Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

27. మార్కండేయో పాఖ్యానము

హరిహరా భేదము :-

మార్కండేయోపాఖ్యానము ద్వాదశ స్కంధాంతమందు కలదు. భాగవతారంభమున పోతన తాను మహేశ్వర ధ్యానము సేయగా శ్రీరాము డగుపించి, శ్రీకృష్ణ చరితమైన భాగవతమును వ్రాయుమని కోరెను. ఇట్లు హరిహరులకు అభేదమని సూచించెను. మార్కండేయోపాఖ్యానమున ఈ అభేదభక్తియే గానవచ్చుచున్నది.

మృకండు డను మహర్షి బ్రహ్మచర్య వ్రతుడై సంతానార్ధియై మరిం దలంచుచు తప మొనర్పగా హరిహరులు ప్రత్యక్షమై వరం బడుగుమనిరి. అతడు గుణాఢ్యుడగు కుమారుని వరముగా కోరెను. అమ్మునికి మార్కండేయు డుదయించెను. మార్కండేయుడు నియమ నిష్ఠాగరిష్ఠుడై యుండ మృత్యు వతని పాశబద్ధు జేసెను. మృత్యువును ధిక్కరించి పదివేల హాయనములు తపంబు జేసెను. అంత శ్రీహరి దర్శన మిచ్చి శరీరముతోడనే అనేక యుగములు బ్రదుకునట్లు వరమొసంగెను.

మార్కండేయుడు శివపూజ చేయుచు హరి స్మరణము చేయమరచెను. నూరు సంవత్సరములు వర్షము గురిసి అంతయు జలమ యంబై అంధకార బంధురమయ్యెను. జల మధ్యంబున వటపత్రశాయి యగు బాలుని గని అతని శరీరము ప్రవేశించి చాలకాలముండి అతని చరణారవింద సంస్మరణంబున బయట పడెను. అంత బాలు డంతర్థాన మందెను. మార్కండేయుడు తన ఆశ్రమమున తపము సేయుచుండగ శంకరుడును పార్వతియు అతని జూడ వచ్చిరి. తపోనిష్ఠలో నున్న అతని హృదయాంతరమున దర్శనమిచ్చిరి. ముని వారిని స్తుతించెను. పరమ శివుడాతనిని పరమ శైవుండని పొగడెను. అంత మార్కండేయుడు ''దేవా ! హరిమాయా ప్రభావంబు దుర్లభంబు. అయ్యది భవత్సం దర్శనంబునన్‌ గంటి'' నని తెల్పెను. నారాయణ చరణాంబుజ ధ్యానమును మృత్యుంజయమును వరములుగా గోరెను. కల్పకోటి పర్యంత మాయువును ప్రసాదించి పురుషోత్తముని యనుగ్రహము కలుగునని శివుడు దీవించెను.

ఈ కథలో శివకేశవు లిద్దరు మార్కండెయుని అనుగ్రహించిరి. రుద్రమునందు రుద్రుడు సర్వాంతర్యామిగా అన్నిటియందున్నట్లు చెప్పబడినది. విష్ణు వనగా సర్వాంతర్యామి యగు జగత్రయము వ్యాసించిన వాసుదేవుడు. ''నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి'' యని కోరబడినది. అందువలననే ఈ కథ హరిహర అభేదమును సూచించుచున్నది.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters