Paramacharya pavanagadhalu    Chapters   

88. రామేశ్వరానికి బియ్యం

స్వాముల వారు ఎప్పుడు ఏ పని ఎందుకు చేస్తారో అర్థమయ్యేది కాదు. అయితే ఆయన చేసే ప్రతి పనికి ఏదో ప్రయోజనం వుంటుంది. అదేమిటో మనం గ్రహించటానికి ఒక్కోసారి చాలా సమయం పట్టేది.

కొంతమంది భక్తులకు వరి పొలాలున్నాయి. అందులోని పంటలో కొంత భాగం మఠానికి కానుకగా యిచ్చుకోవాలని వారికి కోరిక వుంటుంది. అలాంటి భక్తులు కొందరు ప్రతియేడూ ఒకటో రెండో బియ్యపు మూటలు మఠానికి పంపిస్తుండటం కద్దు.

ఒక సంత్సరం మఠం నుంచి అటువంటి భక్తులందరికీ వొక విచిత్రమైన ఆదేశం వెళ్లింది. ''ఈ సంవత్సరం మీరు పంపదలుచుకున్న బియ్యం మూటలను కంచికి పంపవద్దు. రామేశ్వరంలో వున్న కంచి కామకోటి పీఠానికి చెందిన మఠానికే సరాసరి పంపండి! అని. కంచిలో వున్న భక్తులు కూడ తమ వంతు బియ్యాన్ని రామేశ్వరానికి పంపాల్సి వచ్చింది.

చాలా మందికి స్వాములవారిలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. మొత్తం మీద రామేశ్వరం మఠం బియ్యం మూటలతో ఒక పెద్ద గోడౌన్‌ లాగా తయారయింది.

ఆ తరువాత కొద్ది రోజులకు అకస్మాత్తుగా ఉప్పెన వచ్చింది. ధనుష్కోటి దగ్గర వంతెన కొట్టుకొని పోయింది. రామేశ్వరాన్ని భూభాగంతో కలిపే సేతువు అదొక్కటే. అది పోవటంతో రామేశ్వరం జలదిగ్బంధంలో వుండిపోయింది. రామేశ్వరానికి యాత్ర వచ్చిన వారక్కడే చిక్కుపడిపోయారు. అలా చిక్కుపడి పోయిన యాత్రీకులలో మా బావగారు శ్రీ అయితరాజు రాం రావు గారు, అక్కగారు శ్రీమతి రాథా దేవి గారు కూడా వున్నారు. అక్కడ నివాసం వుండేవారు కూడా నిస్సహాయులై పోయారు. సముద్రం అల్లకల్లోలంగా వుండటంతో పడవలు నడవలేదు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెలిపోయి ఏ విధమైన సరకుల సరఫరా జరిగే అవకాశం బొత్తిగా లేకపోయింది.

ఆ పరిస్థితిలో రామేశ్వరంలోని కంచి మఠంలో వున్న బియ్యం, ఎంతగానో అక్కరకు వచ్చాయి. వందలాది యాత్రికులకు, స్థానికులకు తిండి సమస్య లేకుండా ఆ బియ్యం ఆదుకున్నాయి. అప్పుడు కాని త్రికాలజ్ఞులయిన స్వామి అలా ఎందుకు ఆదేశించారో జనానికి అర్థం కాలేదు.

Paramacharya pavanagadhalu    Chapters