Paramacharya pavanagadhalu    Chapters   

36. సంకట విమోచన సపోటాలు

ఒకసారి ఒక కుర్రవాడు చుట్టచుట్టు కొని పడుకున్న తాచుపాముపై పొరపాటున కూచున్నాడు. అయినా అదేం చిత్రమో, ఆ పాము ఆ పిల్లవాడిని ఏమీ చేయకుండా నెమ్మదిగా అవతలకు వెళ్లిపోయింది. మరోసారి ఆ పిల్లవాడే నదిలో స్నానం చేస్తూ మునిగి పోయాడు. అదృష్టవశాత్తు దగ్గరెవరో వుండి అది చూసి యీదుకుంటూ వెళ్లి అతణ్ణి రక్షించారు. ఇంకోసారి ఈనివున్న పందొకటి అతడి వెంబడి పడింది. ఏదో అదృశ్య శక్తి కృప వల్ల ఈసారి కూడా అతడే అపాయమూ లేకుండా బయటపడ్డాడు. ఇలా ఎన్ని గండాలో రావటం తేలిపోవటం జరిగాయి. ఈ గండాలు తప్పిపోవడానికి సపోటా పండ్లకు ఏదయినా సంబంధం వుందా?

మామిడిపల్లి అగ్రహారం (అమలాపురం దగ్గర)లో జగద్గురువులు పరమాచార్యకు చిట్టెన్నగారనే భక్తుని యింట భిక్ష. భిక్ష అయింతర్వాత స్వాములవారు చిట్టెన్నగారి వీధిగదిలో కూర్చున్నారు. భక్తులలో కొందరు వీధిలోనుండే నమస్కారం చేస్తున్నారు. మరి కొందరు బజారులోనే సాష్టాంగపడి స్వాములవారికి ప్రణామం చేస్తున్నారు. ఇంతలో స్వాములవారి శిష్యులూ, వృద్ధులూ అయిన శ్రీ సుబ్రహ్మణ్యంద్ర భారతిని నెమ్మదిగా పట్టుకొని లోపలకు తీసుకొని వచ్చాడు, ఆ వూళ్లోని బ్రాహ్మణులొకరు. ఆయన వెంట ఆయన కొడుకు ఆరేళ్ల వాడు కూడా వున్నాడు.

స్వామి వారా కుర్రవాణ్ణిచూసి 'నీకేమన్నా పద్యాలు వచ్చా' అని అడిగారు. అతడు 'ఆ!' అన్నాడు. 'చదువు'---స్వామి వారి ఆదేశం. అతడు బెరుకులేకుండా పోతనగారి భాగవతంలో ప్రహ్లాద చరిత్ర నుండి 'కంజాక్షునికి గాని కాయంబు కాయమే' అన్న పద్యం చదివాడు. ఆరేళ్ల కుర్రవాడా పద్యాలు చక్కగా చదువుతుంటే స్వాములవారికి ముచ్చటవేసింది. ఆ అబ్బాయి వొడిలో ఆయన వొక సపోటా పండు వేశారు. తరువాత యింకో పద్యం చదవమన్నారు. అతడు చదవటం, వీరు ఒక సపోటా వేస్తుండటం యిలా క్రమంగా అతని వొడి సపోటాలతో నిండింది.

ఇంతకూ వాళ్ల నాన్న ఆ అబ్బాయినక్కడకు తీసుకొని వచ్చింది ఎందుకంటే తనకు సంతానం పుట్టిపోతున్నారు కాని నిలవటం లేదు. వీడికయినా స్వామివారేదయినా రక్షకడతారేమో అడగాలని, అయితే అతనేదీ అడక్కుండానే ఆ పిల్లవానికి స్వామివారి ఆశీస్సులు వొడినిండా సపోటాల రూపంలో దండిగా లభించాయి.

ఆ తరువాత అతనికి మొదటచెప్పిన గండాలెన్నో వచ్చాయి కాని అతని సిగపూవువాడలేదు. స్వామివారు ఆనాడు అతని వొడిలో నింపిన సపోటాలు ఒక్కొక్కటి ఒక గండానికి అడ్డు కట్టా? ఏదయితేనేం, అతని భవిష్యత్తు ఆచార్యుల ఆశీస్సులతో పండింది.

ఆ కుర్రవాడే సుప్రసిద్ధ రచయిత, పండితుడు శ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రి, తెనాలిలో సాధన గ్రంథమండలి స్థాపించి శ్రీవారి ఉపన్యాసాలను పది సంపుటాలుగా ప్రచురించింది. వీరే. శంకరగ్రంథరత్నావళియని ఆది శంకరుల చరిత్రను, రచనలను కూడ 13 సంపుటాలుగా ఆయన వెలువరించారు.

భేరీ రెండు రకాలు, ఒకటి నగారా. రెండవది ఢంకా. రెండూ చర్మవాద్యాలే. పైన రెండూ వృత్తాకారంగా వుండేవే. నగారా వ్యాసం రెండడుగులు. కింద అర్ధవృత్తాకారంగా యినుముతో చేయబడ్డ పాత్ర వుంటుంది. ఢంకా వ్యాసము ఒక అడుగు. కింది భాగం చెక్కతో చేయబడింది. వీటిని డ్రమ్‌ బీటర్స్‌తో వాయిస్తారు. పక్కన పెద్ద జాలరా కూడ వుంటుంది. ఈ నగారా, ఢంకా, జాలరాలను లయబద్ధంగా, శ్రుతి శుద్ధంగా వాయించానికి మన శ్రీమఠంలో ఒక కుటుంబమే వుండేది. వారెవరు? తురుష్కులు! ఉడయార్‌ పాళెం జమిందార్లకు మన మఠంపై భక్తి ప్రపత్తులు ఎక్కువ. వారే ఈ తురుష్కులను ఈ సేవ చేయటం కోసం పంపారు. ఊరేగింపు సమయంలో గుర్రపుస్వారి కూడ ఈ తురుష్కులే చేసేవారు. వారు ఉర్దూలో తప్ప యితర భాషలు మాట్లాడలేరు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters