Paramacharya pavanagadhalu    Chapters   

3. ఆమంత్రణ

వినయానికి ఆయన పెట్టింది పేరు. ఏమీ లేని విస్తళ్లెన్నో ఎగిరి పడుతూ ఉండే యీ రోజుల్లో అన్నీ వున్న ఆ విస్తరి అణగి మణగి వుండేది.

ఎవరు, ఎప్పుడు, ఏమి విన్నవించుకొన్నా సానుభూతితో వినటం, ఆ యిబ్బందులను తొలగించటానికి ఆశీఃపూర్వకంగా సాయపడటం ఆయనకు అలవాటు. తానున్నది అందుకే గదా! - అని గూడ ఆయన అనేవారు.

నిరాడంబరత్వం రూపందుకున్న నిరుపమాన వ్యక్తిత్వం ఆ మహర్షిది. కోరితే ఆయన అనుభవించలేని భోగం లేదు. కావాలని దరిద్రాన్ని వరించిన భాగ్యశాలి ఆయన. ఆదిశంకరుల వలె కాలినడకన ఆసేతుహిమాచలాన్ని ఆయన చుట్టివచ్చారు. వళ్లు చేస్తే పసి పిల్లవానికి అందం. వడలితే సన్యాసికి అందం - అని నమ్మిన నిత్యోపవాసి ఆమౌని.

అన్ని నదులూ సముద్రంలో కలిసినట్లు అన్ని మతాలు ఆ దేవ దేవుని దిక్కుగానే భక్తులను నడిపిస్తాయి అని అనుభవపూర్వకంగా గ్రహించిన ఆత్మజ్ఞాని ఆయన. అన్ని మతాల వారితోనూ, అన్ని దేశాల వారితోను వందనాలందుకొన్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనది.

నమ్రత, నిరాడంబరత, నిరంతరకృషి, నియమబద్ధ ప్రవర్తన - ఇవి ఆయన జీవితం మనకు నేర్పే పాఠాలు, ప్రేమ, సామరస్యం, శాంతి - ఆయన సందేశం.

'పరమాచార్య పావనగాథలు' ఆ మహనీయుని మహిమాన్విత జీవితానికి అద్దంపడుతున్నాయి. నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన ఆ జగద్గురువు జీవితం ప్రజలకు- ముఖ్యంగా యువతకు స్ఫూర్తి దాయకం.

ఆ పావనమూర్తి పవిత్ర గాథలను మనకందించిన శ్రీ భండారు పర్వతాలరావును, ఆ గాథలకు పుస్తకరూపం యిచ్చి సమర్పించిన నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ను అభినందిస్తూ, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.

హైదరాబాదు.

18-3-1994. - మిరియాల వెంకట్రావు.

Paramacharya pavanagadhalu    Chapters