Paramacharya pavanagadhalu    Chapters   

54. హోటకేశ్వర గుహ

స్వాములవారు శ్రీశైలం వెళ్లారు ఒకసారి. ఆది శంకరులవారు శ్రీశైలం దర్శించారు. వారు హాటకేశ్వరం దగ్గరలో ఒకలోయలోకి మెట్లు దిగి పోయి, అక్కడ వున్న ఒక గుహలో పరదేవత నారాధించారు. ఆయన ఆ గుహలో సమాధినిష్ఠులై యోగసాధన చేశారు. పరదేవత సాక్షాత్కారాన్ని పొందారు.

శ్రీశైలం వెళ్లిన శ్రీ పరమాచార్యులు శంకరుడు తపస్సు చేసిన గుహ ఎక్కడ వున్నదో స్వయంగా కనుగొన్నారు. ఆ స్థలానికి ఆయన ఎవరూ దారి చూపించే అవసరం లేకుండా తానే పోయి అక్కడ గల పొదలు, తుప్పలు శుభ్రం చేయించి, ఎంతో కాలంగా అక్కడ మరుగుపడివున్న లింగాన్ని బయట పెట్టారు. అభిషేకాదులు నిర్వహించారు. అక్కడే ఆదిశంకరులు యోగతారావళి రచించినట్లు వారే తెలిపారు.

అదే విధంగా త్రిపురాంతకంలోగల శ్రీ చంద్రమౌళీశ్వరుని కూడ కనుగొని బయటపెట్టి అభిషేకాదులు నిర్వహించారు. వారి వలననే ఆ ప్రాచీన లింగమూర్తులు రెండూ నేడు భక్తులకు దర్శనం అనుగ్రహిస్తూ పూజకు నోచుకుంటూ వున్నాయి.

మనం సంఘంలో ఏ స్థానంలోనైనా వుండవచ్చు. మనం పనిచేసే రంగాలు వేరు వేరుగా వుండవచ్చు; అయినప్పటికీ మనలో ప్రతి వ్యక్తి కొంతకు కొంతయినా సమాజానికి సేవ చేయాలి. కష్టంలో వున్న వారికి, దుఃఖంలో వున్నవారికి, బాధ పడుతున్న వారికి, రోగులకు, బలహీనులకు సేవ చేయాలి. పరోపకారం పరమధర్మం. దాసత్వంలో తన వ్యక్తిత్వాన్నే మరచిన రామభక్త శిఖామణి ఆంజనేయుడు - ఆయన సేవా ధర్మానికి ప్రతీక. యావజ్జీవం పరులను ఉద్దరించటానికే పాటుపడిన శ్రీకృష్ణ పరమాత్మ - ఆయన పరోపకారానికై అవతరించాడు. వారు మనకు ఆదర్శం కావాలి.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters