Paramacharya pavanagadhalu    Chapters   

102. విజయేంద్ర విజయం

పొన్నేరికి దగ్గరలో తండలం అని వొక చిన్న వూరుంది. ఆ వూళ్లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో బ్రహ్మశ్రీ ముక్కామల కృష్ణమూర్తి శాస్త్రి గారనే వేద పండితులొకరున్నారు. ఆయన నాలుగవ కుమారుడు శంకరం.

శంకరం చాలా చురుకైన కుర్రాడు. తంజావూరు, తిరుచినాపల్లి మొదలైన చోట్ల జరిగే వేద పరీక్షల్లో ప్రథమ బహుమతి ఏటా శంకరానిదే, అంతా ఏడేళ్లు చదివే ఋగ్వేదాన్ని ఆయన మూడేళ్లలో పూర్తి చేశాడు! ముసిరిలో జరిగిన వేద పరీక్షలో 48 వేద పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా అందులోనూ శంకరమే ప్రథమ బహుమతి పొందాడు.

ఒక సంవత్సరం కంచికామకోటి పీఠంలో నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. పండితులు వేద మంత్రాలు చదువుతుండగా ఏదోపొరపాటు దొర్లింది. శంకరం అక్కడే వున్నాడు. పెద్ద పెద్ద పండితుంలంతా అక్కడే వున్నా వారెవ్వరూ గమనించని ఆ పొరపాటును శంకరం లేచి జయేంద్ర సరస్వతికి విన్నవించారు. ఆయన అందుకా బాలుని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయన దృష్టిని శంకరం ఆరోజలా ఆకట్టుకున్నందుకు ఫలం ఆ తరువాత కొద్ది రోజులకే అతనికి లభించింది.

పరమాచార్య, జయేంద్ర సరస్వతి - యిద్దరూ శంకరం గురించి చర్చించుకున్నారు. తల్లిదండ్రుల్ని పిలిపించి మాట్లాడారు. తరువాత శంకరాన్ని 70వ పీఠాధిపతిగా ఎంపిక చేసిన సంగతి ప్రకటించారు.

1989 మే నెల 29వ తేదీన శంకరానికి శ్రీ జయేంద్ర సరస్వతి దీక్ష యిచ్చారు. అంతకు ముందు రోజు శంకరం సంప్రదాయం ప్రకారం చేయవలసిన కర్మకలాపం నిర్వహించాడు. రాత్రంతా గాయత్రీ మంత్రం జపించాడు. మరునాటి ఉదయం శ్రీకామాక్షి దేవి తటాకంలో వేలాది భక్తులు చూస్తుండగా శంకరం జయేంద్ర సరస్వతినే ఉపదేశంపొంది దీక్ష స్వీకరించారు. విజయేంద్ర సరస్వతి పేరు ధరించి కంచి కామకోటి పీఠానికి 70వ ఆచార్యులుగా అవతరించారు. కాషాయ వస్త్రాలు ధరించి తటాకంలో నుండి బయటకు వస్తున్న విజయేంద్ర సరస్వతిని చూసి 'మళ్లీ ఆదిశంకరులు దిగి వచ్చారా' అని జనం ఆశ్చర్యపోయారు.

Paramacharya pavanagadhalu    Chapters