Paramacharya pavanagadhalu    Chapters   

82. నీరెండకు దిగిన గీర్వాణం

1960లో స్వామి ఎలియత్తాన్‌లో మకాం చేశారు. అదో చిన్న పల్లె. ఆ వూరు ప్రత్యేకత ఏమంటే ఆ వూళ్లో యిళ్లన్నీ గుళ్లే. ఆ వూళ్లో జనమంతా ఏదో ఒక ఆలయంలో పూజారులే కాని ఏదో ఒక గుడికి సంబంధంలేని వారంటూ ఎవ్వరూ లేరు, అక్కడ. ఆ వూళ్లో గుళ్లనూ, గోపురాలనూ కట్టించింది ద్రవిడ దేశంలో నాటుకోటి సెట్లు. వారంతా కోటికి పడగెత్తిన వారే.

ఎలియత్తార్‌ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలని మద్రాసు నుంచి నీలంరాజు వెంకటశేషయ్య గారు ఆరోజు వెళుతున్నారు. ఆ రైల్లోనే ఆయనకు బాగా పరిచితులయిన సంస్కృత పండితులు ఒకరు కలిశారు. ఆ శాస్త్రిగారు చక్కగా కబుర్లు చెప్పటంలో దిట్ట. కాలక్షేపం కాదనే బెంగలేదు. ఇకనేం యిద్దరూ తీరిగ్గా కబుర్లలో పడ్డారు. రైలెక్కిన దగ్గర నుంచి.

శాస్త్రి గారికి మాట్లాడేటప్పుడు ఆ గ్రంథం నుంచి, యీ గ్రంథం నుంచి సంస్కృత శ్లోకాలను అలవోకగా గుప్పించే అలవాటుంది. అయితే అవి అవతలి వాళ్లకు అర్థమౌతున్నవా లేదా అనేది ఆయన గమనించేవాడు కాదు. శేషయ్య గారు కాసేపు చూసి చివరకు, 'అయ్యా! శాస్త్రి గారూ! నాకు చిన్నప్పుడు సంస్కృతం చదువుకోడం కుదరలేదు. ఇంగ్లీషు బళ్లలో చేరడం మూలాన' అన్నారు. మాటల్లో సంస్కృత శ్లోకాలు గుప్పించటం కొంచెం తగ్గించి, విషయం తెలుగులో అర్థమయ్యేటట్లు చెపుతే మంచిదన్న సంగతి శాస్త్రిగారికి సున్నితంగా స్ఫురింపజేయాలని శేషయ్యగారి యత్నం.

కాని శాస్త్రి గారు వెంటనే ' ఆ! సంస్కృతం మీ కెట్లా అలవడుతుంది లెండి! దాన్నిలా మా బోంట్లకు వదిలేయండి!' అన్నారు.

ఆయన మాట పైకి మామూలుగా వున్నా లోపల్లోపల కొంచెం అవహేళన ధ్వనించకపోలేదనిపించింది శేషయ్య గారికి. ఆయన మనస్సు చివుక్కుమంది. కాని ఆయన బయటపడలేదు. నవ్వి వూరుకున్నారు.

తరువాత యిద్దరూ రైలు దిగి ఎలియత్తాన్‌ గుడి దగ్గరకు పోయి, స్నానం, సంధ్యా అయింతర్వాత స్వాముల వారి దర్శనం కోసం వెళ్లారు. ఆచార్యులు పెరట్లో ఓ చెట్టు నానుకొని కూచున్నారు సాయంకాలం నీరెండలో.

ఇద్దరూ స్వామి దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారాలు చేశారు.

'ఇంకా ఎండగానే వుంది. అయినా ఫరవాలేదు. సాయంకాలపుటెండ!' అంటూ స్వామి ఏదో చెప్పబోతున్నట్లు 'వృద్దాతపః వృద్దాతపః' అని రెండు సార్లన్నారు.

శేషయ్యగారి కప్పుడు చిన్నప్పటి శ్లోకం వొకటి గుర్తుకొచ్చింది. వెంటనే ఆయన

'వృద్దార్కః హోమ ధూమశ్చ

బాలస్త్రీ నిర్మలోదకం

రాత్రే క్షీరాన్న భుక్తిశ్చ

ఆయుర్వుర్థిర్దినే దినే'

అని చదివేశారు.

'ఆ! ఆ!' అంటూ స్వామి వెంటనే ఆ పాదం 'వృద్దార్కః....' - అంటూ అందుకొన్నారు.

స్వామితో కాసేపు గడిపిన తరువాత యిద్దరూ బయటకు వచ్చారు. వెంటనే శాస్త్రిగారు, 'అవురా! ఎంత నాటకం ఆడారండీ! నాకు సంస్కృతం రానే రాదన్నారు రాత్రి ఇప్పుడు స్వామికే శ్లోకం అందించారే!' అన్నారు.

నిజానికి శేషయ్య గారు సంస్కృతం చదువుకోలేదు. ఆయన స్వామి ముందు చదివిన శ్లోకం లాంటివి వొకటో రెండో వల్లించటంతో ఆయన సంస్కృతం చదువుకోటం ముగిసింది. ''అంతేనయ్యా, మహానుభావా!', అంటే శాస్త్రి గారు నమ్మడే!

పంచకావ్యాలూ పుక్కిట బట్టిన శాస్త్రిగారికా శ్లోకం రాదనుకోలేము. కాని అప్పుడాయనకు గుర్తు రాలేదు. సంస్కృతం రాని శేషయ్య గారికి అది అనుకోకుండా చప్పున స్ఫురించింది. ఏభై ఏళ్లక్రిందట ఏదో యదాలాపంగా వల్లె వేసిన ఆ శ్లోకాన్ని ఆయన మనసుపొరల లోతులలోంచి ఎవరు పైకి లాగి నట్లు? ఆయన నోటికి ఏశక్తి అందించినట్లు?

సంస్కృతం మీకెందుకు, మాకొదిలెయ్యండి' అనే శాస్త్రిగారి యెత్తి పొడుపు మాటకు సంస్కృతం రాని శేషయ్య గారి నోటనే జవాబు చెప్పించి, అహం ఎప్పుడు ఎవరి యందు తలయెత్తినా దాని తలను అణగగొట్టిన ఈ అద్భుత శేముషి ఎవరి సొత్తు? స్వామి సన్నిధిన జరిగిన యీ అద్బుత సన్నివేశం ఆచార్యుల అలౌకిక శక్తికి మరో ఉదాహరణ కాదా!

ఇటువంటి కథనే యీ సందర్భంలో మరొకటి గుర్తుకు తెచ్చుకున్నారు శేషయ్య గారు.

ఆదిశంకరుల శిష్యులలో గిరి వొకడు. గురువుగారికి శుశ్రూష చేయటంలో అతడికి అతడే సాటి. కాని చదువులో, పాపం! మొద్దబ్బాయిగా కనిపించేవాడు. అతడా పనీ యీ పనీ చేసి వచ్చే దాకా శంకరులు పాఠం మొదలెట్టేవారు కాదు. తాము బాగా చదువుతామని, తెలివి కల వాళ్లమనీ అనుకొనే మిగిలిన శిష్యులకు అది నచ్చేది కాదు. ఆ విషయం గమనించి శంకరులు వాళ్లకు కాస్త గుణపాఠం నేర్పాలనుకున్నారు.

ఇంతలో గిరి వచ్చాడు. అయితే ఎప్పటిలా కాదు. అదోరకంగా ఆనందంగా నృత్యం చేస్తూ కనిపించాడు. అతడు లయబద్దంగా తోటకవృత్తాలలో గురు ప్రశస్తిని తీయగా పాడుకుంటూ, దానికి తగినట్లు అడుగులు వేస్తూ వస్తున్నాడు. వారంతా వింటుండగా గిరి గురువుగారిని కీర్తిస్తూ ఆశువుగా ఎనిమిది శ్లోకాలు తోటకం అనే వృత్త చందస్సులో చెప్పాడు. అప్పటి నుంచి అందరికీ అతడు తామనుకున్నట్లు మొద్దబ్బాయి కాదని తేలింది. అంతేకాదు. అంత చక్కటి కవిత్వాన్ని అంత అలవోకగా చెప్పగలిగే తెలివితేటలు, పాండిత్యం తమలో ఎవరికీ లేవని స్పష్టమయింది వారికి, ఆచార్యుల అనుగ్రహబలం మూలంగా గిరి అప్పటి నుంచి తోటకాచార్యులుగా పేరొందాడు.

తోటకాష్టకంలో మచ్చుకు వొక్కటి:

'విదితాఖిల శాస్త్ర సుధాజలధే

మహితోపనిషత్‌ కథితార్థనిధే

హృదయే కలయే విమలం చరణం

భవ శంకర దేశిక మే శరణమ్‌!'

అమ్మవారికి చేసే వందనం పాపాలను పోగొడుతుంది. సకల సంపదలను ఇస్తుంది. ' ఈ వందనం ఉన్నదే యిదొక్కటే నా ఆస్తి, కృపామయి అయిన జగదీశ్వరి, ఈ వందన భాగ్యం నా వద్దనే ఉండేట్లు చేయవలె' అని శంకర భగవత్పాదులు భక్తునకు పరమేశ్వరీ చరణాలలో ఉండవలసిన ప్రపత్తి యొక్క పరమార్థాన్ని బోధించారు.

మనం కూడా ఆ మంగళ##దేవత చరణాలనే నమ్ముకొని సుఖశాంతులను పొందుము గాక!

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters