Paramacharya pavanagadhalu    Chapters   

27. శ్వాన భక్తి

స్వాములవారి భక్తులలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, విదేశీయులు అన్ని వర్గాల వారు ఉన్నారు. ఆయన భక్తగణం కేవలం మానవులకే పరిమితం కాదు.

1927 ప్రాంతంలో మఠంలోకి ఎలా చేరిందో ఒక కుక్క చేరింది. మఠాన్ని ఆశ్రయించుకొని కొన్ని వూరకుక్కలు చేరటంలో విశేషం యేమీ లేదు. కాని యీ కుక్కకు ఒక ప్రత్యేకత వుంది; అది మఠంలో పెట్టిన ఆహారం తప్ప బయట ఎవరు ఏం పెట్టినా ముట్టేది కాదు!

స్వాముల వారు ప్రతి రోజూ మఠంలో పరిచారకుల్ని పిలిచి ఆ కుక్కకు అన్నం పెట్టారో లేదో తప్పక విచారించేవారు. స్వామి వారు పల్లకీలో ఏ వూరన్నా వెళితే యీ కుక్క విధిగా కింద నడిచేది. ఏ వూళ్లో నన్నా స్వాముల వారు ఆగితే అది అక్కడ ఆగిపోయేది. ఆయన బయలుదేరితే అదీ బయలుదేరి పల్లకీ తోటి సాగేది.

ఒక రోజెవరో పిల్లవాడు దానికి ఒక రాయి వేసి కొట్టాడు. అది 'బోయ్‌' మని వాడి వెంట పడింది. మఠం సిబ్బంది అది యిక అందరిని కరుస్తుంటుందేమోనని భయపడి, ఎలాగో దానిని పట్టుకొని కండ్లకు గంతలు కట్టి తీసుకునిపోయి, ఎక్కడో 20, 25 మైళ్ల అవతల వదిలి పెట్టి వచ్చారు. అయితేవాళ్లు మఠానికి తిరిగి వచ్చి చూస్తే అది ఆ సరికే మఠంలో వుంది!

ఆరోజు నుంచి అది యింకో కొత్త వ్రతం పట్టింది. ఇది వరకు కూడ మఠం వాళ్లు పెట్టిన ఆహారమే తినేది; ఇప్పుడు అంతే. అయితే దాని కొత్త నియమం ఏమిటంటే స్వాముల వారి దర్శనం చేస్తే కాని, అదిప్పుడు ఆహారం ముట్టటల్లేదు!

అలా ఆ కుక్క జీవితాంతం మఠంలోనే వుండి తన అంతిమ శ్వాస అక్కడే వదిలింది. స్వాముల వారు ఆ కుక్కను కారుణ్య దృష్టితో చూసే వారు, ఆయన కేవలం పై తొడుగును చూడరు కదా మనలాగా; లోపలి వస్తువును (బ్రహ్మపదార్థాన్ని) దర్శిస్తారు.

ఈశ్వర ప్రవాహంలో అలా అలా తేలిపో

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters