Satyanveshana    Chapters   

సత్యాన్వేషణ

1. ఈశ్వరత్వము

''ఆర్తిం జెందెడి భక్త రక్షణ కళా వ్యాపార పారీణుడై

మూర్తిత్వంబు వహించి శంభుడనగా భూభర్త విష్ణుండనన్‌

వర్తించున్‌ పరమాత్మ; తద్రుచిర రూపంబాత్మ భాసిల్ల నే

కీర్తింతున్‌ భయభక్తి శ్రద్ధలెసగన్‌ కేల్మోడ్చి నమ్రుండనై''

అనంతకోటి బ్రహ్మాండములు అనగా లెక్కించుటకు సాధ్యముకాని అసంఖ్యాకములగు బ్రహ్మాండము లన్నమాట. భూలోక భూవర్లోకాదులు పదునాలుగు లోకములున్నవని గదా శాస్త్రములు చెప్పుచున్నావి. అట్టిచో మనకు కనబడేనక్షత్రాది మండలములే గాక మనకు కనబడని ఇతర మండలములు గోళములు కూడ కలవని భావించవలయును. అట్టి బ్రహ్మాండములలో నొక బ్రహ్మాండ మందలి యొక భాగము సూర్యమండలము. ఆ సూర్యమండలమునకు సంబంధించినది సూర్యకుటుంబము. ఆ సూర్యకుటుంబములో జేరిన ఒకగ్రహము భూగ్రహము. ఈ భూగ్రహము వంటివే అంగారకాది గ్రహములు కలవనియు ఆ గ్రహములన్నియు సూర్యుని చుట్టు పరిభ్రమించుననియు శాస్త్రజ్ఞులు చెప్పుదురు. ఆ గ్రహములలో కొన్నిటిని ఆశ్రయించుకొని, వాటి చుట్టూ పరిభ్రమించు ఉపగ్రహములు కూడ కలవని భౌగోళశాస్త్రజ్ఞులు వివరించియున్నారు. ఆయా గ్రహములన్నియు గ్రహరాజగు సూర్యునకు సమదూరముల లేవు. ఒకటి దగ్గరగ నున్న వేఱొకటి బహుదూరమున నున్నది. ఆయా గ్రహములు సూర్యుని చుట్టివచ్చు కాలపరిమితులు సహితము వేఱు వేఱుగ నున్నవి. భూగ్రహము సూర్యుని చుట్టివచ్చుటకు ఒక వత్సరము పట్టగా, శనిగ్రహమునకు ముప్పది సంవత్సరములు పట్టును. ఆ గ్రహములు సహితము ఒక దానికి మఱొకటి సమదూరమున లేవు. మరియు అతన్ని కాలముల అవి స్థిరముగ ఒకే నియమిత దూరములనుండవు. ఒక ఋతువునందు దూరముగ నుండినవి మరొక ఋతువునందు దగ్గరకు రావచ్చును. కొన్నిగ్రహములు కొన్ని సమయముల వక్రించుచు వెనుకకు ముందుకు తిరుగుచుండును. ఈ కారణముననే గావచ్చును భూమిమీద నివసించు ప్రజలకు గ్రహవీక్షణవలన మార్పులు జరుగుట సంభవమని జ్యోతిష్కులు చెప్పుదురు. అది యటులుండ ఈ గ్రహములన్నియు నిరామయమగు ఆకాశమున ఆధారరహితముగ ఎటుల నిలబడి సంచరింప గలుగుచున్నవి? గాలిచే కొట్టబడిన గాలిగుమ్మటము వలె యథేచ్ఛగా ఎగురుటలేదే. ఒక నిర్ణీత పద్ధతిని ఒక ధర్మమును అనుసరించి చరించుచున్నవి కదా. అటుల సంచరించుటకు శాస్త్రజ్ఞులు ఒక కారణము చెప్పుచున్నారు. ఆ గ్రహములకు పరస్పరాకర్షణ శక్తి కలదనియు, ప్రతి గ్రహము మరొక గ్రహములను ఆకర్షించుచు వాటిచే ఆకర్షింపబడుచు నుండటచేతను, అతి వేగముగ గమించుచుండుటచేతను ఆ గ్రహములు నిరామయంబగు గగమున నిలబడి చరింపగలుగుచున్నవనియు చెప్పుచున్నారు. అట్టి పరస్పరాకర్షణ శక్తియు అన్ని గ్రహములకు అన్ని కాలముల ఒకే నిర్ణీతమగు స్థితియందు ఉండనేరదు. ఏలనన ఆ గ్రహములు మనమిది వరకే గ్రహించినటుల ఎల్లప్పుడు ఒకే సమదూరమున నుండవు. అందుచే ఆయా గ్రహముల ఆకర్షణ శక్తి ఒక సమయమున బలీయముగను మరొక సమయమున తక్కువగను నుండుటయు సంభవమేగదా. అటులైన గ్రహములు కాలనిర్ణయమునకు కట్టుబడి యుండుట ఎటుల సంభవము? ఈ మార్పులను ఈ చలనములను ఆయా గ్రహముల ఆకర్షణ శక్తులను ఆయా గ్రహచలన నిర్ణేతకాల పరిమితులను ఎవరు నిబంధించిరి ? అటుల నిబంధింపగల శక్తి వంతమైన పదార్థమేది? అధినాధుడెవరు ?

భూగ్రహము సూర్యకుటుంబమునకు జెందినదనికదా యంటిమి అది సూర్యుని చుట్టివచ్చుటకు ఒక వత్సరము అనగా 365 రోజులు పట్టునని గూడ యంటిమి. అట్టి చలనము మాత్రమేకాక, భూగ్రహము బొంగరమువలె గిరగిర పరిభ్రమించుచుండునని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. భూమి చుట్టు చంద్రగ్రహము పరిభ్రమించుననియు, అటుల పరిభ్రమించుటకు సుమారు ముఫ్పది దినములు పట్టుననియు చెప్పుదురు. త్రివిధములగు ఈ పరిభ్రమణముల వలన సంవత్సరములు మాసములు దివారాత్రములు గలుగుచున్నవికదా. అటుల నిరామయంబగు గగనమార్గమున పరిభ్రమించు భూమండలముచుట్టు వాయుమండలము, దానినతిక్రమించి మేఘమండలముకలవు. మేఘమండలముదాటి ప్రాణవాయువేలేని సూన్యప్రదేశము, ఆపైన చంద్రమండలము, దానినతిక్రమించిన సూర్యమండలము ఆపైన నక్షత్రమండలము ఇటుల ఎన్నో మండలములున్నవని గదా శాస్త్రములు చెప్పుచున్నవి. ఆయా మండలములకు మధ్య మధ్య ఏ యే శక్తులున్నవో తెలియదు. దూరాతిదూరముననున్న నక్షత్ర మండలములో ఎన్ని గోళములున్నవో? మనకు దృగ్గోచరముగాని గోళములింక నెన్నిగలవో? నిర్మలాకాశమున రాత్రిపూట గన్పడు పాలపుంత కోటానుకోట్ల నక్షత్రముల కాంతియేయని యందురు. ఆ గోళములెన్నియో? ఎంత దూరమున నున్నవో కనిపెట్టినవారుగాని చెప్పగలిగినవారుకాని ఇప్పటికిలేరు. అట్టి నక్షత్రములలో కొన్నిటినుండి బయలుదేరిన కాంతిరేఖ భూమండలము జేరుటకు కొన్ని లక్షల సంవత్సరములకాలము పట్టునని శాస్త్రజ్ఞులు అంచనా. అట్టి కిరణములు కొన్ని జన్నస్థానమున బయలుదేరి మనకు జేరక మధ్య మార్గమున ఇప్పటికిని పయనించుచునే యున్నవనియు శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఈ గ్రహములు, నక్షత్రములు అన్నియు స్వప్రకాశములా లేక వేరొక కాంతిమీద నాధారపడియున్నవా? అంగారకగ్రహము ఎర్రగనుండు నందురు. బుధగ్రహము తెల్లగ, శనిగ్రహము నీలవర్ణముగ నున్నవట. ఇటుల ఆయా గ్రహముల వర్ణములతోపాటు గుణములు కూడ నిర్ణేతము లైనవి. మనపూర్వులు అన్ని గ్రహములందును జీవరాసులున్నవనియే నిర్ణయించి, మహాయోగులు ఆయా గ్రహములకు స్వేచ్ఛగా వెళ్ళగలిగి యుండిరని అంగీకరించిరి. చంద్రమండలమునందు జీవరాసులు కలవా? వృక్షములు కలవా? కొండలు నదులు కలవా? వాసయోగ్యమా? శీతోష్ణస్థితి యెటులుండును? అంగారక గ్రహములో నెటులుండును, శుక్రగ్రహములో ఎటులుండును అనునవి నిర్ణయించుటకు నేడు పరిశోధనలు జరుగుచున్నవి. ఆయా గ్రహములలో ఆయా భేదములుండుటకు రంగుభేద ముండుటకు కారణమేమి? గమనభేదమునకు కారణమేమి? వీటినన్నిటిని నిర్ణయించి క్రమద్ధముచేసి పరిపాలలించునది యెవరు? అధినాధుడెవరు? ఆ అనంతశక్తి యెట్టిది?

అనంతకోటి బ్రహ్మాండములలో భూమండలము స్వల్పాతిస్వల్పమని భావించిన దోషములేదు. అట్టి స్వల్పాటి స్వల్పమగు ఈ భూమండలమున ఈ చరాచర ప్రపంచమున, తృణలతాగుల్మ మహావృక్షములు ఫలపుష్పసమేతములై కన్పడుచున్నవి. రాళ్ళగుట్టలు కొండలు పర్వత పంక్తులు కన్పడుచున్నవి దృశ్యాదృశ్యములగు జీవరాసులనంతములు, భూమి జలమయము కొంత. కర్కశ శిలామయమగు మేరొకొంత. జల చరములగు జీవరాసునలు కొన్ని, భూచరములు కొన్ని, ఉభయచరములు కొన్ని, సరీసృపములు, అండజములు, స్పేదజములు, క్రిమికీటకాదులు బహుసంఖ్యాకములు. జడములగు శిలాదులు సహితము అనేక రూపములలో అనేక వర్ణములలో కన్పడుచున్నవి. ఎన్నో రూపభేదములు ఎన్నో ప్రవృత్తి భేదములు, ఏకగర్భజనితులలోనే ప్రవృత్తి భేదములు. ఆలోచించినకొలదియు ఇదియంతయు చిత్రముగ దోచును. కొన్ని పుట్టుచుండును పెరుగుచుండును నశించుచుండును. కొన్ని పుట్టగనే నశించును. కొన్ని బహుకాలముండును, బహుకాల మటులుండునని కూడ దినదినము మార్పులు గాంచుచు పెరుగుచుండును. ఇది యన్ని యెడల గోచరమగుచునే యుండును. కొందరు అల్పాయుష్కులు, కొందరికి దీర్ఘాయువు. బలహీనులు కొందరు బలముకలవారు కొందరు, కొందరు ధనవంతులు మరికొందరు నిరుపేదలు గర్భదరిద్రులు, సురూపులు కొందరు, కురూపులు విరూపులు కొందరు, కొందరు సాధువులుకాగా మరికొందరు దుష్టవర్తనులుగ నున్నారు. మానవకోటితో పాటు చరములగు పశుపక్ష్యాదుల యందును, అచరములయ్యు పుట్టుట పెరుగుట నశించుట యను మూడు గుణములు గల వృక్షాదులందునుకూడ ప్రాణములుండునని జెప్పు పండితులమాట కాదనలేము. జడములును స్థాణువులునగు శిలాదులందు సహితము ప్రాణులకు సామాన్యధర్మమగు సుషుప్తి జాగ్రదావస్థలు కలవనియు స్త్రీ పురుష భేదములు కలవనియు సూక్ష్మాతి సూక్ష్మభేదములు గనిపెట్టగల సున్నితములైన యంత్రముల సాయమున కనిపెట్టగలమనియు శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. అట్టిచో ఇట్టి ప్రవృత్తి భేధములతో గూడిన వివిధ జీవరాసుల సృష్టికి ఈ బహురూప సృష్టికార్యమునకు హేతువనదగిన మూల కారణమేది? దాని గుణమెట్టిది? దాని రూపమెట్టిది? తత్త్వమెట్టిది? అది సాధించు ప్రయోజనమెట్టిది? ఈ ప్రశ్నలకన్నిటికి ఒకటే సమాధానము. స్థూలబుద్ధికి సహితము తోచకమానదు. ఏదో సర్వకార్యములకు కారణభూతమైన మహత్తరమైన ఆదిశక్తి కలదని తోచకమానదు. అది అనుమాన ప్రమాణమే కావచ్చు. అయినను నిర్మలమైన నిస్పాక్షిక బుద్ధితో ఆలోచించిన కరడుగట్టిన నాస్తికుడైనను ఈసత్యమును కాదనలేడు. ఈ మహత్తర శక్తియే భాగవతమున ఈ విధముగ నిర్వచింపబడినది.

కం|| కొందరు స్వభావ మందురు

కొందరు కర్మంబటండ్రు కొందరు కాలం

&#బందురు కొందరు దైవం

బందురు కొంద రొగి గామమండ్రు మహాత్మ భా||చ-358

అనుమాన ప్రమాణమువలన గోచరమైనఆ మహత్తర శక్తిని గురించి మహాత్ములగు జిజ్ఞాసువులు, మహార్షులు, యోగులు, తపస్సంపన్నులు యోచించక పోలేదు. వారు చిరంతన చింతనజేసి సమాధి యవస్థలో ఆ దివ్యశక్తి తేజోరూపములను గుణగణములను మహత్తులను, వారి వారి యుపలబ్ధి ప్రకారము, ఉపాసనాక్రమమున వివిధ రూపముల ప్రత్యక్షముగ దర్శించి యుందురు. వివిధ నామముల స్తోత్రము చేసి యుందురు. వివిధ గుణముల నాపాదించి యుందురు. ఆ దివ్యమైన ఆ మహాశక్తి సర్వ కార్యకారణియని గ్రహించియుందురు. వారి మఖకః ఆ దివ్యతేజస్సు తన వికాసమును విలాసమును లోకముల ప్రస్ఫుటము జేసియుండును. ఆ తేజస్సు స్వప్రకాశము స్వయంవ్యక్తము స్వయం పూర్ణము. ఆ వాఙ్మయగోచరము ఇట్టిదని రూపింపరానిది. ఇట్టిదని వర్ణింపరానిది. అటుల ప్రస్ఫుటమైన చిద్విలాన వికాసములు వివిధ సిద్ధాంతములుగ అధికార తారతమ్యముల కనువుగ రూపొంది యుండును. అటుల ఏనాడు జరిగినదో ఒకే కాలముననో వేరు వేరు కాలములలోనో పలువురు మహర్షుల ముఖతః వెలువడినవో ఇదమిద్థమని చెప్పబూనుట సాహసమే యగును ఆ సిద్ధాంతములే వేదవేదాంగములు. అవి అపౌర షేయములు. ఋషులు నామమాత్రులు. ఆ విలాస వికాసములు ఆ మహార్షుల హృదయములను ప్రకాశింపజేసినవి. సర్వమునకు మూలకారణమగు ఆ మహత్తర మహనీయ శక్తియే ఈశ్వరత్వము. అది సర్వవ్యాపకము స్వప్రకాశము స్వయంవ్యక్తము సర్వశక్తివంతము అనిగదా యంటిమి. అందుచే సర్వసమస్యల పరిష్కారమునకు సర్వప్రశ్నపరంపరల సమాధానములకు ఈశ్వర ప్రసాదితములైన వేదములే యాధారములు. అధికారములు ప్రమాణమలు. అటుల అనుమాన ప్రమాణమున ద్యోతకమైన మహార్షుల యోగుల ప్రత్యక్షానుభూతులవలన బలీయమై వేద వేదాంగ రూపమున హితవాక్య ప్రమాణముగ స్థిరమైనది. సర్వకార్యములకు కారణమైనది ఈశ్వరత్వమే.

బ్రహ్మాండముయొక్క కార్యకారణ సంబంధము విచారించి జగ ద్రూపమునకు వెనుక కారణరూపమొకటి గలదని తత్త్వజ్ఞలు చేయు ప్రతిపాదన కొంత విచారింతము. సర్వకార్యములకు మూలకారణమైనది. ఈశ్వరత్వమనిగదా మనము చెప్పుకొనుచున్నది. ఆ మహాతత్త్వమునకు యథార్ధముగ ఏ రూపములేదనికూడ గ్రహించితిమి. అవాఙ్మయ గోచరమని నామగుణరూప రహితమనియు గ్రహించితిమి. అయినను అది సత్యము నిత్యము పర్వమునకు కారణభూతము. అది రూపరహితము, నామరహితము గుణరహితము. అది ఎట్టిదో ఎటులుండునో ఏమో ఎవరికి నిర్ణయింప శక్యముకానిది. అట్టిదానిని వివరించుటకు ఏదో ఒక నామము దానికి అపాదించవలయును. ఏ వస్తువును గురించి చెప్పదలచి నను దానికి ఏదో నామకరణము చేయనియెడల సాధ్యముకాదుకద. అందుచేత అట్టి రూపింప శక్యముకాని, ఊహాతీతమై అవాజ్మయగోచరమైన పరతత్త్వమును 'సత్‌' అని చెప్పుట పరిపాటియైనది. ఆ 'సత్‌'నే వేదములు 'బ్రహ్మం' అని చెప్పుచున్నవి. ఆ సత్‌ నిర్వికల్పముగా నున్నంత వరకు నిర్వికారముగా నున్నంతవరకు, నిరాకారం, నిర్గుణం, అట్టిదైన ఆ దివ్యతేజస్సు తన కల్పిత మాయా ప్రవర్తనమున ఇచ్ఛామాత్రమున విలాసవికాసముల ప్రవర్తిల్లిన ఆ బ్రహ్మము బాహ్యరూపమున ప్రకృతి గను, ఆ ప్రకృతి అంతర్తేజమగు జీవాత్మగను ప్రకాశించును. అటుల బాహ్యరూపముగ రూపొందిన ప్రకృతి మిధ్యయనియు, అది జీవాత్మ మనోవికార జనిత. ఎండజమావుల బోలిస మూలత్వసూవ్యమైన రూపభ్రాంతియే యనియు కొందరు చెప్పుదురు. పంచేంద్రియముల మూలమున గ్రహింపగలిగిన ఈ బాహ్యప్రపంచము స్వప్న ప్రాయమనియు, మానవుడు స్వప్నావస్థలో గాంచిన, పొందిన అనుభూతులు జాగ్రదావస్థయందు సత్యములు కానటుల, మనము ప్రకృతియని చెప్పుకొను పరమాత్మ మాయాకల్పిత బాహ్యరూపము, అసలు లేనేలేదనియు వాదించువారును కలరు. అటుల వివిధములగు విపరీతవాదముల విమర్శించుటకు అవసరము కాని సంకల్పముకాని లేదు, ప్రకృతి సత్యముకానిండు మిథ్యకానిండు. ఆ మాట అటులుండ 'మిధ్య' అనుటకు కారణము ముందు ముందు చర్చింతము. తార్కికుల మీమాంసికుల వైయాకరుణుల వాదప్రతివాదములు యుక్తులు శబ్దార్థభేదములు, ప్రవచనములు సామాన్యులను మూలసత్యము నుండి దూరముకు తీసికొనిపోవు అవకాశము అవి కల్పించును. అందుచే ప్రకృతి జీవాత్మలు ఆ పరాశక్తి 'సత్‌' యొక్క చిద్రూపములని అంగీకరించిముందుకు పోవుటయే యుత్తమమైనమార్గము.

అటుల ప్రకృతిగా జీవాత్మగా తన విలాసమును ఆ 'సత్‌' చూపినప్పుడు, అది సాకారము సగుణము నామయుతము అయి అనంతకోటి రూపముల అనంతకోటి నామముల గుణముల ప్రచారములో నుండును. ఆ అనంతకోటి దివ్యశక్తులు వివిధ నామముల ప్రవర్తిల్లినవి. ఇవి చూడుడు. అచ్యుత=తన దివ్యాభావమునుండి మారనివాడు; భగవాన్‌=శక్తి కీర్తి ఖ్యాతి సద్గుణములు స్వాతంత్య్రము కలవాడు. గోవింద=జీవాత్మ యెరుగ దగినవాడు. జగన్నివాస=ప్రపంచము తనయందు కలవాడు. కేశవ=త్రిమూర్త్యాత్మకమైనవాడు. మాధవ=సర్వవిధ ఐశ్వర్యములకు నాధుడైన వాడు విష్ణువు=సర్వమున వ్యాపించినవాడు. ఈ విధముగా ఆ యా దివ్యశ్శక్తులకు, ఆ చిద్విలాసమాయా విలాసములకు నామము లేర్పడినవి. అట్టి 'సత్‌' చిద్రూపమున దర్శనమిచ్చినప్పుడు ఆనందప్రదమగుచున్నది. అనగా పరమాత్మను భక్తులు సచ్చిదానందమూర్తిగ దర్శించి పూజింతురన్నమాట. అటుల సచ్చిదానంద బ్రహ్మస్వరూపము వివిధ రూపముల వివిధ నామముల సగుణముగా దర్శనమిచ్చుటచే ముముక్షువులగు జిజ్ఞాసువులకు వేరు వేరు సాధనమార్గములు ఏర్పడినవి. కాని ఇవియేవియు బ్రహ్మ విదులగుజ్ఞానులను భ్రమింపజేయజాలవు. ఆ యా రూపములకు నామములకు గుణములకు మూలకారణమయ్యు వాటికన్నిటికి అతీతమైన అనిర్విచనీయమైన దివ్యశక్తియగు పరతత్త్వము కలదని, అదే పరమాత్మయని, ఆ పర మాత్మ సంకల్ప బలమున ప్రభవిల్లిన జీవాత్మ పరమాత్మలో లీనమగుటయే ముక్తియని జ్ఞానులు గ్రహింపకపోలేదు. కార్యకారణ విచారణ మనోధర్మము. అటుల విచారణచేయగలశక్తి దానికి గలదు అభేద ప్రతి పాదన మనసు అధికారమునకు అందని విషయము. కార్యమునకు కారణముండితీరవలయుననునది, హేతువాదులు కూడ నంగీకరింతురు. కార్యము కారణముకన్న భిన్నమైనది కారణము స్వతంత్రమైనది. కార్యము, దృశ్యముకాగా కారణము అదృశ్యము. ఇంద్రియ ప్రత్యక్షము కార్యము అనుమాన ప్రత్యక్షము కారణము. సాకారము కార్యము, నిరాకారము కారకారణము. కార్యము నశించును. అది అశాశ్వతమ. దానికి మూలభూతమైన కారణము నశింపది. శాశ్వతము సర్వకార్యములకు కారణభూతమైన ఆ మహాత్తర శక్తికి అదిమాధాంతములు లేవు.

దేవికీకట్టుబడనిదై సత్యం శివం సుందరం అయి, 'సత్‌' అది ప్రకృతిలో జీవాత్మగా తన విలాసమును ఎప్పుడు ప్రభవిల్లజేసెనో, అప్పుడే ఆజీవాత్మకు అదిమధ్యాంతములు, సత్వ రజోతమోగుణములు దేశకాలపరిధులు ఏర్పడినవి. వివిధరూపముల అటుల పరిఢవిల్లిక జీవాత్మకు విడరాని కర్మలుకూడ బంధములుగా సిద్ధమైనవి. అటుల కర్మబద్ధుడైన జీవుడు, ఈ ప్రాపంచికి బంధముల త్రెంచికొని జన్మరాహిత్యమగు ముక్తి యును దివ్యావస్థనందుటకు, అనేక యోగములు సాధనచేయవలెను. అట్టి సాధన బహురూపముల నుండును. అట్టి సాధన మార్గముల జూపునదే మతము. ఇటుల విషయ చర్చచేయగల శక్తిమంతమైన మనసు, అన్ని కార్యములకు మూలకారణమైన సత్పదార్దము కలదని యూహింపగలదు. మాత్రమే. కాని, దాని స్రవరూపమిట్టిదని నిరూపించజాలదు. కొంత ముందుకు గమించిన బ్రహ్మవాదులు సృష్టియంతయు బ్రహ్మపదార్థము యొక్క సూక్ష్మాతిసూక్ష్మమగు లీల మాత్రమే యని గ్రహించి దాని స్థితిలయములకుగూడ బ్రహ్మమే కారణమని చెప్పుచున్నారు.

పరిణామము జగత్తుయొక్క ధర్మము. అనగా ఒకనాటి రూపు మరొకనాటికి మారుచుండును. అతి చంచలము విరామము లేకుండా మారచుండును. అదే విధముగ సకలేంద్రియముల మీదను ఆయా యింద్రియములకు సంబంధించి విషయ సముదాయము మీదను గూడ మార్పులు అనుక్షణము జరుగుచునే యుండును. అయినను ఈ ఖంమ ఖండములైన దృశ్యములు, ధ్వనులు, అనుభవములు మనకు జ్ఞానోదయ ప్రదములని గ్రహించవలయును. అప్పుడు అస్తిరమగు ప్రకృతి స్థిరమైన పరాత్పరుని మహిమను అనంతకోటి రూపముల నుండు ఆ దివ్యశక్తిని వ్యక్తీకరించుచున్నటుల గ్రహింపగలము. కార్యమునుబట్టి కారణముయొక్క ఘనతను గ్రహించుచునన్నాము.

పూర్వమేది కలదో దాని తరువాత ఏమివచ్చినదో ముందు ఏమిరానున్నదో అను విషయ సంబందము మనసులో నిలువని యెడల, పూర్వము కలిగిన అనుభూతితోడ ఉత్తరక్షణమున గలుగు జ్ఞానము సమసింప శక్యముకాదు. శబ్దరూప రస గంధాదుల వలన గలిగిన క్షణికాను భవములను సహితము సూత్రమునగూర్చి మనసులో పదలిపరచపుకొనవలయును. అందువలన విషయజ్ఞానము కలుగును. ఆ విషయజ్ఞానమునే పండితులు సాక్షిచైతన్య మందురు. సర్వగతమగు పరమాత్మ రూపమగు బ్రహ్మతత్త్వము సర్వాతీతము; సర్వగతము ''ఒక్కసారి జగముల వెలినిడి యొకపరి లోపలికి గొనుచు, నుభయము తానై సకలార్థ సాక్షియగు'' నది ఆ పరబ్రహ్మము. అటులనినంతమాత్రమున బ్రహ్మతత్త్వము యొక్క పూర్ణత్వము బోధపడినదని భావించరాదు. సృష్టి కార్యము వలన పర బ్రహ్మతత్త్వమును, విషయస్పర్శలవలన గలుగు క్షణికాను భూతులవలన సాక్షిచైతన్యమగు పరమాత్మయొక్క కారణరూపమును ఊహించుచున్నాము. అటులనే విషయ నిర్ణయ విజ్ఞానము పరమాత్మ స్వరూపమును తెలసికొనుట కుపకరించును. అటుల తెలిసికొనుట యంతయు అనుమాన ప్రమాణము వలన మాత్రమే. ఆ తెలివిడిని పండితవాక్యము బలీయము చేయును.

ఈ అనంతకోటి బ్రాహ్మాండములకు సర్వకార్యములకు కారణ భూతమును, సృష్టి స్థితిలయములకు హేతుభూతము ఈశ్వరత్వమనిగదా గ్రహించితిమి సృష్టి స్థితిలయములకు రజస్సు సత్వము తమసులను గుణములు హేతువులని శాస్త్రములు చెప్పుచున్నవి. అదిగాక ఆదిమధ్యాంతములకు ఈశ్వరత్వమే కారణమను సంగతి యిదివఱకే గ్రహించితిమి. 'సృష్టిస్థిత్వంతకరణీం బ్రహ్మవిష్ణు శివాత్మనాం ససంజ్ఞాం యాతిభగవానేక ఏకజనార్దనం'' అనెడి స్మృతివాక్యమునుబట్టి ఆ ఈశ్వరత్వము త్రినామముల చెప్పబడినను ఆ పరబ్రహ్మ మొక్కటియేయని ఆ భావము, ''కేశవ'' అనుభగవన్నామములో సూచితమైనదని గ్రహించితిమి. గుణరహితునకు ఏల గుణముల నాపాదించుచున్నారో, నిరాకారునకు ఏల రూపకల్పనజేసి యున్నారో, మొదలగు విషయములు కొంతకొంత చర్చించితిమి. సర్వ గుణశోభితుడయ్యు గుణాతీతుడు. అనగా ఏ గుణములు ఆ బ్రహ్మమును బాధించవు. అన్నియు వాని చెప్పుచేతులలో నుండును. అన్నిటికి అతీతడు. ఆ బ్రహ్మమునకు భవము దోషము రూపము కర్మము. ఆహ్వయములు; గుణములు లేవు. అట్టి పరబ్రహము ఈశ్వరత్వము. చరాచరప్రపంచము నందంతటను పిపీలికాదిబ్రహ్మపర్యంతముఅణువునుండి బ్రహ్మాండమువరకు సర్వవ్యాప్తిని జెందిన మహిమాన్విత తేజయు. అది తపస్సంపన్నులగు యోగులకు భక్తులకు బ్రహ్మవిదులగు పరమహంసలకు సువిదితము. దానిని వారు గ్రహించగలరు. పరమభక్తుడగు ప్రహ్లాదుని మాటలే మకు ప్రమాణము

''కలడంభోధి కలండు గాలి కలడాకాశంబునం గుంఖి విం

గల డగ్నిం దిశలం బగళ్ళ నిశలలో ఖద్యోత చంద్రాత్మలం

గల డోంకారమునం ద్రిమూర్తులద్రిలింగ వ్యక్తులం దంతటన్‌

గలడీశుండు....''

కం| ఇందుగల డందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన

నందందే గలడు దానవాగ్రణి వింటే (భాగ)

వివిధ రూపముల వివిధ పద్ధతుల దృశ్యమానమగు ఈ ప్రకృతి యందు ఏదోరూపమున ఏదో చిహ్నమున భగవంతుని శక్తి లీల గోచర మగుచునే యుండును. అందుచేతనే ప్రకృతి పరాత్పరుని లీల యనియు మాయాకల్పిత ఆ భాసరూపమని, విజ్ఞులు చెప్పిరి. కాని కొందరు ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరాత్పరుడు వేరు అను వారును గలరు. అట్టివారిలో కొందఱు ప్రకృతిని జడ ప్రకృతి యందురు. కాని ఈశ్వరుని సర్వాంతర్యామి (విష్ణువు యని చెప్పుచు, పుట్టుట, పెరుగుట, నశించుట అను గుణములుగల ప్రకృతి జడమనుటలో వారి భావమేమో! అట్టివారు ప్రకృతి యందు పరాత్పరుని లీలలు దర్శింపలేరా లేక సర్వకార్యములకు కారణ భూతమగు ఈశ్వర ప్రేరణ లేక స్వయముగా సృష్టిస్థితిలయములు లేనిది గాన ప్రకృతిని జడప్రకృతిగా చెప్పుచున్నారా?

ఇటులనే ప్రపంచమంతయు మిద్య అనగా సూన్యమను భావము కాదు. సూన్యవాదము వైదిక మత మంగీకరింపదు. ఇట మిధ్య అనగా కనబడే రూపమే శాశ్వతముకాదనియు, పరిణామ వాదమునుబట్టి, క్షణ క్షణము మారుచు రూపాంతరములందుచు చివరకు రూప రహితమందు స్వభావము కలదనియు, అట్టి మార్పులకు మూలమగు ఏదో మూలశక్తి, అనగా మరణము శాశ్వతమైనది కలదనియు, ఈ ప్రకృతికార్యములన్నియు అశాశ్వతములనియు భావించుట యుచితము.

అతిప్రాచీనమని చెప్పబడు గ్రీకుదేశ నాగరికత, సంస్కృతి పరిశోధించిన అనాదికాలమున, వారున ప్రకృతియందు పరాత్పరుని లీలలను దర్శించి పూజించినవారేయని తెలియ బడుచున్నది. వైదికకాలమున ఆర్యులు ప్రకృతియారాధన చేసినవారే. ఋగ్వేదమున ప్రకృతియారాధన స్తవము కనబడుచున్నది. వారు ఇంద్ర వరుణాది దేవతలకు ప్రకృతికి సంబంధము కల్పించి అతిమనోహరముగ వర్ణించిరి. స్తవము జేసిరి. పూజించిరి. వారు అటుల పూజించినది రూపులను కాదు. అరూపులను కాదు. వారు దేవతలను రూపులుగా గాని అరూపులుగా గాని చూడలేదు. పరబ్రహ్మ దివ్యశక్తులుగ భావించి పూజించిరి. అనగా చరాచర ప్రపంచము నందంతటను ఆ దివ్యశక్తిని దర్శించి రన్నమాట ఆ దివ్యశక్తుల యందు రూపము, అరూపము కలిసియే యుండును. సృష్టి రహస్యమును నెఱుంగగోరిన జిజ్ఞాసువులకు సాధనక్రమమున వివేకము హెచ్చును. నిత్యానిత్యవస్తు విచక్షణ సేయుటకు సంకల్పము బలీయమగును. ఆత్మానాత్మజానము వికసించును. ఆర్యఋషులు దేవతలను జూచిచూచి, వర్ణించి, అరూపమును, నిరాకారమును, సత్తామాత్రజ్ఞేయమును అగు, అప్రత్యక్షవస్తువు కలదని గ్రహించిరి ఆజ్ఞాతమును అగు నిరాకారతత్త్వమున్నదని గ్రహంచిరేకాని ఆ నిరాకారమును పట్టుకొనలేక సత్తు అనిగాని, అసత్తు అనిగాని ప్రతిపాదింప సాహసింపరైరి. బ్రహసూత్రముల నేర్పరచిన నారాయణాంశ సంభూతుడగు వ్యాసభగవానుడు ఆ అంధకారమును ఆ మహాసూన్య సింధువును మధించి వ్యతిరేకపథముల జరించు వారికి అన్వయమార్గము జూపెను. సృష్టిరహస్యమును వెలువరించుచు నిరాకార బ్రహ్మమును, సాకారబ్రహ్మముగను నిర్గుణబ్రహ్మమును సగుణ బ్రహ్మముగను నిరూపించెను. ఆ మార్గమున గమించిన బ్రహ్మవిదులు ప్రకృతియందు పరబ్రహ్మమును దర్శించిరి. ప్రకృతియందలి కార్యకారణ సంఘాతమునందు దేహేంద్రియ మనోబుద్ధులకును వాటి ధర్మములకును వాటి కర్మలకును, వాటి, అవస్థలకును సాక్షిగానుండి ప్రకాశింపజేయునే గాని వాటియందు నిర్గుణము నిరాకారము సర్వకార్యములకు కారణభూతమైన ఆ పరబ్రహ్మమునకు అభిమానము లేదు; ద్వేషము లేద. అదేవిధముగ బ్రహ్మవిదుడు (జ్ఞాని) తనయందు బ్రహ్మమును బ్రహ్మమునందు తనను చూచుటయేగాక, సర్వభూతములందు ఆత్మకత్వమును గుర్తించి బాహ్య నిర్వికల్ప సమాధినిష్టచే నేర్పడినదియు, అధిష్టానముయొక్క యథార్థస్థితికి సంబంధించినదియు నగు విజ్ఞానబలముచే, ఆత్మయందే పరిపూర్ణ సచ్చిదానందైకరసమై, నిర్వికల్పమైన, నిర్వికారమై, నిర్విశేషమైయున్న సత్స్వరూపమునందు అవ్యాకృతము మొదలు, స్థూలదేహము పర్యంతము గల సమస్తభూతములను వాటి వాటి కార్యములతోపాటు ఆత్మమాత్రముగ బ్రహ్మవిదుడు దర్శించుచున్నాడు. "ఇదియంతయు 'నేనే' అనిసమస్తమును తన స్వరూపముగనే తలంచునుగాని వానియునికి తనకన్న భిన్నమని భావింపడు" 'ఈశ్వరా స్సర్వభూతాని, ఆత్మవత్‌ సర్వభూతాని' యనియే భావించును.

సర్వభూతస్థమాత్మనాం సర్వభూతాని చాత్మని

సంపశ్యన్‌ బ్రహ్మసమం యాతినాన్వేన హేతునా

సమస్త భూతములందు తనను, తయందు సర్వభూతములను బాగుగ జూచు మహనీయుడు పరబ్రహ్మమును బొందును. యోగారూఢుడయిన బ్రహ్మవిదుడు సచ్చిదానంద రసమయ పరబ్రహ్మమును సర్వత్ర ప్రత్యగాత్మ స్వరూపముతో నున్నవానివిగా చూచుచున్నాడో, అట్టివానికి సర్వభూతములందును అనగా ప్రకృతియందంతటను భగవంతుడే ప్రత్యక్షమగును. అట్టివానికి సచత్చిదానందరసమయమైన పరబ్రహ్మము కనపడకపోవుట యనునదియే లేదు. నిలబడియున్నను, వెళ్ళుచున్నను, పరుండియున్నను, కనులు తెఱచియున్నను, కనులుమూసియున్నను అహారపానీయములు స్వీకరించుచున్నను వేయేల సర్వావస్థలయందును, ఏ వ్యాపారము చేయుచున్నను నిరంతరము సర్వత్ర పరబ్రహ్మత్వము వానికి సాక్షాత్కారించుచునే యుండును. అట్టి సమ్యగ్దృష్టి కలవాడు సర్వమును బ్రహ్మము గనే గ్రహించును. అంతటను బ్రహ్మదృష్టియు, బ్రహ్మమునందు ఆత్మ దృష్టియు, బ్రహ్మానందానుభవమును గలిగియుండును. భాగవతో త్తముడగు ప్రహ్లాదుడు అట్టి బ్రహ్మవేత్త అతడు,

"తనయందు నఖిల భూతములందు నొకభంగి

సమహితత్వంబున జరుగువాడు"

"పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్‌ భాషించుచున్‌ హాస లీ

లానిద్రాదులు పేయుచున్‌ దిరుగుచున్‌ లక్ష్మించుచున్‌ సంతత

శ్రీనారాయాణ పాదపద్మయుగళీ చింతామృతా స్వాద సం

ధానుండై మఱచెన్‌ సురారి సుతుడేతద్విశ్వమున్‌ భూవరా

మరియు

"అంకించి తనలోన నఖిల ప్రపంచంబు

శ్రీ విష్ణుమయమని చెలగువాడు" (భాగ)

అట్టిజ్ఞానులే బ్రహ్మవిదులే సర్వత్ర భగవల్లీలలు, పరమాత్మ విలాస వికాసములు చూనేర్తురు; ఆనందింతురు; స్తవముచేతురు; ముక్తిగాంతురు.

సృష్టియందలి సర్వవస్తు రాశియందును ఏకరూపమున సమరస భావముతో నుండునదిగాబ్రహ్మము సమమనబడుచున్నది. అట్టిసమరసభావముగల పరబ్రహ్మ మువలెనే సర్వత్ర సమభావము కలవారు సమదర్శనులు. అనగా అరోపితములైన నామారూపములను గమనింపక సర్వత్ర అధిష్టానముగా నుండు బ్రహ్మను మాత్రమే దర్శించుటయందు లక్ష్యము కలవారు బ్రహ్మవిదులు పండితులు అని చెప్పవలయును "పండితః సమ దర్శానా" సర్వము బ్రహ్మమే అనెడి దృఢనిశ్చయము గలవాడైన బ్రహ్మవేత్తమాత్రమే సమదర్శనుడు కాగలడు. సర్వభూతములందు నున్న మహాతత్త్వము మొదలు, స్థూలదేహమువరకుగల, సమస్తభూత సమూహము లోపల వెలుపల నిరంతరము అంతటా వ్యాపించియుండునట్టి నిర్విశేష పరబ్రహ్మమును భజించుచున్నాడో 'అహం బ్రహ్మస్మి' అనే ప్రత్యేక దృష్టితో, తనను సాక్షాత్తు బ్రహ్మముగానే గుర్తించుచున్నాడో, వాడే బ్రహ్మవేత్త. ఆదిశంకర భగవత్పాదులు 'అహం బ్రహ్మస్మి' అని రనుటలో అశ్చర్యములేదు.

అటులనే

"కృష్ణస్య మసి కృష్ణో7హం కృష్ణ ఏ వాఖిలం జగత్‌

కృష్ణమైఁహు కృష్ణతూఁహై కృష్ణహి సబగ జగతహై

అనిన చైతన్య స్వామివారు బ్రహ్మవిదులుగాక మరెవరు? మహాత్ము

లగు వారటుల అనినారుగదాయని ప్రతివాడును తనకున్న మిడి మిడి జ్ఞానముతో తానుకూడ అంతవాడని భావించి 'అహం బ్రహ్మస్మి' అను కొనుట సాహసమే యగును.

అట్టి ఈశ్వరత్వమును నిరూపించి మహిమలు విపులీకరించి ఈశ్వరత్వమని చెప్పబడు సర్వాత్మయగు పరమాత్మకు జీవాత్మకు గల సంబంధము, జీవాత్మ ఎటుల ప్రభవించినది. పరమాత్మలో నెటుల లీనమగును అను విషయ నివేచనచేసి, మానవుడు ముక్తిగాంచుటకు బాటలు తీర్చి దిద్దునది మతము. అట్టి మతతత్వమును పరీశీలించి గ్రహించుటయు నవసరమే.

Satyanveshana    Chapters