Paramacharya pavanagadhalu    Chapters   

108. సాక్షాత్కారం

ఒకసారి స్వాముల వారు చెంగల్పట్టులో వుండగా ఆయనను పాల్‌ బ్రంటన్‌ వచ్చి దర్శించారు. ఆయన సుప్రసిద్ధ పత్రికా రచయిత. దర్శనం తరువాత కొంత సేపు స్వాముల వారితో మాట్లాడి ఆయన మదరాసుకు వెళ్లారు.

ఆ రోజు రాత్రి ఆయన బసలో ఆయనకు ఒక దివ్యానుభూతి కలిగింది. ఒకరాత్రి వేళ ఆయనకు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. గది అంతా చీకటి, అందులో ఏదో వెలుగు గోచరించింది. ఆ వెలుగులో ఎదురుగా పరమాచార్య కనిపించారు. స్పష్టంగా, ఏ పొరపాటుకు అవకాశం లేని విధంగా పరమాచార్య ముఖం, దేహం అన్నీ ఎదురుగా కన్పిస్తున్నాయి. 'ఆయనను చెంగల్పట్టణంలో వదలి వచ్చేశాను గదా, మళ్లీ యిక్కడికెలా వచ్చారు' అని బ్రంటన్‌ ఇది ఏదో భ్రమ అని గట్టిగా కళ్లు మూసుకున్నారు. అయినా ఆదృశ్యం అలాగే కళ్లు తెరిచి చూస్తున్నంత స్పష్టంగా కన్పిస్తూనే వుంది. ఆచార్యుల ముఖం చూస్తే దివ్యానుభూతి కలిగిందే కాని ఏదో దయ్యాన్ని చూసినట్లుగా ఆయన కనిపించలేదు. స్నేహ వాత్సల్యాలు పెల్లుబికే ఆచార్యుల సన్నిధిలో వున్న హాయిగొలిపే అనుభూతి కలిగిందాయనకు.

కాసేపటికి ఆదృశ్యం కరగిపోయింది. అయితే ఆ అనుభూతితో మనసంతా ఉత్సాహంతో ఉద్వేగంతో నిండిపోయింది.

ఈ విషయం బ్రంటన్‌ స్వయంగా రాసుకున్నారు.

కంచి కామకోటి పీఠంలో గల చంద్రమౌళీశ్వరులే శంకరులు కైలాసం నుంచి తెచ్చిన అయిదు స్పటికలింగాలలోని యోగలింగం. స్పటిక లింగం పరబ్రహ్మానికి చిహ్నం. అందులో ఏ రంగయినా ప్రతిఫతిస్తుంది. తురీయమైన శివానికి అది గుర్తు. చంద్రమౌళీశ్వరునికి ఒక కోవెల చాలదు. ఊరంతా ఆయన సొంతమే. ఊరే కాదు, దేశమంతా, 'ఊరూరూ తిరికి స్వామికి ఉత్సవం చేయండి' - అని శంకరులు మమ్ము అందుకే ఆదేశించారు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters