Paramacharya pavanagadhalu    Chapters   

52. జన కళ్యాణ సారథి

కంచి కామకోటి పీఠాధిపతులుగా ప్రస్తుతం వున్న శ్రీ జయేంద్ర సరస్వతి పూర్వాశ్రమ నామం సుబ్రహ్మణ్య అయ్యర్‌. వీరు తంజావూరు జిల్లా తిరుళ్లిణికిలో 1935లో జన్మించారు. ఔచథ్యగోత్రీకులు. ఋగ్వేదీయులు. వడమశాఖ బ్రాహ్మణులు.

వీరి తండ్రిగారు మహదేవయ్యర్‌, తల్లి సరస్వతి. మహదేవయ్యర్‌ రైల్వేలో ఉద్యోగి. అయినా కుమారునికి ఇంగ్లీషు చదువులు చెప్పించకుండా ఎనిమిదవ యేట ఉపనయనం చేసి యజుర్వేద పాఠశాలలో పెట్టారు. ఆ రోజుల్లో విల్లుపురంలో మకాం చేసి వున్న శ్రీ చంద్రశేఖర సరస్వతిగారికి కుమారుని చూపించి అతనికి వేదాలు చెప్పించాలను కుంటున్నామని అందుకు స్వామి ఆశీస్సులు కావాలని అడిగారు. ముందు మూడేళ్లు వేదం చెప్పించి, తరువాత ఉపాధి కొరకు లౌకిక విద్యలు నేర్పించాలని తన అభిప్రాయంగా అయ్యర్‌ స్వామికి చెప్పారు. స్వామి బాలుని వంక ఒకసారి చూసి అయ్యర్‌తో 'ఈ బాలుని వరకు మాత్రం లౌకిక విద్య అవసరం లేదు. పూర్తిగా వేదాధ్యయనమే చేయించండి'. అని అదేశించారు. మర్నాడే కంచిలో కామాక్షి ఆలయ కుంభాభిషేకం వుంది. దానికి స్వామి వేదవిద్యార్థులను, గురవులనూ రమ్మన్నారు.

అది 1944 వ సంవత్సరం. అంతా కంచి వెళ్లి, కామాక్షి ఆలయ కుంభాభిషేకం దర్శించారు. అయ్యర్‌ కూడా తన కొడుకును తీసికొని వారి వెంట కంచి వెళ్లారు. తరువాత కుంభాభిషేకం జరిగిన రోజుననే స్వామివారి ఆశీస్సులతో, అమ్మవారి సన్నిధిలో శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్‌ ఋగ్వేదాధ్యయనం ప్రారంభమయింది. ఆయన అక్కడ 13 ఏళ్లు ఋగ్వేదం చదువుకొన్నారు.

ఆ సమయంలో ఒకసారి కంచి స్వామి మధ్యార్జునం వచ్చి వేద పాఠశాల విద్యార్థులందరికీ దర్శనమిచ్చారు. అప్పుడాయన సుబ్రహ్మణ్య అయ్యర్‌ను చూసి అతడిని 69వ పీఠాధిపతిగా స్వీకరించదలచినట్లు ప్రకటించారు.

మహదేవయ్యర్‌, సరస్వతిగారల అంగీకారంతో స్వామివారు ఆ బాలునికి పీఠ సంప్రదాయాది విషయాల్లో తగిన శిక్షణ యిచ్చే ఏర్పాటు చేశారు. రెండేళ్లు ఆయన తల్లితండ్రుల వద్ద వుండి ఆంగ్ల భాషను కూడ అభ్యసించారు.

1955 మార్చి 19 నుండి 22 వరకు సుబ్రహ్మణ్య అయ్యర్‌ ఆశ్రమ స్వీకారోత్సవం కంచిలో ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకు విశ్వేశ్వర సన్నిధిలో 'మహావాక్యాన్ని' ఉపదేశించారు. జయేంద్ర సరస్వతి అన్న సన్యాసనామంతో ఒక యోగపట్టాన్ని, ఒక రుద్రాక్ష మాలను స్వామి ఆయనకు అనుగ్రహించారు.

జయేంద్ర సరస్వతి దేశంలో ధార్మిక చింతన జరిగేలా చూడటం కోసం, లోక కళ్యాణం కోసం 'జన జాగరణ', 'జనకళ్యాణం' అనే రెండు కార్యక్రమాలను చేపట్టారు. మత ప్రచారంతో పాటు సంఘ సంస్కరణకు కూడ ఆయన పూనుకుంటున్నారు.

'జగత్తు అంతా మిధ్య' - అని నమ్మే అద్వైతులకు కార్యరంగంలో అలసత్వం పెరుగుతుందని కొందరంటారు. కాని ఈ మాటలు సరికావని చెప్పేందుకు ఆదిశంకరుల ఉదాహరణ చాలు. ఆయన పరమ అద్వైతి. అయినా ముప్పదిరెండేళ్ల వయస్సుకే ఆసేతు హిమాచలాన్ని కాలి నడకన చుట్టబెట్టారు. ఎందరితోనో వాదించి జయించారు. ఎన్ని యంత్ర ప్రతిష్ఠలో, మూర్తి ప్రతిష్ఠలో చేశారు. ఎన్నో స్తోత్రాలు, గ్రంథాలు రచించారు. మఠాలను స్థాపించారు. అలాగే విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్య స్థాపనకు బీజం వేసి పెంపొందింప జేశారు. శివాజీ మహారాజుకు స్ఫూర్తి నిచ్చిన గురువు సమర్థ రామదాస స్వామి గారు, తంజావూరులో నాయనార్ల రాజ్యస్థాపనకు కారణమయిన గోవింద దీక్షితుల వారు కూడా అద్వైతులే కదా!

ఈ విషయాలు తెలియని తెల్లదొరలు హిందువులు మాయావాదంలో పడి నిష్క్రియులై తురుష్కులకు రాజ్యం వొప్ప జెప్పారని ప్రచారం చేస్తున్నారు. కాని చరిత్రను నిష్పక్షపాతంగా చూస్తే నిజం వేరే వుందని తేలుతుంది.

మాయతో ఏకీభావం పొందకుండా, తనను సాక్షిమాత్రంగా భావించుకొని వ్యవహరించటం సాధ్యమే. అప్పుడు వారు లోక వ్యవహారంలో వున్నట్లు కన్పించినా, ఆ వ్యవహారాల్లో చిక్కుకొని విచారపడక, అందుకు అతీతంగా సాక్షిభూతంగా వుండటం వల్ల స్థిరమైన మనోబలం, చెదిరిపోని దేహబలం, తగిన ప్రణాళిక వేసుకొని పటిష్టంగా కార్యక్రమం ముగించగల నేర్పు వారికి అబ్బుతాయి.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters