Satyanveshana    Chapters   

సత్యాన్వేషణ

సత్యాన్వేషణ అనగా సత్యము కొఱకు వెదకుట. అటుల అన్వేషించుటకూడ సత్యమైనది కావలయును సత్యమైనదే నిత్యం. అది శివంసుందరం, సత్యం, శివం సుందరమైనదే ఈశ్వరత్వమనియు, అది నిత్యము, శాశ్వతము, సృష్టిస్థితి లయములకు కారణభూతమనియు గుర్తించితిమి. సర్వకార్య కారణభూతమగు ఆ పరతత్వము సత్యము, శాశ్వతము కాగా, మిగిలినవన్నియు భ్రమా జనితములు, అశాశ్వతములు, మిధ్యయనియు, గ్రహించితిమి. నిరాకారము, నిర్గుణము, అవాజ్మయగోచరము అగు, ఆ పరతత్వమును ఎటుల ఊహించవలెనో ఎటుల వివరింపవలయునో అను సందేహమునుండి మార్గము గనుగొనుటకు, దానిని 'సత్‌' అని చెప్పుకొని, ఆ సత్తు తన స్వకల్పిక మాయావిశేష జనిత బహురూప, బహుగుణ సమృద్ధి ప్రకృతిరూపమున ఎటుల దర్శనమిచ్చినదియు బహు రూపనామము లెటుల గలిగినదియు కొంతకొంత, గ్రహింప యత్నించితిమి. రూపనామ గుణరహితమగు ఆ దివ్యశక్తి మహిమల గ్రహించుటకు మార్గముల, నన్వేషించుచు, మతముల, ఆ మతప్రయోజనముల కొంతకొంత చర్చించితిమి. వేదవిహితమైన ఈశ్వరోపాసన, వివిధమార్గముల ప్రవర్తిల్లుటయు, అటుల ప్రవర్తిల్లుటకు హేతువులను, వేదవిహిత స్వధర్మ నిర్వహణ ప్రాముఖ్యతను గ్రహింప యత్నించితిమి. ఈ విచారణలో అన్నిమతములకు వైదికమతమే మూలమనియు, ఆ వైదికమతమున చెప్పబడని ధర్మములు, నిర్ణయింపబడని విధులు, నీతులు, మఱి యే యితర మతములందును లేవనియు, వైదికమతము (ఇప్పుడు మనము హిందూ మతమనునది) ఏనాటినుండి ప్రవర్ధమానమైనదో, ఎవరు స్థాపించిరో, ఇదమిద్ధముగ జెప్పగలవారులేరనియు, అటుల చెప్పగలమను వారిమాటలు, ఊహాగానములే యనియు గ్రహించితిమి.

ఆత్మానాత్మ విచారణ చేయుటలో జీవాత్మపరమాత్మలకు సంబంధము కలదనియు, ఆ పరమాత్మయే తన స్వకల్పిత మాయావిశేషమున జీవాత్మగా ఈ జగత్తునందు వివిధరూపముల ప్రవర్థమానమై - తన విలాస వికాసముల చూపుచున్నదనియు అటులమనుచున్న జీవాత్మ ఎన్నటికైన పరమాత్మలో లీనముకావలయుననియు, అదియే ముక్తియనియు, దానిని సాధించుటయే మనకుకర్తవ్యమనియు గ్రహించితిమి. అందులకు కావలసిన సాధనమార్గములగు కర్మ భక్తి జ్ఞానయోగములను గ్రహింప యత్నించితిమి. జీవరాసులలో మానవజన్మ అత్యుత్తమమైనది యనువిషయమును సహేతుకముగ స్థాపించుటకు యత్నించితిమి. మానవుడు తరించుటకు కావలసిన కృషిని తానే చేసికొనుటకు అవకాశము కలదనియు, ఆ కృషి సనాతన ధర్మములమీద నాధారపడి యీశ్వరోపాసన రూపమున నుండు ననియు, అట్టి ఈశ్వరోపాసన బహువిధములనియు గ్రహించితిమి. అకాశాల్‌ పతితం తోయం యధాగచ్ఛతి సాగరం'' అనునటుల అట్టి వివిధమార్గములకు గమ్యస్థాన మొక్కటియే యనియు, అధికార తారతమ్యతనుబట్టి అన్వేషణ మార్గములు వివిధములుగ వెలుగొందె ననునది యంగీకరించితిమి. ఉపాసన సగుణోపాసన నిర్గుణోపాసన యని ద్వివిధముల చెప్పబడి నను సగుణోపాసన లేకుండ నిర్గుణోపాసన దుర్లభమనియు, సగుణోపాసనయందు విగ్రహారాధన ప్రధానస్ధాన మాక్రమించినదనియు నెఱింగితిమి.

అటులనే ఆశ్రమధర్మముల వివరించుటలో జ్ఞానప్రధానమైన యత్యాశ్రమము పరమోత్తమమైనదని అంగీకరించుచునే గృహస్థాశ్రమమున సకలాశ్రమధర్మముల ననుష్ఠించి, సకలాశ్రమ లాభమును బొందవచ్చునని నిర్ణయించితిమి. సర్వులకు కర్మభక్తిమార్గములు ప్రధానమనియు, జ్ఞానులైనను, యతులైనను కర్మానుష్ఠాన తత్పరులు కావలసినదే యనియు, భక్తిలేని కర్మగాని జ్ఞాననిష్ఠగాని యుండనేరదనియు గ్రహించితిమి. గృహస్థు కర్మయోగి యెటులగునో బంధకారణమని చెప్పబడు కర్మల స్వభామెట్టిదో, బంధకారణములుకాని కర్మలేవో కొంత తెలిసి కొంటిమి. కర్మలు జన్మపరంపరకు కారణమని చెప్పబడుచున్నను కర్మిష్ఠిపునర్జన్మరహితమగు ముక్తిగాంచుటకు అవకాశము కలదని స్థిరీకరించితిమి. పునర్జన్మరాహిత్యమునకు కర్మసన్యాసము మంచిమార్గము అనిచెప్పుబుధులమాటలకు అంతరార్ధము గ్రహింప యత్నించుచు కర్మసన్యాసము కన్న - సర్వకర్మ ఫలసన్యాసము ఉత్తమమైనదని చెప్పు పండితుల మాటలకే ప్రాధాన్యమిచ్చితిమి. జ్ఞానికాని ముక్తుడుకాడనియు, కర్మిష్టియగు గృహస్థు నకు ముక్తిలేదను వాదనను తిరస్కరించి కర్మిష్ఠియగు గృహస్ధు నిష్కామకర్మపరతంత్రత కర్మయోగమై చిత్తశుద్థిగలిగి జ్ఞానియగుటకు ఎట్టి అభ్యంతరము లేదనియు, అట్టి కర్మయోగియగు గృహస్థు భగవంతునకు పరమాత్ముడనియు జ్ఞానకర్మయోగములు రెండును ముక్తిప్రదములే యనియు గీతాప్రమాణమున విశదీకరించితిమి.

కర్మయోగి ముక్తుడగునని విశదీకరించుటలో గృహస్థు నిష్కామ ప్రవృత్తి కర్మల శాస్త్రములు తనకు విధించిన ధర్మములుగ భావించి ఆచరించుచున్న ప్రతిఫలాపేక్షయను ప్రశ్నయే లేదనియు ఎవరివిధులు వారుచేయుటలో పుణ్యములేకపోగా చేయకున్న పాపము సంక్రమించు ననియు గ్రహించితిమి. భార్యాబిడ్డల అతిధి అభ్యాగతుల దీనుల వికలాంగుల నిస్సహాయుల, పోషించుట, మానవునకు, నిజధర్మమైనప్పుడు అటుల చేయకుండుట ధర్మభంగముకాదా? అటుల సంచరించుట మానవధర్మము పురుషలక్షణము. కాపురుషుడు తనకు విధియైన వేదవిహిత ధర్మముల నెఱవేర్చక భ్రష్టుడై పాపమునకు బాల్పడును. అట్టివానికి ముక్తిలేదు. కాన కర్మిష్టియగు గృహస్థు స్వీయవిధుల నెఱవేర్చుచు కర్మయోగియగును.

మానవుడు విధ్యుక్తధర్మముల చేయుచు సర్వము భగవత్ర్పేరితమని భావించి తత్పలము భగవదర్పితము చేయవలయును. కార్యసిద్ధి గాంచుటకు పురుషప్రయత్నము ఆరుపాళ్ళు ఏడవపాలు భగవంతునిదయ. పురుష ప్రయత్నము సక్రమముగ చేయకయే చేసినయత్నము వలన సత్ఫలములు కలుగలేదని వాపోయిన లాభ##మేమి? పల్లేరుగింజలు నాటిన బదరీఫలములు లభించునా? ఒక సమయమున పురుషయత్నము ఎంత సక్రమమైన మార్గమున నున్నను ఫలింపదు, అప్పుడు మనకుప్రాప్తిలేదని భావించవలయును. సత్కర్మలవలన గలుగుఫలములను దుష్కర్మలవలన గలుగుఫలమును కొంతవరకు ఇదివరకే గ్రహించితిమి. అందుచే మానవుడు ఏ ఆశ్రమమున నున్నను ఏ పరిస్థితిలోనున్నను సనాతనధర్మముల నేమరక తనకొఱకు తానుండు సంఘముకొఱకు మానవతాగుణములు అనగా దమశమదయ శౌచాది సద్గుణములు కలిగి ఇహపరములు సాధించుటకు భగవంతుని యందు నిశ్చలమైన అకలంకమైనభక్తిగలిగి శ్రద్ధతో సత్కర్మల నిష్కామ ప్రవృత్తి చేయవలయును. నిత్యకర్మాదులు చేయు కర్మయోగికి ఫలము కలుగునా కలుగదా? అను భావమే ఉండదు. ''సర్వం పరమేశ్వరార్పణ మస్తు'' అనియే భావించును. కాని ఒకమాటు నిష్కామప్రవృత్తి చేసి నను కామ్యకర్మలు చేసినను మనము కోరినను కోరకపోయినను ఏదో ఫలము కలుగకమానదు. అట్టిఫలము బంధహేతువగును. అటుల బంధ హేతువుగా పరిణమించకుండుటకు సర్వకర్మ ఫలత్యాగము అనగా సర్వకర్మఫలము పరమేశ్వరార్పణగా సంకల్పించి త్యాగముచేయుటయే ఉత్తమ సన్యాసము. అదియే జ్ఞానమార్గము అటులచేయు కర్మిష్ఠియే కర్మయోగి.

భక్తజనమందారము, సృష్టిస్థితిలయకారకుడు, కర్మసాక్షియగు పరమాత్మ తనభక్తుల, సత్కర్మపరుల జ్ఞానుల అందరిని సమదృష్టినే జూచి మోక్షమొసగును. అందుచే ఎవరికివీలయినది భక్తిమార్గముకానిండు, కర్మమార్గముకానిండు, జ్ఞానమార్గముకానిండు వారు నిష్కామప్రవృత్తి శాస్త్రవిధివిహిత కర్మల ననుష్టించుటయే ముక్తిసాధన మనుటయే పర్యవసానము సాధనమార్గములు వేరైనను అన్నిమతములవారికి గమ్యస్థాన మొక్కటియే కద. మతావేశపరవశులై జాతిమతకుల వర్ణభేదబుద్ధితో ద్వేషభావమున పరస్పరము దూషణాదుల జేయుట తామసలక్షణము. అమానుషము. అట్టివారికి ముక్తీలేదు. సరికదా నరకద్వారము ఎల్లవేళల స్వాగతమిచ్చుచునే యుండును.

లోకకళ్యాణము మానవాభ్యుదయము, సర్వజీవకారుణ్యము ముఖ్యములని భావించి స్వధర్మనిర్వహణ, పరధర్మములయెడ వైముఖ్యము, సాత్వికభావము అత్యత్తమ మానవధర్మములుగా పరిగణించవలయును. పరోపకారపారీణత, హింసాదూరిత మాతాపితగురు దైవములందు భక్తి పెద్దలయెడ వినయసంపత్తి సత్పురుషలక్షణములు ఎన్ని గ్రంధములు చదివివినను ఎన్నిమతోపన్యాసములు వినినను, మహానుభావుల నెందరిని దర్శించినను ఎన్ని పుణ్యక్షేత్రములు దర్శించినను, ఎన్ని పుణ్యతీర్థములు గృంకినను, ధర్మాచరణ లోపభూయిష్టమైన ముక్తిలేదు మనసా వాచాకర్మణా సన్మార్గగమనము, స్వధర్మ నిర్వహణములే ముక్తి హేతువులు. అట్టివారే ఇహపరముల సాధింపగలరు. ఇహమునందు తానుండు సంఘము నకు ప్రయోజనకారి కానివాని బ్రతుకు నిష్ఫలము. అట్టిపుట్టుక గిట్టుట కొరకు మాత్రమే. ఒకని జన్మ సార్థకమగుటకు పరోపకారపారాయణత్వము ఒక పరమ సాధనము. కర్మానుష్ఠానముచే యోగనిష్ఠచే తానొక్కడే తరించుటకు కృషిచేయుటలో తనతోటి మానవులుకూడ తనతోపాటు సుఖజీవులై, సద్థర్మవర్తనులై చరించి తరించుటకు మార్గము చూపుట ఉత్తమ పద్ధతి కాదా. అట్టి భావమునే ఈనాటివారు మానవతా గుణమనుచున్నారు బ్రహ్మవిదుడగు జ్ఞాని.

''స్వస్తి ప్రజాభ్యోం పరిపాలయన్తాం న్యాయే నమార్గేణ మహీం మహేశా

గోబ్రాహ్మణభ్యాం శుభమస్తు నిత్యం లోకస్పమస్థాం సుఖినోభవస్తు''

అనియే సర్వధాకోరును ముముక్షువు జన్మరాహిత్యము నందుటకు మార్గములుగా జెప్పబడిన కర్మభక్తి జ్ఞానమార్గములు శ్రీకృష్ణభగవానుడు మనకు ప్రతినిధియనదగిన నరునకు గీతారూపమున ఉపదేశముచేయుటకు మూలకారణమైనది. సర్వముక్తి మార్గములలో ముఖ్యమైనది అయిన ఈ శ్లోకము సర్వులకు సర్వకాల సర్వావస్థలయందు స్మరణీయము, అనుసరణీయము.

శ్రేయాన్‌ స్వధర్మోవిగుణశి పరధర్మాత్స్వానుష్టీతాత్‌

స్వధర్మే నిధనంశ్రేయః పరధర్మో భయా వహః.

Satyanveshana    Chapters