Paramacharya pavanagadhalu    Chapters   

41. ఆకాశలింగం ముంగిట ఆచార్య స్వామి

చిదంబరంలో నటరాజస్వామి ఆలయం వుంది. ఇక్కడి లింగం ఆకాశలింగం అంటారు. నిజానికి అక్కడ ఒక గదిలో నటరాజమూర్తిగా శివుడున్నాడు. ప్రక్కనే మరో గదికి ఎప్పుడు తెరవేసి వుంచుతారు. టిక్కెట్టు తీసికొన్న వారికి మాత్రం తెర తీసి చూపుతారు. కాని అక్కడ ఏమీ వుండదు. అందుకనే చిదంబర రహస్యం అనే నానుడి పుట్టింది.

చిదంబరంలో స్వామికి బంగారు గోపురం వుంది. అర్చక స్వాములు కూడా బంగారు గొలుసులు ధరించి వుంటారు. చిదంబర క్షేత్రంలో ఆది శంకరాచార్యుల వారు యోగలింగం ప్రతిష్టించారు. ఆయన కాశీ నుండి తెచ్చిన 5 స్పటిక లింగాలలో అదొకటి. ఇంకొకటి కామకోటి పీఠంలో ప్రతిష్ఠించబడింది.

కంచికామకోటి పీఠాధిపతులలో 48వ గురువు అద్వైతానందబోధులు. ఈయన క్రీ.శ. 1166 నుండి 34 సం.ల పాటు కంచి కామకోటి పీఠాన్ని అలంకరించారు. శ్రీహర్షుని సమకాలికులైన వీరు శంకర విజయం, బ్రహ్మ విద్యాభరణం, గురు ప్రదీపిక శాంతి వివరణ మొదలయిన గ్రంథాలు రచించారు.

ఆయన చిదంబరంలో సిద్ధిపొందారు. దానితో కంచికామకోటి పీఠం గుర్తు అలా చిదంబరంలో శాశ్వతంగా వుండిపోయింది. అయితే 200 సంవత్సరాలుగా కంచికామకోటి పీఠాధిపతులు చిదంబర దేవాలయాన్ని దర్శించటం లేదు. అక్కడి అర్చకులు అందుకు తమ చేతుల మీదుగా విభూదినిస్తారు. పీఠాధిపతులు కూడా తాము స్వయంగా విభూతి తీసికోరాదని,, తామే యివ్వాలని వారు పట్టు పట్టేవారు. దానిని ప్రతిష్ఠకు భంగకరంగా భావించి ఆచార్య స్వాములు అక్కడకు వెళ్లడం మానేశారుట!

అయితే 1933 మే 18న శ్రీవారు చిదంబరం వెళ్లారు. అర్చకులు స్వాముల వారి యెడల ఎట్లా నడుచుకుంటారో ఏమోనని శ్రీమఠంలొ అందరికీ ఆందోళనగా వుంది. స్వాముల వారు మామూలుగానే తెల్లవారు ఝూమున లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానాలు పూర్తి చేసుకుని గుడి తలుపులు తెరచేవేళకి గుడి ముందున్నారు. అప్పటికి ముఖ్యులైన అర్చకులెవరూ యింకా గుడికి రాలేదు. గుడి తులపులు తీసిన అర్చకుడు బయటకు వచ్చి చూసేసరికి స్వాముల వారు నటరాజస్వామి కెదురుగా ధ్యానమగ్నులై నిల్చోని వున్నారు. అతడు కంగారుపడి వెంటనే ఇతర అర్చకులకు కబురు పంపాడు. అంతా ఆదరాబాదరా వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. స్వాముల వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పాలనే ప్రయత్నంలో వున్నామని, తీరా స్వాముల వారు వచ్చే సమయం తెలియనందున వారు వచ్చే సమయానికి తామంతా వచ్చి స్వాగతం నెరపే అవకాశం పొందలేక పోయినందుకు బాధపడుతున్నామని విన్నవించుకొన్నారు. స్వాముల వారు స్వామి దర్శనం ప్రధానం కాని స్వాగత సత్రారాలు కాదని వారిని తగువిధంగా అనునయించారు.

ఆ తరువాత స్వామి వారు సహస్ర స్తంభమంటపంలో చంద్రమౌళీశ్వరుని అర్చించారు. ఒక ప్రక్క శంకరులు ప్రతిష్టించిన యోగలింగం. మరో పక్క శంకరులు కంచి కామకోటి పీఠంలో నెలకొల్పిన మోక్షలింగం. రెంటినీ ఒకే పర్యాయం దర్శించుకొనే అవకాశం ఆ రోజు చిదంబర దేవాలయ అర్చకులకు, యాత్రికులకు కలిగింది.

ఈ రోజుల్లో కొందరు ఏదో పుస్తకంలోని వేదాంతం అరకొరగా చదివి 'ఆత్మను ఏదీ అంటదు, ఆత్మ దర్శనం కర్మ మార్గానికి చెందిన హోమాలతోను, కర్మకాండ (రిచుయల్స్‌) తోను సాధ్యం కాదు' - అని బ్రహ్మతత్వం గురించి ధారాళంగా చెప్పేస్తూ, తమ తమ అనుష్ఠానాలను గాలికి వదలి, తమను ఏదీ అంటని స్థితికి తాము చేరుకున్నట్లు భావించుకుంటూ వుంటారు. కాని అందరూ జనకులు కారు. ఎంతో అరుదుగా కోట్లలో ఒకనికి మాత్రమే ఈశ్వరానుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం అప్రయత్నంగా లభించవచ్చునేమో కాని అందరికీ అలా జరగదు. వేదాంతం అనుభవంలోకి రావటానికి ఎంతో సాధన అవసరం. అనుష్ఠానం, భక్తి, ఉపాసన మార్గాల ద్వారానే పూర్వకర్మం వల్ల అంటిన మనో వాసనలను తుడిచివేసుకోడానికి, ఆత్మ దర్శనానికి పట్టుదలతో,' శ్రద్ధతో నియమ పూర్వకంగా సాధన చేయాల్సి వుంటుంది. ముందు చిత్తశుద్ధి ఏర్పాడాలి. చిత్త ఏకాగ్రత నలవరుచుకోవాలి. ఆ తరువాతే ఆత్మతత్వ విచారం చేయగల పరిపక్వ స్థితి ఏర్పడుతుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters