Paramacharya pavanagadhalu    Chapters   

64. బస్సు పంపిన బాంధవుడు

మద్దులపల్లి మాణిక్యశాస్త్రి గారు విజయవాడలోని ఒక కళాశాలలో వేదాంత పండితులుగా పని చేస్తుండగా ఆయనకు రెండు సంస్కృత గ్రంథాలతో పని పడింది. అవి ఎక్కడా దొరకలేదు. ఎవరో కంచి వారికి రాసి చూడమన్నారు. అలా రాయగా ఆ రెండు పుస్తకాలను పోస్టులో స్వామి ఆయనకు ఉచితంగా పంపారు. అప్పటికి శాస్త్రిగారు స్వామి వారిని కలవలేదు. వారిద్దరకూ పరిచయం లేదు.

జగద్గురువులు కాళహస్తిలో వుండగా మాణిక్యశాస్త్రి గారు వెళ్లి స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ సభలో దూరంగా కూర్చున్నారు. స్వామి బిగ్గరగా మాణిక్యశాస్త్రీ అని పిలిచి దగ్గరకు రప్పించుకొని మాట్లాడి పంపారు. ఆయన అది వరకు చూడకపోయినా శాస్త్రి గారిని ఎలా గుర్తించి పిలిచారో అర్థం కాదు.

గురువాయూరులో జయేంద్ర సరస్వతి చాతుర్మాస్యం చేశారు. అప్పుడు అక్కడ శాస్త్ర సభలను నిర్వహించారు. అందులో శాస్త్రిగారిని పరీక్షాధికారిగా నియమించారు. శాస్త్రిగారు వెంటనే భార్య శిష్యులతో బయలుదేరి వెళ్లారు. మధ్యలో దేనికో సమ్మె జరిగి బస్సులు నిలిచిపోయాయి. సకాలంలో గమ్యస్థానం ఎలా చేరటమా అనేది శాస్త్రిగారికి సమస్యగా మారింది. స్నానం, అనుష్ఠానం చేసుకోడానికి కూడా అక్కడ వలసి లేదు. అప్పుడు శాస్త్రిగారు శ్రీ పరమాచార్యను స్మరించి శాస్త్ర సభకు సకాలంలో చేర్చే బాధ్యత స్వామిదేనని ప్రార్థనా పూర్వకంగా మనసులోనే విన్నవించుకొన్నారు.

ఇంతలో ఎక్కడినుంచో ఒక బస్సు వచ్చింది. అది సరిగ్గా శాస్త్రిగారి బృందం నిలుచున్న చోటికి వచ్చి ఆగింది. అందులో పోలీసులున్నారు. ఆ బస్సులోని పోలీసు అధికారి శాస్త్రి గారిని చూసి తాము కాలడి వేపు పోతున్నామని, శాస్త్రిగారు తమతో రాదలచుకుంటే తీసుకుపోతామని చెప్పి ఎక్కించుకొని దారిలో గురువాయూరు దగ్గర దింపి వెళ్లారు!

శాస్త్రి గారికి స్వామి స్వప్న దర్శనం కూడా అనుగ్రహించారు తరువాత ఒకసారి.

Paramacharya pavanagadhalu    Chapters