Paramacharya pavanagadhalu    Chapters   

18. ఆయనే అల్లా

స్వామి వారి భక్తులలో అన్ని మతాల వారూ వుండేవారు. 1920లో ఆయన వేదారణ్యం వెళ్లారు. అక్కడ సముద్రస్నానం చేశారు.

స్వామివారు వేదారణ్యంలో వుండగా ఆయనను ఒక ముస్లిం వృద్ధుడు వచ్చి చూశాడు. స్వామివారు కోరగా ఆయన మహమ్మదీయ మతానికి సంబంధించిన అనేక విషయాలను, ప్రవక్త బోధలను ఆచార్యులకు వివరించాడు. తరువాత బైటికి వచ్చి, ఆచార్యుల సన్నిధిలో వున్నంత సేపూ దైవసాన్నిథ్యంలో గడపినట్లు ఒక దివ్యానుభూతి కలిగిందన్నాడు.

1926లో స్వాములవారు పుదుక్కోట వెళుతుండగా మరో సన్నవేశం జరిగింది. కొందరు ముస్లింలు వచ్చి శ్రీవారి దర్శనం కోరారు. స్వామివారు అంగీకరించారు. వచ్చిన ముస్లిం సోదరులలో ఒకరు సంస్కృతం చదువుకున్నారు. ఆయన సంస్కృతంలో కవిత్వం కూడ చెప్పగలరు. వెంటనే ఆయన శ్రీవారిపై కొన్ని శ్లోకాలు రచించి స్వాముల వారికి సమర్పించాడు. ''నాదృష్టికి స్వామివారు అల్లా స్వరూపంగా కన్పిస్తున్నారు. మన పాపాలను పోగొట్టటానికి స్వాముల వారి దర్శనం చాలు!, అని ఆయన అన్నారు.

1927 లో ఇంకొక ముస్లిం భక్తుడు స్వాములవారిని ఈ రోడులో కలుసుకున్నాడు. కాగితంపై చిన్న చిన్న గళ్లతో శివలింగం లాగా గీసి అందులో స్వాములవారిపై తాను రచించిన సంస్కృత శ్లోకాలను రాసి స్వామికి సమర్పించారు. స్వామి వారాశ్చర్యపడి నీకు సంస్కృతంలో కవిత్వం చెప్పే కౌశల్యం ఎలా వచ్చిందని అడిగారు. దానికతడు తన తాత ముత్తాతలు సంస్కృత పండితులనీ, తన తండ్రి వద్ద తాను సంస్కృతం నేర్చుకొన్నానని స్వామివారికి చెప్పాడు. స్వామి వారది విని సంతోషించి, సంస్కృతంలో యింకా ఎక్కువగా కృషి చేయవలసిందిగా సూచించారు.

'మీరంతా నాలో భాగమే, నాకు ఆత్మ బలం అనుగ్రహించవలసిందని నేను దేవుని వేడుకొంటే దానర్థం మీ అందరికీ మేలు కలగాలనే. నేను ఏ ప్రార్థన చేసినా అది నా వొక్కడి కోసమే కాదు, లోక కళ్యాణం కోసమే'.

- పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters