Paramacharya pavanagadhalu    Chapters   

97. సంశయం తీరిందా!

ఒకసారి స్వాముల వారు మదరాసు వచ్చారు. అక్కడ త్రిపుర సుందరీ, చంద్రమౌళీశ్వరుల పూజ చేస్తున్నారు. స్వామి ఆదేశంపై శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూర్చొని వున్నారు. వేసిన పందిళ్లు చాలక జనం కిటకిటలాడుతూ మైదానమంతా నిండిపోయారు.

ఇంతలో అనుకోకుండా దట్టంగా మబ్బు పట్టింది. ఏ క్షణాన్నయినా వర్షం భారీగా కురిసేట్లుంది. గట్టిగా వర్షం పడితే వేసిన పందిళ్లు కూడా తట్టుకోవు. పూజకు అంతరాయం కలుగుతుందేమో అని అందరికీ ఆందోళనగా వుంది. పెద్ద స్వామి యిదంతా గమనిస్తున్నారు. నెమ్మదిగా లేచి బయటకు నడిచారు. వెలుపలికి వచ్చి ఆకాశం వైపే అదే పనిగా చూస్తూ నిలుచున్నారు. కాసేపటికి నెమ్మదిగా మబ్బులు పలచబడ్డాయి. క్రమంగా వాన తేలి పోయింది. తిరిగి ఎండ కాస్తోంది.

స్వామి వారికి కొంచెం దూరంగా ఒక వ్యక్తి నిలుచొని యిదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు.

అపుడు స్వామి ఆయన వేపు తిరిగి ' మీ సందేహం నివృత్తి అయిందా?' అని అడిగారు.

'అయింది స్వామీ' అని నమస్కరించారాయన. అనుకోకుండా స్వామి తనను పలకరించింనందులకు ఆశ్చర్యం, సంభ్రమం, ఆనందం ముప్పిరిగొనగా, నిజానికి ఆయనకు స్వాముల వారలంటే గురి లేదు. వారి మహిమలంటే అసలే నమ్మకం లేదు. ఈ పెరియ సామికి నిజంగా అంత శక్తి వుందా అన్నది ఆయన సందేహం.

స్వామి అలా కాసేపు తేరిపారచూడగానే వాన తేలిపోవడం ఆయన స్వయంగా చూశాడు. అది స్వామి సంకల్ప బలమా? అదే సమయానికి దానంతటదే జరిగిందా? అని ఆలోచిస్తుండగా స్వామి సంశయం తీరిందా? అనడిగారు. తనకు యిలాంటి విషయాలంటే సందేహం వున్న సంగతి స్వామి కెలా తెలుసు? అదీ ఆయనను ఆశ్చర్యపరిచిన సంగతి.

స్వామి వారు పలుకరించిన సందేహరావు ఎవరో కాదు. సుప్రసిద్ధ గాంధేయ వాది, కాంగ్రెస్‌ కార్యకర్త, హరిజన సేవకుడు ఊటుకూరి నరసింహారావు.

Paramacharya pavanagadhalu    Chapters