Paramacharya pavanagadhalu    Chapters   

55. నేనున్నది ఎందుకు?

అప్పుడు స్వాములవారు మాంబలంలో వున్నారు. రాత్రి పన్నెండు గంటలవరకూ గోష్ఠి జరుగుతూనే వుంది. అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారితో కలిసి అలా వేకువఝాము (5 గం. కావచ్చింది.) న స్వామి గోష్ఠి ముగించి దండం, కమండలం తీసుకొని బయలుదేరారు.

దారిలో ఒక స్త్రీ ఒక యువతినీ, చంటిపిల్లనూ తీసికొని గబగబా ముందుకు వచ్చింది. రాత్రంతా నిద్ర లేక కాలాతీతమైవుంటే, యిపుడు కూడ దర్శనాలా అని తాతాచారిగారికి చికాకు వేసింది. 'స్వాములవారికి విశ్రాంతి అక్కరలేదా?' -- అని ఆయన కాస్త కసిరారు. అయితే ఆవిడ ఆమాట వినిపించుకోలేదు. తమ కుమార్తె ఎక్స్‌ప్రెస్‌ బండిలో వెళుతున్నందున స్వామి ఆశీస్సులకై వచ్చానని ఆవిడ అన్నది.

తాతాచారిగారి కోపం, ఆవిడ ఓపిగ్గా తన పని తాను కానియ్యడం స్వామి గమనిస్తూనే వున్నారు. తాతాచారిగారిని వెళ్లి కొంచెం ప్రసాదం పట్టుకొని రమ్మని పంపారు.

స్వాముల వారావిడ చెప్పేదంతా విన్నారు. ప్రశాంతంగా ఆశీర్వదించి ప్రసాదం యిచ్చారు. ఆమె బ్రహ్మానందంతో మరలి పోయింది.

ఆమె వెళ్లిన తరువాత స్వామి యిలా అన్నారు.

భగవంతుని ముందు తమతమ బాధలను చెప్పుకుంటే బాధానివృత్తి అవుతుందని ప్రజలలో నమ్మకం వుంది. కాని ప్రజలకు దేవుడు కన్పించడు కదా! నాలో ఆయనను చూచుకొని, ఆ నమ్మకంతోనే అమాయకంగా వీళ్లు నా దగ్గరకు వచ్చి దేవునితో చెప్పుకొన్నట్లు నాముందు తమ గోడు వెళ్లబోసి కొంటున్నారు. తృప్తితో వెళుతున్నారు. చెప్పుకుంటే వినటానికేగదా! దానివలన ఈ శరీరానికి శ్రమ కలిగితే కలగనీ గాక, ఏమీ కొదవలేదు. నాకు ప్రజలు నమస్కరిస్తున్నారు, నన్ను భగవంతునిగా భావించి నాతో తమ బాధలు విన్నవించుకుంటున్నారు - దానిలో గొప్పయేమి లేదు. ప్రజలలో యీ మాత్రమైనా భగవచ్చింతన మిగిలింది అని నాకు సంతోషం. కనుక యీ పనికి ఎవరూ అడ్డు రాకుండా వుండటం మంచిది!

Paramacharya pavanagadhalu    Chapters