Paramacharya pavanagadhalu    Chapters   

46. పట్టు పావడా

ఒకసారి స్వాములవారు అమ్మవారి పూజ చేస్తున్నారు. వందలాది ప్రేక్షకులు తన్మయత్వంతో అది వీక్షిస్తున్నారు. అమ్మవారి విగ్రహానికి కట్టిన పట్టుపావడాను చూసి ప్రేక్షకులలో వున్న ఓ చిన్నపిల్ల ముచ్చట పడింది. ఆ పావడా తనకు కావాలని ఆ పిల్ల అమాయకంగా తల తల్లిని అడిగింది. తల్లి 'తప్పు! అలా అనకూడదు. అది అమ్మవారి పావడా' అని నెమ్మదిగా మందలించి సముదాయించాలని చూసింది.

ఇంతలో పూజ పూర్తయింది. పూజ చూడటానికి వచ్చిన వారంతా బారులు తీరి స్వాముల వారి చేతిమీదుగా తీర్థం అందుకొంటున్నారు. ఎక్కడో ఓ మూలకూర్చున్న ఆ తల్లీ బిడ్డా కూడా లేచి తమ వరుసలో క్రమంగా ముందుకు రాసాగారు. వాళ్లు స్వామి వారి దగ్గరకు రాగానే స్వాముల వారు వారిద్దరిని ఆగమని చెప్పి అమ్మవారికి కట్టి వున్న పరికిణీ విప్పి చిరునవ్వుతో ఆ అమ్మాయికి యిచ్చేశారు. ఆ తర్వాత తీర్థం.

'మా అమ్మాయి నాతో చెప్పిన సంగతి స్వామి వారికెలా తెలిసిందా' అని ఆ తల్లి విస్తుబోతుంటే ఆ చిన్నారి ముఖంలో వెలిగే ఆనందరేఖల్లో అమ్మవారి లీలా విలాసం చూసి ఆనందిస్తున్నారు. స్వామి! అవును, అన్నెం పున్నెం ఎరుగని ఆ అమాయకబాల లోకన్న 'బాల' కోసం మరెక్కడో ఎందుకు వెదుక్కోడం?

అందుకే శ్రీ యామిజాల ఆయనను 'మానుషరూపేణ చరదైవం' (మనిషి రూపంలో సంచరించే దేవుడు) అన్నారు. నీలంరాజు వెంకటశేషయ్య గారు ఆయనపై తాను రాసిన పుస్తకానికి 'నడిచే దేవుడు' అని పేరు పెట్టారు.

అయితే స్వాముల వారెప్పుడు దైవం యెదుట దోసిలొగ్గి నిలుచునే దైవ సేవకుని వలెనే వున్నారు. కాని తానే దైవం అన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆయనకు అహంభావం లేక పోగా ఆయన సన్నిధిలోకి వెళ్లిన వారి 'అహం' కూడా దిగిపోయేది. నీలంరాజు వెంకటశేషయ్య గారు చెప్పినట్లు మొదటిసారి స్వాముల వారి దర్శనం చేసినప్పుడు 'యతి, పూజనీయుడు అన్న గౌరవ భావం మాత్రం ఉండినది. కొంతసేపు ఆయనతో సంభాషించిన తరువాత బయటకు వచ్చే సమయంలో నా అహంభావమంతా ఆయన వద్దే వదలి వచ్చాను'అన్న భావం స్ఫురిస్తుంది. ఆయనతో సంభాషించిన వారెవరికైనా.

Paramacharya pavanagadhalu    Chapters