Paramacharya pavanagadhalu    Chapters   

80. ఇంతేగా మీరు చెప్పేది?

1956లో స్వామి ఆరోగ్యం సరిగా లేదు. అప్పుడే కుంభకోణంలో మహామాఖ తటాకంలో మహామాఖోత్సవాలు జరిగాయి. ఆ వుత్సవాలు 12 సంవత్సరాల కొకసారి వస్తాయి. స్వామి కాలినడకన కంచి నుండి కుంభకోణం వెళ్లి ఆ తటాకంలో స్నానం చేయాలని అనుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా లేనందున అది అంత మంచిది కాదని ఆయన శిష్యులంతా భావించారు. అంతా కలిసి ఆలోచించి, మద్రాసు నుంచి పేరు పొందిన వైద్యుణ్ణి ఒకరిని పిలిపించారు. ఆయన ఆధునిక పరికరాలను తీసుకొని కంచికి వచ్చాడు. స్వామి దేహస్థితిని చక్కగా పరిశీలించాడు. తరువాత స్వామికి ఆయన ఆరోగ్యపరిస్థితి ఎలా వుందీ వివరించటానికి ఉపక్రమించాడు.

కాని స్వామి డాక్టరు గారి మాటలకు అడ్డు తగిలి 'మీరేం చెప్పబోతున్నారో నే బెబుతా వినండి!' అని మొదలు పెట్టారు. డాక్టరుతో సహా అంతా ఆశ్చర్యంగా వింటున్నారు.

''ఈ స్వాములవారికి పయోరియా వుంది. కనక ఒకటో రెండో పండ్లు పీకించాలి అంటావు. అది నిజమే కావచ్చు కాని పండ్లు పీకించుకుంటే నేను మంత్రాలను సక్రమంగా పలకలేదు కదా! ఎలా? పోతే, నావూపిరి తిత్తులలో ఒకటి పని చెయ్యటం లేదు అంటావు. నిజమే! కాని ఇప్పుడు కాదు. 1930 నుండి అదలాగే వుంది. ఇక వేళాపాళా లేకుండా అకాలభోజనాలు చేయడం, ఉపవాసాలు వీటి వల్ల ఈయన పొత్తి కడుపులో వొక పేగు పని చేయడం లేదు అంటావు. అంతేగాదు, ఎదురు రొమ్ములో రక్తం గడ్డ కట్టుకుపోయింది. ఇదేగా మీరు చెప్పదలిచింది?

డాక్టరు గారు చెప్పదలచింది సరిగ్గా అదే. డాక్టరు గారు చేసేదేమీ లేక, 'స్వామికి వేళకు మంచి పుష్టికరమైన ఆహారం యివ్వండి! బాగా విశ్రాంతి అవసరం' అని సలహా యిచ్చి వెళ్లిపోయారు.

శిష్యుల మాటను మన్నించి స్వామి కుంభకోణం ప్రయాణం మానేశారు. కుంభకోణం నుంచి పుష్కరతీర్థం తెప్పించుకుని కంచిలోనే స్వామి ఆ పవిత్ర జలాలతో స్నానం చేశారు. కొన్ని వారాల తరువాత స్వామి వైద్య సహాయం లేకుండా స్వస్థులైనారు.

Paramacharya pavanagadhalu    Chapters