Paramacharya pavanagadhalu    Chapters   

48. ఇదీ మన 'నీతి'

కంచిస్వామి వుపన్యాసాలలో చిన్న చిన్న కథలు వుండేవి. విషయాన్ని తేలికగా అర్థం చేసికోవడానికి యివి తోడ్పడేవి.

ఒకసారి స్వామి హిందువుల ప్రస్తుత పరిస్ధితిని వివరిస్తూ యీ కథ చెప్పారు: 1937లో మద్రాసులో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, రాజాజీ. ఒకసారి బాల నేరస్థుల విషయం ఆయన దృష్టికి వచ్చింది. 18 ఏండ్ల లోపలి పిల్లలంతా మైనర్లు కనుక వారు నేరాలు చేస్తే ఖైదులో వేయరు. తమ తప్పు తాము తెలుసుకొని వారు బాగుపడేందుకు వీలయిన శిక్షణను వారికి యిచ్చే స్కూళ్ల వంటి జైళ్లు వేరే వుంటాయి. వాళ్లను అందులో పెడతారు.

బ్రిటీషు ప్రభుత్వ హయాములో అలాంటి చోట్లకు వెళ్లి బాల నేరస్థులకు నీతి బోధ చేసే పనిని క్రైస్తవ మిషనరీలు చేస్తుండేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏమతం పిల్లలకు ఆ మతానికి చెందిన బోధకులు నీతి బోధ చెయ్యాలని ఏర్పాటు చేశారు. నీతి బోధ రోజు ఆ మతానికి చెందిన పిల్లలకు సెలవిస్తారు. మహమ్మదీయులు శుక్రవారం సెలవు కావాలని కోరారు. ఆరోజు ఒక కాజీ వచ్చి ముస్లిం బాలురను తీసుకొని ఒక మసీదుకు వెళ్లి నమాజు చేయించాడు. తరువాత నీతి బోధ మొదలుపెట్టారు.

క్రైస్తవులు ఆదివారం సెలవడిగారు. ఒక ఫాదరీ వచ్చి క్రైస్తవ బాలురను తీసుకొని చర్చికి వెళ్లి ప్రార్థన చేయించాడు. తరువాత నీతి బోధ ప్రారంభించారు. ఇక హిందువులు ఏవారం సెలవు తీసుకోవాలి? వీరికి ప్రత్యేకంగా ఒక వారమంటూ లేదాయే. సరే, మాకు ఆదివారం యివ్వండన్నారు. హిందూ బాలురను తీసికొని వెళ్లిన పెద్దమనిషి అంతగా పూజలూ, వాటిల్లో గురి లేనివాడేమో!, వారితో పాటు ఆదివారం మాట్నీ (సాయంత్రం - సినిమా)కి పోయాడు.

ఈ కథ చెప్పి స్వామి 'ప్రస్తుతం మన హిందువులున్న దయనీయ పరిస్ధితి యిది!' - అన్నారు.

దీనికి కారణం కూడా ఆయన చెప్పారు. మనదేశం తెల్లవారి పాలనలో వుండగా మనదేశస్థులను క్రైస్తవ మతంలోనికి మార్పిడి చేయించే ప్రయత్నాలు జరిగాయి. అందుకోసం ఇండియాకు వచ్చిన మిషనరీలు తాము ప్రయత్నాల గురించి ఇంగ్లాండుకు నివేదికలు పంపేవారట! అందులో ఒక నివేదికలో, 'ముందుగా భారతీయులకు తమ మతం అంటే అభిమానం లేకుండా చేయాలి. తరువాత వారిని మన మతంలో చేర్చుకునే ప్రయత్నం చేయాలి. వారికి తమ మతం అంటే అభిమానం పోతే మన పని నూటికి 50 వంతులు ఫలించినట్లే' అని వుంది. ఇంగ్లీషు చదువుల ధర్మమా అని ఆ మిషనరీ చెప్పినట్లు 50 శాతం పని ఫలించిందేమో!

అందుకే స్వామి యిలా అన్నారు: 'ఇతర మతాల వారిని చూచి మనం భయపడనక్కరలేదు. మన మతంలోనే వుంటూ మన మతం అంటే విశ్వాసం లేకుండా ప్రవర్తించే వాళ్ళ వల్లే మన మతానికి ఎక్కువగా హాని కలుగుతుంది'.

మనం ఇండియన్‌ కల్చర్‌, ఇండియన్‌ కల్చర్‌ అని ప్రసంగాలు చేస్తుంటాము. కాని వాస్తవంలో ఇండియన్‌ కల్చర్‌ అంటే ఏమిటి? జ్ఞానం ఎక్కుడున్నా వెళ్లి దానిని సముపార్జించుకొనే ప్రయత్నం చేయటం మన సంస్కృతి. ఆ ప్రయత్నంలో జిజ్ఞాసువు తన ప్రాణాన్ని వొడ్డటానికైనా వెనుదీయడు. అలాగే తన దగ్గరకు జ్ఞానాన్ని ఆర్థిస్తూ వచ్చిన వారు తనకు బద్ధ శ్రతువులయినా, వారు. శాస్త్ర ప్రకారం ఆ జ్ఞానాన్ని పొందే అర్హత కలిగిన వారయితే, తనకు తెలిసిన దానిని అరమరిక లేకుండా వారికి తెలియబరచటం కూడ మన సంస్కృతిలో భాగమే. మన సంస్కృతీ, సంప్రదాయాలలోని ఈ ఉత్కృష్టతను బృహదారణ్యకంలో చెప్పబడిన కేశిధ్వజుని వృత్తాంతం తెలియచేస్తుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters