Paramacharya pavanagadhalu    Chapters   

76. ధ్యాన గమ్యులు

విజయవాడ వచ్చినపుడు స్వామికి అక్కడ భక్తులు వజ్ర కిరీటం పెట్టారు. ముఖమల్‌ పరుపులు పరచిన పూల పల్లకిలో ఊరేగించారు. ఆ వైభవాన్ని కనులారా చూడలేకపోయిన వారిలో చల్లా శేషాచలశర్మ గారొకరు.

ఆచార్య స్వామి మళ్లీ ఆ వజ్ర కిరీటం మొదలయినవన్నీ ధరించి మాకు దర్శనమిస్తే ఎంత బాగుండు? అని ఆయనకనిపించింది. తమ యింటిలో స్వామి విడిదిచేసిన రోజుల్లో ఆ సంగతి ఆయన స్వామి వారి ప్రధాన శిష్యులుగా వున్న రామశాస్త్రిగారిని అడిగారు, 'శ్రీవారు విరాగులు. అలాంటికోరికలు అడగటానికి అవకాశముండదు' అని ఆయన జవాబిచ్చారు. తరువాత ఆయన కొంచెం సేపు ఆలోచించి మీ కోరికను ధ్యానంలో శ్రీవారికే ప్రార్థనా పూర్వకంగా తెలుపుకోండి! శ్రీవారు ధ్యానగమ్యులు కదా!' అన్నారు.

శర్మగారు అలాగే మనసులో ప్రార్థన చేసుకున్నారు. ఆ సాయంకాలం దీప పూజ -వరుసలు వరుసలుగా దీపాలు వెలిగించారు. కన్నుల పండుగగా త్రిపుర సుందరీ, చంద్రమౌళీశ్వరులను తూగుటుయ్యాలలో వుంచి చుట్టూ దీపాలు వెలిగించారు. ఇంతలో పక్కగది తలుపు తెరుచుకొని స్వామి లోనికి ప్రవేశించారు.

ఒక చేతిలో దండం, మరో చేతిలో కమండలం, భస్మరేఖలు, రుద్రాక్షమాలలు, పైన అంతకు ముందు శర్మగారు వేసిన బంగారు పూలమాల, శిరస్సున అర్థ చంద్ర కిరీటం, వజ్రకిరీటం! ఆపైన ఒక తులసిమాల. దానిమీద శర్మగారి తల్లి ఆయన కిచ్చిన గంగ చెంబు పెట్టుకున్నారు.

వెనుక నుంచి రామశాస్త్రి గారు పతంజలి మహర్షి రచించిన 'పర చిదంబర నటంహృదిభజ' - అనే శ్లోకాలు లయ తాళబద్దంగా చదువుతుంటే అందుకనుగుణంగా అడుగులే వేస్తున్నారా అన్నట్లు వచ్చారు స్వామి.

శర్మగారి కోరిక అలా అదే రోజు నెరవేరింది. స్వామి నిజంగా ధ్యానగమ్యులే అనుకున్నారు ఆయన!

Paramacharya pavanagadhalu    Chapters