Paramacharya pavanagadhalu    Chapters   

85. కబోదికి కనుచూపు

అది 1963. తిరుచినాపల్లిలో వున్నారు, స్వామి దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ. పెద్ద స్వాములు నవరాత్ర దీక్షలో వుండి, ఆ కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, కనుక ఇంటర్‌వ్యూలు రద్దు చేశారు.

అయితే స్వామి దర్శనార్ధం వచ్చే భక్తుల సంఖ్య వేలాదిగా వుంది. అంత జన సందోహంలో ఒక ముసలమ్మ స్వామితో మాట్లాడి పోవాలన్న పట్టుదలతో హఠం పట్టి కూచుంది. అసలే వృద్ధురాలు. అందులో బొత్తిగా చూపానటల్లేదు. పైగా వినికిడి కూడా అంతంత మాత్రమే. అందులో మూడు రోజులుగా ఉపవాసాలు చేస్తోంది. ఆవిడ శివ శివా, హరహరా అంటుందే తప్ప వేరే మాట్లాడదు. అదో నియమం ఆవిడకు.

స్వామి దీక్షలో వుండిరి, ప్రముఖులకే ఇంటర్‌వ్యూలు లేవాయె. ఈవిడకు స్వామి దర్శనం ఎలా దొరుకుతుంది.? అని జాలిపడుతూనే, ఎవరికి వారు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. అయినా వొక భక్తుడు కొంచెం ఆలోచించి, ఆవిడను అక్కడున్న వొక వాకిలి వద్ద కూచోబెట్టాడు. స్వామి బయటికి వచ్చిపోవడానికి అప్పుడప్పుడా ద్వారం వుపయోగిస్తుంటారు. అదృష్టం కలిసొస్తే స్వామి దర్శనం దొరకొచ్చు. ఆ ఆశకొద్దీ ఆవిడ యిక అక్కడే 'శివ శివా, హర హరా' అంటూ కూర్చుంది.

ఇంతలో తలవని తలంపుగా స్వామి వారి శిష్యులలో వొకరు ఎందుకో ఆ వాకిలి తెరుచుకొని బయటికి వచ్చారు. వెంటనే అక్కడి వారామె కథ అతనికి తెలియచేశారు. అతడు తిరిగి లోపలకు పోయి స్వామికి ఆవిడ కథ నివేదించారు.

అప్పడు స్వామి పూజామందిరంలోకి వెళ్లబోతున్నారు. శిష్యుడి మాటలు వింటూనే ఆయన గిరుక్కున వెనక్కు తిరిగారు. అదే వాకిలి తలుపును తీసికొని బయటికి వచ్చారు. ముసలమ్మ అక్కడే కూచుని శివశివా, హర హరా అంటోంది.

'ఏం పాటీ (అవ్వా!) నేను నిన్ను చూడటానికి వచ్చాను. ఎంత సేపటి నుంచి యిక్కడ కూచున్నావు?' అని అడిగారు, స్వామి ఆవిడకు దగ్గరగా వెళ్లి.

ముందామెకు స్వామి మాటలు వినిపించలేదు. చుట్టు ప్రక్కల వాళ్లు గట్టిగా అరచి స్వామి వచ్చి పలకరిస్తున్నారని చెప్పారు. ఆవిడకు విషయం అర్థం అయింది. దాంతో ఆమెకు పట్టరాని సంతోషం వేసింది. 'నా తండ్రీ! నా దేవుడా! వచ్చావా తండ్రీ, నన్ను దీవించటానికి వచ్చావా!,' అంటూ స్వామి వేపు తిరిగింది.

'తండ్రీ! కాసేపు అట్లాగే నిలబడు, నన్ను వొకసారి నీ కాళ్లకు మొక్కనీ' అని వేడుకొన్నది.

'అవ్వా! నీకు చూపులేదుకదా, ఎలా చూస్తావు నన్ను?' అడిగాడు స్వామి.

'పోనీ, దగ్గరకొచ్చి మాట్లాడుతే నీ మాటన్నా వింటా' అన్నదావిడ.

'అట్లా కాదు, నే చెప్పినట్లు చేయి,' అన్నారు స్వామి.

ఆమెను కొంచెం దూరంగా తీసుకొని వెళ్లి ఎండలో నిలబెట్టారు. ఆమె చుట్టూ స్వాముల వారే ప్రదక్షిణం చేశారు. అలా చుట్టూ తిరిగేటప్పుడు, ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క క్షణం ఆగారు. 'నేను నీకు కనిపిస్తున్నానా?' అని స్వామి దిక్కు దిక్కుకూ ఆగినప్పుడల్లా అవ్వను అడుగుతూ వచ్చారు. చుట్టూ వందలాది జనం మూగి యిదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఒక్కొక్క దిక్కు దగ్గర ఆగి, తిరిగి స్వామి కదిలినప్పుడల్లా, అవ్వ స్వామి రూపంలో ఒక్కొక్క భాగాన్ని వర్ణించసాగింది.

'అదిగో!, స్వామి! నీ పాదుకలు కన్పిస్తున్నాయి! ఇదిగో కాషాయ వస్త్రం! ఆహా! అదిగో దండం! అవిగో రుద్రాక్షమాలలు! స్వామీ, విభూతి పట్టెలు కన్పిస్తున్నాయి! ఎంత చక్కగా తీర్చి దిద్దినట్లున్నాయి. అవి! అవిగో, స్వామి! నీ కండ్లు, దయతో నిండి నావంకే చూస్తున్నాయి! అదిగో స్వామి, నీ తలపై కాషాయపు కొంగు! స్వామి! నాకు యిప్పుడు నువు సంపూర్ణంగా కన్పిస్తున్నావు. భ##ళే! ఇరవై ఏళ్ల కింద నా కళ్లు బాగుండగా ఒకసారి నిన్ను నేను చూశా తండ్రీ! అప్పుడెట్లా వున్నావో అచ్చంగా యిప్పుడు నా కళ్లకు అట్లాగే కన్పిస్తున్నావు. నేను ధన్యురాలిని, నా తండ్రీ!' అవ్వ కండ్ల వెంట ఆనందభాష్పాలు కారిపోతున్నాయి. ఆమె సాగిలబడి నమస్కారం చేసింది తృప్తిగా ఆనందంగా. స్వామి వాకిలి గుండా తిరిగి లోపలకు వెళ్లిపోయారు.

&#ఏ మతస్తులైనా, ఏ సంప్రదాయానికి చెందినా మానవులందరి పరమావది కామ క్రోధాలను అధిగమించడమే.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters