Paramacharya pavanagadhalu    Chapters   

29. నా బాలాజీ యీయనే!

అది 1929వ సంవత్సరం. స్వామివారు ఏదో యాత్రలో వున్నారు. ఉత్తర ఆర్కాటు జిల్లా పొలిమేర గ్రామంలో ఒక సన్యాసి వచ్చి ఆయనను కలిశాడు. ఆ సన్యాసికి హిందీ, మరాఠీ తప్ప వేరే భాషారాదు. కాని ఆయనకు వచ్చిన ఇబ్బంది భాషతో కాదు. అంతకన్న పెద్దదే. అదీ స్వాముల వారొక్కరే తీర్చదగింది కూడా. 'నేను రామేశ్వరం వెళ్లాను. తిరిగి వస్తూంటే రైల్లో నా దండం పోయింది. మీరు నాకో కొత్త దండం యిప్పించండి!' అని ఆయన స్వామివారిని కోరాడు. సన్యాసికి దండం ముఖ్యం. అది పోతే కొత్త దండాన్ని మరో సన్యాసి చేత మంత్రింపించి మరీ స్వీకరించాలి అంతదాకా ఆయన భోంచేయటానికి వీల్లేదు.

ఎనభై ఏళ్ల వృద్ధుడైన ఆయనను చూసి స్వామి జాలిపడి ఆయనకో కొత్త దండం మంత్రించి ఇప్పించారు.

''మీరు నాకు కొత్త దండం యిప్పించి నా ఆశ్రమం నిలబెట్టారు. కనుక యిక నాకు మీరే గురువులు. నేను మిమ్మల్ని వదిలేది లేదు'--- అని ఆయన అప్పట్నించి స్వామితోనే వుండిపోయారు.

అదే సంవత్సరం స్వామికి మలేరియా జ్వరం వచ్చింది. అందులో చాతుర్మాస్యవ్రతాన్ని మనలూర్వేటలో నిర్వహిస్తున్నారు. జ్వరం తీవ్రంగా వుండటం స్వాములవారు లేచి నిలబడేందుక్కూడా వోపిక లేకుండా అయ్యారు. ఆయన ఆచార్యస్వామి కదా, ఆయనను తాకే సాహసం ఎవరికీ లేదు.

ఈ సన్యాసి సాహసించి స్వామివారి సేవకు పూనుకొన్నాడు. అలా ఆయనకు స్వామిసేవాధికారం సంప్రాప్తించింది.

పూర్వాశ్రమంలో ఆయన రెవెన్యూ శాఖలో పని చేసేవాడు. అందులోనూ దేవాస్‌ సంస్థానంలో, అందుకని ఆయనలో కాస్త పెత్తందారీ ధోరణి వుండేది. దానికి తోడు కోపిష్ఠి. దాంతో అందరికీ ఆయనంటే హడలుగా వుండేది.

రోజూ ఆయన స్వామివారికి పాదపూజ చేసేవాడు. పూజచేస్తున్నంత సేపూ ఎంతో తన్మయత్వం చెందేవాడు. భావోద్రేకంతో ఆయన చెంపల వెంట కన్నీరు కారిపోతుండేది. అలాటి పరిస్థితిలో ఆయనను వారించటానికి ఎవరి వశం అయేది కాదు. అయినా స్వాములవారు నిస్సంగులు. ఇవేవీ పట్టించుకొనేవారు కాదు.

ఒకసారి స్వాములవారిని చూడటానికి వచ్చే జనంలోవొకరు యీ రెవెన్యూ స్వామి బంధువు వున్నాడు. 'పాపం! ఆయన నూరేళ్ళ వృద్ధుడు. ఆయన అంతగా విమ్ములను ఆరాధిస్తుంటే మీరు అలా ముభావంగా వుంటారేమి?'-- అని స్వామివారితో వాదం పెట్టుకున్నాడు ఆ వచ్చిన చుట్టం. అయినా స్వామి పట్టించుకోలేదు.

ఒకసారి అంతా తిరుపతికి వెళ్ళారు. స్వామివారు తన శిష్యగణంతో తిరుమల మెట్లెక్కి వెళ్లి స్వామి దర్శనం చేసికొన్నారు. ఏం జరిగిందో ఏమోకాని ఈ రెవెన్యూ స్వామి దిగువ తిరుపతిలో వుండిపోయాడు. తీరా అంతా కొండ దిగిపోదాం అని బయలుదేరుతుంటే ఆ శతవృద్ధుడు రొప్పుతూ, రోజుతూ కొండ ఎక్కి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వెంటనే దేవాలయాధికారులు 'రండి! బాలాజీ దర్శనం చేసివద్దురుగాని'-- అని ఆయనపై వుండే గౌరవం కొద్దీ ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాని ఆయన విన్పించుకోలేదు.

వెంటనే స్వాములవారి పాదాలపై పడి, 'ఇదిగో! నా బాలాజీ ఇక్కడే వున్నాడు'--- అని చెప్పి దైవ దర్శనం చేయకుండానే స్వాములవారితో తిరిగి కొండ దిగి వెళ్ళిపోయాడు.

96 సంవత్సరాల వయసున 1945లో ఆయన సిద్ధిపొందారు. అంతవరకూ ఆయన పరమాచార్యను విడువలేదు. బహుశా స్వామే అనుగ్రహంకొద్దీ ఆయనను విడువలేదేమో!

ఏది ధర్మం? - అని నిర్ణయించటానికి మనకు ప్రమాణం ఏది? వేదం మనకు మొట్ట మొదటి ప్రమాణం. దాని పిదప స్మృతులు, ఆపైన ఋషుల నడవడి, తరువాత శిష్టాచారం. ఆఖరున మనస్సాక్షి. ఇదీ వరుస. ఇప్పుడు ఈ వరసంతా తల క్రిందులయింది. ప్రస్తుతం మొదటి ప్రమాణం మనస్సాక్షి. చిట్టచివర వేదం ప్రమాణం!

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters