Paramacharya pavanagadhalu    Chapters   

30. పంచముఖేశ్వరుని పత్తా

శ్రీకాళహస్తి అనగానే వాయులింగ రూపంలో వున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి అందరికీ గుర్తుకు వస్తాడు. ఇక్కడి గర్భగుడిలో రెండు దీపాలు వెలుగుతూంటాయి. లింగానికి అటూఇటూ ఒకే ఎత్తులో ఒకే వరుసలో, ఒకటి ఎప్పుడూ నిశ్చలంగా వుంటే రెండోది ఎప్పుడూ గాలికి రెపరెపలాడుతుంటుంది. మృదువుగా, అందుకని అక్కడ వాయులింగం అంటారు.

అయితే అక్కడ ఎన్నో ఏండ్లుగా పంచముఖేశ్వర స్వామి ఆలయం వున్న సంగతి అక్కడ వారిక్కూడా తెలియదు. ఒకసారి 1932లో స్వామి కాళహస్తికి వెళ్లారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అయిన తర్వాత పంచముఖలింగేశ్వర స్వామి గుడియెక్కడ అని వాకబు చేశారు. చివరకు బ్రహ్మగుడి అని ఒక గుట్ట వుందని తెలిసింది. కాని ఆ గుట్ట మీద గుడి వుందో లేదో ఎవరికీ తెలీదు. స్వాములవారు పట్టువిడవలేదు. ఆ గుట్టపైకి ఎక్కి చెట్లతో, పాదాలతో మనిషిపోవడానికి వీలు కాకుండా వున్న ఆ గుట్ట మీది ప్రదేశాన్ని అంతా బాగు చేయించారు. అప్పడు అక్కడ ఒక గుడి బయట పడ్డది. దానిలో స్వాముల వారూహించినట్లే పంచముఖలింగేశ్వరస్వామి లింగరూపంలో వున్నాడు!

ఈశ్వరుడు అయిదు ముఖాలతో వున్న గుళ్ళల్లో నేపాల్‌ దేశంలోగల పశుపతినాధుని ఆలయం ఒకటి. ఖాట్మండులో వున్న ఈ గుడిలో నిజానికి నాలుగు ముఖాలే వున్నాయి. బయట ఇంకో చిన్నగుడి, దానిలో ఒక లింగం వున్నాయి. ఆ లింగంతో కలిపి పంచముఖాలని అంటారు. అందుకని ఆ గుడిలోని లింగాన్ని కూడా తప్పక దర్శించాలి. పసుపతినాదునితోపాటు. తిరువానైక్కావల్‌ లో కూడా యిటువంటి పంచముఖ లింగేశ్వరాలయాన్ని స్వాములవారే కనుగొని నిత్యం పూజ జరిగే ఏర్పాటు చేయించారు.

కాళహస్తిలోని పంచముఖలింగేశ్వరుని సేవించటానికి పోవాలంటే ఒక మండపం గుండా పోవాలి. మొదట ఆ చోటు కూడా పొదలు, తుప్పలతో చాల చికాకుగా వుంది. స్వాములవారి ఆదేశం ప్రకారం అవన్నీ శుభ్రం చేయగా అక్కడ వున్న మండపం బయటపడింది. అక్కడ వెనుక గోడపై నర్తన గణపతి, నటరాజు, శివపార్వతులు, భిక్షాటనామూర్తి శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడ్డాయి. ఒకప్పుడు ఇది నాట్యమండపం అయివుండవొచ్చని స్వాములవారన్నారు. కాళహస్తిలో ఆగమ శిల్పసదస్సును ఊరివారి సహకారంతో స్వాములవారు నిర్వహింపజేయటం ఆ స్థలం అనుభవించిన పురావైభవాన్ని తలపింపజేయటానికే కావచ్చు. ఈ సదస్సులో అప్పుడు రాష్ట్రమంత్రిగా వున్న ప్రస్తుత ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు పాల్గొన్నారు. కాంబోడియా దేశానికి చెందిన బౌద్ధభిక్షువు మహాదేవ ధర్మపరులు ఈ సదస్సులో పాల్గొనటం విశేషం.

Paramacharya pavanagadhalu    Chapters