Paramacharya pavanagadhalu    Chapters   

60. మంచే మతమైతే.......?

రష్యా దేశస్థుడు డాక్టర్‌ యస్‌.ఐ. తులాయేవ్‌ ఒకసారి స్వాముల వారిని దర్శించారు. ఆయనకు ఒక సందేహం కలిగింది.

''ఒక మనిషికి ఏ మతం మీదా నమ్మకం లేదు, ఏ కర్మకాండా చేయడు. గుడికీ, మసీదుకూ, చర్చికి పోవటం అసలే లేదు కాని ఎల్లప్పుడూ మంచి విషయాలనే ఆలోచిస్తాడు. మంచి మాటలే మాట్లాడుతాడు. మంచి పనులే చేస్తాడు. జీవితాంతంలో అతనికి మోక్షం లభిస్తుందా?'

ఇదీ ఆ రూసీ డాక్టరు గారి ప్రశ్న

స్వాముల వారు రెండు క్షణాలు ధ్యానంలో వున్నారు.

'లభిస్తుంది' - అని జవాబు చెప్పారు.

ఇంద్రియాలు మనకు ఆశాప్రేరకాలుగా వున్నాయి. కొన్ని ఆహారాలు రుచ్యంగా తోస్తాయి. కొన్ని వెగటుగా వుంటాయి. ఈ తేడా నాలుక తెచ్చి పెట్టింది. ఈ వ్యత్యాసాన్ని జయించి సమత్వం సాధించగలిగితే జిహ్వచాపల్యం పోతుంది. చాపల్యాన్ని జయించిన తరువాత ఏమి తిన్నా వొకటే, అన్నిటా సమబుద్ధికలుగుతుంది కనుక. అలా కాక ఒక పదార్థం యిష్టం, మరొకటి అయిష్టం అనిపించినన్నాళ్లూ ఆహార విషయంలో కట్టుబాట్లు తప్పవు. ఆ కట్టుబాట్లు జిహ్వ చాపల్యాన్ని జయించేందుకు దోహదం చేయాలి. ఇంద్రియాలపై జయం సాధించిన తరువాత ఆ నియమాలు తమంతట తామే జారిపోతాయి.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters