Paramacharya pavanagadhalu    Chapters   

7. శ్రీవారి అనుగ్రహవీక్షణం

శ్రీకంచి కామకోటి పీఠం 66వ ఆచార్యస్వామి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VI (1891-1907 ఒక సారి యాత్రలు చేస్తూ తిండివనం (దిండివనం) దగ్గరలో నున్న సారం గ్రామానికి వచ్చారు. శంకరాచార్యుల దర్శనం చేయటానికి ఆ గ్రామంలోని వారే కాక చుట్టు ప్రక్కల వూళ్ల వాళ్లు కూడా గుంపులు గుంపులుగా వస్తున్నారు. వాళ్లలో తిండివనం నుండి వచ్చిన కొందరు బడిపిల్లలు కూడా వున్నారు. అందులో ఒక కుర్రవాడు స్వామి వారికి పాదాభివందనం చేస్తే, స్వామి వారతనికి తీర్థం యిచ్చి కుశల ప్రశ్నలు వేశారు. అంతమందిలో శంకరాచార్యులవారు యీ పిల్లవానితో మాట్లాడటమే ఎంతో గొప్ప సంగతి అని అంతా అనుకుంటుంటే, స్వామివారా అబ్బాయిని ఆ రాత్రికి తమ వద్దే వుండి పోవలసిందని కోరారు. దాంతో అందరు అతని అదృష్టం చూసి ఆశ్చర్యపడ్డారు. అయితే ఆ బాలుడు ఆ వూరి వాడు కాదు. దగ్గరలో వున్న తిండివనంలో వుంటాడు. ఇలా శంకరాచార్యుల దర్శనం కోసం సారం వస్తున్న సంగతి ఆ కుర్రవాని యింట్లో తెలియదు. ఏదో బడి పిల్లలంతా స్వాముల వారిని 'చూడటానికి వెళదాం, వెళదాం' అని తమలో తాము కూడబలుక్కుని యిళ్ళలో చెప్పకుండా వచ్చేసిన బాపతు. ఆ పిల్లవాడు స్వాముల వారితో వున్నవిషయం దాయకుండా చెప్పేశాడు. ఇంట్లో చెప్పిరానందున తానారాత్రి అక్కడ వుండటం వీలు కాదని మనవి చేసికొన్నాడు. సెలవు తీసికొని వెళ్ళిపోయాడు.

స్వామి వారికి ఆ పిల్లవాడిని చూస్తే ఎంతో ముచ్చట వేసింది. అతడు వెళ్లిపోయింతరువాత కూడా స్వామి వారు అతని సంగతే తమ అనుచరులతో ముచ్చటిస్తూ కూర్చున్నారు. తమ తరువాత ఆ బాలకుడినే ఆచార్య పీఠానికి వారసుడిని చేయాలని తమ కనిపిస్తోందని కూడా వారు తమ ఆంతరంగికులతో చెప్పారు.

ఆచార్యుల అనుగ్రహ వీక్షణానికి నోచుకొన్న ఆ అదృష్టవంతుని పేరు స్వామినాథన్‌. ఆయన దక్షిణ ఆర్కాట్‌ జిల్లాలోని విలుప్పురంలో 1894 మే 20న జన్మించారు. తండ్రి హోయసాల కర్నాట స్మార్త బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి. తల్లి మహాలక్ష్మి. స్వామిమలై పైన వెలసి వున్న స్వామినాథస్వామి ప్రసాదం వల్ల జన్మించాడన్న భావంతో తల్లితండ్రులు ఆ పిల్లవానికి స్వామినాథన్‌ అన్న పేరు పెట్టుకున్నారు.

పేరులోనే 'స్వామి' వున్న ఆ అదృష్టశాలిని ఆచార్య స్వామిగా చేయాలని జగద్గురువులు సంకల్పించటంలో ఆశ్చర్యం ఏముంది?

Paramacharya pavanagadhalu    Chapters