభావ ముండరాదు. సర్వమానవ సౌభ్రాతృత్వము సర్వజీవకారుణ్యము ఉండవలయును.

ఇటుల వర్ణాశ్రమధర్మముల నిర్ణయించిన శాస్త్రములు స్త్రీపురుష ధర్మముల వైవాహికబంధ వైశిష్ట్యమును భార్యాభర్తల విధులను నిర్ణయించినవి.

స్త్రీ ధర్మములు :

సీ|| విలయంబు వాటించు నిర్మలగేహియై

శృంగార మే ప్రొద్దు సేయవలయు

సత్యక్రియాలాప చతురయై ప్రాణశు

చిత్తంబు ప్రేమ రంజింపవలయు

దాక్షిణ్య సంతోషధర్మమేధాదుల

దైవతమని ప్రియు దలపవలయు

నాధు డే పద్ధతినడచు నా పద్ధతి

నడచి తత్పధము నడువవలయు

అ గీ. మార్థవంబున బతికి మజ్జన భోజన

శయనపానరతుల జరుపవలయు

విభుడు పతితుడైన వెలది పాతివ్రత్య

మహిమ పుణ్యుజేసి మనుపవలయు.

(భాగ.)

కం. తరుణి తన ప్రాణవల్లభు

హరిభావముగా భజించి యతడును దానున్‌

సిరికైవడి వర్తించుచు

హరిలోకమునందు సంత దానందమునన్‌.

(భాగ)

కం. ఉపవాసంబులు వ్రతములు

దపములు వేయేల భర్త దైవతమని ని

ష్కపటత గొల్చిన సాధ్వికి

నృపవర దుర్లభములేదు నఖిల జగములన్‌.

అటుల స్త్రీలు ఆదర్శగృహిణులై మానవతీమణులయి యుండుటకు విద్యావంతులు కావలయును. విద్యవలన సదసద్వివేకము గలుగును. అట్టి వివేక సంపన్నులే ధర్మాధర్మ వివేచన జేసి తమకర్తవ్యమును గుర్తెఱింగి, తమ మీద ఆధారపడియున్న పతి, సుత, బంధుమిత్రాదులనరసి, పోషించి గౌరవించి, వారిని సుఖపెట్టి తాము సుఖపడి తరించగలరు. కాన పురుషులకువలెనే స్త్రీలకు సంస్కృతి సంస్కారము కలుగుటకు విద్య అవసరము. అటుల విద్యావ్వితులగు జ్ఞానులే స్వధర్మ నిర్వహణమునందు కృతార్థులై ధన్యజీవులు కాగలరు.

భర్తలపట్ల భార్యలు వర్తించు విధానమును నిర్దేశించిన శాస్త్రములే భర్త భార్యను ఎటుల ప్రేమించి, మన్నించి, గౌరవించవలయునో, విశదపఱచియే యున్నవి. హిందూమతమున వివాహము, వేదవిహితవిధిని జరుగునది. అట్టి వివాహసమయముననే అగ్ని సాక్షిగ వధువును స్వీకరించిన వరుడు, సప్తపది మొదలుగాగలవి నెఱవేర్చుచు తనయింటిని తన ఆస్తిని భార్యకు ఎరుకపఱచుచు, స్వాధీనముచేసి, తన తల్లిదండ్రుల, సోదర సోదరీమణుల, భృత్యుల, ఆశ్రితుల, అతిధి, అభ్యాగతుల పాలించి పోషించి గౌరవించి తనవంశమునకు ఖ్యాతిని గూర్చుభారము సమంత్రకముగ నర్పించును. ఈ మంత్రములు చూడుడు.

''ప్రాణయస్తే ప్రాణాంత్సంధధామి

ఆస్తి భిర స్తి నిసంత ధామి

మజ్జా సైః మజ్ఞా సాని సందధామి

త్వచా త్వచజ్ఞా సంద ధామి

సాజీర్యత్వం మయా సహ

యాతేతు తిఘ్ని, ప్రజాఘ్ని, పశుఘ్ని

గృహిఘ్ని,యశోఘ్ని ర్నందితాతనూ''

అటుల ఎరుకపఱచుటయే కాక భార్యాభర్తలు శారీరకముగా వాచా, మానసికముగా, సర్వవిధముల నొకటేయనియు, అటుల సంచరించుట విధియనియు, మంత్రములవలన నెఱుగనగును. వైదికవివాహకర్మ అతి విష్ఠురమైనది.కట్టుదిట్టములతో గూడినది. విశృంఖల విహారమునకు గొడ్డలిపెట్టు. అతిపవిత్రమైనధి. భార్యాభర్తలు ఏకాత్మకలవారగుదురు. ఇల్లాలు గృహమునకు యజమానురాలు, అలంకారము, గృహలక్ష్మి, గురుతరమైన గృహనిర్వహణ బాధ్యతను స్వీకరించి, నిర్వహించు ధీర హృదయ, పరమపూజ్యురాలు. పుట్టినింటికి, మెట్టినింటికి, తనసచ్చ త్ర, సన్మార్గవర్తనమున, కీర్తిగూర్చు పూతచరిత హైందవదంపతులప్రేమ అతిపునీతమైనది. వారి బంధము ఆజన్మాంతము. అది పై పైమెరుగుల మీద ఆధారపడి యుండునదికాదు. తత్కాలికముకాదు. సులభముగ ఛేదింపబడునది కాదు. అది శారీరక వాంఛాతృప్తికి కాదు. కామమునకు పవిత్ర ప్రేమలో స్థానములేదు. అది యంతరాత్మల నతికింపజాలినది. ¸°వనప్రావిర్భావమున నావిర్భవించిన మోహము సందాతిచే శాంతిని, ధర్మధారణచే ధృవత్వమును, సంసారమునే మాంగల్యమును, బొందినకాని అయ్యది చంచలమును ప్రతికూలమును అగు జగత్తునుండి తప్పించుకొనజాలదు. ప్రేమలో వేగము ఆవేశము ఉన్నంతకాలము, స్థిరత్వములేదు. విశృంఖల వ్యాపారములో స్థిరత్వము శూన్యము. పూర్వమిమాంస ప్రకారము, స్త్రీజన్మ మాతృత్వమునందే సాఫల్యమందును. ఆ మాతృత్వము పరమపూజ్యమైనది. హిందూగృహమునకు ఋష్యత్వమే పునాది యందురు. ''ప్రజాయై గృహ మేదినాం'' అను ప్రయోజనమంగీకరించిన గాని,వివాహమునకు అధికారము లేదు. విషయేచ్ఛయే ప్రధానముగా దలచబడిన అది వివాహముకాదు. మాతృత్వమే దానికి పరమావధి. వేదోక్త వివాహము కానియెడల, మాతృత్వమునకు అధికారము లేదు. సై#్వరవిహార సంప్రాప్త మాతృత్వము ధర్మబద్ధము కాదు. అది శోచనీయము; పరిహార్వము. తన భార్యయందు మాతృత్వము చూడలేని వానికి కాముకత్వము నశింపలేదని భావించవలయును. వివాహము మాంగల్యధారణచే స్థిరత్వము సంపాదించి సంసారగమనమున పునీతమై, పుతజననముతో పవిత్రమై. పూజనీయమగును. దీనిని ప్రతి మానవుడు గ్రహించవలయును. భార్యను ఆటవస్తువుగా కాక, తనవంశమునిల్పు పవిత్రమూర్తిగ, వంశవర్ధనిగ, సుఖదుఃఖ ముల సమభాగినిగ, సంభావించి గౌరవించవలయును. సమంత్రకమగు వివాహబంధము పరమపూజ్యము. పితృదత్తయగు వధువును అగ్ని సాక్షిగ వరుడు గ్రహించుటయే ఉత్తమ వివాహక్రతువు.

శివుడు మన్మధ మధనుడు. అనగా కామమును దహనము చేసిన వాడు. కాని పార్వతిని వివాహమాడినాడు. దీనిభావమేమి? వివాహము కామతృప్తికి కాదనియు, ఒక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకనియు తేలుచున్నది. తారకాసుర సంహారకర్తయగు పుత్రుడు పార్వతి యందు పరమేశ్వరునకు కలుగవలయును. లోకరక్షణార్ధము పార్వతీ పరమేశ్వరుల వివాహము కావలసివచ్చినది పార్వతి తపముచేయుచున్నది. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. పరస్పరము ప్రేమించుకొనివారు. పంచవిధ వివాహములలో నొకటియగు గాంధర్వవిధిని శివుడు పార్వతిని గ్రహింపవచ్చు. అది క్షత్రియులకు ధర్మమే. ఇచటకాదు. అందుచే హిమవంతుడు సాలం కార కన్యాధానము చేసినప్పుడే శివుడు పార్వతిని స్వీకరించెను. దేవతల మహర్షుల సమక్షమున ఆ వివాహము జరిగినది నేటికిని అటులనే పండితుల, సదస్యుల సమక్షమున వేదివిధిగ కన్యాదానము చేయుట ఆచారమైనది. ఆ పురాణదంపతులే మన కాదర్శము. శివుని అర్ధనారీశ్వరత్వమే దంపతుల ఏకాత్మ సూచించుచున్నది. భార్య Better half అనే, ఆంగ్లేయ పదములందు గల భావము పూర్ణపురుషత్వము; భార్యాభర్తలు ఏకాత్మకలవారనుటనే సూచించుచున్నది.

అటుల వివాహమైన భార్యకు జ్ఞాన భక్తి మార్గములు గల్గుటకై వ్రతములకు, పూజాదులకు, భర్త అవకాశము గలుగజేయవలయును. అది వాని విద్యుక్తధర్మము. అట్టి సదుపాయములు చేయనియెడల ఆమె పాప ములకు భర్త బాధ్యత వహంచవలయును.బిడ్డలకు చిన్న తనమునుండియు దైవభక్తి, పెద్ధలయెడభక్తి, సత్ర్పవర్తన తలిదండ్రులు అలవాటు చేయవలయును. లేనిచో వారు అపమార్గములు కావచ్చును అందువలన సంభవించు పాపఫలమునకు తలిదండ్రులు బాధ్యులు. కర్మలోపమువల్ల స్వధర్మనిర్వహణయందు అశ్రద్ధగలుగును. ఆ కారణమున పాపము సంభవించును. అందుచే భర్తలు వయసునందు పెద్దవారగుట తమబార్యలందు భక్తి జ్ఞానభావములు గలుగుటకు వారు వారి ధర్మములు నిర్వహించుటకు సదుపాయములు చేయవలయును. సద్బోధ చేయవలయును. అటుల చేయని భర్తలు తమ స్వధర్మముల నెఱవేర్చుటలేదని చెప్పావలయును.

భార్యాపుత్రాదుల పోషణార్ధము ఈ లోకయాత్రను సుఖప్రదము చేయుటకు మానవులు కృషి చేయవలయును. ఆ కృషి వ్యవసాయము కావచ్చు, వర్తకము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, చేతిపనులు కావచ్చు, లేక కూలిపని కావచ్చు. ఈ లౌకిక ఖర్మల నెరవేర్చుటలో స్వలాభము కొఱకు అన్యాయ మార్గమున చరించి, ఇతరుల మోసముచేసి ధనమార్జించుట ఆధర్మము. అటుల అధర్మమార్గముల సంపాదించిన ధనము నిలువదు. ''అన్యాయార్జితం విత్తం సమూల వినశ్యతి'' క్రొత్తనీరు వచ్చి ప్రాతనీటిని కూడ కొట్టివేయును కాని ఈ కాలమున ధర్మముకన్న అధర్మమే ఎక్కువ ప్రచారములో నున్నది. ధర్మములు, శ్రీరంగనీతులు చెప్పువారు ఎక్కువగను, గమనించువారు తక్కువగ నున్నారు. తాము అధర్మమార్గమున నడుచుచునే అన్యాయముచేయుచున్నారు; పాపమునకు ఒడిగట్టుచున్నారు.'' అని ఇతరుల నిందించుట కాంచుచున్నాము, వారిది పరోపదేశపాండిత్యము. అసత్యమాడుట, మోసముచేయుట, ఆధర్మమార్గముల ధనమార్జించుట తప్పని భావించువారు చాలా తక్కువ. ఈనాడు ప్రతి మనుజుడు తనహక్కులను పేర్కొని, వాటి కొఱకు పోరాడుటలో చూపు చున్న శ్రద్ధ, పట్టుదల, తనధర్మముల విధుల నిర్వహించుటలో చూపుట లేదు. లౌకికకర్మలలో ఆత్మపరీక్ష చేసికొనుట చాల అవసరము. స్వలాభముకొఱకు పరపీడన, అన్యాయవర్తన, ఇరుగుపొరుగువారల కష్టములను గమనించకపోవుట సభ్యత అనిపించుకొనదు. అటుల గమనించనివారు సంఘశ్రేయోభిలాషులు కారు. సర్వులయందు సమతాభావము వారికున్నదని చెప్పలేము. స్వలాభపరులు ''సర్వజనా సుఖినోభవంతు'' అనుసూక్తి నెటులంగీకరింతురు?

అధర్మవర్తనులు చిన్నపెద్ద తారతమ్యములులేక ఏనాటికైన శిక్షింపబడుదురు నిప్పుద్రొక్కిన కాలు కాలకమానదు. మానవులేగాదు చివరకు దేవతలు సహితము; దేవతలేకాదు, దైవముసహితము ధర్మమును మీరి ప్రవర్తించిన పాపమునకుబాల్పడి శిక్ష అనుభవించక తీరదు. అందులకు ఈ ఇతిహాసమే తార్కాణము.

ధర్మాచరణలో, స్వీయవిధుల నెఱవేర్చుటలో, దేశ కాల వార నక్షత్ర ముల గమనింపకపోవుటలో, దోషముచేసినవారును శిక్షార్హులగుదురు. అట్టి వారికి ప్రాయశ్చిత్తకర్మ విధిపంబడినది బ్రహ్మకు ఒకనాడు విపరీతమైన వాంఛకలిగినది. ఆ కోర్కె ఉద్రేకపరచగా

శా. వాచా గోచర మప్రతర్క్యము వినిర్ధ్వంబ సాధారణం బసాధారణం

బా చోద్యం బతిలోక మప్రతిమ పర్యాయంబు వర్ణింపగా

నీ చెల్వంబది నిక్కమట్లయిన గానీ నాకు నీవంక వాం

ఛా చాపల్యము దీఱనేరదు మనోజక్రీడలన్‌ గోమలీ |

కం. నాకోరిక లీడేరగ

గైకొనవలె నీవు ప్రమద గౌరవకృత భా

షాకృతులు నూఱి కటువలె

గైకొంటివియేని చెప్పగలరేమవినన్‌.

అని శారదాదేవిని గోరగా ఆ తల్లి భర్తృ ఆదేశానుసారము నూరు రూపముల వెలయుటయు, కాల నియమధర్మముల బాటించక, కామాంధుడగుచు, కేళీంతుడై, ఉన్న కార్యంబులనెల్ల, బోమెత్తి,' పుణ్యపాపంబులదలంపక బ్రహ్మచరించుటచే

శా. క్రూరుల్‌ ధూర్తులు దోషకారులు జగద్రోహుల్మహా భీషణా

కారు ల్దర్మవిరోధు లన్యరమణీ కామాంధకారాంధు లా

చార భ్రష్టులు లోకకంటకులు శస్త్రవ్యగ్రచాల్కృపా

దూరు ల్ముప్పదివేల రక్కసులు దోడ్తోబుట్టుచుం దండ్రితో

(కాళహస్తి)

భేదించి వింద్యగిరిప్రాంతారణ్యమున నివాసమేర్పఱచుకొని చేసిన దురంతములకు, సల్పినఘోరములకు భంగపఱచిన వర్ణాశ్రమధర్మములకు, లోకము ఆక్రోశించినది భూదేవి ఆ పాపులభారము భరింపలేక, బ్రహ్మతో మొరలిడ కొడుకులపై కెరలినకోపంబున బ్రహ్మకు ఉగ్రుండను తనయుం డుద్భవించె బ్రహ్మపంపున ఉగ్రుండు తనసోదరులగు రక్కసులనెల్ల దునుమాడి మరలి నిజజనకునకు విన్నవింప, పుత్రవధా కర్ణన గ్రధిత శోకావలదదహ్యమానసుండై మండిపడుచు జూచిన, ఉగ్రండు వెంటనే భస్మంబయ్యె. దాన పుత్రహీనత్వపాపము ప్రాప్తించె, అద్ధాని నుండి విముక్తిగలుగుటకు దక్షతణకైలాసగోత్రంబున కూర్చుండి కమలాసనుండు పరమేశ్వరచరణంబులు మనసున నిలిపి, పెక్కేండ్లు తపంబు సేయ, శంకరుడు ప్రత్యక్షమై కరుణించి వరములీయ పాపరహితుండాయె.

ప్రతిమానవుడును ఆహారవిహారాదులందు అధర్మమార్గమున చరింపరాదు. స్వధర్మనిర్వహణకు ఇష్టానిష్టములకు ఎట్టి సంబంధము లేదు. అట్టి స్వధర్మనిర్వహణము మానుటయు, పరధర్మము ననుష్టించుటయు కష్టములకు పాపమునకు హేతువనియు అట్టి ధర్మమనునది యెవరో శాసించునదికాదనియు, లోకయాత్రను సుఖప్రదము చేయునదెల్ల ధర్మమనియు, ఇహపరములందు సుఖదుఃఖముల మానవుడే తనకుతాను నిర్మించుకొనుననియు దీనికొక, శాస్తలు, శిక్షకులు లేరనియు, దైవము కర్మఫలదాతయేగాని స్వతంత్రుడు కాడనియు, పురాణతిహాసములు ప్రపంచించినవి. ధర్మమనగనేమి? అధర్మమనగనేమి? అనునది తేల్చుట అంత తేలికఅయిన విషయముకాదని మున్నే గ్రహించితిమి. అందువలనే ధర్మమనగా వేదనిర్దేశ##మైన విధియని నిర్ణయించిరి. ఆ ధర్మములను మానవుడు త్రికరణశుద్ధిగా పాటింపవలయును. లేకయున్న ధర్మభ్రష్ఠుడగును.

వారివారి స్వధర్మముల, అనగా జాతిమతసారేణ విధింపబడిన ధర్మములు ఇతరులకు దోషములుగా గనపడుచున్నను, ఆచరించుటయే శ్రేయస్కరము. అటుల ఆచరింపక ఇంకొక ఆశ్రమధర్మముల ననుసరించుట నరకప్రాప్తియే. స్వధర్మానుష్ఠానతత్పరతకన్న చనిపోవుటయే శ్రేయస్కరము. సత్యముకొఱకు మృత్యువునైన ఎదుర్కొనగల వజ్రసంకల్ప ముండవలయును. అవసరమైన ఎట్టిత్యాగమునైన చేయవలయును వర్ణాశ్రమధర్మముల ననుష్ఠించువారు గమనింపవలసిన ముఖ్యవిషయ మొకటియున్నది. శాస్త్రరీతిని చక్కగా నియమపూర్వకముగా జేయునట్టి పరధర్మముకంటె, గుణరహితమగుగాక, సక్రమముగ చేయలేకపోయినను తనకర్తవ్యముగా శాస్త్రము విధించినట్టి స్వధర్మమే మానవునకు విద్యుక్తమైనది. పరధర్మము విడచి ఇంచుక గుణరహితమైనను స్వధర్మాచరణయందే చరించు వారికి మరణానంతరము మోక్షము లభించును. అటుగాక స్వధర్మమును వీడి, పరధర్మమున వర్తించువారికి ఈ జన్మలో ఆత్మశాంతి యుండదు సరికదా, మరణముకూడ శ్రేయస్కరము కాదు. మోక్షప్రాప్తియులేదు. అందుచేతనే భగవానుడు స్వధర్మమును వీడుటకు పరధర్మ మనుష్ఠించు టకు సిద్ధమైన అర్జునుని క్రమమార్గమునకు మరల్చుటకు గీతోపదేశము చేసెను.

యుగధర్మములు మారుచుండుననియు, ఆ మారుటయు సనాతన ధర్మముల ప్రాతిపదికమీదనే జరుగుననియు, ఆ మార్పులు స్మృతికర్తలు చేసియుండిరనియు ముందేగ్రహించితిమి. కాని యీనాడు కొందఱు శాస్త్రజ్ఞానము చాలకనో, అన్యమత భాషాచార సంస్కృతుల వ్యామోహముననో, లేక యే యితర స్వప్రయోజనముల నాసించియో, కొన్ని ధర్మములకు విపరీతార్ధములు చెప్పుచున్నారు. 'ధర్మంచర' 'సత్వంవద' అను సూత్రములకు లౌకికమగు అర్ధములు కల్పించి, యేదోవిదముగ సరిపెట్టుకొనుచున్నారు. నై తికధర్మములు అన్ని విషయముల ప్రధానమేకద. ప్రతివాడు ఒక నీతికి ఒక కట్టుబాటుకు నిలబడి నియమముల పాటించవలయునుకద. కాని ఈనాడు కొందఱు నీతినియమములకు సనాతనధర్మములకు సంబంధము లేదనియు, అవి సంఘకట్టుబాటునకు సంబంధించినవి మాత్రమే యనియు, పురోగమించుచున్న సంఘములో అవి మారుట సహజమనియు వాదింతురు. అట్టివారు మతప్రయోజనమునుగాని మతతత్వమునుగాని; పూర్తిగ గ్రహించలేదనవలయును.

అట్టివాదన లౌకికముగ ఎంతవఱకు పురోగమన దోహదకారియో చెప్పలేము. కాని అధ్యాత్మికముగ తిరోగమనమనుమాట సత్యము. జ్ఞానులమని జ్ఞానసాధకులమని చెప్పుకొనువారు సహితము నీతివిషయమున ఈ భావమే కలిగియున్నవారును కలరు. స్త్రీ పురుషసంబంధములో ఈ నీతినియమములు కొంత సడలినను వారు అంగీకరింతురు. అటుల అంగీకరించుట ఉదారహృదయలక్షణమందురు. భార్యాభర్తల సంబంధము అతిపవిత్రమైనది. వేదవిహితకర్మయని శాస్త్రములు చెప్పుచున్నను, అది సాంఘిక కట్టుబాటు మాత్రమేయని వారు వాదింతురు అందుచే లోక కట్టుబాటునకు భంగకరముగ సంచరించుట పాపహేతువు కాదందురు.

పోనీ వాదమునకు వారిమాట అంగీకరించినను అటుల విభిన్నము చేయబడిన వైవాహిక సంబంధమువలన గలుగు దుష్ఫలితములు, మానసిక ముగ నొకరికింకొకరు గలిగించు మానసికవ్యధ బాధ్యతారహితమైన సై#్వర, విహారమువలన గలుగగల అనర్ధములు సంఘదుస్థితికి కారణమగునే గాని సంఘము అభ్యుదయమార్గమున పురోగమించుట కుపకరించదు. స్త్రీ పురుష సంబంధమైన నీతిని, కట్టుబాటును కాదని వర్తించిన దానివలన గలుగు వర్ణసంకరము, అనారోగ్యము, ద్వేషము, కలహములు, హత్యలు, ఆత్మ హత్యలు, సంఘమునకు చీడ పురుగులు కావా? కాంతా కనకములే గద ఈ లోకమున అన్ని దుర్ఘటనలకు హేతువు. శారీరకమైనవియు, క్షణభంగురములనగు సౌఖ్యములకు ధర్మాతిక్రమణచేసి, వేదవిహితవిధులకు భంగము కలిగించు మనస్తత్వము గలవారు, శాశ్వతానందమొసగు భగవద్విషయ ముల, అధ్యాత్మికచింతను, ఆత్మానాత్మవిచారణను ఏకాగ్రబుద్ధితో నెటుల నుండగలరు? వారు తత్త్వవేత్తలమని, దివ్యజ్ఞాన సంపన్నులమని చెప్పుకొనవచ్చును. నిగ్రహములేక శారీరకవాంఛలకు లోబడువారికి చిత్త సంస్కార మెటుల కలుగును? నీతినియమముల సంఘ కట్టుబాటులను పాటింపనివారు ఎంతటి భగవధ్యాసపరులై నను ముక్తిగాంచరు. వారు వేద విహిత ధర్మములకు భంగకారులగుట, దుర్గతిపాలగుదురనుటకు సందేహము లేదు. నీతి అనగా Morality అనవచ్చును. అది ఒక స్త్రీ పురుష సంబంధ విషయమేకాక, సంఘమునందలి ప్రతి మానవుని జీవితములోను ముఖ్యమే ఒక కట్టుబాటునకు నిలబడి, తన విధికృతమగు ధర్మనిర్వహణలో నెట్టి త్యాగమైన జేయువాడు నీతిగలవాడనబడును. కష్టముకాని, నష్టమురాని యథార్థమును ఒప్పుకొనువాడు నీతిపరుడు. అట్టి వానికి Moral back bone ఉన్నదనుట పరిపాటి. కనుక నీతియను పదమునకు ఏదో ఒక సంకుచితార్థమును చెప్పక, విశాలదృక్పదముతో, సమగ్రమైన అన్వయము చేసికొనిన, మానవుని జీవితములో నీతి చాల ముఖ్యమైనదని తేలును అనగా నిజాయతీ ఒక లౌకికమైన యెత్తు అన్న మాట. అవసరమునుబట్టి గమనింపదగినది కాని మన శాస్త్రముల ప్రకారము, మన సంప్రదాయము ప్రకారము నిజాయితీ ఒక పరమ ధర్మము సర్వకాల సర్వావస్థలయందు అనుసరణీయమైన విధి. పాశ్చాత్య నాగరకతా వాసన గలిగిన తరువాత హైందవుల తత్త్వములోగూడ విపరీత భావములు స్ఫురించుటలో ఆశ్చర్యములేదు.

ఇటులనే 'సత్యంవద' అనగా సత్యమును పలుకవలయును అనృత మాడకూడదు. అది దోషము అను శాస్త్రవచనములకు కట్టుబడియేకదా సత్యహరిశ్చంద్రుడు అన్నికష్టముల ననుభవించినది తన తండ్రిని సత్యవాక్య పరిపాలనాదక్షుచేయుటకే కదా శ్రీరామచంద్రమూర్తి రాజ్యమును రాజభోగములను త్యజించి పల్కలాజినధారియై, వనముల కేగినది. సత్యవ్రత దీక్షితుడగు బలిచక్రవర్తి, సర్వము తెలిసియు, గురునగు శుక్రునిచే అన్యధా బోధింపబడియు, సర్వము వామనమూర్తికి ధారవోసెను. సత్య వ్రతమును అతిపవిత్రముగ భావించినారునాడు. కాని యీనాడు అటుల కాదు. సమయాసమయములబట్టి మారుచుందురు. వీరికి శుక్రనీతి అనుసరణీయమైనదేమో! ఆ దానవగురుడు

ఆ. వె. వారిజాక్షులందు వైవాహికములందు

ప్రాణ విత్త మాన భంగమందు

చకితగోకులాగ్ర జన్మరక్షణమందు

బొంకవచ్చు నఘము పొందడధిప.

అను సిద్ధాంతము ఎల్లరు వారి వారి వీలు ప్రకారము అన్వయించు కొనవచ్చు; ఉపయోగించుకొనవచ్చు.

ఇంతకు చెప్పునదేమనిన సనాతములైన ధర్మములు, యధాతధముగ అన్నియుగముల అన్నిదేశముల ననుసరించుట సాధ్యము కాదని, ఆర్యఋషులు స్మృతికర్తలు గ్రహించియున్నారనుటయే. అట్టి మార్పులు ఆచరణలో కొన్ని అపమార్గములబట్టి అర్థములేకుండ పోయినవి యుండవచ్చు. విద్యావిహీనులగు ప్రాకృత జనుల నోటబడి - కొన్ని కొన్ని మాటలు ఉచ్ఛారణలోపమున రూపమే మారి అపభ్రంశములుగా నుండుటయు చూచుచున్నాము. అటులనే కొన్ని కొన్ని యుగధర్మములు ఆచారములు వాటి తొంటిధర్మములకు విరుద్ధమగు రూపముల చలామణి యగు చున్నవి. అటుల జరుగుటకు, ప్రజల అజ్ఞానమేకాక పరమతముల ఔద్ధత్యము దుష్ప్రచారములు కూడ నని చెప్పవలయును బాల్యవివాహములు మహమ్మదీయ దండయాత్రలవలన హిందూసంఘమున వ్యాపించినవి అనాగరికులగు ఆటవికజాతులు మొదలగువారి మూఢత్వమున కొన్ని ధర్మములు దురాచారములుగ మారినవియు కలవు. వాటినే పట్టుకొని మూఢా చారములుగ ఉదహరించి, ప్రచారముచేసి, మన శాస్త్రమర్యాదలను సంస్కృతిని నిరసించి, ఆధ్యాత్మిక చింతాదూరులుగ మానవులు సంచరించుట తగదు అన్నిమతములలోను ఇట్టి దురాచారములు సంక్రమించుట మూఢ నమ్మకములు కలుగుట సహజము. కాని అందరు అంగీకరించినటుల సత్ప్రవర్తన అవసరము. సంఘ కట్టుబాటులన్నియు శాస్త్రములచే నిబంధితములు, వాటికి లోనై మానవశ్రేయస్సు దృష్ట్వా నడుచుకొని ఇతరుల మనస్సు నొచ్చకుండా పరోపకారజీవులై మానవులు సంచరించుచు, ఇహము శాశ్వతము కాదనియు, పరమే గమ్యస్థానమనియు, జీవాత్మ పరమాత్మలో లీనమగుటయే ధ్యేయమనియు భావించవలయును. ఆ భావము కలిగించుటకు వర్తనమును దిద్దితీర్చుటకు ధర్మములే పరమప్రయోజన కరములు.

పరమేశ్వరునకు మేరలనునవి లేవు అతని లీల దేనిచేతను అడ్డుగింప బడదు స్వభావసిద్ధమైన ఆతని శక్తి అనంతము.

శ్రీ అరవిందయోగి.

Satyanveshana    Chapters