Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

10. పరీక్షిత్తు శాపము

భాగవత అవతరణము:-

7 దినములలో ముక్తి

అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు దశమాస వయస్కుడై తల్లి గర్భమున నున్నప్పుడు అశ్వత్థామ ''అపాండవ మగుగాక'' అని బ్రహ్మాస్త్రము ప్రయోగించెను. ఆ బాణానలము గర్భస్థ శిశువగు పరీక్షిత్తుని దహింప మొదలిడెను. అంత శిశు విట్లు దిగులు చెందెను.

ఉ|| కుయ్యిడ శక్తిలే దుదర గోళము లోపల నున్నవాడ, ది

క్కెయ్యది? దా ననాథనని ఎప్పుడు దల్లి గణింప విందు, నే

ది య్యిషు వహ్ని వాయుటకు నెయ్యది మార్గము? నన్నుగావ నే

యయ్య గలండు? గర్భజని తాపద నెవ్వడెఱుంగు? దైవమా!

భాగవతము 1-280

క|| చిచ్చర కోల వశంబున

జచ్చి బహిర్గతుడ గాని సమయమునను దా

నుచ్చలిత గర్భ వేదన

జచ్చును మాతల్లి గర్భ సంతాపమునన్‌.

భాగవతము 1-281

అని పరీక్షిత్తు విలపించెను.

అంత కృష్ణుండు కనికరించి ''డింభకుని పరితాప విజృంభణంబు నివారించి, గర్భంబు గందకుండ అర్భకునకు ఆనందంబు గల్పించెను.'' గద జేబట్టి బాణానలము నుపశమింప జేసి అదృశ్యుడయ్యెను.

మ|| గదజేబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్‌ గ్రూర శు

క్ప్రదమై వచ్చు శరాగ్ని దుత్తుమురుగా భంజించి రక్షించె, నీ

సదయుం డెవ్వడోకో? యటంచు మదిలోజర్చించుచున్‌ శాబకుం

డెదురైచూడ సదృశ్యుడయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా!

భాగవతము 1-287

పై విధముగా తన్ను రక్షించి అదృశ్యుడు కాగా పరీక్షిత్తునకు విష్ణురాతుడను నామము సిద్ధించెను.

చ|| ప్రకటితదైవ యోగమున బౌరవ సంతతి యంతరింపగా

వికలత నొందనీక బ్రభవిష్ణుబు విష్ణు డనుగ్రహించి శా

బకు బ్రతికించె గావున నృపాలక శాబకుడింక శాత్రవాం

తకుడగు విష్ణురాతు డన ధాత్రి బ్రసిద్ధికి నెక్కు బూజ్యుడై.

భాగవతము 1-289

తల్లి గర్భము నుండి వెలువడిన తరువాత గర్భమున తాను దర్శించిన భగవంతుని విశ్వమున నెల్లెడ బరీక్షింప బూనుట చేత పరీక్షితుడను నామమును బొందెను.

క|| తనతల్లి కడుపు లోపల

మును సూచిన విభుడు విశ్వమున నెల్ల గలం

డనుచు బరీక్షింపగ జను

లనఘు బరీక్షిన్నరేంద్రు డంద్రు మునీంద్రా!

భాగవతము 1-296

ఆతడు యుక్త వయస్కుడైన తరువాత పట్టాభిషిక్తుడై కలిని నిగ్రహించి ధర్మపరిపాలనము సేయదొడగెను. ఒకనాడు ఆ రాజు వేటకైవెడలి మృగంబుల వెంబడించుటచే బుబుక్షా పిపాసలవలన పరి శ్రాంతుడయ్యెను. నీటికై వెదకుచు అతడొక తపోవనము జొచ్చెను.

అచట

సీ|| మెలగుట సాలించి, మీలితసేత్రుడై.

శాంతుడై కూర్చుండి, జడత లేక,

ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల

బహిరంగ వీధుల బారనీక,

జాగరణాదిక స్థానత్రయము దాటి,

పరమమై యుండెడి పదము దెలిసి,

బ్రహ్మభూతత్వ సంప్రాప్తి విక్రియుడయి,

యతిదీర్ఘజడలు తన్నావరింప,

తే|| నలఘు రురుచర్మధారియై యలరుచున్న

తపసి'' ని బొడగనియెను. భాగవతము 1-458

నిమీలితనేత్రుడై కామాద్యరిషడ్వర్గ లయముచేత శాంతుడై పంచేంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి వీనిని నియమించి జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు దాటి బ్రహ్మసమాధిలో బాహ్యమును మరచిన శమీకుడను మునిని గాంచెను. విస్తృత బాహ్యాంత రింద్రియ కృత సంచారుడగు శమీకుని త్రాగుటకు నీ రొసంగుమని రాజు కోరెను. ముని బదులు పలుక నందున నతనిని గర్విష్ఠిగా రాజు తలపోసి రోషమున చచ్చిన పామును ముని మెడలో వ్రేలాడవేసి వెడలి పోయెను.

ఈ విషయమును శమీకుని కుమారుడైన శృంగికి సమీపవర్తనులైన మునికుమారులు తెలుపగా నతడు మిగుల కోపించి ''పరీక్షిత్తు ఏడవనాడు తక్షకవిషముచే మరణించు''నని శాపమిడెను. శమీకుడు సమాధినుండి లేచిన తరువాత కుమారుడు రాజును శపించిన విషయము తెలిసికొని వానిని మందలించి రాజుకు శాప విషయము తెలియజేసెను.

పరీక్షితుడు విప్రశాప మెరిగి అర్ఘకామముల సన్యసించి ముక్త సంగు డయ్యెను. తాను గర్భస్థశిశువుగా నున్నపుడు బ్రహ్మాస్త్రబాధనుండి శ్రీహరి ఆతనిని రక్షించెను. బ్రాహ్మణుడగు అశ్వత్థామ చేసిన ప్రయోగము నిరర్థక మయ్యెనుకదా? ఇపుడు పరీక్షితుడు శ్రీహరిని ప్రార్థించి శృంగి శాపమునుండి విముక్తుని చేయుమని వేడుకొనలేదు. చిత్తము గోవిందపరాయత్తము గావించి ప్రాయోపవిష్ణు డయ్యెను. అతని కడకు శుకమహర్షి ఏతెంచి సప్తాహముల భాగవత పారాయణము గావించి పరీక్షిత్తునకు ముక్తి చేకూర్చెను.

ఈ కధ భాగవత అవతరణమునకు మూలకారణము. ఇందు గమనింపదగిన విషయములు రెండు.

1. శమీకుడు కామాద్యరిషడ్వర్గ లయముచే శాంతుడై, పంచేంద్రియములు ప్రాణము బుద్ధి మనస్సులను నియమించి, అవస్థాత్ర యమును దాటి, బ్రహ్మసమాధిలో బాహ్యమును మరచియుండెను. అట్టి తపోబల సంపన్నునిపై మృతసర్పము వైచి అవమానించుటయే శాపకారణమయ్యెను. భాగవతాపచారము ఎంతవారికైన ముప్పు కలిగింపక మానదు. మృత సర్పమును వైచిన పరీక్షితుడు కాలసర్పము వాత బడవలసి వచ్చెను కదా !

2. అర్ధ కామముల సన్యసించిన పరీక్షితుడు. ''సప్తాహంబుల ముక్తి కేగెడి గతిం చర్చించి భాషింపరే'' యని మునులను కోరెను. సప్త భూమికలైన పంచేంద్రియములు మనస్సు బుద్ధినిదాటి ఏడు దినములలో ముక్తిని బొందు మార్గమును శుకుడు బోధించెను. ఈముక్తి మార్గమే క్రింద చూపబడినది. భాగవత సారభూతమైనది.

పరీక్షితునకు శుకుడు తొలుత ఖట్వాంగుడు ముక్తి బొందుటను వివరించెను. సప్త ద్వీపముల బాలించు ఖట్వాంగ మహారాజును రాక్షసులతో బోరుటకై తనకు సహాయము రమ్మని ఇంద్రుడు కోరెను. ఆ రాజు రాక్షసులను జయించి దేవతలకు సహాయ మొనర్చెను. దేవతలు అతని యెడ ప్రసన్నులై వరము కోరుమనిరి. దాని కతడు తన మరణకాలము తెలుపమని వేడెను. మరణమునకు ఒక ముహూర్త కాలము మాత్రమే ఉన్నదని దేవతలు తెలిపిరి. వెంటనే ఖట్వాంగుడు భువి కేతెంచి విరాగియై గోవిందనామ కీర్తనము జేసి ముక్తిని రెండు గడియల కాలములో పొందగలిగెను. రెండు గడియలలో ముక్తి గాంచిన ఖట్వాంగుని కథ తెలిపి ఏడు దినములలో ముక్తిని సాధించుట కష్టము కాదని శుకుడు పరీక్షితునకు ఇట్లు తెలిపెను.

''వినుము నీకు నేడు దినంబులకు గాని జీవితాంతంబు గాదు. తావత్కాలంబునకున్‌ బారలౌకిక సాధన భూతంబగు బరము కల్యాణంబు సాధింపవచ్చు.''

1) వైరాగ్యము :-

''అంత్యకాలము డగ్గరినన్‌ బెగ్గడిలక దేహి దేహపుత్ర కళత్రాది సందోహంబు వలని మోహ సాలంబు నిష్కామ కరవాలంబున నిర్మూలనంబు సేసి''

అనగా మరణ మాసన్న మయ్యెనని భయపడవలసిన పని లేదు. వైరాగ్య మవలంబించుట కర్తవ్యము. జీవితమున నిష్కామ కర్మాచరణముచే కర్మసన్యాసియై మరణ మాసన్నమైనపుడు సర్వకర్మలను సన్యసించవలెను. శుకుఢు అర్ధ కామముల సన్యసించెను. భాగవత ధర్మమును పాటించెను. బంధు మిత్ర కళత్రాదులపై మోహమును వదలెను.

2) తారకవిద్య :-

''గేహంబు వెడలి పుణ్యతీర్థ జలావగాహంబు సేయుచు నేకాంత శుచి ప్రదేశంబున, విధి వత్ర్పకారంబునన్‌ గుశాజిన చేలంబుల తోడ గల్పితాసనుండై మానసంబున నిఖిల జగత్పవిత్రీకరణ సమర్థంబై అకారాది త్రివర్ణ కలితంబై బ్రహ్మబీజంబైన ప్రణవంబు సంస్మరించుచు వాయువుల జయించి.''

అనగా వాయువును జయించుటకు తారకవిద్య, లేదా, ప్రాణ గత్యాగతి ప్రత్యవేక్షణము, లేదా అజపావిద్య లేదా క్రియాయోగము మొదలగు నామములతో చెప్పబడు క్రియను అనుష్ఠించి వాయువును జయించవలెను.

పై క్రియా విధానమును ఇంతకు ముందు పేజీలలో ధ్యాన యోగమునందు పూర్తిగా వివరించితిని. బాహ్య సాధనములు, ఆహార నియమము. అభ్యాసవిధానము విపులముగా తెలుపబడినవి. ఇట్టి యోగాభ్యాసరతుడు గొప్పవాడు.

శ్లో|| తపస్విభ్యోధికో యోగీ, జ్ఞానిభ్యోపి మతోధికః.

కర్మిభ్య శ్చాధికో యోగీ, తస్మాత్‌ యోగీ భవార్జునః

యోగియైనవాడు తపస్సుచేసిన వారికంటెను, శాస్త్రార్థ పాండిత్యము కలవారికంటెను, కర్మనిష్ఠుల కంటెను అధికుడు. అందు వలన యోగివి కమ్ము.

ఈ యోగములో బ్రహ్మబీజమైన ప్రణవమును స్మరించమని చెప్పబడినది. సోహం'' భావనలో సోలోని ''ఓ కారము'', ''హం'' లోని ''మ'' కారము కలిసి ఓంకారమగుచున్నది. ఈ అభ్యాసి హంసోప నిషత్తులో తెలిపిన దశవిధ నాదములు వినును. కటపటి నాదము ఓంకారమే.

వాయువు ''హకారేణ బహిర్యాతి సకారేణ విశేత్పునః'' అని చెప్పబడినది. ఈ తారకవిద్య ''మనశ్శుద్ధి కారకము''

క|| తారక యోగము దెలియగ

నేరక వేదాంతవాక్య నికురంబముచే

ఊరక చెడిపోదురని సీతారామాంజనేయ సంవాదము హెచ్చరించుచున్నది.

ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో

మానసము గూర్చి వానితోడ

హంసయనగ నొప్పు నక్షరద్వయము యో

చించి సంతతము భుజింపవలయు.

ఇట్టి యోగముతో వాయువుల జయింప వచ్చునా? ఇది సాధ్యమేనని రమణ గీత తెలుపుచున్నది.

క|| మానసముచేత జల్పెడు

ప్రాణంపుం బ్రత్యవేక్ష బ్రాణనిరోధం

బౌ; నిటుల ప్రత్యవేక్షణ

గా నెల్లప్పుడు కుంభకము సిద్ధించున్‌ రమణగీత

3) వృత్రాసురవధ

''విషయంబుల వెంట నంటి పారెడి యింద్రియముల బుద్ధి సారధియై మనో నామకంబులైన పగ్గంబుల బిగ్గబట్టి మ్రొగ్గం దిగిచి''

ఇంద్రియ వృత్తుల నిరోధించుట ప్రధమ కర్తవ్యము. ''తస్మా దింద్రి యాణ్యాదౌ నియమ్య భరతర్షభః'' భాగవతములోని వృత్రాసురవధ సంకేతార్థము ఇంద్రియ వృత్తుల నిరోధమేనని చిత్రకేతూ పాఖ్యానమున నిరూపించితిని. కామమునకు అధిష్ఠానము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. అందువలన ఇంద్రియముల నియమించుట ప్రథమ కర్తవ్యము.

4) ఆంగిరసులకథ :-

''దట్టంబులైన కర్మఘట్టంబుల నిట్టట్టు మెట్టెడి మనంబును శేముషీ బలంబున నిరోధించి'' వేదమునందలి ఆంగిరసుల కథకు సంకేతార్థము మనోవృత్తుల నిరోధమని అరవిందులు సూచించిరి.

భగవద్గీతలో ''ఆత్మసంస్థం మనః కృత్వా

నకించదపి చింతయేత్‌''

అని చెప్పబడియున్నది. ఆత్మయందు మనస్సుంచుట యనగా నేమి? ఆలోచనల సమూహమే మనస్సు. ఈ మనస్సు ఆత్మనుండియే వెడలుచున్నది. అనగా ఆలోచనల నాపినచో మనస్సు ఆత్మయందు చేరినట్లే. ఇదియే నిజమైనమౌనము. మనోవృత్తుల నిరోధము ద్వితీయ కర్తవ్యము. ''అందువలన నకించిదపి చింతయేత్‌'' అని చెప్పబడినది. దీనివలన మనోలయము సిద్ధించును. తరువాత మనో వినాశమునకై ప్రయత్నించవలయును. లయ వినాశములగూర్చి ముందుగా తెలిపి యుంటిని.

5) అవయవయోగము:-

''భగవదాకారంబుతో బంధించి నిర్విషయంబైన మనంబున భగవత్పాదా ద్యవయవంబులన్‌ గ్రమంబున ధ్యానంబు సేయుచు''

కపిలుడు తల్లియైన దేవహూతికి సాంఖ్యమును తెలిపెను. ఆమె దానిని గ్రహింపజాలదయ్యెను. అంత కపిలుడు శ్రీహరి దివ్యమంగళ విగ్రహమును మనంబున నిలుపుకొనుమని ఉపదేశించెను.

శ్లో|| ఏకైక శోంగాని ధియా విభావయేత్‌

పాదాది యావత్‌ వసితం గదాభృతః

జితం జితం స్థావ మపోహ్య ధారయే

త్వరం పరం శుద్ధతి ధీర్యథా యథా

భాగవతము 2-2-14

మ|| విమలఁబై పరిశుద్ధమై తగు మనో విజ్ఞాన తత్త్వ ప్రబో

ధమతిం నిల్పి తదీయమూర్తి విభవ ధ్యానంబు గావించి చి

త్తము. సర్వాంగ విమర్శన క్రియలకుం దార్కొల్పి ప్రత్యంగమున్‌

సుమహా ధ్యానము సేయగా వలయుబో బుద్ధాంత రంగంబునన్‌

భాగవతము -2-2-14

త్యాగరాజు కూడ ''నీ నగుమోము గనలేని నాజాలి తెలిసితే'' అని శ్రీరాముని దివ్యమంగళ విగ్రహము మనః ఫలకమున నిలుపుటకై జాలిపొందెను కదా. ''ఎందరో మహానుభావులు'' అను పాటలో

''హొయలు మీరు నడలుగల్గు పరముని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై మనంబునను యశంబు గలవా'' రెందరో మహానుభావులని వ్రాసెను.

భగవంతుని రూపమును మనస్సున నిల్పుకొనుటకే మానసిక మైన షోదశ ఉపచారములు ''మృత్యుంజయ మానసిక పూజ'' మొదలగునవి శంకరాదులచే రచింప బడినవి. వీని వలన మనస్సునందు భగవద్రూపము నిలిచి ధ్యానము ధారణ సిద్ధించును. అందులకే పోతన భాగవతమున భగవద్రూపమును సీస పద్యములలో అనేక పర్యాయములు వర్ణించెను.

తరువాత భాగవతమున శ్రీహరి ప్రత్యేక అవయవములు వర్ణింపబడినవి. అనగా ఒక్కొక్క అవయవమును మనస్సున నిలుపుకొనుచు తుదకు శ్రీహరి దివ్యమంగళ విగ్రహమును మనః ఫలకమున నిలుపుకొనుట అవయవయోగ మనబడును. ఈ యోగమును దేవీగీత చక్కగా వర్ణించినది.

శ్లో|| దిక్కాలా ద్యవచ్ఛిన్నం దేవ్యాం చేతో నిధాయచ

తన్మయో భవతి క్షిప్రం జీవబ్రహ్మైక్య యోజనాత్‌

దిక్కులు కాలము మొదలగు వానితో (Space and time) పరిమితి నొందని సచ్చిదానంద పరమేశ్వరియగు నాయందు చిత్తము నిలిపి జీవపరమాత్మల కేకత్వము భావించుట వలన సాధకుడు తన్మయుడగు చున్నాడు. అనగా సాధకుడు బ్రహ్మాకార చిత్తవృత్తి నలవరచుకొనవలయును. ఇది సులభ సాధ్యముకాదు.

శ్లో|| అధవా సమలంచేతో యది క్షిప్రం నసిధ్యతి

చిత్తము మలయుక్త మగుటచేత నిరుపాధికము నిర్గుణము అగు నాయందు దానికి నిలుకడ కలుగదేని -

శ్లో|| తదావయవ యోగేన యోగీ యోగాం త్సమభ్యసేత్‌

మదీయ హస్త పాదాదా వంగేతు మధురే నగ

చిత్తం సంస్థాపయే న్మంత్రీ స్థాన స్థాన జయా త్పనః

విశుద్ధ చిత్త స్సర్వస్మిన్‌ రూపే సంస్థాపయే న్మనః

అప్పుడు అవయవములు నాకున్నట్లు భావించవలయును. మంత్ర సాధకుడు చిత్త మాలిన్యము తొలగించు అతి సుందరములగు నా పాదకమలములు మొదలగు అవయవములలో ఒక్కొక్క అంగమునందు చిత్తము నిలిపి, ఆ అవయవము చిత్తమునకు స్వాధీనమైన పిదప మరియొక అవయవమునందు చిత్తము నిలుపవలెను. ఇట్లు ఒక్కొక్క అవయవమునందు చిత్తము నిలిపి ధ్యానించుచుండగా చిత్తగతములైన దారేషణాదులు, కామాదులు, అవిద్యయు, స్వభావ చాంచల్యము మున్నగు సర్వదోషములు తొలగును. తరువాత నా దివ్య మంగళ విగ్రహమును భక్తితో కనులముందు నిలుపుకొనవలయును.

పై విధముగ భాగవతము దేవీగీత అవయవయోగమును సమర్థించినవి.

6) ధారణ:-

''రజస్తమో గుణంబులచే నాక్షిప్తంబగు చిత్తంబు విమూఢంబైన ధారణా వశంబునన్‌ దద్గుణంబుల వలన నయ్యెది మలంబులన్‌ బోనడచి, నిర్మల చిత్తంబునన్‌ పరమంబైన విష్ణు పదంబునకుం జనుధారణా నియమంబు గలుగ సుఖాత్మకంబగు విషయంబు నవలోకించు యోగికి''

ధారణయందు భగవత్‌ విశాల రూపమును మనమున ననుసంధానము సేయవలయునని శుకుడు తెలిపెను.

ఆ|| పవనము నియమించి పరిహృతరంగుడై

ఇంద్రియముల వర్గ మెల్ల మాపి

హరి విశాల రూపమందు చిత్తము జేర్చి

నిలుపవలయు బుద్ధి నెఱపి బుధుడు భాగవతము-2-15

''చూపునిలిచిన సుఖము నిలుచు''ను. ధారణ వలన బ్రహ్మానందము సిద్ధించును. ''మనసు నిలిచిన మారుతంబు నిలుచు''

7) సమాధి:-

భక్తి లక్షణంబైన యోగాశ్రయంబున వేగంబ మోక్షంచు సిద్ధించు.''

అనగా భక్తియోగి ''అపహృత మనః ప్రాణుడై'' సమాధిస్థితి ఏర్పడి ఆ స్థితియే అన్ని అవస్థల యందును సహజస్థితిగా రూపొంది జీవన్ముక్తు డగును.

పై విధముగా 7 దినములలో ముక్తి కేగెడి మార్గమును శుకుడు పరీక్షితున కుపదేశించెను. ఇదియే పరమభాగవతులు పాటించు భాగవత మార్గము.

శ్లో|| స్థిరం సుఖం చాసన మస్థితో యతిః

యధా జహాసు రిమ మంగ లోకమ్‌

కాలేచ దేశేచ మనో న సజ్జయేత్‌

ప్రాణాన్‌ నియచ్ఛే న్మనసా జితాసుః

భాగవతము 2-2-15

శరీరము నందలి ఇంద్రియములు మనస్సుతో కలసి దేహముతో బంధమున్నవానికి దేహము పోవునపుడు మరణము సంభవించును. అట్లుగాక ఇంద్రియములు మనస్సు ప్రాణము, వీనిని ధారణచే అధిగమించినచో మరణముతో సంబంధము లేక దేహము విడువ వచ్చును. అంగలోక మనగా దేహము. ధారణలో నున్నవానికి దేహ సంబంధముండదు. బాహ్య ప్రపంచజ్ఞాన ముండదు. కాబట్టి దేహమున్నంత కాలమునుండి రాలిపోవును. రమణ మహర్షి 45 ఏండ్లు జీవన్ముక్తుడై యుండెను కదా. కోరి దేహమును విడువవలసిన పనిలేదు. కాని పరీక్షితునకు శాపవశమున 7 దినములకు దేహము వదలవలసివచ్చెను.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters