Paramacharya pavanagadhalu    Chapters   

111. ముచ్చటగా మూడు సార్లు....

కంచి కామకోటి పీఠం 63వ ఆచార్యులు శ్రీ మహదేవేంద్ర సరస్వతికి తంజావూరు మహారాజు శర్ఫోజి 1801లో తంజావూరులో కనకాభిషేకం చేశారు. అప్పుడు 500 బంగారు ముద్రికలను వినియోగించారు. వాటి విలువ 1987లో వేసిన అంచనా ప్రకారం రూ.1.5 లక్షలు.

తంజావూరు రాజా శివాజీ కంచికామకోటి పీఠం 64వ శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (V) స్వామి వారికి 1838లోకుంభకోణంలో ఒకసారి, 1842లో తంజావూరులో రెండవసారి కనకాభిషేకం జరిపారు. ఆ మహరాజే 65వ ఆచార్యులు శ్రీ మహదేవేంద్ర సరస్వతి స్వామికి కూడ 1850లో కనకాభిషేకం జరిపారు.

కంచి పీఠం 65వ ఆచార్యులకు పుదుక్కోట సంస్థానాధిపతి రాజారామచంద్ర తొండమాన్‌ కూడా కనకాభిషేకం చేశారు.

పరమాచార్య (68వ ఆచార్యులు) కు 1957లో సెప్టెంబరు 6న చిన్న కంచిలో భక్తులు కనకాభిషేకం జరిపారు. 1965లో ఏప్రిల్‌ 11న శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి భక్తుల కోరికపై పరమాచార్యకు మదరాసులో రెండవ కనకాభిషేకం నిర్వహించారు.

పరమాచార్యుల శతజయంతి ఉత్సవాల సందర్భంగా 1993 మే 26న కంచి కామకోటి మఠంలో భక్తులు పరమాచార్యకు మూడవసారి కనకాభిషేకం జరిపారు.

శంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళి అయిదు స్పటిక లింగాలను తెచ్చారు. మార్కండేయ సంహితలో ఆ లింగాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించిందీ వివరించబడింది.

'శివలింగం ప్రతిష్ఠాప్య చిదంబర సభాతటే

మోక్షదం సర్వజంతూనాం భువనత్రయసుందరం

ముక్తిలింగం తు కేదారే నీలకంఠే వరేశ్వరం

కాంచ్యాం శ్రీకామకోటే తు యోగలింగ మనుత్తరం

శ్రీ శారదాఖ్యపీఠేతు లింగం తం భోగనామకం

కేదారంలో ముక్తి లింగాన్ని, నేపాల దేశంలో గల నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని, చిదంబర క్షేత్రంలో కనక సభలో మోక్షలింగాన్ని,శృంగేరీ శారదాపీఠంలో భోగలింగాన్ని, కాంచి కామకోటి పీఠంలో యోగలింగాన్ని ప్రతిష్ఠించటం జరిగిందని మార్కండేయ సంహిత చెబుతోంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters