Satyanveshana    Chapters   

గీతా వైశిష్ట్యము

''గీతార్ధం ధ్యాయతే నిత్యం కృత్వాకర్మాణి భూరిశః

జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదం''

సృష్టియందుగల జీవరాసులలో మానవజన్మ సర్వోత్తమైనదని యంటిమి. ఏలనన, పుణ్యపాపముల, శుద్ధాశుద్ధముల, ధర్మాధర్మముల, నిత్యానిత్యములాది, వివిధ సమస్యల, చక్కగ పరిశీలించి, పరిష్కరింపగల, మేధాసంపన్నమైనది మానవజన్మయే. అనగా కార్యకారణ సంబంధము నెరుంగుటకు కావలసిన జిజ్ఞాస మానవులకు మాత్రమే సహజము, సాధ్యము. అది లేనినాడు మానవజన్మకు పశుజన్మకు భేదములేదు. అట్టి మానవులకు కామక్రోధాదులను అరిషడ్వర్గములు అంతరశత్రవులు. అధ్యాత్మిక, ఆధిబౌధిక, ఆది దైవికములను, త్రివిధములగు దుఃఖములుగూడకలుగుటయు కద్దు. ఆధ్యాత్మిక దుఃఖములనగా అరిషడ్వర్గములవలన కలుగు మానసికమైన, శారీరకమైన, పీడలు, చుట్టుపట్లనుండు పరిసరముల పరిస్థితుల వలనను దొంగల వలనను, సరీసృపములవలన, మొదలగు విష జంతువుల వలనను, గలుగు బాధలు ఆధిబౌధికములు. మానవుల శక్తిసామర్ధ్యములకు సాధ్యముకాని ఆదృశ్యక్తులచేతనో దేవతల చేతనో పిశాచముల చేతనో మానవులకు గల్గు బాధలు, భూకంపములు, జలప్రళయములు మొదలగు బాధలు అధిదైవికములు అవి ఎందుకు సంభవించుచున్నవో మనకు తెలియదు ఏవేవో కారణములు చెప్పబుడుచున్నను అవి అన్నియు ఊహాజనితములేగాని యధార్థమని నిర్ణయించలేము. ఆ యా దుఃఖముల పోగొట్టుకొనుటకు మనకు ప్రపంచమున గల సాధనములన్నియు తత్కాలికమగు శాంతి చేకూర్చజాలినవి మాత్రమేకాని శాశ్వతమెన నివారణకారకములు కాజాలవు. అట్టిచో ఆ దుఃఖములనుండి శాశ్వతముగ విముక్తినందుటకు సాధనమేది? అది ఆత్మానాత్మవివేక మొక్కటియే. అట్టి వివేకమును గలిగించునవి ఆత్మప్రబోధాత్మకమగు మహాగ్రంధములు.

జీవాత్మ పరమాత్మను జేరుటకు సాధనమార్గముల తీర్చిదిద్ది ఇహ లోక నడవడిని, విధినిషేధములతో ధర్మబద్ధము చేసి సక్రమముగ జేయుట, మానవుని నడవడిని శీలమును అదువులోనుంచుట, మొదలగు బాధ్యతలతో గూడినది మతమనియు, అట్టి మతములు వేరు వేరు కాలముల వేరు వేరు నామముల ఈ ప్రపంచములో ప్రచారములో నున్నను, అన్ని టికి మూలసూత్ర మొక్కటియే యనియు, ఆ యా మతముల సిద్ధాంతములు క్రోడీకరించబడి, మత గ్రంధములుగా ప్రచారములో నున్నవనియు, ఇదివఱకే గ్రహించితిమి కాలప్రవాహములో మత సిద్ధాంతములు మరుపులో పడకుండుటకు జిజ్ఞాసువులకు, అందుబాటులో నుండుటకు, అని గ్రంధరూపమున నుండుట ఎంతయు అవసరమే. వితండవాదుల వాదముల ఖండించుటకు కావలసిన ఉపపత్తులు గల ప్రమాణ గ్రంధ ముండవలయును గద. క్రైస్తవులకు బైబిలు ప్రమాణ గ్రంధముకాగా మహమ్మదీయులకు కొరాను, బౌద్ధులకు దమ్మపదము ప్రమాణ గ్రంధములైనవి. అ గ్రంధములన్నియ ఒక పరిమిత ప్రమాణము కలవి మాత్రమే. హిందూమతమని నేడు మనము సాధారణముగ చెప్పుకొనుచున్న ఆర్షమతమునకు వేదములు ప్రమాణ గ్రంధములు. అందుచే మనది వైదికమతమనియు చెప్పబడు చున్నది. మన మత గ్రంధములు బహు సంఖ్యాకములు. వేదములు, ఉపవేదములు, దర్శనములు, శాస్త్రములు, స్మృతులు; మొదలగునవి. ఇటుల ప్రమాణ గ్రంధ బహురూప సంపద యుండుట మంచిదే అయినను, కొన్ని యెడల సామాన్యులకే గాక పండితులకు గూడ చికాకు గలిగించుటయు సంభవమే అన్ని గ్రంధముల నవలోకించుటయు ఒకనికి కష్టమే. అందుచే చతుర్వేదములుగ నారాయణాంస సంభూతుడగు వేదవ్యాసునిచే విభజింపబడిన వేదవాజ్మయ సారమంతయు ఉపనిషత్తుల రూపమున వెలువరింప బడినది. ఆ ఉపనిషత్తులుకూడ బహుసంఖ్యాకములు కొన్ని యెడల పరస్పర విరుద్ధములగు విషయములతో గూడియుండుటయు కద్దు. అయినను భారత వర్షముననున్న వివిధ మత సిద్ధాంతములు, అనగా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతములేగాక, బ్రహ్మ సమాజము, ఆర్యసమాజము, బౌద్ధము, జైనము, మొదలగునవి అన్నియు ఏదో ఒక ఉపనిషద్యర్ధమును ప్రధానముగా ప్రమాణముగా స్వీకరించినవేయని గ్రహించితిమి. అట్టి ఉపనిషత్తుల సారమును క్రోడీకరించి వివిధ ప్రక్రియల నిర్ణయించి వ్యాస మనీషి బ్రహ్మసూత్రముల వెలయించెను. అ బ్రహ్మసూత్రములు సహితము విపుల భాష్యములేకుండ సామాన్య పండితులకుగూడ బోధపడవు. అనేక సందేహములకు మూలమైతర్క వితర్కముల కాలవాలమై వాద ప్రతివాదములకు దారి తీసి చివరకు ఒరదరి త్రొక్కక, మనసునకు చికాకు గలిగించు ప్రమాదముకూడ సంభవమే. అందుచే మానవులకు తరుణోపాయము జూపుటకు శ్రీకృష్ణభగవానుడు కింకర్తవ్యతామూఢుడైన నరునకు, తత్వోపదేశము చేయు వ్యాజమున, సర్వోపనిషత్సారమును గీతారూపమున వెలువరించెను. ఈ విధముగా నిగూఢమగు వేదాంతరహస్యములు ఉపనిషత్తులుగ, బ్రహ్మసూత్రములుగ, భగవద్గీతగ ప్రభవిల్లి ప్రస్తానత్రయమని పేర్గాంచి వైదికమతమునకు ప్రమాణ గ్రంధములైనవి.

ఈ ప్రమాణ గ్రంధములలో ముఖ్యముగా బ్రహసూత్రములు, ఉపనిషత్తులు, అర్థప్రధానము లగుటయే గాక, శబ్ద ప్రధానములు గూడ నగుటచే అందరికి పఠింప శక్యముకాదు. ఆ కారణమున వ్యాసమనీషి పంచమవేదముగా ప్రసిద్ధిగన్న మహాభారతమున సర్వవేదాంత సారమును వెలయించెను. అది స్త్రీ పురుషులందరు కులవర్ణ భేదములు లేకుండ చదువదగిన, చదువవలసిన ఉద్గ్రంధము. అటులగుటకు బలీయమైన మఱొక కారణము కలదు. సకల ఉపనిషత్సారమగు శ్రీ భగవద్గీత పదునెనిమిది యధ్యాయములలో శ్రీ మహాభారతమందు అంతర్భాగముగా గలదు. అటు లుండుటయేకాదు గీతా సారమంతయు విస్తృతమై మహాభారతమునందంతటను వ్యాపించియున్నది. ఆ రహస్యమును గ్రహించి మనీషి తిక్కయజ్వ భారతమును ఆంధ్రీకరించుటలోసంస్కృత భారతమునందువలె భీష్మ పర్వమున ఒక్కచోటునే గీతనంతను ఆంధ్రీకరించక భగవద్గీతాసారమును వివిధ ఘట్టముల సందర్భోచితముగ వివరించెను. అందుచే మహాభారతము భగవద్గీత విస్తృతరూపమనుట సమంజసమని ఋజువు చేసెను. భారత మందు అధ్యాత్మిక విజ్ఞాననంపత్తితో లౌకిక వ్యవహార దక్షతకూడ సమన్వయింపబడుటచే ఇహపరములు సాధించుటకు ఎంతయు ప్రమాణ గ్రంధమైనది. అనగా శ్రుతి స్మృతుల బోధయంతయు గీతయందు కేంద్రీకరింస బడినదన్నమాట.

ఒక గ్రంధము ప్రమాణ గ్రంధ మనబడుటకు దానికి ఏయే లక్షణములుండవలయును? అసంఖ్యాకములగు ప్రతులలో ప్రచారములో నుండిన మాత్రమున, అది ప్రమాణ గ్రంధమగునా ? అనేక భాషలలోనికి తర్జుమా చేయబడినంత మాత్రమున ఒకటి ప్రమాణగ్రంధమగునా ? ఈ రెండే ప్రధానమైన బైబిలు అన్నిమతములవారికి ప్రమాణ గ్రంధము కావలసియుండును. అటులగాక వేనవేలపుటలతో రమ్యముగా ముద్రింపబడిన బహుళ గ్రంధమైనంతమాత్రమున ఒకటి ప్రమాణ గ్రంధమగునా? అదియే గీటురాయి అయిన Britanika Eneyclopdica ప్రమాణ గ్రంధము కావలయును. బహుసంఖ్యాకులు చదువుటయే ప్రధానముగా నెంచిన ప్రతి దినము వెలువడు వార్తా పత్రికలు ప్రమాణ గ్రంధములు కాపలయును. విజ్ఞులెవ్వరు అంగీకరింపరు. ఒక గ్రంధము ప్రమాణ గ్రంధమగుటకు ఆధ్యాత్మిక సంబంధములైన సందేహములన్నిటిని తీర్చునది, జీవాత్మ పరమాత్మ సంబంధము దెల్పునది, సృష్టిరహస్యమును, ఇహలోక పరలోక సంబంధమును; వాటిని సాధించు మార్గములను, దెల్పగలిగి, సర్వసందేహ నివృత్తి కారకమగు, ఆత్మానాత్మ విచారణను, పుణ్యపాప విచక్షత మొదలగు సర్వకాలికములైన సత్యములను, సర్వమానవులకు తరుణోపాయమును చూపు విజ్ఞాన ప్రదమగు గ్రంధము కావలయును. అంతియేకాదు. మానవుడు స్వయంకృషిచే ఇహపరములను సాధించుటకు కావలసిన సాధన సంపత్తిని మార్గములను, మనో నిబ్బరమును ఇచ్చు శక్తి గలిగి యుండవలయును. ప్రవృత్తులలో భేదముగల ఈ మానవకోటి కంతటికి ఒక మార్గము ఒక యోగము ఉపకరించదు. అందుచే వివిధములగు సాధన మార్గముల ప్రబోధించునదై యుండవలయును. సర్వకాలికములగు సత్యములనే ప్రతిపాదించునది కావలయును. అది సర్వులకు అన్నిమతముల వారికి సర్వసందేహములు దీర్చునదిగ నుండవలయును. అనగా The Universal Seripture : A seripture for all Climes, for all men, and for all times, అట్టి మహానీయ ప్రబోధాత్మకమైన ఉద్గ్రంధరాజము శ్రీమత్‌ భగవద్గీత.

భగవద్గీత మహోత్కృష్ట ప్రబోధాత్మక గ్రంధమనుటకు సర్వమతములవారికి ప్రమాణ గ్రంధ మనబడుటకు కారణములు లేకపోలేదు.

వేదములను బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అను త్రివిధభాగములుగ చెప్పవచ్చును. బ్రాహ్మణములు కర్మపరతంత్రతకే ప్రాధాన్యమిచ్చి క్రతువిధానము విపులముగ నిర్వచించి నిబంధించినవి. ఆ క్రతువులు వివిధములు వాటి ప్రయోజనములును వివరింపబడినవి. మొదట వాని వైశిష్ట్యము గ్రహించియే క్రతువులు చేయబడుచుండినను, క్రమ క్రమముగ కాలప్రభావమున కొంతవఱకు కొన్ని అర్థరహిత ఆచారములుగ మారినవి. ఆ కారణమున ఉపనిషత్తులు వెలసిన కాలమునకు ఒక విధమగు భావవిప్లవము కలిగినది. ఆ ఉపనిషత్కర్తలు అందరు మహా ఋషులు, తపోసంపన్నులు, జ్ఞానులు, వారు చతుర్వేదముల నెరింగినవారే. వేదసారమును గ్రహించినవారే. మానవాభ్యుదయమును గోరినవారే. వారు బ్రాహ్మణములలో చెప్పబడిన క్రతువిధానమును కాదనలేదు. వేదముల కాదనలేదు. ఆ క్రతువిధానము ఇహమునకు చెందిన ప్రవృత్తి మార్గ మనియు, శాశ్వతమైనముక్తిని ప్రసాదింపనేరదనియు తలంచిరి. వారు తమకు గలిగిన వేదాంతార్థజ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకొనిరి. చిరంతన చింతనజేసి తమ స్థితిని, పరిస్థితులను అతిక్రమించిన అనే కత్వమునందు ఏకత్వమున్నదను సత్యమును గ్రహించిరి అనగా వివిధ రూపముల నుండు సర్వజీవరాసులకు సర్వసామాన్యమగు మూలకారణ మొకటి గలదని తెలిసికొనిరి. అద్దానిని జేరుటకు అనగా పునర్జన్మ రహిత ముక్తి గాంచుటకు జ్ఞానయోగము ఒకటియేయని దానిని ప్రతిపాదించిరి. ఉపనిషత్తుల కాలమున తరువాత కొంతకాలమునకు మరల హిందూమత మున మరొక విధమగు చైతన్యము కలిగినది. దానికి కారణము ఉపనిషతార్థములు సర్వులకు అవగాహన కాకపోవుటయే కావచ్చును. అట్టి చైతన్యము గలిగించినది పురాణయుగము. ఆ పురాణయుగమున మానవునకు భగవంతునకు సంబంధము సన్నిహితత్వము బాంధవ్యము కల్పించబడినవి. ఆ యుగముననే హిందువులకు త్రిరత్నము లనబడు శ్రీమద్రామాయణము, మహాభారతము, శ్రీమద్భాగవతము వెలసినవి. అవి సర్వ విజ్ఞాన సర్వస్వములు. అందు ముఖ్యముగా మహాభారత అంతర్భాగమున శ్రీమత్‌ భగవద్గీత వెలియుటచే మహాభారతము ఇహపరముల సాధించుటకు అనగా లౌకిక పరమార్థిక వర్తనకు వెలుగుబాటలు వేసిన ఉద్గ్రంధము. ఉపనిషత్యుగమున హిందూ మతమున భావవిప్లవము కలిగించిన సిద్ధాంతములకు పురాణయుగమున బహుళ ప్రచారము కలుగుటయేకాక, తత్పూర్వ సిద్ధాంతములతో కూడ సమన్వయము చేకూర్చబడినది.

ఆ యుగమున మరొక విశేషము గలదు. భిన్న భిన్న మతములుగ, సిద్ధాంతములుగ, ప్రచారములోనున్న వాటి తత్త్వమును, పరిశీలించి, ఆ యా సిద్ధాంతముల క్రోడీకరించి ఏకత్వము కలిగించి హిందూమతము యొక్క పరిపూర్ణమైన నిజతత్త్వము, దాని ప్రయోజనములు నిర్ణీములైనవి. అటుల నిరూపించిన ఉద్గ్రంధము శ్రీమత్‌ భగవద్గీత.

భగవద్గీత యోగశాస్త్రముకాగా అ గీతను ఉపదేశించిన శ్రీ కృష్ణభగవాన్‌ యోగీశ్వరుడయినాడు. అ బోధలవిని అనుసరించువారిని యోగులని యనుట పరిపాటి అయినది. కనుక యోగమనునది భగవద్గీతయందు ప్రధానస్థాన మాక్రమించిన దనవలయును యోగమనగా జీవాత్మ పరమాత్మల సమ్మేళనమునకు ఏర్పాటు చేయబడిన లంకె లేక, ముడియన వలయును. అట్టి యోగులు యుక్తులు, యుక్తులేకాక నిత్యయుక్తులు అనగా సతతయుక్తులు కావలయును. అటుగాక ఐహికవిషయములందు మనసు నిలపినవారు సంగులగుదురు.

బ్రాహ్మణములందు క్రతు విధానరూపమున కర్మయోగమునకు ప్రాధాన్యమీయగా ఉపనిషత్తులయందు జ్ఞానయోగమునకు ప్రాధాన్యమీయబడినదని గ్రహించితిమి. ఇక భగవద్గీత యందన్ననో ఈ రెండు యోగములతో భక్తియోగముకూడ ప్రతిసాదింపబడినది. మూడు యోగములకు సమాన ప్రతిపత్తి నిరూపింపబడినది. ఈ మూడు యోగములు వేరుకావనియు, మూడింటిని అవినాభావసంబంధము కలదనియు గీత నిరూపించినది. కర్మయోగము వేదవిహిత నిష్కామకర్మాచరణమున జీవుడు ముక్తుడగుననగా, భక్తి యోగమున ముముక్షువగు జిజ్ఞాసువు, భగవంతునియందు అచంచల భక్తి విశ్వాసములుండుట ముక్తిహేతువని చెప్పబడగా, జ్ఞాన యోగమున తపోనిష్ఠాదుల జీవుడు ముక్తుడగునని ప్రబోధింపబడినది. ఈ మూడును సాధనమార్గమున పరస్పరసహకారములే. ఇటుల వివిధ మార్గముల సమన్వయించి ప్రబోధించిన కారణమున శ్రీమత్‌ భగవద్గీత ఏకైక ప్రమాణ ఉద్గ్రంధమైనది.

గీత ముఖ్యముగా బోధించునది ముక్తియనునది యెవరో ప్రసాదించునది కాదనియు, మానవుడు స్వయంకృషిచే ఆత్మజ్ఞానము సంపాదించి, సాధన పరంపరచే సంపాదింపదగినది మాత్రమే యనునదియని గ్రహించవలయును. అటుల స్వయంకృషి చేయుటలో మానవుడు చేయవలసిన సాధనలు గీత వివరించినది. ఆధ్యాత్మిక భావసమృద్ధికి ఐహిక వాంఛానివృత్తికి కావలసిన సాధన రూపములన్నియు గీతయందు గలవు. ఇంకొక వివేషమేమన గీత ఐహికవిషయముల మానవ జీవితమునకు కావలసిన నిత్యవ్యవహారముల నిషేధింపదు. వాని క్రమబద్ధము చేయును. ఈ లోకములోనే యుండి అంతరబాహ్య బాధలతో గూడిన జీవిత సంగ్రామమున మానవుడు ముక్తిమార్గమన్వేషించుటకు మార్గములను జూపును. కాని అనుసరించవలయునని నిర్బంధము చేయదు. వ్యక్తుల విచక్షణజ్ఞానమునకు వదిలిపెట్టును. అటుల మార్గముల చూపుటలో ధర్మనిరూపణజేసి స్వధర్మనిర్వహణ మెంతముఖ్యమో, పరధర్మాచరణ ఎంత అనుచితమో, ధర్మధిక్కరణ యెంత పాపమో సకారణముగ నిరూపించినది. సాధారణముగా లౌకిక, ఆధ్యాత్మిక భావముల విడదీసి బోధించుట కొన్ని మత గ్రంధములందు కనబడుచున్నది. గీతయందు అటులగాదు. లౌకిక భావముల, కర్మల ఆచరణ విధి నిషేధములతో గూడిన నిర్ణీతపద్ధతిని నుంచుట వలన ఆధ్యాత్మిక భావాభివృద్ధికి, ఆధ్యాత్మిక జీవనమునకు కారణభూత మగునని బోధింపబడినది ఆధ్యాత్మిక భావముల నభివృద్ధి చేసికొనుటకు మానవుడు ఏకాంతవాసమే చేయనక్కరలేదు. పదుగురిలో నుండియు భార్యా పిల్లలతో సంసారిగానుండియు స్వధర్మ నిర్వహణ దక్షుడైన కర్మయోగి, యోగియయి గమ్యస్థానము చేరుటకు కావలసిన ఉపపత్తిని సంపాదింపవచ్చునను సత్యమును గీత ప్రబోధించినది.

ముక్తి సాధనకు సంకల్పము ఆకాంక్ష, శ్రద్ధ, నిష్ఠ, ఆచరణ ముఖ్యమనునది గీతవలన మనకు తెలియుచున్నది. మానవుని మనసా వాచా కర్మాణా సంపూర్ణ మానవుని జేయుటయే గీత సాధించు ప్రయోజన మనవలయును. అటుల అన్ని విధముల సంస్కరింపబడి సంపూర్ణుడైన మానవుడు పురుషోత్తముడు. అట్టి పురుషోత్తమునకు భగవంతునకు భేదము లేదు. నరుడు ఆరాయణుడగును. పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి భగవదవతారమేకద.

అన్నిమతములవారి ప్రమాణ గ్రంథములలో కొన్ని కొన్ని మహా వాక్యములు జ్ఞాన ప్రబోధాత్మకమగునవి యుండుననుట సహజము. అటుల లేకున్న ఆ గ్రంథములు ప్రమాణ గ్రంథములు కానేరవు. ఆ మహా వాక్యములు జీవునకు పరమాత్మకు గల సంబంధము తెల్పునవై యుండవలయను. మన వేదములలో అట్టి మహావాక్యములు నాలుగు కలవని బుధులు చెప్పుదురు.

ఆ మహావాక్యములు 'ప్రజ్ఞానాం బ్రహ్మ' 'అహం బ్రహ్మస్మి' 'తత్త్వమసి' ఆ అహం 'ఆత్మబ్రహ్మ' అనగా బ్రహ్మ జ్ఞానము కలిగి యుండుట, నేను బ్రహ్మను అదినీవు అయివున్నావు నాఆత్మయే బ్రహ్మ అని క్రమముగ అర్థము చెప్పుకొనవలయును. అనగా సర్వజీవరాసులకు సర్వ కార్యములకు మూల సూత్రమగు ఏ మహాతత్త్వముకలదో ఆ తత్త్వమే పరతత్త్వము. అది నా సర్వకార్య కారణ భూతమై వివిధ గుణరూప భావ సమృద్ధమై ప్రకృతియందు తన యిచ్ఛామాత్రమున విలాసముల చూపు చున్నది వేఱొండు లేదు ఐహికములగునవి యన్నియు ఆశాశ్వతములు. అన్నిటికి మూలమగు ఆ పరాశక్తియగు పరబ్రహ్మ మొక్కటియే శాశ్వతము. ఈ నాలుగు మహావాక్యముల భావము ఒక్కటే యనవచ్చును. ఆ భావమును విపులపఱచునవే ప్రమాణ గ్రంథములు. 'తత్త్వమసి' అను మహావాక్యమునకు అర్థము తెలిసిన మిగిలిన మహావాక్యముల సారము సులభముగ అవగతమగును. అందుచే 'తత్త్వమసి' యను మహావాక్యము అతి ముఖ్యమైనదని ఆ పండితులందరు అంగీకరించుచు దాని తత్త్వమును గ్రహించుటకే చింతన చేయుచుందురు 'తత్త్వమసి' అను మహావాక్యమును తేలిక మాటలలో చెప్పవలయునన్న అది నీవుఅయివున్నవు. అనగా నీవు అది అయివున్నావు, అని చెప్పుకొనవలయును. ఇందు మూడు మాటలున్నవి. నీవు, అది, అయివుండుట. ఈ తత్త్వ రహస్యమును బోధింపని మతము మతము కాదు. వివరింపని గ్రంధము ప్రమాణగ్రంధము కాదు. ఈ మహావాక్య వివరణమే ఆద్యంతములు భగవద్గీతలోవ్యాపించియున్నది. మొదటి ఆరు ఆధ్యాయములలో నీవు అనగా జీవాత్మఅంటే ఏమిటో, రెండవ ఆరు అధ్యాయములలో 'అది' అనగా పరమాత్మ అంటే యేమిటో చివరి ఆరు అధ్యాయములలో జీవాత్మ పరమాత్మ అయివుండుట అంటే ఏమిచో విపులముగ వివరింపబడినది. 'తత్త్వమసి' నీవు, ఆది అయివున్నాము. ఈ మాట భూతవర్తమాన భవిష్యత్కాలములకు వర్తించినదేకాని, ఒక కాలమునకు సంబంధించినది మాత్రమే కాదు. ప్రాపంచిక వాసనా సంబంధముల నన్నిటిని విసర్జించి నిష్కళంకమైన జీవాత్మ తాను ప్రభవిల్లుటకు మూలమైన పరమాత్మను జేరి లీనమగుట కదా ముక్తి. అది సాధించుటకు 'తత్త్వమసి' అను మహావాక్యము గుర్తులో నుంచుకొనవలయును. ఆ ముక్తి సంపాదించుటకు కావలసిన సాధన సంపత్తిని సమకూర్చి సరియగు మార్గము చూపు గ్రంధమగుటచే భగద్గీత పరమోత్తమ ప్రబోధాత్మక ప్రమాణ గ్రంధమైనది.

'సర్వ శస్త్రమయీ గీతా సర్వ వేదమయో హరిః

సర్వ తీర్థమయీ గంగా సర్వ ధర్మమయో మనుః

ఏకశాస్త్రం దేవకీపుత్ర గీత మేకదేవో దేవకీపుత్ర ఏవ

ఏకమంత్రో దేవకీపుత్ర నామ కర్మాష్యేకం దేవకీ పు తసేవా''

అను ప్రమాణ వాక్యముల దృష్ట్యా భగవద్గీత సకల ఉపనిషత్సారమేకాదు బహ్మవిద్యకూడ. బ్రహ్మవిద్యయేకాదు యోగశాస్త్రము కూడ. బ్రహ్మవిద్య యనగానేమి? దేనిని తెలిసికొనినతరువాత మానవునకు తెలిసికొనవలసినది ఏదియు యుండదో. ఏది తెలిసినతరువాత సృష్టి రహస్యములో తెలిసికొనవలసినది యేమియు మిగులదో, అట్టి పరిజ్ఞానమును ప్రసాదించునది బ్రహ్మవిద్య. బ్రహ్మ విద్యావిదులు సర్వకార్యములకు మూలకారణమైన సద్వసువును గ్రహింతురు. అట్టి జ్ఞానమునే శివజ్ఞాన మనియు, ఆత్మబోధ, పరవిద్య, మొదలగు నామముల చెప్పుదురు. బ్రహ్మవిద్యా ప్రబోధమే గీత. అట్టి గీత సాక్షాత్తు శ్రీ కృష్ణభగవానునిచే మానవకోటికి తరుణోపాయము జూపుటకు ప్రసాదింపబడుటచే అది పరమోత్కృష్ట ప్రమాణ గ్రంథమైనది. ఈ సంసారముననుండి తరించుటకు కష్టపరంపరలనుండి వెలువడి, అజ్ఞాన తిమిరమును పటాపంచలు చేసి చిత్తశాంతిని బొంది జ్ఞానము గాంచుటకు మానవునకు ముఖ్యసాధనము భగవద్గీత. జ్ఞానమువలన గాని మోక్షమార్గము సులభముకాదు. అట్టి జ్ఞానమును ప్రబోధించునది గీత. ఆ గీత సర్వమతములవారికి జిజ్ఞాసువుల కందరికి సమ్మతమైన గ్రంధము. అది పఠించుటవలన దాన ప్రతిపాదితములైన ధర్మముల ననుసరించుట వలన హృదయ గ్రంధుల నుండు మలినము పోవును. శ్రీమత్భగవద్గీత సర్వమతసార ప్రబోధాత్మకము. సర్వధర్మ ప్రతిపాదకము. ఉపాస, భక్తి కర్మ, జ్ఞాన, మార్గ ప్రకాశితము. అందు చేతనే శ్రీ వివేకానందుడు ఆద్దావిని Universal seripture అనినారు. అది Bible of Humanity అనగా మానవ కోటికంతకు పవిత్ర గ్రంధమన్నమాట.

అట్టి గీత మానవుల పురోగతికి మోక్షప్రాప్తికి వెలుగుబాటలు నిర్మించిన ఉత్తమ గ్రంధ మనిగదా యంటిమి అది శ్రీమన్నారాయణుడు కృష్ణావతారమున నరునకుచేసిన తత్వోపదేశము విష్ణాంశ సంభూతులు నరనారాయణులను ఋషిపుంగవులు. వారు కారణజన్ములు. మహా తపశ్శాలురు. ఒకే తేజము రెండు రూపములుగ ప్రకాశించినది. వారు విభిన్న రూపులైన ఏకాత్మ ద్వైవిత్వముగల ఏకత్వము జీవాత్మకు పరమాత్మకు గల సంబంధమే నర నారాయణులకు గల సంబంధము. నారాయణాంశము పరమాత్మవలె శాశ్వతము. అనగా సత్యం సుందరం శివం. అది సర్వాంత ర్యామి. నరాంశము ప్రకృతివంటిది. లేదా జీవాత్మవంటిది. జీవాత్మకు పరమాత్మ చేయు ప్రబోధమే గీత నరాంశము ఎల్లకాలము ఒకే రూపమున నుండదు. విభిన్నరూపముల ప్రభవిల్లును. అటుల వివిధ రూపముల వివిధ యుగముల రూపొందుచున్న నరాంశమును నారాయణాంశము ఏమరదు. పరమాత్మ జీవాత్మను పాలించుచునే యుండును అనగా నారాయణుడు నరుని వీడడన్నమాట. నరుడు నారాయణుని కాదని వీడి మనజాలడు. నరుడు నారాయణుని మరువరాదు. అటుల మరువని నరుని, నారాయణుడెప్పుడు కంటికి రెప్పవలె కాపాడుచునే యుండును. ఆ తపోధనులగు నరనారాయణులే ద్వాపరయుగమున అర్జున కృష్ణులుగ జన్మించి రంటిమి. భారతము చదివినవారికి వీరిరువురకు గల పరస్పర సంబంధము, పరమాత్మయగు శ్రీ కృష్ణభగవానుడు నరుడగు పాండవ మధ్యమునకు సర్వ కాల సర్వావస్థలయందు అండయై నిలచినది. గ్రహింపకపోరు. శ్రీకృష్ణసారధ్యమున రణరంగమున అవక్రపరాక్రమమున, అరిభయంకరుడై శత్రు సైన్యములకు పరిపంధిరాజలోకమునకు దుస్సహ, దుర్వార, తేజో రాశిగ గన్పడిన నరుడు, శ్రీకృష్ణ నిర్యాణానంతరము నిస్తేజుడై, యాదవ కాంతల ఆటవిక కిరాతుల బారినుండి రక్షింపలేక, దుఃఖాక్రాంత చేతస్కుడైనాడు. అటుల నారాయణుని అండ గోలుపోయిన నరుని విషాదము గనుడు.

శా. కాంతారంబున నొంటి దొడుకొనిరాగా జూచి గోవిందు శు

ద్ధాంత స్త్రీల బదారువేల మదరాగాయత్తలై తాకి నా

చెంతన్‌ బోయలు ముగి పట్టుకొన నాసీమంతినీ సంఘమున్‌

భ్రాంతిన్‌ భామిని భంగినుంటి విడిపింపన్‌ లేక ధాత్రీశ్వరా!

(భాగ)

శా|| ఆతేరా రధికుండు నాహయము లా యస్త్రాసవం బా శర

వ్రాతంబన్యుల దొల్లిచంపెను తుదిన్‌ వ్యర్థంబులైపోయె మ

చ్చేతోధీశుడు చక్రిలేమిభాసితక్షిప్త్రాజ్య మాయావి మా

యా తంత్రో పరబీజముల మర్యాదన్‌ నిమేషంబునన్‌

ఇటులనే శ్రీకృష్ణసహాయములేక అర్జునుడు నిస్తేజుడైన ఘట్టములు జై మినీభారతమున వివరింపబడినవి. ఒక అర్జునుడేకాదు నారాయణుని మరచి లేక కాదని నిర్లక్ష్యముచేసి, ఐహికములగు బల సంపత్తినే ఆధారముగ జేసికొని జయింపనెంచిననరు డెవ్వడును, సఫలీకృతమనోరథుడు కాజాలడు. పురుషప్రయత్న మెంత యున్నను, బలశౌర్యాదులెన్నియున్నను, దైవబలముముందు, అన్నియు నిష్ప్రయోజనమే. అందులకు భారతామే పరమోదాహరణము. కౌరవపాండవ యుద్దారంభమునకు ముందు. దుర్యోధనార్జును తిరువురు శ్రీ కృష్ణుని సాయమపేక్షించి వెళ్ళిన వారే. తన సహాయము యిరువురకు ఇత్తునని, నిరాయుధుడై యుద్ధము చేయని తా నొక వైపు, సకలాయుధసమోపేతులు, భుజబల పరాక్రమ ధైర్య సాహసులగు వీరులు పదివేలు ఒక వైపు, సహాయ సంపత్తిగా నిర్ణయించిన, అర్జునుడు శ్రీకృష్ణుని వరించుటయు, దుర్యోధనుడు వీరనికాయమును స్వీకరించి, తాను ఎంతయో ఘనకార్యము సాధించి నటుల భావించుటయు తెల్లమే. ఇట ఒక రహస్యమున్నది. అర్జునుడు దైవబలము నమ్మిన వాడు దుర్యోధనుడు ఐహికమైన సరిసంపదలను, అంగబలమును, తనవారి భుజబల పరాక్రమముల నమ్మి, వాటిపై యాధారపడినవాడు, అందుచే భారత యుద్ధము దైవబలమునకు, మానుషశక్తులకు మధ్య జరిగిన పోరాట మనియు, అందు దైవబలము మానుషశక్తుల మించినదనియు ఋజువు చేయబడినది. శ్రీ కృష్ణపరమాత్మ తనను నమ్మిన, ఆశ్రయించిన, వరించిన నరునకు, ప్రత్యక్షముగా యుద్ధముచేసి సహాయము చేయకున్నను, రధ సారధియై పరోక్షముగ ఎంత సహాయము జేసినదియు భారత పాఠకులకు తెల్లమే. అటులనే దైవము మీద ఆధారపడినవారికందఱికి భగవంతుడు అండయై నిలచును. అట్టిది ఆపద్భాంధవుడగు ఆ పరమాత్మ కృపా విశేషము. ఆ పరమాత్ముని దయామృతఝరి, ఎవరిమీద ప్రవహించునో వారు ధన్యులు. పునర్జన్మరహితమైన పదవిగాంతురు. పరమాత్ముని కృపా విశేషమును నిరూపించుగాధలు మన పురాణములం దెన్నేవి కలవు. నారాయణుని మరువని నరుని,నారాయణుడు కంటికి రెప్పవలె సర్వకాలముల కాపాడుచునే యుండునని అంటిమికదా. అందులకు ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలగు మహాభక్తులే యుదాహరణము.

శ్రీకృష్ణార్జునుల సంవాదమే గీత. నరుని సందేహములను దీర్చు అమోఘవాక్య సంపుటియే గీత. ఆదియే సర్వమానవకోటి తరించుటకు మార్గముజూపు ధృవతార. పాండవ మధ్యముండగు నరుడు, మానవకోటికి ప్రతినిధి (Representative). మానవులమగు మనకందఱకు ధర్మాధర్మవివేచనయందు గలుగు సందేహములు మన ప్రతినిధికి గూడ కలుగుటయు సహజమే. తనకు గలుగకన్నను మనకొరకైన సందేహ నివృత్తి చేయవలయునుగదా. ఆ సందేహములను, అనుమానములను తీర్చునది నారాయణాంశసంభూతుడగు శ్రీ కృష్ణపరమాత్మయే యగుట ఒక విశేషము. శ్రీకృష్ణపరమాత్మ చేసిన గీతోపదేశమును, పదునెనిమిది యధ్యాయములలో వ్యాసభగవానుడు విపులీకరించెను. ఆ సంవాదము నంతను వేదవ్యాస కృపా విశేషమున గలిగిన దివ్య శక్తివలన సంజయుడు ధృతరాష్ట్రునకు వినికిడి జేసెను. అందచే యుద్ధరంగమున శ్రీకృష్ణభగవానుడు పదునెనిమిది యధ్యాయములలో, పెక్కు శ్లోకములలో, ఎంతో కాలము తీసికొని చెప్పియుండెనవి తలంచుట ఆసంభావ్యము. అది ఎంతగజెప్పెనో, సూక్ష్మముగ జెప్పెనో, వివరముగ జెప్పెనో, మనకనవసరము. అతిసూక్ష్మమైన ఆ బోధను వ్యాసుడు బదునెనిమిది అధ్యాయములలో విపులీకరించెనేమో ఆ భగవద్గీతార్ధమును వేనకు వేలు పుటలతో, నేటికి విపులముగా ప్రచురించుచుండుట లేదా? సర్వమత సర్వస్వము గలిగి హైందవేతరులచే సహితము పొగడ్తకన్న ఆ గ్రంధ రాజమునకు త్రిమతాచార్యులు మొదలు నేటివఱకు ఎందఱో భాష్యములు రచించినారు. వ్యాఖ్యలు చెప్పియున్నారు. ఇంక నెందఱు వ్రాయనున్నారో? ఇంకను వ్యాఖ్యానించవలసిన బృహత్తర విజ్ఞాన విశేషములెన్ని గలవో? కొందఱు భగవద్గీతయందు పరస్పర విరోధములగు Contradietory విషయములు కొన్ని కలవని భావింతురు. అటుల భావించుట భగవద్గీత యందుభక్తి విశ్వాసములు లేకగాదు. అన్వయించి, సమన్వయించుకొను శక్తిలేమి కావచ్చును. మహా మేధాసంపన్నులగు పండితులు, వేదాంతులు, ఒకమెట్టు క్రిందికిదిగి, మధ్యమనుందాధికారుల కొఱకు సులభముగా గ్రాహ్యమగునటుల క్లిష్టముగ, పరస్పర విరోధములుగను, దుర్గ్రాహ్యములుగ మన్న విషయముల విశదీకరించుట ఎంతయు నవసరము.

జిజ్ఞాసువులకు, జ్ఞానపిపాసగలవారికి, అధికార తారతమ్యముల బట్టి వారి వారికి కావలసిన పరమార్థమును తెలుపు శ్రీమత్‌ భగవద్గీతను అర్జునునకు శ్రీకృష్ణుడేల చెప్పవలసివచ్చెను? అర్జునునకేయేల? అందును యుద్ధరంగమధ్యను. అంతియేకాక హింసాయుతకర్మయగు యుద్ధమునకు నరుని పురికొల్పుట పాపమునకు పాల్పడచేయుట పరమాత్మకు ధర్మమా? అను సందేహములు కొందఱికి కలుగుటకు ఆస్కారము కలదు. కొంచెము లోతుగా నాలోచించిన అట్టి సందేహములు నిరాధారములని తేలును. సమగ్రముగా కాకపోయినను, కొంతవఱకైన సమాధాముల నరయ యత్నింతము.

అర్జునుడు పంచపాండవులలో నొకడు. అందు పెద్దవాడు ధర్మరాజు. శాంతుడు, యోగి. ఉచితానుచితములు ధర్మాధర్మములు ఎఱింగిన ఉత్తముడు. అట్టి ధీశాలికి ఆధ్యాత్మికబోధ చేయవలసిన అవసరములేదు. ఇక భీముడు శుద్ధ ప్రాకృతమైన భుజబల పరాక్రమ పౌరుష ధైర్యాదులచే ఏదియైన సాధింపగలనను ధైర్యముకలవాడు. అన్య సహాయ మపేక్షించనివాడు. మానవశక్తికి దైవశక్తి కూడ నుండవలయునను భావమే కలుగదు వానికి. ఇక అర్జునుడు పాశుపతాది దివ్యాస్త్రముల కొఱకు తపస్సుచేసినవాడు దైవబలమునందు నమ్మకము కలవాడు. వివిధాస్త్ర బలోపేతుడు. తన శక్తి యందును విశ్వాసము కలవాడు అటు ధర్మరాజువలె జ్ఞానికాడు. ఇటు భీమునివలె ప్రకృతికి సంబంధించిన భుజబలాదులను మాత్రమే నమ్మినవాడు కాడు. రెండు పద్ధతులకు మధ్యస్తుడు. దైవబలమునందు నమ్మకము కలదు. అట్టివాడు కనుకనే సామాన్య మానవునకు ప్రతినిధి అయినాడు. మానవుడు తనకు తానుగా ఏదియు నిశ్చయించుకొనలేనప్పుడు దైవసహాయమును పొందుటకు సిద్ధుడగుట సహజము. అందుచేత అర్జునుడు గీతోపదేశమునందుటకు అర్హుడైనాడు. అర్జునుడు మనవలె మానవుడే యయ్యు, ముముక్షువునకు కావలసిన జిజ్ఞాస బ్రహ్మజ్ఞానము బడయుటకు, తత్వోపదేశము పొందుటకు, కావలసిన సాత్వికలక్షణములు, సంస్కారము, భగవంతునియందు అచంచలభక్తి, యుండియుండవలయును. అతడు ప్రజ్ఞాన్వితుడు, కృష్ణుని యందు అచంచలమైన భక్తి విశ్వాసములు కలవాడు. అది హేతువుగ తత్త్వోపదేశము పొందుటకు, విశ్వరూపమును దర్శించుటకు, అర్హత సంపాదించినాడు. ప్రతి మానవుడు అర్జునునకు గల సాత్వికగుణము, వ్రతాచరణమునందు, భక్తి శ్రద్ధలు, నలవఱచుకొని, భగవంతుని కటాక్షమునకు వేయియుండిన కిరీటికిలభ్యమైన అదృష్టము వానికిని పట్టుననుటకు సందేహములేదు.

అర్జునుడు క్షత్రియుడు. యుద్ధముచేయుట క్షాత్రధర్మము, హింసా యుతమయ్యు, ప్రజాపాలనయందు, దుష్టశిక్షణయందు, విధివిహితము, శాస్త్రసమ్మతము అది క్షత్రియులకు, పాలకులకు, స్వధర్మము, క్షత్రియుడు దానిని ఏమరరాదు. ఏ కారణమునైనను స్వధర్మమునకు భంగకరముగా చరింపరాదు. బాధాకరము, హింసాయుతము అవి శస్త్ర వైద్యుడు ఒకని ప్రాణము రక్షించుటకు అంగములనైనను ఖండింపక మానడుగదా! తల్లి ప్రాణమును రక్షించుటకు గర్భస్తుడగు శిశువును ఛేదించుటకు శస్త్ర వైద్యుడు హింసయని వెనుకాడునా? భిక్షాటనము క్షత్రియులకు, పరధర్మము. షట్కర్మనిరతులకు అది చెల్లును షట్కర్మలనగా, యజ్ఞము చేయుట, చేయించుట, వేదములు చదువుట, చదివించుట, దానములు చేయించుట, దానములు స్వీకరించుట, క్షత్రియులకు, దాన ప్రతి గ్రహము మినహా, మిగిలిన అయిదు కర్మలు, ప్రజాపాలనము, ప్రజా పాలనకు విధింపబడిన, ఇతర కర్మలు, విహితములు, సర్వవేదమయుడు బ్రాహ్మణుడు కాగా, సర్వదేవమయుడు క్షత్రియుడైనాడు. విష్ణ్వాంశమున్న గాని ప్రభువు కాలేడని కదా శాస్త్ర వచనము. 'నా విష్ణుః పృధివీపతిః'.

ధర్మత్రక్షేత్రమగు కురుక్షేత్రమున మహాసంగ్రామము జరుగనున్నది. కౌరవ పాండవులేగాక వారికి సాయము చేయవచ్చిన పెక్కురగు రాజన్యులతో పదునెనిమి యక్షాహిణీల బలముతో రణరంగము నిండి యున్నది. కిరీటికి ప్రతిపక్షమున గురువులు, పితామహులు, కులవృద్ధులు, సోదరులు, బంధువులు ప్రతిఘటించి యున్నారు. యుద్ధము వారితో చేయవలయును. జయము గాంచుటకు వారిని సంహరింపవలయును. అటుల పూజ్యులైన గురుపితా మహాదులు శత్రుపక్షమున వచ్చిన మాత్రమున స్వలాభముకోరి, సంహరించుట కరుణాశుడగు పార్ధునకు పాపమను భ్రమ, బంధువులయందు మోహము గలిగినవి. శోకమగ్న మానసుడై కర్తవ్యతా మూడుడైనాడు. హృదయమున ఒక విధమగు సంక్షోభము రేకెత్తినది. సజ్జనులకు పరపీడ బాధకరముకద. వరుడు సజ్జనుడు; దయార్ద్ర హృదయుడు. అతనికి కరుణ గలిగినది. కాని అది అస్థాన స్నేహకారుణ్యము. కారుణ్యమునకు గూడ, దేశకాల పాత్రముల గమనించవలయును. కిరీటికి అత్తరి ధర్మాధర్మ జ్ఞానము లోపించినది. అతడు వ్యామోహితుడయినాడు. స్వధర్మమగు యుద్ధము చేయననినాడు. అది మొదటి దోషము. పరధర్మము తనకు విధర్మము అగు భిక్షాటనమునకు మొగ్గు చూపినాడు. అది రెండవ దోషము. ఇటుల రెండు దోషములకు సిద్ధపడి తత్ఫలితమగు పాపఫలము నందు విపద్దశలో పాండవ మధ్యముడు పడినాడు. మానవుడు అపమార్గమున చరించుట భగవంతుడు సహింపనడని గదా యంటిమి ప్రతి మానవునకు కూడని తలంపులు కలిగినప్పుడు, వాని అంతర్వాణి 'నఖలు నఖలు' అని హెచ్చరించుచునే యుండును. బుద్ధిమంతుడు దానిని గ్రహించి తనను తాను దిద్దుకొనును. ఆ అంతర్వాణి ప్రతి మానవుని హృదయాంతరాళమున నుండు భగవంతుని వాణియే. మూర్ఖుడు అహంకార బధిరుడు అగువాడు, దానిని లక్ష్యముచేయక పాపమునకు బాల్పడును. అర్జునుడు శ్రీకృష్ణుని అన్ని విధముల నమ్మిన భక్తుడు. అట్టిచో భక్తచింతామణి యగు పార్థసారథి కర్తవ్యమేమి? మోహాంధకారమున కింక ర్తవ్యతా మూఢుడైన అర్జునుడు, విజతత్త్వము తెలిసికొనుటకు పరమాత్మ తత్త్వోపదేశము జేసి, విశ్వరూప ప్రదర్శనమున జ్ఞానమను వెలుగుబాటను జూపినాడు. ఆ బాటయే ఇహలోకమునుండి పరలోకమునకు పయనించు జీవులు ముక్తులగుటకు రాచబాట.

''గీతాశాస్త్ర విదం పుణ్యం యఃపఠేత్‌ ప్రయతః పుమాన్‌

విష్ణోః ప్రదమవాష్ణోతి భయశోకాది వర్జితః

ఇక యుద్ధరంగముననే తత్త్వోపదేశము చేయవలసి వచ్చుటకు మఱొక కారణము గలదు. వేదములు, వేదాంగములుగా గల వేదవాఙ్మయ మంతయు, ప్రశాంత వాతావరణమున ఋష్యాశ్రమముల పెంపొందినది. అచట మనసునకు చికాకు కలుగుటకు పరి పరి విధముల భావ వైకల్యము కలుగుటకు అవకాశ##మే లేదు. కాని అట్టి వాతావరణమే ప్రత్యక్షముగా మనము చూచు లోకపు నడవడికి సంబంధములేదు. మామూలు ప్రపంచ మున పరస్పర సంఘర్షణకు, దారితీయు సన్నివేశము లనేకము. అదికార్య రంగము. ఒక విధమగు యుద్ధభూమి. మానవులయందు ప్రవృత్తి భేదము లుండును. కొందరు సాత్వికులు కాగా,మరికొందరు రాజసిక ప్రవృత్తి కలవారు, ఇక కొందరు తామసిక ప్రవృత్తి కలవారు. రాజసిక తామసిక ప్రవృత్తులు కలవారే అధిక సంఖ్యాకులు. అట్టి వారికే సాత్వికులకు మధ్య, ఘర్షణ తరచు గలుగుచునే యుండును. అట్టి ఘర్షణయే కురుక్షేత్రమున జరుగనున్న కురుపాండవ సంగ్రామము. రాజసిక తామస ప్రవృత్తి కలవారు కౌరవులు బహుసంఖ్యాకులు. సాత్వికులగు పాండవులు అల్ప సంఖ్యాకులు. ధర్మ మెచట నుండునో భగవంతు డచటనే యుండును. నిర్గుణుడు. గుణా తీయుడయ్యు, పరమాత్మ సత్వగుణ సంపదను బలపఱచి, లోకమునకు అలజడి గలిగించు రాజసిక తామస ప్రవృత్తుల రూపుమాపును. అట్టి తరుణము కురుక్షేత్ర సంగ్రామ రంగము రంగము. సావధానముగ ఏ ఋష్యాశ్రమముననో, ఆలోచించుటకు, బోధించుటకు, తగిన సమయము కాదు. ఆ క్షణమే దివ్య బోధ కావలసి వచ్చినది. అనుభవ వేదాంతము అచట అవసరము. కృష్ణార్జునులు యుద్ధరంగమున నిలచినారేగాని గృహమందుకాదే. అత్యవసరముగ నివృత్తి జేయవలసిన సందేహములకు అచట కాక మరెక్కడ సమాధానము చెప్పుట సబబు? ప్రపంచమే కర్మరంగము. కర్మానుష్ఠానము ధర్మబద్ధము. స్వధర్మాచరణకు భంగము గలుగగూడదు ప్రతిక్రియ జరుగవలెను.అదియే గీతాబోధ.

అర్జునుడు మానవుల ప్రతినిధి యంటిమి. వానికి గలిగిన సందేహములు సర్వమానవకోటికి సామాన్యమే. విజ్ఞానియగు కిరీటికే ధర్మా ధర్మ వివేచనలో సందేహములు గలుగగ. పరిమిత విద్యాన్వితులు, ఆరిషడ్వర్గ భూత చేతస్కులు, ఈతి బాధాపరివృతులు అయిన గృహస్థుల మాట వేరుగ జెప్పవలయునా? ధర్మవర్తనులు సాత్వికులునగు పాండి వేయులకు, ఆధర్మ వర్తనులు, మాత్సర్యగ్రస్తులు, అసహనులు, అహంకారులు, తామసులు అయిన, ధార్తరాష్ట్రులకు ఆనాడు కురుక్షేత్ర రంగమున యుద్ధము జరిగినది ఆ కురుక్షేత్రము ధర్మక్షేత్రము ధర్మా ధర్మములకు యుద్ధము జరుగుటయు ధర్మము జయము గాంచుటయు జరిగినది. నేడును అట్టి కురుక్షేత్రములు కలవు. ప్రతి మానవుని హృదయము ఒక కురుక్షేత్రమే. మానవుని జీవితమే ఒక యుద్ధమువంటిది. మానవుని ప్రవృత్తిలో సత్వ రాజసిక, తామసిక గుణములు కొంచముగనో. ఘనముగనో యుండియే యుండును. అటులుండనియెడల వాడు మానవుడేకాడు. అందు రాజసిక తామసిక గుణ ప్రధానములైన కోర్కెలు ఎక్కువగను, సత్వగుణ ప్రధానమైనవి తక్కువ గను ఉండుటయు సహజమే. మానవ హృదయమున ఈ వివిధ ప్రవృత్తి జనిత సంకల్పములకు అనవరతము సంఘర్షణ జరుగుచునే యుండును. అది అన్ని వేళల ఎడతెగక ధర్మా ధర్మములకు, న్యాయా న్యాయములకు, సత్యాసత్యములకు జరుగు సంగ్రామము. కురుక్షేత్ర సంగ్రామము పదు నెనిమిది దినములకే పరిమితముకాగా, ఈ సంగ్రామము జీవితాంతము ప్రతినిత్యము, అనుక్షణము జరుగుచునే యుండును. మానవ హృదయము ధర్మక్షేత్రము కావలయును. అప్పుడు గాని ఆ హృదయ సంక్షోభము ఉపశమనము పొందదు. అనగా సత్వగుణము బలీయము కావలయును. అటులగు టకు దైవబలము చేయూత నీయవలయును. అట్టి దైవప్రసాదిత బలోపేతమైన సాత్వికశక్తి, మానవుని హృదయమునందలి రాజసిక, తామసిక ప్రవృత్తులను, లోబఱచుకొనును. అంతముక్తి మార్గాన్వేషణకు వాని మనసు తహతహపడును. ఆ తరుణమున భగవద్గీత కన్న మించిన ప్రబోధాత్మక గ్రంధముకాని ప్రమాణ గ్రంధముకాని మరొకటి లేదు.

యుద్ధము హింసాత్మకమైనది. దానికి శ్రీకృష్ణ పరమాత్మ నరునిప్రోత్సహించునా? అను ప్రశ్నకు కొంత వరకు సమాధాన మరసితిమి. ప్రకృతియందు పుట్టుట, పెరుగుట, నశించుట, అను అవస్థలు ఎప్పుడును జరుగుచునే యుండును. సృష్టికి నష్టదాయక మైనవాటిని ప్రకృతి ఎప్పుడు నాశనము చేయుచునే యుండును. మానవ సుఖజీవనమునకుభంగకారులైన జంతువులు, సరీసృపాదులు, వృక్షములేకాక, మానవులు కూడ నాశనమగుటయే ధర్మము. సృష్టి ధర్మమే అది, ఒకే పద్ధతి ఎంత మంచిదైనను. ఆచరణలో క్రమముగ దాని మంచితనమును బోగొట్టుకొని, లోపభూయిష్టము కావచ్చును. అప్పుడు పరిణామ ధర్మమున నూతన విషయములు నూతన ఆదర్శములు కలుగుచుండును. సృష్టిలో చెడు అనునది యుండగూడదనియు. మంచికి, ధర్మమునకు, భంగకరమైనదానిని తొలగించుట ప్రతి వ్యక్తి ధర్మమనియు గీత బోధించినది. నస్యములు, బాగుగ చెరగుటకు కృషీ వళుడు తుంగ మొదలగు అవసరపు కలుపును తీసి వేయును. పండిన బండ్ల బుట్టనుండి కుళ్ళిన పండ్లను ఏరివేయుదుము. ఏల? చెడు పదార్థమువలన మంచివికూడ చెడిపోకుండ జాగ్రత్త పడుటకే కదా. కుష్టురోగిని, అంటువ్యాధులు కలవారిని, సంఘములో దూరముగ నుంతురు. అటులనే దుష్టవర్తనుల, సంఘద్రోహుల, పాపవర్తనుల, తొలగించుట అవసరము ఒకానొక సమయమున హింసాయుతమయినను దండనాదులు చేయకతప్పదు అటుల చేయుట ప్రతిమానవుని ధర్మము. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ హింసాయుతమైనను యుద్ధము చేయవలసినదే యని ప్రోత్సహించుటలోని మర్మమిది. ఇచట నరుడు నిమిత్తమాత్రుడు. సంకల్పము దైవాదేశము. గీతలో దివ్యరూప సందర్శనములో అందరు మరణించుచున్నటులనే కనబడుచున్నటుల చెప్పబడినది. అందుకే నిచట హింస ప్రబోధింపబడినదని భావించుట అసమంజసము. అటుగాక సృష్టి కార్యమునకు, దైవ సంకల్పమునకు, ప్రతి మానవుడు ఇతోధికముగ సహాయకారి యగుటయే ధర్మము.

మానవులు మూడు రకములు ఉత్తములు వారు సాత్వికులు. వీరు సర్వకాలసర్వావస్థల యందును పరమాత్మయందు తమ మనసు లీనమొనర్తురు వారు జీవితము బుద్బుదప్రాయమని భావింతురు. ఈ యుత్తమ తరగతికి జెందిన స్త్రీ పురుషులందరు ఏ వ్యాపారము నందున్నను, అంతటను, ఆ పరబ్రహ్మమునే, అనగా ఆ శ్రీమన్నారాయణుని మహిమా విశేషముల, లీలల గాంతురు. అట్టి పాత్వికులు ప్రహ్లాదాది మహాభక్తులు.

రాజసిక గుణప్రధానులు మధ్యములు. మానవులలో వీరే ఎక్కువగ నుందురు. వీరు ప్రపంచ వ్యవహారముల దగుల్కొనియుండియు, మధ్య మధ్య ఆధ్యాత్మిక చింత చేయుదురు. వీరికి భగవద్భక్తి గలదు. సర్వము భగవంతుని నిర్దేశముచేతనే జరుగునని ఎరుగుదురు. అయినను వీరు ప్రాపంచిక వ్యవహారముల కాంక్ష వీడజాలరు. ఐహ్హికములైన కోరికలు, వీరిని బంధించును. అరిషడ్వర్గముల జయించునంతటి నిగ్రహము వీరికుండదు. సాధారణముగ గృహస్థులందరు ఈ తత్త్వమువారే. వీరు బాగుపడుటకు మార్గము కలదు. గట్టి సాధన మవసరము. ఇక తామసుల కన్ననో ఆధ్యాత్మిక భావములే యుండవు. వారికి శరీరమే ప్రధానము; శాశ్వతము. దాని పోషణకు ఎల్లపుడు కృషి చేయుదురు. వారికి ప్రాపంచిక సుఖములే సుఖములు. భోగములే భోగములు. మానవుడు జన్మించినది భోగము లను భవించుటకే యని వారు భావింతురు. స్వసుఖము కొరకు, స్వలాభముకొరకు, భోగముల సమకూర్చుకొనుటకు వారు ఏకార్యమున కైన గడంగుదురు. స్వప్రయోజనార్థము ఇతరులకు అపకారము చేయుటకు జంకరు కొంపలు కూల్తురు. ఆకతాయిలుగ సంచరింతురు. తమకు లాభమని తోచిన, హత్యలు చేయుటకు కూడ వెనుకాడరు. వారు పుట్టుచుందురు, చచ్చుచుందురు, మరల పుట్టుచుందురు. చర్విత చర్వణము వారి జీవితము. అట్టివారు

''అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై

చచ్చుచు బుట్టుచున్‌ మరల చర్విత చర్విణులైన వారికిన్‌

చెచ్చెర బుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన నే

మిచ్చిననైన కానలకు నేగిననైన హరి ప్రబోధముల్‌. (భాగ)

అవి భాగవతమున వర్ణింపబడినారు. భగవద్గీతకు మూల సూత్రమనునది సర్వులకు శిరోధార్యమగునది.

''శ్రేయాన్‌ స్వధర్మో విగుణః

పరధర్మో త్స్వానుష్ఠీ తాత్‌

స్వధర్మే విధనం శ్రేయః

పరధర్మో భయావహః'' (గీ.3 ఆ. 35)

శ్రీ భగవద్గీతావిర్భూతమునకు అర్జునుడు స్వధర్మమునందు జూపిన విముఖత, విధర్మమునకు మొగ్గుచూపుటయే కదా కారణములు. ఇచట ధర్మమననేమి? అధర్మమననేమి? విధర్మమననేమి యను ప్రశ్న పరంపర లుత్పన్నమగుటకు అవకాశము కలదు. ఈ ధర్మ స్వరూపము నిర్ణయించుటకు విజయునకు జ్ఞానోపదేశము చేయుటలో భగవానుడు కర్మ భక్తి జ్ఞాన మార్గముల ప్రతిపాదించెను. వర్ణాశ్రమ ధర్మముల నిర్దేశించినాడు. ధర్మరక్షణార్థము భూలోకమున అప్పుడప్పుడు అవతరింతుననినాడు.

''పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మసంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే'' (గీ ఆ 6.8)

ఈ గీతావాక్యము పరమాత్మ ప్రసాదించిన అభయహస్తము. అది అతి ముఖ్యము. జాగ్రత్తగా దీని భావము అవగాహన చేసికొనవలయును. తన మాయా విశేషమున, తాను సృజించిన, మానవ కోటియందు ధర్మమే వర్థమానము కావలయును. భగవంతుని నిర్దేశము. సాధువులకు బాధలుండరాదు. మానవులు ఎంత కర్మబద్ధులైనను ఇహలోక యాత్రలో బహు జాగ్రత్తగ నుండవలయును. సాధువులు రక్షింపబడవలయును దుష్కృతులు అనగా చెడ్డ కార్యములు చేయువారు నాశనము కావలయును. అందులకు పరమాత్మ అవససరమును బట్టి ఆయా కాలముల అవతరించుచుండును అనిగదా పై గీతావాక్యము చెప్పుచున్నది. ఇందు చెప్పబడిన సాధువు లెట్టివారు? దుష్కృతులన్న నెవరు? ధర్మమున నెట్టిది? అను విషయములు పరిశీలనార్హములు.

సాధువు కృపాళుడు, అకృతదోషుడు, క్షమావంతుడు, సత్త్వగుణ ప్రధానుడు, అసూయాది దోషగుణ రహితుడు. సుఖదుఃఖముల సమముగ జూచువాడు. పరోపకారజీవి. అహంకార రహిత చిత్తుడు. మృదు మధుర భాషి, శుచి, అపరిగ్రహుడు, నిర్వికారుడు, ధృతిమంతుదు, శీతోష్ణముల క్షుత్పిపాసల శోక మోహములను, ష ర్ములను జయించినవాడు. అతడు అమాని, పరబోధన దక్షుడు, కారుణికుడు, జ్ఞాని, సర్వులయెడ మైత్రిభావము కలవాడు. దర్మాచరణమున చిత్తశుధ్యాది గుణములు కలుగుననియు, కాకున్న దోషంబులు దొడరుననియు, భగవదాజ్ఞా రూపమగు వేదముల నెరింగియు, భక్తి ధృడత్వంబున భగవంతునే సర్వకాల సర్వావస్థలయందు భజించువాడు. ఇట్టి గుణములు పూర్తిగ గాకున్నను కొంత వఱకైన, తన కెంతవరకున్నవని ప్రతి మానవుడు ఆత్మ పరీక్షచేసికొని, తన జీవితమార్గమును సరిజేసికొనుటకు యత్నించవలయును.

ఈ సాధువులవలెనే మహాత్ములును సమచిత్తులు, ప్రశాంతులు, ఆరిషడ్వర్గముల జయించినవారు. సహృదయులు, సదాచారులు, పరమేశ్వరునిమీద సౌహృదయంబే ప్రయోజనమని యెంచి, పుత్ర మిత్రకళత్ర గృహాదులయెడ నాసక్తి యుడిగి, లోకమున నత్యంతావశ్యకమైన భగవత్తత్త్వమే గ్రాహ్యమని, తదితరములయెడ విరక్తులగుదురు. అట్టి మహాత్ముల, సాధువుల సేవ, ముక్తికి సహాయకారియని శాస్త్రములు చెప్పు చున్నవి. ''సాధుసంగంబు సకలార్థ సాధనంబు'' అను నానుడి సర్వధా సత్యము. సర్వసంగ కర్తకమైన సాధుసంగము, భగవంతుని వశీకరించి నటుల యోగము, సౌంఖ్యము, ధర్మము, ప్వాధ్యాయాదులు, సన్యాసము, వ్రతములు యజ్ఞములు, తీర్థములు, నిష్ఠనియమములు, వశీకరింపజాలవని కూడ నందురు. అందుచే నట్టి సాధువులకు, మహాత్ములకు కీడు రాకుండ రక్షించు భారము భగవంతుడే స్వీకరించునన్నమాట. ఇక దుష్కృతులనగా ఎవరు? చెడ్డపనులు చేయువారు అనిగదా అర్థము. అనగా పరపీడా పరులు, హంతకులు, ఆకతాయిలు, హింసాకృత్యములు చేయువారు, పరస్త్రీ, పరధనాపహారులు, అనృతవాదులు, లోక కంటకులు, కుత్సితులు, స్వధర్మమును విడచినవారు, మానవత్వము మరచినవారు మొదలగువారందరు దుష్కృతులే. సాధువుల సజ్జనుల మనుగడ సుఖప్రదముగ నుండవలయునన్న సంఘమునకు చీడపురుగులనదగిన దుష్కృతుల నేరి చంపవలయును. దీనిని కాదనువారుండరు. శ్రీ మహా విష్ణువు అవతారములు దాల్చినది ఈ దుష్టశిక్షణ శిష్టరక్షణకే.

నరకాసుర రావణ కుంభకర్ణాదులు లోకకంటకులు. సాధువులను మునులను బాధించినవారు. స్త్రీలను చెఱబట్టుటాది దుష్కృతులు జేసి యుండుట, వేదవేదాంగము చదివియు, శివపూజా ధరంధరులయ్యు, యాగాదులజేసియు, సత్యశౌచ దయాది సద్గుణములు లేనివారగుటచే శిక్షార్హులైనారు. కాని శతమఘంబులు జేసి, దేవతలను తృప్తిపఱచి, భూరి దానముల భూదేవతాగణముల తృప్తిపఱచి, నిరతాన్నదానమున, భూత తృప్తిజేసి, వదాన్యు డనిపించుకొనిన దానవవీరుడు బలిచక్రవర్తి పరమ భాగవతో త్తముడు. విష్ణుభక్తుడగు ప్రహ్లాదుని మనుమడు అన్ని విధముల మంచివాడనిపించుకొనిన ఉత్తమ గుణములు కలవాడు. అట్టివానిని శ్రీ మహావిష్ణువు వామనావతారమున పదభ్రష్టుని జేసి, రసాతలమునకు బంపుట న్యాయమా? అది దుష్టశిక్షణ యనిపించుకొనునా? అని శంకించువారుండవచ్చును. అటుల శంకించుట సహజమే కాని వామనావతారము 'పరిత్రాణాయ సాధూనాం ''కొఱకాలేక'' వినాశ చ దుష్కృతాం. కొఱకా? ఇచట ధర్మ సంస్థాపన ఏమి జరిగినది? కొంచెము లోతుగ నాలోచింపవలసిన విషయము. పురాణ గాధలయందు నివురుగప్పిన నిప్పువలె గర్భితములై యున్న ధర్మముల, సత్యముల, శాస్త్రరహస్యముల గ్రహించుట అందరికి సాధ్యము కాదు. వామనావతార ఘట్టమును జాగ్రత్తగ పరిశీలించిన పైన నుదహరింపబడిన సందేహములకు సమాధానము దొరకును.

బలి చక్రవర్తి యన్ని విధముల నుత్తముడు. గురు బ్రాహ్మణ దైవ భక్తి కలవాడు. సత్యసంధుడు. విష్ణుద్వేషికాడు. కాని వానియందు ఏదో ఒక దోషముండి యుండవలయును. ప్రతి మన్వంతరమున సూర్యాది గ్రహములు, దేవర్షులు, బ్రహ్మలు, రుద్రులు, ఇంద్రుడు మారుచుందురని శాస్త్రములవలన తెలియు చున్నది. శతమఘంబులు జేసిన యుత్తమునకు ఒక మన్వంతరమున ఇంద్రత్వము భగవంతుడే నిర్దేశించి ప్రసాదించును ఆ మన్వంతరమువరకు ఇంద్రాధికారము వానిది. ఆ అధికారము దైవదత్తము. ఇంద్రుడు అనునది ఒక అధికార చిహ్నము కాని ఏ యొక వ్యక్తి పేరుకాదు. అటుల భగవదత్తమైన అధికారమునకు భంగము గలిగించుట భగవదాజ్ఞల ధిక్కరించుటయే. ఒక పనికి నియమితుడైనవాని అధికారము అవిచ్ఛిన్నముగ జరుగునటుల జూచుట ఆ అధికారిని నియమించిన పై అధికారి ధర్మము; బాధ్యత. అట్టి దైవ నిర్ణీతమైన ఇంద్రత్వమునకు బలి భంగము గలిగింపవలయునని యత్నించినాడు అందుచే శిక్షార్హుడైనాడు ఇంద్రుని ఇంద్రత్వమును రక్షింపవలయును. ఆ కారణమున బలిని శిక్షింపవలయును. కాని బలి విష్ణుభక్తుడు, సత్యవ్రతుడు దానశీలుడు. ఇతర దైత్యులవంటివాడు కాడే. సన్మార్గుడే. అన్ని విధముల మంచివాడే. కాని మాత్సర్యము, జ్ఞాతివైరము, కాంక్ష, నేను సర్వము చేయగలనను అహంభావము వానిని వీడలేదు. దానవదైత్య సంగతివలన అసురభావము బలియందు గలిగినది. ఆ దానవదైత్య సంగతి నుండి భక్తుని తొలగింపవలయును ఉత్తముడగు భక్తుడు పెడదారిపడి అరిషడ్వర్గములు బలీయముకాగా పతితుడగు ప్రమాదమేర్పడెను అట్టి భక్తుని క్రమమార్గమునకు మరల్చి రక్షింపవలయును. అటుతాను ప్రసాదించిన ఇంద్రత్వమునకు భంగము రాకూడదు. ఈ రెండు సమస్యలను సాధించుటయే వామనావతారఘట్ట రహస్యము.

దానశూరుడైన బలికి అహంకారము కలదనుట యీ పద్యము ఋజువు చేయుచున్నది. వామనునితో బలియనిన విధము చూడుడు.

మ|| వరచేలంబులొ మాడలోఫలములో వన్యంబులో గోవులో

హరులో రత్నములో రధంబులొ విశిష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో కేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక యే మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా||

అటులనుటలో ఏది యడిగినను నేను ఈయగలను. సర్వమునకు అధినాధుడను అను అహంభావము బలికి కలదనియేగదా భావించవలయును. ఆలోచించిన యధార్థముగ ఇది నాది యనదగినది ఏ మానవునకైనను కలదా? ప్రపంచమందలి ప్రతివస్తు సముదాయమునకు నధినాదుడై అన్నిటిని సృష్టించి జీవరాసులకు దయతో ప్రసాదించిన ఫల పుష్ప జల వస్త్ర ఆహారాదులమీద మానవులకు గల హక్కేమి? తాను సంపాదించితినని తనదని మురియుటయేమి? ప్రపంచమునం దేదియు తనది కానప్పుడు, తనదికాని దానిని భగవంతుడునకు 'ఫలం పుష్పంతోయం' అనియథా శక్తి నివేదించుట యననేమి? దాని యంతర్థానము గనుడు. '' ఈ వస్తు సముదాయమంతయు నీ దయ చేతనే మాకు ప్రాప్తించినది.వివిధ రూపములనున్న ఆ వస్తు సముదాయమును, నీ అనుజ్ఞతో, నీ ఆశీస్సులతో, పునీతమైన దానినిగా, నీవు ప్రసాదించిన దివ్య ప్రసాదముగా, అనుభవించుటకు మాకు అనుజ్ఞ ఈయుము. ఈ వస్తు సముదాయమును, నీ కృపా విలోకమున పునీతము చేయుము. అని ప్రార్థించుటయే యని గ్రహించవలయును. ఈ రహస్యము గ్రహించిననేగాని భగవద్వినియోగ ప్రసాదము యొక్క పవిత్రత అర్థము కాదు.

మనదన దగినది యేదియు లేదు. ఇచ్చువాడు భగవంతుడు హరించువాడు భగవంతుడు. ఇది నాది, నాకు హక్కుగలదు, అనుకొనుట అజ్ఞానజనిత స్వాతిశయము. అహంకారము. అదియే బలిని పదచ్యుతుని చేసినది భగవంతుడు తాను ప్రసాదించిన దానిని తన భక్తులు అనుభవించుట జూచి సంతసించును. ఈ భావమే ఈశా వాశ్యోపనిషత్తునందు 'తేన త్యక్తేన భంజీత' అని చెప్పబడినది. శ్రీమత్‌ మధ్వాచార్యులు వారు ఈ సూక్తిని యీ భావముననే వివరించిరి. 'తేన' అనగా ఈశ్వరునిచేత 'త్యక్తేన' ప్రసాదింపబడిన దానిని అనుభవింపుము. అనగా దైవకృపాప్రసాదిత వస్తుచయమును పవిత్రముగా భావించి, కృతజ్ఞతతో దివ్య ప్రసాదముగ స్వీకరింపుము. ''పుట్టుకతో మానవుడు ఏ వస్తువును తీసికొని వచ్చుచున్నాడు? చనిపోయినప్పుడు ఏ ఆస్తిని, వస్తువాహనములను వెంటదీసికొని పోవుచున్నాడు? రెండును లేనప్పుడు ఇది నాది, దీనికి అధికారిని నేను, నేను ఎవరికైన నీయగలను, ఉన్నది, నాయిష్టము, వచ్చినటుల ఏమియైన చేయగలను'' అని అనుకొనుట అవ్యక్తము శుద్ధమూఢత్వము.

ఆ పరమ యాచకుడగు వామనుడు ''ఒకటి రెండడుగులమేర'' యిమ్ము, అని అడుగగనే బలి, ''దాత పెంపు జూచి యడుగవలదే'' 'అసురేంద్రుడనైన నేను నీ వడిగి'న పదత్రయము మాత్రమే ఇచ్చుట పాడియా 'అనుట' అది నా గొప్పతనమునకు, దర్జాకు, పదాన్యతకు తగని దనుటయేకదా. అదియే అహంకారము, అహంభావము. సర్వాంతర్యామి యగు భగవంతుడు, రెండడుగులలో సర్వలోకముల నాక్రమించెను. బలి యిచ్చిన మూడవ అడుగు మేరకు తావు కనబడలేదు. అటుల మహా దేవ మాత్రుండై, తేజోవిరాజితంబైనరూపంబున ప్రత్యక్షమై, బలి నాదియని చెప్పదగినది యేదియులేదని నిరూపించి, వాని అహంకారాంధ కారము పటాపంచలు జేసి జ్ఞానోదయము గలిగించెను. విశ్వరూప ప్రదర్శనమున నిజభక్తుని పునీతుని జేసెను. ఆ జగత్ప్రభువు దయావిశేషంబున రసాతలవాసియై, శ్రీ మహావిష్ణువే గదా ధారియై అన్ని వేళల కాపాడు చుండ, కాలము గడిపి, యథాకాలంబున ఇంద్రత్వము గాంచి యనుభవించి ముక్తి గాంచెను.

కం|| సావర్ణ మనువు వేళను

దేవేంద్రుండగు నితండు దేవతలకు దు

ర్భావిత మగునా చోటికి

రావించెద నంతదనుక రక్షింతు దయన్‌|| (భాగ)

అని భక్తజనమందారమగు శ్రీ మహావిష్ణువు వరమిచ్చెను. దైత్యకులమున జన్మించినను బలిచక్రవర్తి సాధువగుటచే సహవాస దోషమున చెడుతలంపులకు లోనుగాకుండ రక్షింపబడెనేగాని దానవుడని శిక్షింపబడలేదు. అనుగ్రహింపబడెనే గాని నిగ్రహింపబడలేదు. బలిచక్రరవర్తి యందు గల సాత్విక తత్త్వమును ప్రజ్వలింవజేసి రాజసిక తామసిక గుణముల నణచి వానిని పరమాత్మ ముక్తిమార్గగామిని గావించెను. దానవులైనను మానవులైనను దేవతలైనను సత్ప్రవర్తన కలవారు, సచ్ఛీలురు, సాధువులు, వారు హరికి ప్రియులు. దుర్వర్తనులు, లోకకంటకులు శత్రువులు దండనార్హులు. వ్యక్తులుగాగాక వారి వారి మంచి చెడ్డలచే హరికృపకు గాని కోపమునకు గాని గురియగుదురు. భగవంతుకి దానవులనిన ద్వేషములేదు. దేవతలనిన అభిమానములేదు. అతడు సర్వసముడు నిర్గుణుడు గుణాతీతుడు. దేవతలవలన వచ్చు లాభముగాని, దానవులవలన రాగలిగిన అపకారముకాని లేదు. దానవత్వమును రూపుమాపుట దేవత్వమనదగు మానవత్వమును రక్షించుటయే. 'పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం' అనుదానికి అర్థము.

భగవంతుడు అవతారములు దాల్చుటకు కారణము లనేకముండును. అన్నియు మానవాభ్యుదయమునకు, లోకకళ్యాణమున కేయని నమ్మవలయును. లేకయున్న అటుల వివిధావతారములనెత్తి కష్టపడవలసిన అవసరము భగవంతుని కేల గల్గినది? తనుసృజించి పెంచుచున్న సృష్టి సక్రమమార్గమున అభ్యుదయము నందవలయును. ఎవరి అక్రమ నడవడి వలనను భంగము గలుగరాదు. ఆర్తత్రాణ నారాయణుండు, ఆశ్రిత సులభుడు, భక్తుల పాలిటి చింతామణిగదా శ్రీమన్నారాయణుండు. ఆ మహానీయుని యీ అవతారముల మూలకారణముల గమనింపుడు. హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు,రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రలు ఆ యా యుగముల జన్మించి వారిని సంహరించుటకు పరమాత్మ అవతారములదాల్చెను. 'పరిత్రాణాయ సాధూనాం....' అను కారణమేకాక మరొక రహస్యము కూడ ఆ యా అవతారావిర్భూతములకు కలదు. జయ విజయులు శ్రీ మహావిష్ణువు భక్తులు. విష్ణు సారూప్యమున, సామీప్యమున హరిని సర్వధా సేవించుచుందురు. వారు కారణాంతరమున శపింపబడి భూలోకమున రాక్షసాంశమున జన్మించవలసి వచ్చినది. శాపోపహతులైనవారు తమ ప్రభువగు శ్రీమన్నారాయణునితో మొరవెట్టికొనిరి. భగవంతుడు ఆర్తత్రాణ పారాయణుడుకదా. వారిని శాపవిముక్తులను జేసి రక్షింపవలయును. జయవిజయులు వేరు వేరు యుగముల వేరు వేరు నామముల చెలంగిరి. అటుల జన్మించినను తమ పూర్వజన్మమునందు తమకు స్వామియైన శ్రీ హరిని మరువలేదు. భగవంతుడును వారిని మరువలేదు. మిత్రత్వ మున చిరకాలములోగాని సాధింపరాని, శ్రీమన్నారాయణుని సాన్నిధ్యమును, అచిరకాలములో శతృత్వమున సాధింపనెంచిరి. వారిది క్రోధభక్తి. భగవంతునకు కోపము తెప్పించవలయును. అందులకు లోకకంటకులుగ చరించిరి. విష్ణువు నెడ పగ, ద్వేషము, బాగా చాటిరి. హరి భగవంతుడే కాదనిరి. దుర్భాషలాడిరి. హరిభక్తుల నిందించి బాధించిరి. ఎదుర్కొని పోరాడ ఎందెందో వెదకిరి. హిరణ్యకశ్యపుడు తనభృత్యులతో ననిన యీ మాటలవలన భగవంతుని అనంతశక్తి అత డెరుంగునను నది ధృవపడుచున్నది.

''వనములనుండు జొచ్చు మునివర్గము లోపల ఘోణిగాడు సం

జనన మెరుంగ నెవ్వరును, జాడ యొకింతయు లేదు, తన్ను డా

సిన మఱి డాయు వెంటబడి జిక్కక చిక్కడు వీని నొక్కకే

లున మనమెల్ల లోబడక లోబడ పట్టుకొనంగ శక్యమే!''

భగవంతుని మహిమలు లీలలు తెలిసియు శాపకారణముగ విష్ణువు చేతిలో మరణించి శాపవిముక్తులగుటకే కోరి భగవంతునితో వైరము తెచ్చుకొనిరి. భగవంతుడు వారికి శాపవిమోచనము గలిగించుటకు తాను అవతారములు దాల్చెను. అది భక్తరక్షణకాక మఱి యేమి యగును. శిష్టరక్షణ, దుష్టశిక్షణ తన విధులుగా ధర్మముగా భగవంతుడు భావించి చేయుచున్నాడు. అతడు గుణాతీతుడు. భగవంతునకు కోపతాపములు లేవు. పైన మన మిదివరకే గ్రహించినటుల తామసిక గుణముల హరించుటకు, రాజసిక గుణముల హద్దులోనుంచుటకు, సాత్వికగుణము ప్రవర్థమానమగుటకు భగవంతుడు నిరంతరంము చేయు కృషియే దుష్టశిక్షణ శిష్టరక్షణలు. ధర్మము నుద్ధరించుటయే పరమ ప్రయోజనము.

అటుల నుద్ధరింపబడు ధర్మము ఏ రూపమున నుండును? ఎవరికి యేది ధర్మము? ఏది అధర్మము అని యెరింగినగాని, ఈశ్వరోపాసనతో పాటు, ధర్మనిర్వహణముకూడ ముక్తి సాధనమని నిరూపించలేము ధర్మ నిర్వహణ మననేమో, స్వయం కృషి వలన స్వధర్మముల పాలించుటవలన, మానవుడు ఇహపరముల ఎటుల సాధించగలడో వివరించునదే శ్రీమత్‌ భగవద్గీత. అందు ఏ మతమును ప్రబోధింపబడలేదు. కాని అన్నిమతముల మూలసారము బోధింపబడినది. ఆ కారణమున గీత ప్రపంచమందలి జిజ్ఞాసువులకు అభిమాన అధికార గ్రంథమయినది. ధర్మాధర్మ వివేచన కష్టముతో గూడిన పని. అటుల వివేచించి ఒక నిర్ణయమునకు వచ్చుటకు వేదవాఙ్మయము, అందు ముఖ్యముగా భగవద్గీత ప్రధాన ప్రమాణ గ్రంథములు. ముక్తిగాంచుటకు మానవులు ఏయే ధర్మముల ననుష్ఠింపవలయునో గీతయందు బాగుగ వివరింపబడినది. ముఖ్యముగా కురుక్షేత్ర సంగ్రామమువంటి మానసిక సంఘర్షణలో చిక్కుకొని కర్మక్షేత్రమున సతమతమగుచున్న గృహస్థులు అనుష్ఠింపవలసిన ధర్మస్వరూపము కొంతవఱకైన గ్రహించుటకు, ఏయే మార్గములు విధి నిషేధములతో వివరింపబడినవో గ్రహించుట ఎంతయు ప్రయోజనకరము. గతామృత సారము మనసునం దిడుకొని ధర్మతత్త్వస్వరూపము గ్రహింప యత్నింతము.

---------------------------------------------------------------------------------------------------- ఇహమును ఆశించిన పరము లేదు. పరముగోరిన ఇహమును గోల్పోవుదురు, పరము బ్రహ్మానందము. ఇహము క్షణభంగురము. దేనిని గోరుదువో యోచింపుము.

శ్రీ బుద్ధభగవానుడు.

Satyanveshana    Chapters