Paramacharya pavanagadhalu    Chapters   

69. అప్పు చేసి స్వామికి పప్పన్నం?

శ్రీ చల్లా శేషాచల శర్మగారిది గురజాడ. ఆయన పూర్వీకులు శ్రీ విద్యా ఉపాసకులు. ఆ పుణ్యఫలం వల్ల ఆయనకు కంచి స్వామి అనుగ్రహం లభించింది.

శర్మగారు స్వయంగా స్వామి దయచే అనేక దివ్యానుభవాలను పొందారు. అందుచే ఆయన స్వామి వారిని ప్రత్యక్ష దైవంగా తలచేవారు. పదే పదే స్వామి వారిని ఆయన తన యింటికి ఆహ్వానిస్తూ వచ్చారు. స్వాముల వారు కుటుంబం లేని బహుకుటుంబీకుడు. ఆయనను భిక్షకు పిలవటం చాలా ఖర్చుతో కూడిన పని. స్వామి వారందువల్ల శర్మగారి ఆర్థిక స్థితి గురించి, వారి వూరు గురించి వాకబు చేస్తూ వున్నారే గాని సరే! అనలేదు. బహుశా ఆ బీద బ్రాహ్మణ్ణి బాధ పెట్టటం ఎందుకనుకున్నారేమో! అయినా శర్మగారు మాత్రం తన ప్రార్థన మానలేదు.

ఆ తరువాత ఒకసారి స్వాముల వారు శర్మగారి వూరికి వేంచేశారు. వారావూరిలో వుండగా మహోదయ పుణ్యకాలం వచ్చింది. ముప్ఫయ్యేండ్ల కొకసారి వచ్చే పుణ్యఘడియలవి. ఆ రోజు స్వామిని భిక్షకు పిలవటానికి ఒక కోటశ్వరుడు వచ్చి కాచుకొని కూర్చున్నాడు. బహుశా భిక్షకు పిలిచి, మఠానికి ఏదయినా పెద్ద మొత్తాన్ని విరాళంగా యివ్వాలనుకున్నాడేమో కూడా!

అయితే స్వాముల వారి ఆలోచనలు వేరుగా వున్నాయి. ఆయన శర్మగారిని పిలిచారు. 'మీ పొలంలో పండిన వడ్లతో రెండే రెండు బస్తాలు మించకుండా ఖర్చు చేసి, నా కీరోజు మీ యింట్లో భిక్ష ఏర్పాటు చేసికో' అని అనుగ్రహించారు.

ఆ తరువాత కొన్నాళ్లకు స్వామి ఆ వూరు వదిలి దగ్గరలో శాయపురం దగ్గర వున్నారు. అప్పుడు శర్మగారు వెళ్లి ఆయనను దర్శించారు. అంతా కూర్చోని స్వామి ఒక కథ చెబుతుంటే వింటున్నారు.

స్వామి చెబుతున్న కథ విష్ణు పురాణం లోనిది. 'మంత్రి తన ఆదాయానికి మించి ఖర్చు చేస్తుంటాడు. అయితే అతనికేమీ దురలవాట్లు లేవు. ఆ ఖర్చంతా దానధర్మాలకే. ఫలితంగా అప్పుల పాలవుతాడు. పాపం, రాజుగారు ఆ అప్పులన్నీ తీర్చి, ఇక నుంచయినా అప్పు చేయకు అంటుండేవారు. ఏం లాభం! కథ మళ్లీ మళ్లీ మొదటికేవస్తుండేది' ఈ - కథ చెప్పి స్వామి శర్మ గారి వేపు చూశారు. శర్మగారికి కూడా అలాంటి అప్పులే అధికమేమో! అయితే ఆయన అప్పులకు బెదరలేదు. స్వామి తన వంక చూసిన చూపులే తనకు పెన్నిధి అనుకున్నాడు.

రాజు కన్న మొండివాడు బలవంతుడు కదా! స్వామేం చేస్తారు? ఈ సారి అడుగకుండా తనంతట తానే శర్మగారింటికి వచ్చి మూడు రోజులుండి పోయారు!

'స్వామి రావాలే కాని అప్పయితే భయమా?' అనుకొనే శిష్యుడు గదా శర్మ!

మనకు తల్లులు ముగ్గురు. మనకు జన్మనిచ్చిన తల్లి కన్నతల్లి. మనకు పాలిచ్చి పెంచేది గోమాత. మూడవతల్లి జన్మభూమి.

ఈ ముగ్గురు తల్లులకూ మూలమైన తల్లి పరాశక్తి. ఆమె సాన్నిధ్యం యీ ముగ్గురిలోను వుంది. అణువణువులోను సర్వమంగళ సర్వసాన్నిధ్యం వహించిందా అన్నట్లు వుంటుంది. మనం మన కన్న తల్లికీ, గోమాతకూ, జన్మభూమికీ సేవ చేయాలి. అలా సేవ చేసేటప్పుడు ఆ జగన్మాత పరంగా ఆసేవల నందించాలి. పరాశక్తి సేవలు కోరదు. మాతకూ, గోమాతకూ, భూమాతకు, మీరు చేసే సేవలన్నీ నాకు చేసినట్లే అంటుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters