Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

8. జ్ఞానయోగము

ఆధ్యాత్మ విద్య:

విద్యలలో ఆధ్యాత్మవిద్య శ్రేష్ఠమని భగవద్గీతలో విభూతి యోగమున చెప్పబడినది.

''ఆధ్యాత్మ విద్యా విద్యానాం'' గీత 10-32

ఎందుకనగా లోకములో ఇతర విద్యలు కార్య కారణముల చేతను, తర్కము చేతను, పంచేంద్రియములు మనస్సుచేతను గ్రహింప వీలగునవి. కాన కార్యకారణముల నధిగమించినది ఆధ్యాత్మవిద్య. అందులకే భాగవతమున

సీ|| కార్య వర్గంబును కారణ సంఘంబు

నధికరించి చరించు నాత్మ తత్త్వ

మధ్యాత్మ మనుబడు'' నని చెప్పుచున్నది.

- భాగవతము

ముండకోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది.

''ద్వేవిద్యే వేదితవ్యే, పరాచై వపరాచ, తత్రఅపరా ఋగ్వేదో యుజుర్వేద సామవేదో అధర్వవేదః శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తంఛందో జ్యోతిషమితి. అధ పరా యయా తదక్షర మధిగమ్యతే''

అనగా విద్యలు రెండు 1. అపరావిద్య 2. పరావిద్య. ఋగ్వేదయజుర్వేద సామవేద అధర్వణ వేదములు, శిక్షాకల్ప వ్యాకరణ ఛందో జ్యోతిషములు అపరావిద్యకు చెందినవి.

దేనిచే బ్రహ్మ సాక్షాత్కారము కలుగునో అది పరావిద్య.

ఆత్మ జ్ఞానము:

సాంఖ్యమనగా ఆత్మానాత్మ విచారము. దీనిని జానమార్గమని అందురు. ఈ జ్ఞానము రెండు విధములు 1) పరోక్షజ్ఞానము 2) అపరోక్ష జ్ఞానము.

పరోక్ష జ్ఞానమనగా తర్కబలము చేతను, యుక్తి చేతను గ్రహించు శబ్దార్థ జ్ఞానము. ఇది కేవలము ఆత్మ వివేకము (సాంఖ్యము).

అపరోక్ష జ్ఞానము అనగా అనుభవ పూర్వకముగా దర్శించు ఆత్మ సాక్షాత్కారము.

పరోక్ష జ్ఞానమే అపరావిద్య, అపరోక్ష జ్ఞానమే పరావిద్య.

జ్ఞానము

పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము

అపరావిద్య పరావిద్య

ఫలితము ఫలితము

వాచా వేదాంతము ఆత్మసాక్షాత్కారము

ఆత్మవిచార మనగా కేవల శాస్త్ర చర్చకాదు. అహం మూలమును వెదకుట అని శ్రీ రమణమహర్షి తెలిపెను. పుస్తకములో ఆత్మ లభింపదు. చంద్ర బింబమును చెరువులో కాక ఆకసమున దర్శింపవలెను. నీలో ఉన్న ఆత్మను వెదకి అనుభూతి పొందవలయును. కేవల శాస్త్రీయ జ్ఞానము అనగా అపరావిద్య అహంకారము కలిగించును. అనుభవ జ్ఞానము స్వస్వరూప జ్ఞానమును కలిగించును.

''బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి'' ముండకోపనిషత్తు

బ్రహ్మవేత్త బ్రహ్మయే అగుచున్నాడు. అనాత్మను వర్జించుటను పై రాగ్యమని ఆత్మానుభూతి పొందుట జ్ఞానమని నిర్వచింప వచ్చును.

భగవద్గీతకూడ ఆత్మజ్ఞానమే ఉత్క్యష్టమైనది. పొంద దగినది అని తెలుపుచున్నది.

శ్లో|| నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే

గీత 4-38

జ్ఞానముతో సమాన మింకొకటి లేదు. అది పవిత్రమైనది. ఆత్మవిచారమునకంటె గొప్ప కర్మభక్తి లేదు. ఆత్మశక్తినే కుండలిని, జ్ఞానము, భక్తి అందురు.

శ్లో|| యథై ధాంసి సమిద్ధోగ్ని ర్భస్మసా త్కురుతేర్జున

జ్ఞానాగ్ని స్వర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా

గీత 4-37

మండుచుండెడి అగ్ని ఏ ప్రకారము కట్టెలను భస్మము చేయునో అట్లే జ్ఞానమను అగ్ని సర్వ కర్మలను నాశనము చేయును. భగవద్గీతలో జ్ఞానతపస్సు. జ్ఞాననౌక, జ్ఞానయజ్ఞము, జ్ఞానాగ్ని, జ్ఞానఖడ్గము ఇత్యాది ప్రయోగములు గలవు.

శ్లో|| సర్వ కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే. గీత 4-33

మనో వాక్కు కాయిక కర్మలు ఆ ఫలితములు జ్ఞానము నందేలయించును.

శ్లో|| జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తి మచిరేణాధి గచ్ఛతి

గీత 4-39

జ్ఞానము అనుభవమునకు వచ్చినతోడనే ముక్తి కలుగును. శాంతి చేకూరును. ''ఆత్మలాభా త్పరోలాభః క్వచి దన్య న్న విద్యతే'' ఆత్మ లాభముకన్న మించిన లాభ మెక్కడను లేదు.

ఆత్మ సాక్షాత్కారము - 27

బ్రహ్మానందము:

సాధారణముగా వాడుకలో సుఖము ఆనందము ఇత్యాది పదములు పర్యాయ పదములుగా వాడబడుచుండును. గీతతో

''సుఖ మాత్యంతికం యత్త బుద్ధి గ్రాహ్య మతీంద్రియం'' గీత 6-21

బుద్ధిచే గ్రాహ్యమై ఇంద్రియముల కతీతమైనది సుఖమని చెప్పబడినది. భాగవతమున

గీ|| అల్పతరమైన సుఖముల నందుచున్న

జనుల దుఃఖంబు మాన్పంగ జాలునట్టి

వుండరీకాక్షు గుణ కథా ప్రోతమైన

వితత నిగమార్థమగు భాగవతము భువిని.

భాగవతము 3-264

అల్పసుఖములైన ఇంద్రియ సుఖముల నాశించుచు దుఃఖపడు మానవులకు దుఃఖనివృత్తి కలిగించునది భాగవతము.

కఠోనిషత్తు నందు

''శ్రేయశ్చ ప్రేయశ్చ మునుష్యమేత స్తౌ

సంపరీత్వ వివినక్తి ధీరః శ్రేయోహి ధీరో7భి ప్రేయసో

వృణీతే ప్రేయో మందో యోగక్షేమా ద్వృణీతే''

అని చెప్పబడినది. ప్రేయమనగా తాత్కాలిక బాహ్యేంద్రియ సుఖము. శ్రేయమనగా చిరకాలికమగు కల్యాణము. సామాన్యులకు ఆత్మకల్యాణమున కంటె బాహ్యసుఖమే ఎక్కువై తోచును. కావున బ్రహ్మానందమునే పొందవలయును. సుఖమనునది ఆత్మస్వరూపమే. ఆత్మసుఖ మొక్కటయే సత్యము. విషయముల యందు సుఖమనునది లేదు. మనస్సు వెలికి పోయిన జగము తోచును. దుఃఖము కలుగును. మనస్సు ఆత్మ సంస్థమైన, అనగా తలంపులు లేనప్పుడు ఆనంద మనుభవించు చున్నది.

కోరినది దొరకినపుడును, సమాధి, నిద్ర, మూర్ఛలయందును మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖమునే అనుభవించుచున్నది.

ఆత్మ యనగా నేమి?

పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ప్రకృతిలో జరుగు విషయములకు కారణము దాని ''స్వభావము'' (Narure) అన్నారు. కాని అస్వభావికమైనవి. తన నిజస్వభావము తెలిసికొనవలెనని రమణమహర్షి సూచించెను.

ఆత్మ తత్త్వము దురవగాహ మైనప్పటికిని శ్రీకృష్ణు డర్జునునకు గీతలో రెండవ అధ్యాయమున వాచికముగా ఆత్మను గూర్చి తొలుత సాంఖ్యరూపమున బోధించెను. ఆత్మ ఆవినాశి అచ్ఛేధ్యమని తెలిపెను. ఇది వాచికముగా తెలిసికొనుట మాత్రమే. తరువాత ఆత్మను అనుభవ పూర్వకముగా తెలిసికొనుటకు కర్మ భక్తి ధ్యాన జ్ఞాన యోగములను తెలిపెను. అవియే ఆత్మానుభూతికి ముక్తికి మార్గములు.

ఆత్మనుగూర్చి తొలుత వాచికముగా తెలిసికొనుట అవసరము. లేని యెడల ఆత్మకాని దానిని ఆత్మగా భావించు ప్రమాదమేర్పడ వచ్చును. అందువలన ఆత్మవిషయము తెలియనివాడు అజ్ఞాని. కేవల మూఢభక్తి సంపూర్ణ ఫలము నివ్వదు. అది జ్ఞానముచే కూడి యుండవలయును. అందులకే త్యాగరాజు ''తెలిసి రామభజన సేయవేమనసా!'' అని ప్రబోధించెను. జ్ఞానియు భక్తుడే. అజ్ఞానికి ఆత్మసాక్షాత్కారము లభింపదు.

''ఆత్మావారే మంతవ్యో ద్రష్టవ్యో నిధిధ్యాసితవ్యః'' ఆత్మను గూర్చి విచారించవలెను. మననము చేయవలెను. ధ్యానించవలెను ''నాయమాత్మా ప్రవచనేన లభ్యో నకర్మణా ప్రజయా ధనేన (నమేధ యా బహునా శ్రుతేన)'' బోధించుటచేతను కర్మలచేతను ధనముచేతను ఆత్మ లభింపదు. అందులకే భాగవతమున కపిలుడు దేవహూతి కిట్లు తెలిపెను. శ్రీ నారాయణుడు ఆత్మ స్వరూపుడు.

''అంబ! నారాయణు డఖిల శాస్త్రంబుల

సమధికానుష్టిత సవన తీర్థ

జప తపోధ్యయన యోగక్రియా

దాన కర్మంబుల గానబడడు''

- భాగవతము

మాండూక్య ఉపనిషత్తు ఆత్మనుగూర్చి ఇట్లు తెలుపుచున్నది.

''న బహిప్రజ్ఞం నాంతః ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞం నాప్రజ్ఞం నప్రజ్ఞాన ఘనం, అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మలింగ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయసారం ప్రపంచో పశయం శాంతం శివ మద్వైతం చతుర్థం అన్యంతే సఆత్మా సవిజ్ఞేయః''

జాగ్రతే స్వప్న నుషుప్త్యవస్ధలకు పరమై తురీయమైన ఆత్మ ఈ రీతిగా నున్నది.

న బహిప్రజ్ఞం = ఇంద్రియములతో గ్రహించు బాహ్యప్రజ్ఞ లేనిది. (విశ్వుడుకాదు)

నా న్తః ప్రజ్ఞం = మనస్సునకు సంబంధించిన ఆంతరిక ప్రజ్ఞకాదు. స్వప్నావస్థకాదు. (తైజసుడుకాదు)

నోభయత ప్రజ్ఞం = బాహ్యాంతర మధ్యవిషయమునందు ప్రవర్తించు ప్రజ్ఞకాదు.

న ప్రజ్ఞం = ఏకకాలమున బాహ్యాంతర విషయముల వర్తించు ప్రజ్ఞకాదు.

నా ప్రజ్ఞం = చై తన్య రహితము కాదు.

న ప్రజ్ఞాన ఘనం = సుషుప్త్యవస్థకాదు (ప్రాజ్ఞుడుకాదు)

అదృష్టం = జ్ఞానేంద్రియములకు గోచరించుదు.

అవ్యవహార్యం = వ్యవహరింప యోగ్యముకాదు.

అగ్రాహ్యాం = మనస్సుచే గ్రహించుటకు వీలుకానిది.

అలక్షణం = లక్షణము లేదా చిహ్నములు లేనిది.

అచిన్త్యం - ఊహచే చింతించుటకు వీలు లేనిది.

అవ్యపదేశం - ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిది.

ఏకాత్మ ప్రత్యయసారం - విశ్వ, తైజస ప్రాజ్ఞాది ఆత్మల యొక్క సారమైనది

ప్రపంచోపశమం - సర్వ ప్రపంచ శూన్యము.

శాంతం - అరిషడ్వర్గ రహితము.

శివం - మంగళకరము

అద్వైతం - రెండవది లేనిది.

పే విధముగా ఆత్మ వర్ణింపబడినది. ఆత్మను సచ్చిదానంద స్వరూపమని చెప్పినను అది నిజముకాదు. పై విధముగా చెప్పుట చేత అది ఆసత్‌ కాదని, జడముకాదని, బాధలేనిదని మాత్రమే చెప్పుచున్నాము. మనస్సునకు ఆత్మకును భేదముల లేదు. అంతర్ముఖమైన మనస్సే ఆత్మ. అది బహిర్ముఖమైనపుడు ప్రపంచ మేర్పడును. అత్మ లేక మనస్సునకు ఉనికి లేదు. మనస్సులేక ఆత్మకు ఉనికి కలదు.

శ్రీకృష్ఠు డర్జునునకు ఆత్మస్వరూపమును ఇట్లు వాచికముగా గీతలో బోధించెను.

శ్లో|| అవినాశితు త ద్విద్ధి యేన సర్వ మిదం తతమ్‌

వినాశ మవ్యయ స్యాన్య నకశ్చిత్‌ కర్తు మర్హసి

-గీత 2-17

దేనిచే సర్వప్రపంచము వ్యాపించపబడినదో, అట్టి ఆత్మనాశనము లేనిదని తెలియుము. ఇట్టి ఆత్మకు నాశనము కలిగించుట శక్యము కాదు.

శ్లో|| అనంత వంత ఇమే దేహా నిత్యస్యోక్తా శ్శరీరిణః

అనాసినో ప్రమేయస్య తస్మాద్యుద్ధ్య స్వ భారత!

గీత 2-18

ఈ ఆత్మ శరీరముల ధరించినది. ఆత్మ నాశరహితము, అగో చరము. దేహములు నాశవంతములు కాని అత్మ నిత్యము కావున యుద్ధము నేయుము.

శ్లో|| య ఏవం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్‌

ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి నహన్యతే.

గీత 2-19

ఈ ఆత్మ చంపునని తలచువాడును. ఈ ఆత్మ చంపబడునని తలచువాడును తెలిసినవారు కారు. ఈ ఆత్మ పుట్టినదియుకాదు చంపబడునదియు కాదు.

శ్లో|| న జాయతే మ్రియతేవా కదాచి న్నాయం భూత్వా భవితావా నభూయః

అజో నిత్యః శాశ్వతో7యం పురాణో న హన్యతే హన్య మానే శరీరే

గీత 2-20

ఆత్మ పుట్టునదికాదు చచ్చునదికాదు. ఒకప్పుడు లేకుండ నడుమ కలుగునదియుకాదు. మొదటయుండి కొంతకాలమునకు నశించునది కాదు. పుట్టుటలేనిది. నాశనము లేనిది, స్థిరమైనది. అనాదియైనది. దేహము నశించినను అది నశించదు.

చావు అనగా అహంవృత్తి ఉపశమించుట. తిరిగి పుట్టుట అనగా అహంవృత్తి పుట్టుట, చావు పుట్టుకల మూలముగ్రహించి అహంవృత్తిని నాశనము చేయవలయును. అదియే ముక్తి.

శ్లో|| వేదా వినాశినం నిత్యం య ఏన మజ మవ్యయం

కథం న పురుషః పార్థ! కం ఘాతయతి హన్తి కమ్‌

గీత 2-21

ఎవ డీ యాత్మ నాశము లేదనియు నిత్యమనియు పుట్టుక లేదనియు క్షయము లేదనియు దెలిసికొనుచున్నాడో అట్టి పురుషుడు ఎట్లు ఎవనిచే వధింపబడును? ఎట్లు ఎవనిని వధించును? అట్టివాడు తాను వధింపబడుటయు తా నితరుల వధించుటయు అసంభవము.

శ్లో|| వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృణ్హాతి

నరో7పరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి

నవాని దేహీ

గీత 2-22

మనుష్యు డెట్లు చినిగిన వస్త్రములను వదలి క్రొత్తవి గ్రహించునో అట్లు ఈ ఆత్మ జీర్ణములైన దేహములను వదలి క్రొత్త దేహములు గ్రహించుచున్నది.

శ్లో|| నైనం ఛిన్దని శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయ న్త్యాపో నశోషయతి మారుతః

గీత 2-23

ఆత్మను ఆయుధములు ఛేదింపజాలవు. అగ్ని దహింపనోపదు. ఉదకము తడువజాలదు. వాయువు ఎండింప జేయజాలదు.

శ్లో|| అచ్ఛేద్యో7య మదాహ్యో7య మక్లేద్యోశోష్య ఏవచ

నిత్యః సర్వగతః స్థాణు రచలో7యం సనాతనః

గీత 2-24

ఆత్మ ఛేదింప నలవిగానిది, దహింప నలవిగానిది, తడప శక్యము కానిది. ఎండింప సాధ్యముగానిది. సర్వవ్యాపకమైనది. నిత్యమైనది. నిశ్చలము అనాదియైనది.

శ్లో|| అవ్యక్తో7య మచింత్యోయ మవికార్యోయ ముచ్యతే

తస్మాదేవం విదిత్వైసం నానుశోచితు మర్హసి

గీత 2-25

ఈ ఆత్మ గోచరము కాదనియు, తలప నశక్యమనియు వికార రహితమనియు చెప్పబడుచున్నది. కాన ఆత్మ ఇట్టిదని తెలిసికొని నీవు శోకింప పనిలేదు.

శ్లో|| అనాదిత్వా న్నిర్గుణత్వా త్పరమాత్మా7య మవ్యయః

శరీరస్థోపి కౌన్తేయ! న కరోతి నలిప్యతే. గీత 13-32

ఆత్మ దేహమునందున్నను శాశ్వతుడు. ప్రకృతి నంటకయుండు వాడు. ఏమి చేయడు, చేయనీవాని కింక ఫల మంటు టెక్కడ?

ఉదాహరణము:-

శ్లో|| యథా సర్వగతం సౌక్ష్మ్యౌ దాకాశం నోప లిప్యతే

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోప లిప్యతే.

గీత 13-33

ఆకాశము అంతటను వ్యాపించియుండియు దేనిని అంటక ఎట్లున్నదో ఆత్మ అన్ని దేహములయందున్నను అంటుట లేదు.

శ్లో|| యథా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోక మిమం రవిః

క్షేత్రం క్షేత్రీ తథాకృత్స్నం ప్రకాశయతి భారత!

గీత 13-34

సూర్యుడొక్కడై లోకమునంతకు ఎట్లు ప్రకాశమును కలిగించునో అటులనే పరిమాత్మ ఒక్కడయ్యు సర్వక్షేత్రములకు ప్రకాశమిచ్చువాడు.

ఇంత విపులముగా ఆత్మస్వరూపము, గీత ఉపనిషత్తులు తెలిపినను, అది అనుభవమునకు రాదు. కేవల శాస్త్రజన్యజ్ఞానముచే పరోక్షజ్ఞానికి ఆత్మసాక్షాత్కారము కలుగదు.

శ్రీకృష్ణుడు పై విధముగా ఆత్మనుగూర్చి బోధించినను అర్జునునకు ఆత్మజ్ఞానము తక్షణమే అనుభవమునకు రాలేదు. అది తెలియజెప్పుటకై శ్రీకృష్ణు డిట్లనెను.

శ్లో|| ఆశ్చర్యవత్‌ పశ్యతి కశ్చిదేన

మాశ్చర్యవ ద్వదతి తధైవ చాన్యః

ఆశ్చర్యవ చ్చైద మన్యః శృణోతి

శృత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్‌ గీత 2-29

ఒకానొకడు ఆత్మను ఆశ్చర్య వస్తువువలె జూచును. మఱి యొక డీ యాత్మను ఆశ్చర్యమువలెనే చెప్పును. మఱియొక డాశ్చర్యముగా వినును. వినియు చూచియు చెప్పియు ఆత్మను తెలిసికొన జాలడు. ఆత్మనుగూర్చి శ్రీకృష్ణుడు మరల ఉత్తరగీతలో అర్జునునకు చెప్పవలసి వచ్చెను. అందులకే శ్రీకృష్ణుడు

''క్లేశో7ధికతర స్తేషాం అవ్యక్తా సక్త చేతసాం'' నిర్గుణోపాసన కష్టమని వచించెను. ఇక్కడనే విగ్రహారాధనకు అవతారముల నర్చించుటకు సమన్వయము కుదురుచున్నది. వానిని సమర్థించుటకు వీలగుచున్నది. నిర్గుణము నిరుపాధికము అగు ఆత్మపై మనస్సును నిలుప వీలుకాదు. ఇంద్రియములు నామరూపములకంటె వేరగు విషయముల నెఱుగజాలవు. అందువలన సగుణోపాసన విధింపబడినది. శ్రీకృష్ణుడే పరమాత్మ. సకలభూతముల ఆంతఃకరణమున గలడు.

శ్లో|| ''అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయ స్థితః''

గీత 10-20

అపతారపురుషుడై లీలామానుష విగ్రహుడైన తన్ను పరమాత్మగ మూఢులు గుర్తింపలేదని శ్రీకృష్ణుడే చెప్పికొనెను.

శ్లో|| ''అవజానంతి మాం మూఢాం మానుషీం తను మాశ్రితమ్‌''

తాను మాయా మానుష విగ్రహు డైనప్పటికిని అవ్యక్తుడు అజుడు, అవ్యయుడు అని శ్రీకృష్ణుడే చెప్పికొనెను.

శ్లో|| ''మూఢోయం నాభి జానాతి లోకో మా మజ మవ్యయం''

గీత 7-25

పరమ ముక్తుడైన జ్ఞానికూడ దేహము ధరించిన అవతార పురుషుడనవచ్చును. అతనికి సామాన్య మానవునకువలె దేహముపై సూర్య రశ్మి పడినప్పుడు నీడ ఏర్పడదట. వేమన ఒకప్పుడు అట్టి యోగి అగుపించగా నమస్కరించెనట. అతని శిష్యు లిదిగాంచి ''మీరే మహాయోగులు గదా? అతనికేల నమస్కరించితి''రని ప్రశ్నించిరట. దానికే వేమన ''ఆ యోగి పరమ ముక్తుడు. అతనిపై ఎండ పడినప్పటికిని నీడ అగుపించుట లేదని'' బదులు చెప్పెనట.

భాగవతముకూడ అవతారములను గూర్చి ఇట్లు సమర్థించుచున్నది.

చ|| జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్త వ

ర్తనుడగు చక్రికిన్‌ కవు లుదార పదంబుల జన్మకర్మముల్‌

వినుతులు సేయుచుండుదురు; వేదరహస్యమునందు నెందు జూ

చిన మఱిలేవు జీవునికి జెప్పిన కై వడి జన్మకర్మములే.

భాగవతము 1-68

''భువన క్షేమంకరంబైన భా

గవతామ్నాయము బాదరాయణుడు తా కల్పించె నేర్పొప్పగన్‌

- భాగవతము

అనగా శ్రీకృష్ణుడు పరమాత్మయేకాని పురుషుడుకాదు. అతని నారాధించుట ఆత్మారాధనయే అగును. అతడు మందాధికారులకు సగుణడు. ఉత్తమాధికారులకు నిర్గుణుడు. అతని సగుణనామములు విభూతులు భగవద్గీతలో విభూతియోగమున చెప్పబడినవి. అతనికి నిర్గుణమును సూచించు నామములు కూడ కలవు. సగుణారాధనయే అధికారమును బట్టి నిర్గుణురాధనగా మారును. అందులకే రామతాపిని యందిట్లు చెప్పబడినది.

శ్లో|| చిన్మయస్య అద్వితీయస్య నిర్గుణస్య అశరీరిణః

ఉపాసకానాం కార్యర్థం బ్రహ్మణో రూపకల్పన

- రామతాపిని ఉపనిషత్తు

అనగా చిన్మయుడు, అద్వంద్వుడు, గుణరహితుడు, శరీరము లేనివాడు అగు పరమాత్మకు ఉపాసకుడు భావించుటకై రూపము కల్పింపబడినది. అట్లే విగ్రహారాధనమును సమర్ధింపవచ్చును. విగ్రహమే దైవమని భావించి పూజించినచో అది బూడిదలో చేసిన హోమ మగునని భాగవతమున తెలిపబడినది.

చ|| అనిశము సర్వభూత హృదయాంతరవర్తి యనం దనర్చు నీ

శు నను నవజ్ఞసేసి మనుజుండొగి మత్ర్పతిమార్చనా విడం

బనమున మూఢుడై యుచితభక్తిని నన్ను భజింపడేని ఆ

మ్మనుజుడు భస్మకుండమున మానక వ్రేల్చిన యట్టివాడగున్‌

భాగవతము 3-964

కాబట్టి దేవతార్చనలో అర్చకుడు తన యందలి అంతరాత్మనే ''ఉచ్ఛ్వాసరూపేణ బహిరాగత్య'' ఊపిరిద్వారా బయటికివచ్చి ''యావత్పూజావ సానకం బింబేస్మిన్‌ సన్నిధిం కురు'' పూజ ముగియువరకు విగ్రహమునం దుండుమని వేడుకొనును. అందువలన దేవతార్చన ఆత్మ పూజయేకాని విగ్రహపూజ కాదని విదితమైనది కదా! ''ఆత్మావారే మంతవ్యో ద్రష్టవ్యో నిధి ధ్యాసితవ్యః'' అను వేదవాక్యమునే పురాణము లనుసరించుచున్నవి.

ఆత్మ విచారమున కధికారి ఎవ్వడు:-

క|| ఈ ఆత్మ విచారమ్మున

కే యత డధికారి యనుచు నెన్నంబడు?

అను గణపతిముని ప్రశ్నకు రమణమహర్షి ఇట్లు బదులు తెలిపెను

కం|| తనువు నశియించు నను బు

ద్ధిని, విషయమ్ముల నెడ గదిరిన విరాగ

మ్మును, గుఱుతుల నీ రెంటను

దను నధికారిగ నెఱుంగదకు నిక్కముగన్‌

- రమణగీత

ఆత్మనాత్మ విచారముచేయు ఉత్తమాధికారికి సాధన చతుష్టయ సంపత్తి యుండవలెనని రామస్త వరాజము సూచించినది.

1) ఆత్మ నిత్యము జగ మనిత్యమని ఎఱుగుట నిత్యా నిత్య వస్తు వివేక మను మొదటిసాధనము.

2) స్రక్చందనాది వనితా భోగంబులును, స్వర్గాతిలోక సుఖంబులను అనగా ఇహపర సౌఖ్యముల గోరకుండుట ఇహాముత్రార్థ ఫలభోగ విరక్తి యను రెండవసాధనము.

3) బాహ్యపంచేంద్రియ నిగ్రహము దమము. అంతఃకరణ నిగ్రహము శమము. కామాద్యరిషడ్వర్గములు లయించుట శాంతి. శ్రుత్యాచార విశ్వాసము శ్రద్ధ. అట్టి శమదమాది సంపత్తి మూడవ సాధనము.

4) శీఘ్రము మోక్షముగోరుట ముముక్షుత్వమను నాల్గవసాధనము.

ఇట్టి సాధనసంపత్తి కలిగినగాని బ్రహ్మవిద్య నుపదేశింపరాదని శ్రీ శంకరాచార్యులు ఉపదేశ సాహస్రిలో తెలిపియున్నారు.

సాధన చతుష్టయ సంపత్తిలో మొదటిదగు ''ఆత్మనిత్యము జగమనిత్యమని ఎఱుగుట'' అనగా ''బ్రహ్మసత్యం జగన్మిథ్య'' అనుటను తెలిసికొనుట యగును. కాని తరువాత జగత్తంతయు బ్రహ్మస్వరూపమేనని ''వాసుదేవ స్సర్వమితి'' అని అందురు కదా? అది ఎట్లు సాధ్యమని ప్రశ్నింపవచ్చును.

సాధకునకు ముందుగా జగత్తు బ్రహ్మమని చెప్పినచో శరీరాదులతోకూడిన జగత్తే తానని భ్రమను చెందును. అందువలన జగత్తు మిథ్య అని చెప్పవలయును. ఆత్మను విడిచి బహిర్ముఖమైన దృష్టి జగత్తంతయు మిథ్య అన్నగాని అంతర్ముఖము కాదు. అంతర్ముఖమై తన్ను తా గన్నవెనుక తనకంటె వేరులేదు గనుక జగత్తు నంతయు బ్రహ్మముగా జూడగలడు.

జ్ఞానమును పొందుటకు అన్ని ఆశ్రమములవారు అధికారులే.

''జ్ఞాన మాత్రే యద్యపి సర్వాశ్రమిణామ్‌ అధికారః'' ముండక భాష్యము.

ఏషాం పునః పూర్వకృత సంస్కారవశాత్‌

విదుర ధర్మవ్యాధ ప్రభృతీనాం జ్ఞానోత్పత్తిః

తేషాం నశక్యతే ఫలప్రాప్తి ప్రతిషేద్ధుమ్‌

- సూత్రభాష్యము

పూర్వ సంస్కారముచేత విదుర ధర్మవ్యాధులకు జ్ఞానోదయమైనది. శూద్రులకుకూడ సంస్కారవశమున జ్ఞానోదయము కలుగవచ్చును.

బ్రహ్మనిష్ఠకు మూడు మార్గములు:-

లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయా నషూ!

- గీత

శ్రీకృష్ణపరమాత్మచేతనే ఖ్రహ్మనిష్ఠకు రెండుమార్గములు చెప్పబడినవి. నిష్ఠ ఒక్కటియేయైనను దానికి రెండుమార్గములు. 1). కర్మయోగము. 2) సాంఖ్యయోగము. (ద్వివిధానిష్ఠా అను దానిని బహువ్రీహి సమాసముగా భావించిన ''ఏ నిష్ఠకు రెండుమార్గములు కలవో అది యని చెప్పవచ్చును) కాని రమణగీతలో ''మార్గత్రయ కథనము'' ఆత్మనిష్ఠను పొందుటకై చెప్పబడినది. నిష్ఠ ఒకటేనని రమణగీత ఒప్పుకొనుచున్నది.

శ్రీ రమణమహర్షి ''శిష్యజనుల యభ్యాసముకై

త్రిపధములను భిన్నము, త

త్వపు చూడ్కి నేకమగు విధానము'' తెలిపెను.

శ్రీ రమణమహర్షి తన అనుభవమును పురస్కరించుకొని జీవన్ముక్తదశలో శ్రీ వాశిష్ఠగణపతిమునికి ఆత్మనిష్ఠను బొందుమార్గములను క్రింది శ్లోకములో సూచించెను. తరువాత దానిలోని ప్రతి పదమును వ్యాఖ్యానించి సందేహనివృత్తిని కలిగించి విశేషార్థములకు కుతర్కమునకు తావులేనట్లు చేసెను. శాస్త్రజ్ఞానమునకంటె అనుభవ జ్ఞానము శ్రేష్ఠముకదా? ''తా ననుభవించి యొరులకు జ్ఞానము నుపదేశ మిలను గావించుటకై మేను గొనినట్టి'' విజ్ఞాని శ్రీ రమణ భగవానుడు.

క్రీస్తుశకము 1916 లో మహర్షి స్వయముగా అనుగ్రహించి వ్రాసిన శ్లోకమును తాను గణపతిముని కుపదేశించెను. ఇది వేదాంతసారము, సందేహనివృత్తి కరము.

శ్లో|| హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం

హ్యహమహ మిత సాక్షా దాత్మరూపేణ భాతి;

హృదివిశ మనసా స్వం చిన్వతా, మజ్జతావా,

పవన చలన రోధా దాత్మనిష్ఠో భవ త్వం.

శ్లోకము పూర్వార్థమందు శరీరమున ఆత్మస్థానమును సూచించెను. అదియే హృదయకుహరము. దేహమే దేవాలయము. జీవుడే శివుడు. ''పంచకోశాత్మకమైన దేహమేగుహ.'' అందు వసించు పరమేశ్వరుడే గుహేశుడు. ఈ గుహనే హృదయాకాశము మానసాకాశము దహరాకాశము సిద్ధాకాశము అని అందురు. ఈ బ్రహ్మవిద్యనే దహరవిద్య అని అందురు,

హృదయ మనగా నేమి?

హృదయమును గూర్చి రమణమహర్షి సందేహనివృత్తి యొనర్చెను

శ్లో|| ఉపరి జఠరదేశ స్యాపి వక్షోన్తరేచ

వపుషి వివిధ వర్ణం షట్కమ స్త్యంగకానాం

కువలయ కలికాభం దక్షిణాంశే నివిష్టం

భవతి హృదయ మన్త ర్మధ్యతోద్వ్య ఙ్గలాంతే.

రెండుస్తనములకు నడుమ రొమ్మునకు అడుగున నుండు కడుపునకుపైన పలురంగుల పదార్థము లారున్నవి. వానిలో ఒకటి కలువ మొగవలె కుడిభాగమున రెండువ్రేళ్ళదూరమున హృదయమున్నది.

మంత్రపుష్పమున నట్టి అభిప్రాయమే చెప్పబడినది.

పద్మకోశ ప్రతీకాశం హృదయం చా ప్యధోముఖం.

అధోనిష్ట్యా వితస్యాంతే నాభ్యా ముపరితిష్ఠతి

(జ్వాలమాలా కులంభాతి విశ్వస్యాయతనం మహత్‌)

హృదయం త ద్విజానీయా ద్విశ్వస్యాయతనం మహత్‌

శ్లో|| భవతి వదన మస్య త్వావృతం తత్ర మధ్యే

వియతి నిబిడ మాస్తేజ్ఞానరూపం తమిస్రం

ఇహహి సకల నాడీ సన్దయో వాసనాశ్చ

భవతి సదనమేత త్ర్పాణచేతో ద్యుతీనాం

ముఖరుద్ధమైన దానిలోనుండు సూక్ష్మ రంధ్రమందు రాగాది వాసనలు నిండిన మహాంధకారము కలదు. అన్ని నాడులు ఆ హృదయమును బట్టుకొని యున్నవి. అవియే ప్రాణ మనస్తేజములకు స్థానమగును.

శో|| నిర్గచ్ఛంతి యత స్సర్వా వృత్తయో దేహధారిణాం

హృదయం తత్సమాఖ్యాతు భావనాకృతి వర్ణనమ్‌.

- రమణగీత

క|| ఏకడనుండియె వృత్తులు

సాకల్యము బయలు వెడలిసాగునొ, పేరుం

గైకొనునది హృదయంబని;

యాకారపు వర్ణన యరయగ భావనయే.

దేహధారులకు సకలములగు వ్యాపారము లెచ్చటనుండి బయలు వెడలుచున్నవో అదియో హృదయ మనబడును. ఆకారవర్ణనము కేవల భావనయే.

శ్లో|| అహంవృతి సమస్తానాం వృత్తీనాం మూల ముచ్యతే

నిర్గచ్ఛతి యతో హంధీః హృదయం తత్స మాసతః

క|| నానా వృత్తుల మూలం

బేనను వృత్తియె యటంచు నెన్నం బడెడిన్‌.

నేనను బుద్ధియు నెచ్చట

దాను బయలువెడలు నదె హృదయ మొక మాటన్‌.

సకల వృత్తులకు ''నేను'' అను వృత్తి మూలమని చెప్పబడుచున్నది. నేను అను బుద్ధి ఎచటనుండి బయలు వెడలుచున్నదో అదియే హృదయము.

శ్లో|| అన్యదేవతతో రక్త పిండా ద్ధృదయ ముచ్యతే

అయం హృదితి వృత్త్యాత దాత్మనో రూప మీరితమ్‌

క|| ఆరక్త పిండమునకున్‌

వేరగునదియే హృదయము వృత్తి, ''అయం హృ''

త్తారయగా నగుటను దా

నీరితమది యాత్మరూపమే యని సరిగాన్‌

ఆ రక్తపిండముకంటె వేరగునదియే (హృదయము). హృత్‌ + అయం = హృదయం అను పదవిభాగముచే ఆత్మరూపము హృదయమని చెప్పబడుచున్నది.

శ్లో|| వ్యాప్తేన తత్ర్పకాశేన శరీరే త్వనుభూతయః

స్థలం తదేవ హృదయం సూరయ స్సం ప్రచక్షతే

రమణగీత 9-8

ఆ యాత్మప్రకాశము శరీరమునందు వ్యాపించినందున యనుభవములు గలుగుచున్నవి. ఆ యాత్మజ్యోతి యుండు స్థలమునే విద్వాంసులు హృదయమని తెలుపుచున్నారు.

శ్లో|| తస్య దక్షిణతో ధామ హృత్పీఠేనైవ వామతః

తస్మాత్‌ ప్రవహాతి జ్యోతిః సహస్రారం సుషుమ్నయా

క|| కుడివైపున నున్నది యది

ఎడమవైపునందు గాదు హృత్వీఠిని, న

క్కడనుండి జ్యోతి వాఱును

సుడీ సహస్రారమున సుషుమ్నా సరణిన్‌

హృత్ఫలకమునందు హృదయము కుడివైపున నున్నది. ఎడమ వైపునగాదు. ఆ హృదయస్థానమునుండి సుషుమ్నానాడి మార్గమున జ్యోతిస్సు సహస్రారమునకు ప్రసరించుచున్నది.

హృదయము రెండు విధములని వశిష్ఠుడు శ్రీరామునకు తెలిపెను.

శ్లో|| సౌధో జగతి భూతానాం హృదయం ద్వివిధం స్మృతం

ఉపాదేయంచ హేయంచ విభాగోయం తయోశ్ర్భుణు

ఇయత్తయా పరిచ్ఛిన్నే దేహే యద్వక్షసోన్తరం

హేయం తద్ధృదయం విధ్ధి తానా వేక తటే స్థితం

సంవిన్మాత్రంతు హృదయ ముపాదేయం స్థితం స్మృతం

తదంతరేచ బాహ్యేచ నచబాహ్యే న చాంతరే

తత్తు ప్రధానం హృదయం''

హృదయములు రెండు విధములు. ఒకటి ఱొమ్ములోనున్న మాంసపిండము, రెండవది చిన్నాత్రముగ వెల్గు చేతన హృదయము. అది లోపల వెలుపల నుండును. ఇదియే ప్రధాన హృదయము.

బ్రహ్మపురమను దేహమున హృదయ కమలాసనమున పరమాత్మ యుండును. మనస్సును నిలుపుటకు యోగ్యమైన స్థానము హృదయము. అష్టదళయుత హృదయకమలమునే కైలాసము వైకుంఠము పరమపదమని తెలుపుదురు. నాడీ మండలమునకు బ్రహ్మవృక్షమని బ్రహ్మవనమని ఇందులో భగవంతుడు విహరించునని చెప్పుదురు. భాగవతమున పురంజనోపాఖ్యానమునందు పురంజనుడను రాజు (జీవుడు) నవద్వారయుతమైన పురమును ప్రవేశించినట్లు చెప్పబడినది.

ఇంతవరకు హృదయకుహరమును పదమునకు శ్రీ రమణమహర్షి వివరణము వివరింపబడినది. పాంచ భౌతిక శరీరము నాశ్రయించిన ఆత్మయొక్క స్థానమును రమణమహర్షి హృదయ కుహరమని స్థాననిర్దేశ మొనర్చెను. ''కేవలం బ్రహ్మమాత్రం'' అనుటచేత జీవేశ్వర భేదమును తొలగించి అద్వైతమును ప్రతిపాదించెను. ఆ బ్రహ్మయే ''నేను నేన''ని ప్రత్యక్షముగ ఆత్మరూపమున ప్రకాశించుచున్నది. ఆత్మ అనగా నేమియో ఇంతకుముందు చర్చించియున్నాను.

మానవుడు నేను నాది (అహంకార మమకారములు) అని చెప్పుకొనుచున్నాడు. ఆత్మకూడ నేను నేను అని ప్రకాశించుచున్నది. ఈ రెండు ''నేనులు'' సత్యములా విచారింతము.

మానవునకు దేహాత్మభావము కలదు. ఈ దేహము నేను అనుకొన్నప్పుడు అందులో పంచకోశ రూపములైన స్థూల సూక్ష్మ కారణ దేహములు మూడు ఇమిడియున్నవి. ''నేను వచ్చితిని, నేను పోయితిని'' అన్నప్పుడు దేహమే నేనను భావము కలుగుచున్నది. పుట్టక ముందు దేహమేలేదు. నిద్రలో దేహములేదు. కాని నేనను భావన ఎట్లు కలిగినది? దీనినే అవిద్య అని, అహంకారమని, జీవుడని మాయయని, మల మని, అనేక విధములుగా జెప్పుదురు.

ఆత్మనుండి చిదాభాసము కలుగుచున్నది. దానినుండి వృత్తి మూలమగు అహాంకారము కలుగును. అహంకార మున్నంతవరకు ఇంద్రియ గోచరమగు జగత్తున్నది 1) జీవుడే ద్రష్ట, 2) జగత్తు దృశ్యము. 3) వృత్తిజ్ఞానము దృక్కు. ఈ త్రిపుటి ఒకదానినొకటి విడచియుండదు.

శ్లో|| న వక్తి దేహోహ మితి; ప్రసుప్తౌ

నకోపి నాభూవ మితి ప్రవక్తి;

యత్రోదితే సర్వముదేతి! తస్య

ధియాహ మః శోధయ జన్మదేశమ్‌ - సద్విద్య-25

నేనని ఈ దేహము పలుకదు. నిద్రయందుగూడ నేను లేనని ఎవ్వరును జెప్పుటలేదు. నేనొకటి పుట్టినవెనుక నిఖిలమును బుటును. ఈ నేను ఎక్కడ బుట్టునని సూక్ష్మబుద్ధితో శోధింపుము.

శ్లో|| దేహో నజానాతి; సతో న జన్మః

దేహ ప్రమాణోన్య ఉదేతి మధ్యే;

అహంకృతి గ్రన్థి విబన్ధ సూక్ష్మ

శరీరచేతో భవ జీవ నామా.

జడ శరీరము నేను అనదు. సత్తైన చిత్తు జనించదు. నడుమ దేహ పరిమాణముగా ''నే''నొకటి పుట్టును. ఇదియె చిజ్జడగ్రంధి, బంధము, జీవుడు, సూక్ష్మశరీరము, అహంకారము, సంసారము, మనస్సు మొదలగునవి.

ఈ నేనను అహంకారము ఆత్మ కాదు. ''అహ మిహ మితి సాక్షా దాత్మ రూపేణ భితి'' అన్న రమణ వచనములలో ''అహ''మని తెలుపు ఆత్మవస్తువు చెప్పబడినది. ఇది సంకుచితమైన అహంకారము కాదు. అది సర్వాంతర్యామియైన పరమాత్మయే. అందువలన అహంబ్రహ్మాస్మి'' అనుటలో అహం శబ్దము పై ఆత్మవస్తువును సూచించుచున్నదని భావించవచ్చును. ఇది నేనను అహంకారముకాదు. అందువలన ఈ నేను బ్రహ్మముకాదు. పూర్ణమైన అహమే బహ్మమని మహావాక్యార్థము చెప్పవచ్చును కదా. దేహాత్మభావము తొలగిన గాని ''అహం బ్రహ్మాస్మి'' అనుభూతికి అందదు. ఆత్మ ''అహం'' రూపమని వేదము చెప్పుచున్నది.

అహ మప్మి ప్రధమజా ఋతాస్య

పూర్వ దేవేభ్యో అమృతస్యనాభాయి

యో మాదదాతి స ఇదేవమావాః

నేను సర్వ దేవతలకంటె ముందున్నాను. జగత్తుకంటే ముందున్నాను.

''అహం'' శబ్దము బ్రహ్మపదవాచ్యమని నృసింహ ఉపనిషత్తున మంత్రోద్ధారమున చెప్పబడినది. శ్రీ నృసింహస్వామి అహం పదవాచ్యుడు.

ఈ నేనను అహంకారమే మనస్సు తొలివృత్తి. అనగా నేనను తలంపే మనస్సుయొక్క తొలి తలంపు. దాని నాధారముగా జేసికొని ఇతర వృత్తు లేర్పడును. నేను, నాది (అహంకార మమకారములు) లేనప్పుడు ఆత్మ సాక్షాత్కార మగును.

నడుమబుట్టిని ఈ నేనను అహంకారమును తొలగించుటకు పై శ్లోకము ద్వితీయభాగమున శ్రీ రమణమహర్షి మూడుమార్గముల తెలిపెను. తత్త్వమువలన మార్గము ఏకత్వము నొందిన దైనను మూడువిధములుగా శిష్యుల కభ్యాసమగుటకై యుపదేశించెను.

శ్లో|| ఉపాయో (1)మార్గణాభిఖ్యః ప్రథమ స్సం ప్రకీర్తితః

ద్వితీయో (2)మజ్జనాభిఖ్యః (3)ప్రాణరోధస్తృతియకః

-రమణగీత

ఆత్మను కనుగొనుటకు మూడు మార్గములు.

1) వెదకుట - మార్గణము

2) మునుగుట - మజ్జనము

3) ప్రాణమును నిరోధించుట - ప్రాణరోధము

బ్రహ్మనిష్ఠ:-

ఏకమైనను అభ్యాసమునకు గీతలో రెండు మార్గములు, రమణ గీతలో మూడు మార్గములు, భాగవతములో 1) అవయవయోగము, 2) భాగవత శ్రవణము అను రెండు మార్గములు చెప్పబడినవి. భాగవత శ్రవణముచేతనే అవహృత మనఃప్రాణుడు కాగలడు, ఏ మార్గమైనను ఇంద్రియ మనోనిగ్రహమునకే సాధనము. ''నాన్యః పంథా'' అను వచనమునకు ఇంద్రియ మనోనిగ్రహములు పొందుటయే అని భావము.

పై మార్గములను రమణమహర్షియే సద్విద్యయందు వివరించెను.

1) మార్గణము - వెదకుట

శ్లో|| భావేహమః సర్వమిదం విభాతి

లయోహమో నైవ విభాతి కించిత్‌

తస్మాదహం రూప మిదం సమస్తం

తన్మార్గణం సర్వ జయాయ మార్గః -28

గీ|| నేను గలిగిన నీవును గానబడుదు;

నేను నీవును గలిగిన నిగుడు జగము;

నీవు నేనును నొకటైన భావమెపుడు

గానబడు, నట్టికాలంబు దీని కవధి.

- రామస్త నరాజము

''నేన''ను అహంకారము కలదనిన అఖిలమును కలదు. అది లేదనిన అఖిలమును లేదు. కనుక అహంకారమే అఖిల మగును. కావున ఇది ఏది యని వెదుకుటయే సకలమును వదలు మార్గమని తెలియుము. నేను (అహం) ఆవతరించగనే ప్రపంచము గోచరించును. అది లేనిఎడల ఏ కొంచెము అగుపించదు. కావున సమస్తము అహం రూపమే. దాని మూలాన్ని వెదకుటయే అన్నిటిని జయించుమార్గము.

గాఢనిద్రలో మనస్సు లేనప్పుడు ప్రపంచనాటకము లేదుకదా. కాబట్టి ఈ నాటకము నేను, అంతఃకరణము, వీని విలాసమే. ప్రపంచ మంతయు ''నేను'' యొక్క ప్రభావమే, దానిని జయించిన అన్నిటిని జయించినట్లే.

శ్లో|| సత్యాస్థితి ర్నాహ ముదేతి యత్ర

తచ్చోదయ స్థాన గవేషణన

వినా న నశ్యే; ద్యది తన్న నశ్యేత్‌

స్వాత్మై క్యరూపా కథమస్తు నిష్ఠా? -29

''నేను'' పుట్టకయున్న స్థితియె మనము ఆదిగా నున్నస్థితి. నే నుదయించు స్థానమును వెదకి, నేను పుట్టని యహము తా నాశ##మెటుల పొందును? దానిని పొందక తా నదియగు స్వస్థితి నెట్లు పొందును?

సర్వమూ ఆత్మయే. నీవుగాక ఇతరం లేదని గుర్తించవలయును. నీకు నిజస్థితికి మధ్య అహంకార మున్నది. అది ప్రపంచము వేరు నేను వేరను భేదబుద్ధితో నుండును. ''నేను''ను దాటిన ఆత్మసాక్షాత్కారం కలుగును. అప్పుడు సమాధిలో ఉన్నా లేకపోయినా నీవు ఆత్మస్థితిలో ఉండగలుగుదువు. ఇది జీవన్ముక్తావస్థ. ''నేను'' పుట్టుకను వెదుకుటయే నేను నశించుమార్గము. అప్పుడది ఆత్మలో లయము చెందును.

శ్లో|| గవేషణాత్ర్పాప్య హృదంతరం తత్‌

పతే దహన్తా పరిభుగ్న శీర్షా;

అథాహ మన్యస్ఫురతి ప్రకృష్టం;

నాహంకృతి స్తత్పరమేవ పూర్ణం.

-32

నేనెవ్వడనని మనసులో వెదకుచు హృదయమున జేరినప్పుడు నే ననువాడు తలక్రింద బడిపోయి తోడనే నేను నేను అనుచు నొక వస్తువు తోచును. తోచినను దాని అర్థము అహంకారముకాదు. పరిపూర్ణ వస్తువే దాని అర్థము.

ఆత్మను వెదుకుచు మూలమును చేరినప్పుడు ''నేను'' తల పగిలి రూపు మాసిపోవును. అప్పుడు ఇంకొక అహం స్ఫురించును. ఈ నేను పరిపూర్ణమైన అహం. సర్వవ్యాప్తమైన ఆత్మ.

ఆత్మను వెదకుటకు ''నేతి నేతి'' అను మార్గము చెప్పుదురు. కర్మేంద్రియములు నేనుకాదు. జ్ఞానేంద్రియములు నేనుకాదు. ప్రాణాది వాయుపంచకము నేనుకాదు, అని ''నేతి నేతి'' నే నదికాదు. ఇది కాదు, అని భావించవలెనని తెల్పుదురు. ఇంకొక విధముగా విచారించినచో ఉపనిషత్తులు అధ్యారోవ అపవాద ప్రక్రియను సూచించుచున్నవి. అనగా నేను దేహమును అవి అధ్యారోపము చేసికొని తరువాత విచారముచే నేను దేహముకాదని అపవాదము చేయుట. అట్లే జాగ్రత్‌ స్వప్న సుషుప్త్యవస్థలుకూడ నీవుకాదని అపవాదము చేయవచ్చును.

కాని శ్రీరమణమహర్షి ఆత్మను వెదకుటకు అనుభవ పూర్వకమైన పద్ధతిని క్రింది విధముగా సూచించెను.

శరీరమున నేనని తోచునదేదియో అది మనస్సు. మనస్సులోని తలంపుల కన్నింటికి మొదటి తలపు నేనను తలంపు. ''నేను'' తోచిన తరువాతనే ''నీవు'' ''వాడు'' ఏర్పడును. ''నేను'' లేవిఎడల జగములేదు. మనస్సున తలపు లేర్పడినపుడు అవి ఎవరికి కలిగినవని ప్రశ్నించుకొన్నచో నాకని తోచును. ఆ నేనెవడని ప్రశ్నించుకొన్నచో మనస్సు తన పుట్టిన స్థానమైన హృదయమును చేరును. అప్పుడు ''నేను'' అను అహంకారముపోయి ''తాను'' మిగులును. అనగా మనస్సును హృదయమున నిలిపినచో లేక అంతర్ముఖముచేసినచో అది నశించును. నేనను తలంపులేని స్థితి నిజస్వరూపము, అట్లుండుటయే మౌనము. జ్ఞానదృష్టి. సహజస్థితి. నిరంతరము మనస్సును ఆత్మయం దుంచుటకే ఆత్మవిచార మని పేరు. ఈ విషయమునే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఇట్లు తెలిపెను.

''ఆత్మ సంస్థం మనః కృత్వా న కించి దపి చింతయేత్‌''

''నకించి దపి చింతయేత్‌'' అను వాక్యము ఉత్తరగీతయందు కనుపించుచున్నది.

శ్లో|| ఖమధ్యే కురు చాత్మాన మాత్మ మధ్యేచ ఖం కురు

ఆత్మానం ఖమయం కృత్వా నకించిదపి చింతయేత్‌

ఉత్తరగీత 1-అధ్యాయము

జీవబ్రహ్మల నభిన్నముగా భావించి ఇతరమును తలచకుము.

ఆత్మను మనస్సునం దుంచుట అనగా నేమియని శ్రీ రమణ మహర్షిని ప్రశ్నించిరి. మనస్సనగా తలపులమూట. ఈ తలంపులు ఆత్మనుండియే బయలు వెడలును. తలపులకు, (అన్ని మనోవృత్తులకు) మూలము అహ మను (నేనను) తలపు. తలపులను ఆపికొన్న ఎడల మనస్సు హృదయమునం దుంచబడినదని చెప్ఫుదురు. అందులకే ''నకించి దపి చింతయేత్‌'' అని నేనను తలపుకూడలేని నిజమైన మౌనము సూచింపబడినది. ఆత్మవిచారమనగా ''నే నెవడని'' ప్రశ్నించుకొనుట కాదు. నేనను అహంకారము బయలుదేరుస్థానమును వెదకి చేరుట. అదియే హృదయము. ''హృదయము లోపల వర్తిలు వారల కైక్యమగును దృక్‌ దృశ్యంబుల్‌''. ఇదియే రమణమహర్షి సూచించిన ఆత్మను వెదకు మార్గము. అందరును దీనిని సులభముగా అభ్యపించవచ్చును.

దేహము పంచకోశాత్మక మనీ పంచ భూతాత్మకమనీ పంచీకరణాదులనుగూర్చి సలుపు శాస్త్రచర్చ ప్రయోజనకారికాదు. అది ఊడ్చిపారవేయవలసిన చెత్త. నే ననునది ఎక్కడ పుట్టుచున్నదో వెదకి ఆత్మసంస్థితుడై తానుగా నుండుటయే మన కర్తవ్యమని రమణమహార్షి ఉద్భోధించెను.

2)మజ్జనము - మునుగుట

శ్లో|| కూపే యధాగాఢ జలే తథాన్త

ర్నిమజ్జ్య బుద్ధ్యా శితయా నితాన్తం

ప్రాణంచ వాచంచ నియమ్య చిన్వన్‌

విన్దే న్నిజాహంకృతి మూల రూపం --11-30

ఒక మనుజుడు నీటిలోబడిన వస్తువునుగొనుటకై నీట మునుగునట్లు, తీక్షణమైన బుద్ధి తో వాక్‌ ప్రాణ బంధనముతో లోన మునిగి ''నేను'' బుట్టు చోటును యెఱుగవలయును. నూతిలో బడిన ఆభరణమును వెదకుటకు ఊపిరి బిగబట్టి మునుగుటవలె మనస్సును అంతర్‌ముఖముచేసి ఆత్మను వెదకవలయును. ఇదియే విచారము. అప్పుడు ఆలోచనలు శ్వాసనిలచిపోవు. అనగా ధ్యానములో ప్రాణాయామము తనంతటనే జరుగును. మనోవ్యాపారము ఆగిన శ్వాస ఆగును. వ్యాపారములేని మనస్సుతో ఆత్మ గుర్తింపబడును. ఈ వ్యాపారములేని మనస్సు నీదేకదా? నే నెవరని ప్రశ్నించుకొనుచు అన్వేషించిన ఆలోచనలు లేకపోవుటకు మూలము ఏదో అది ఆత్మయని తెలియవచ్చును.

శ్లో|| మౌనేన మజ్జన్‌ మనసా స్వమూలం

చర్చైవ సత్యాత్మ విచారణం స్యాత్‌;

''ఏషోహ మేత న్నమమ స్వరూపం''

ఇతి ప్రమా సత్య విచారణాంఙ్గం --31

''నేను'' అని నోటితో బలుకక, లోన మునుగు మనస్సువలన ''నేను'' అని ఎచ్చట వెలుగునని వెదకుటయే జ్ఞాన విచారమగును. ''ఇది నేనుగాదు అది నేనుగాదని'' తలంచుట సహాయమగును గాని జ్ఞాన విచార మెట్లగును?

నిజమైన ఆత్మవిచార మనగా మనస్సు మౌనముదాల్చి తనలో తాను మునిగి తన జన్మకు మూలమును వెదకి పట్టుకొనుట. నేను శరీరమునుకాదు, పంచకోశములుకాదు. బుద్ధినికాదను భావనలు ఆత్మచర్చకు కొంచెముగా ఉపకరించవచ్చును. దీనివలన అనుభవజ్ఞాన మేర్పడదు. ఇతరులు చెప్పగా విన్నదే.

శ్లో|| త ద్యుష్మదో రస్మది సంప్రతిష్టా

తస్మిన్‌ వినష్టేస్మది మూల బోధాత్‌

తద్యుష్మ దస్మ న్మతి వర్జితైకా

స్థితి ర్జ్వలంతీ సహజాత్మ నః స్యాత్‌

''నీవు'' ''అది'' అనే భావములు ''నేను'' మీద ఆధారపడియున్నవి. ఈ నేను భావంయొక్క మూలం దగ్గరకుపోయిన అక్కడ ఈ ''నీవు'' ''అది'' అదృశ్యమౌను. ఆ ''నీవు'' ''అది'' ''నేను'' అను భావము లేని స్థితి ఒకటి మాత్రమే. అది దేదీప్యమానముగా ప్రకాశించే ఆత్మయొక్క నిజస్థితి.

తలపులను తొలగించి చూచిన మనస్సనునది వేరొకటి అగుపించదు. ప్రత్యేకముగా మనస్సను వస్తువులేదు. కాబట్టి తలంపులే మనస్సు స్వరూపము. తలపుల నాపికొని మౌనము వహించి నిశితమైన బుద్ధితో లోనముణగి మనస్సును అహం ముఖము లేక అంతర్ముఖముగాచేసి (హృదయమునుండి దానిని బహిర్ముఖము చేయకున్న ఎడల) అదియే జానదృష్టి యగును. ఇది మజ్జనము.

3) శ్వాస నిరోధము :-

మనస్సణగుటకు ఆత్మవిచారమే ముఖ్యము. స్రాణాయామ మంత్రజపాదులచే అణగిన మనస్సు కుంభకము నిలిపినంత వరకు మాత్రమే నిలిచియుండును. ప్రాణము బయటికి వెడలగనే మనస్సు ప్రకోపించును. ప్రాణమునకు మనస్సునకు పుట్టుచోటు ఒకటియే. నే ననునది మనస్సు తొలి తలంపు. నేనను తలంపు పుట్టుచోటు ప్రాణము పుట్టుచోటు ఒకటియే. అహంకారము ఎచ్చట బుట్టుచున్నదో అచటినుండియే శ్వాస పుటుచున్నది. కాబట్టి మనస్సు అణగిన ప్రాణము అణగును. లేదా ప్రాణమును అణచిన మనస్సు నిల్చును. ప్రాణము మనస్సుయొక్క స్థూలరూపమే. ప్రాణాయామముగాని ప్రాణగత్యాగతి ప్రత్యవేక్షణము గాని మనస్సును లోబరచుకొనుటకు (లయముచేయుటకు) తోడ్పడునేగాని మినోవినాశమును కలిగించదు. మూర్తి ధ్యానము మంత్రజపము కూడ మనోలయమునకు తోడ్పుడుచున్నవి. మంత్రజపము ప్రాణాయామముతో కూడి యుండవచ్చును.

హృదయమునందు ఆజానరూపమగు మనసై#్సన నేనను సంకల్పము నశించువరకు మనస్సును హృదయమున నిరోధింపవలెను. ఎచ్చట తలపు లుడిగి శాంతి ఏర్పడునో అది ఆత్మస్థానము. యోగములో ప్రాణబంధముచే మనస్సు బంధింపబడుచున్నది. జ్ఞానములో మనోనిగ్రహముచే ప్రాణము బంధింపబడుచున్నది. రెండును ఒక్కటియే. మనోమూలమును వాయుపంచక మూలమును ఒక్కటియే.

ప్రాణాయామము కేవల కుంభకము సిద్ధించువరకు అభ్యసించిన చాలును. అప్పుడు స్వస్వరూపాను సంధానము వీలగును.

రేచక పూరకములను ఆత్మవిచారముతో సోహం భావముతో అభ్యసించి మనస్సును హృదయమున నిలిపి నిరంతర ధ్యానరూప భక్తిచే సమాధి సాక్షాత్కారమును బొందవచ్చునని రమణమహర్షి తెలిపెను.

పై మూడు మార్గములచే దేహాత్మభావమును తొలగించుకొని ఆత్మనిష్టుడవు కమ్మని శ్రీ రమణమమహర్షి సందేశము.

శ్లో|| యో దేహాత్మ మతిక్షయో భవతి త

ద్దానంచ, యజ్ఞ స్తపః

చి ద్వ్యోమాపిచ, సత్యనా, గుతకృపా

ధర్మార్థ కామా అపి

సన్యాసశ్చ మృతిర్వినాపి మరణం

జ్ఞానంచ మోక్షోప్యసౌ

మౌనం, శాన్తిరపి, స్థితిశ్చ పరమా

యోగశ్చ భక్తిః పరా||

దేహాత్మభావమును వదలుటయే దానము, తపము, యజ్ఞము, ధర్మము, ధనము, యోగము, భక్తి, వ్యోమము, శాంతి, సత్యము, శక్తి, మౌనము, నిష్ఠ, చావనిచావు, జ్ఞానము, సన్యాసము, మోక్షము, ఆనందమని ఎఱుంగుము.

ఆత్మానుభవము :-

బాహ్యవిషయములు ఇంద్రియములచే గుర్తించబడును. సుఖ దుఃఖములు మనస్సుచే అనుభవింపబడును. ఇంద్రియములు నామరూపములకంటె వేరగు విషయముల నెరుగజాలవు. ఇంద్రియములచేతను మనస్సుచేతను పొందు అనుభవములేగాక సాక్షి అనుభవమను మూడవ అనుభవజ్ఞాన మున్నది. ఇంద్రియములను మనస్సును అధిగమించిగాని (Transcendental Meditation) ఈ అనుభవమును పొందజాలము, దీనిని సహజస్థితి యని శ్రీ రమణమహర్షి తెలిపెను. మనస్సుచేత గాని వాక్కుచేత గాని దీనిని వర్ణింపలేము. ఆత్మను తెలిసికొనుటకు ఆత్మయే కావలయును.

ఆత్మను గూర్చిన వాదములు :-

ఆత్మ ఉన్నదని, లేదని, ఉండియు లేదని, లేనేలేదని బౌద్ధ చార్వాకాదులు వాదించిరి. కాని ఆత్మ ఈ నాలుగు భావములకు అతీతమని గౌడపాదులు వచించిరి. ఆత్మకు భూత భవిష్యత్తులు లేవు.

శ్లో|| కోట్యశ్చ తస్ర ఏతాస్తు గ్రహై ర్యాసాం సదావృతః

భగవానాభిర స్పృష్టో యేనదృష్టః స సర్వదృక్‌

గౌ||కా|| 4-84

పై నాలుగుభావములులేని ఆత్మ నెఱిగినవాడే సర్వజ్ఞుడని భావము.

అందువలననే భాగవతమున హిరణ్యకశిపుడు హింసించునపుడు ప్రహ్లాదుడు ''ఇట్టిట్టనరాని'' బ్రహ్మంబు తానయై యుండెనట. అనగా ఆత్మను నిర్వచించుటకు వీలుకాదు. అనుభ##వైక వేద్యమని భావము. ఇందులకు బాష్కలునికథ ఉదాహరణముగా చెప్పవచ్చును. ఈకథను భక్తియోగమున వ్రాసి యుంటిని. బ్రహ్మజ్ఞాన ముపదేశింపుమని బాష్కలుడు బాహ్వుడనువానిని కోరెను. అతడేమియు చెప్పకమిన్నకుండెను. మరల బాష్కలుడు ప్రశ్నించెను. అప్పుడును బాహ్వు డూరకుండెను. నాలుగైదు పర్యాయము లట్లు జరుగగా ''నేను చెప్పుచునే యున్నాను. బ్రహ్మస్వరూపము చెప్పుటకు వీలు పడనిది'' అని బాహ్వుడు బదులు చెప్పెను. కాబట్టి నోరు మూసికొని చెప్పుటకు సాధ్యమగునదియు (మౌన వ్యాఖ్యానము) కన్నులు మూసికొనిన పిదప కనబడునదియు తెలియుట మానినపిదప తెలియునదియు ఆత్మయని భావించవలెను.

జ్ఞానము నెట్లు పొందవలెను :-

''నాయ మాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా న బహునా శ్రుతేన'' కఠోపనిషత్తు - ముండకోపనిషత్తు.

బోధనవలన గాని బుద్ధివలన గాని వేదశాస్త్రముల వలనగాని ఆత్మ లభ్యముకాదు.

శ్లో|| త ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉప దేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః

-- గీత 4-34

పెద్దల సేవ చేయుచు మాటిమాటికిని సందేహముల నడిగి తెలిసికొనుచు, అనుభవజ్ఞులయొద్ద జ్ఞానమును పొందుము. అనుభవ జ్ఞానులే నీ సందేహమును దీర్తురు.

పెద్ద లనగా రామస్తవరాజమున నిట్లు చెప్పబడినది.

గీ|| పెద్దలనగ గొప్ప పెనుగొండ లంతేసి

వారుగారు అట్టి వారు గారు

తన్ను దాను గన్న ధన్యులెవ్వారైన

వారె పెద్దలనగ వసుమ తీశ!

తన్ను తా నెఱిగినవాడే అనగా ఆత్మజ్ఞానానుభూతి గలవాడే పెద్ద, అట్టివాని శుశ్రూష చేయవలయును. జీవన్ముక్తినియందు నమ్మకము కలిగి యుండవలయును. జీవన్ముక్తుని పవిత్ర జీవితకథలు మంచిమార్గమును జూపును. పాపులు అతని దర్శనమున పాపవిముక్తలగుదురు. శిష్యులు ముక్తిని గాంతురు.

రామస్తవరాజమున వ్యాసుడు వాచా వేదాంతులగూర్చి ధర్మరాజుతో నిట్లు తెలిపెను. వీరు అనుభవజ్ఞానములేని శుష్క వేదాంతులు. వీరిని నమ్మిన మార్గము చూపింపజాలరు.

సీ|| బ్రహ్మంబు నేనని పలుమారు ననవచ్చు

బ్రహ్మబోధ మెఱుంగు భావ మరుదు

వేదాంత శాస్త్రముల్‌ విభజింపగా వచ్చు

నాత్మ ధర్మము దెల్పు టదియు నరుదు

సర్వంబులును రోసి సన్యాసి ననవచ్చు

శూన్యమార్గంబులో జొచ్చుటరుదు

ఇవి బంధమోక్షంబు లని చెప్పగావచ్చు

తానుగా నిలకడ దనరు టరుదు

గీ|| #9; తనువు నర్థంబు గురునికి ననగ వచ్చు

దారి మొనసిన లోభంబు దీరు టరుదు

మనసు సామర్థ్య మెఱగెడి మర్మ మరుదు

అంతదానయ్యు గాకుండుటదియు నరుదు.

రామస్తవరాజము వాచా వేదాంతులను నిందించుచున్నది.

గీ|| శుష్క వేదాంత సిద్ధాంత సూరివరులు

ఆత్మ నెఱుగక నర్థముల్‌ వ్యర్థముగను

జెప్పుచుందురు లోకుల జెరచుకొరకు

నిజము నిష్ఠూరమై కల నిజములాయె.

-- రామస్తవరాజము

ఆత్మ నెఱిగిన సద్గురువు నాశ్రయించిన గాని ఆత్మజ్ఞానము కలుగదని భాగవతమున ప్రహ్లాదు డిట్లు చెప్పెను.

ఉ|| #9; కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువున్‌

గానని యట్లు. - భాగవతము 7-183

గ్రుడ్డివాని వెంట బడినవాడు గమ్యము చేరజాలడు గదా.

శాస్త్రజ్ఞోపి స్వాతన్త్య్రేణ బ్రహ్మజ్ఞానా న్వేషణం నకుర్యాత్‌ ఇత్యేతత్‌ గురుమేవ.

శాస్త్రజ్ఞాని స్వయముగా బ్రహ్మజ్ఞానము సంపాదించుటకు ప్రయత్నింపరాదు. గురూపసత్తి లేనిదే ఆత్మజ్ఞన ముదయింపదు.

అవిద్యను తొలగించిన ఎడల ఆత్మజ్ఞానము కలుగునని కొందరందురు. కాని అవిద్య ఎవరికున్నది? నే నెవరని తెలిసికొన ప్రయత్నిస్తే సందేహ నివృత్తి కలుగను. ఆత్మను తెలిసికొనుటకు బుద్ధి అవసరములేదు. మనస్సును అంతర్ముఖముచేసిన చాలును. సూర్యుని చూచుటకు ఇతర దీపము లెందులకు? మనస్సు బుద్ధి - ఇవి ప్రకృతి కార్యములే. జ్ఞానము సాత్విక రాజసిక తామసికములని మూడు విధములు. బుద్ధికి సాత్విక జ్ఞానము కలిగిన త్రిగుణాత్మకమగు ప్రకృతి వేరనియు తాను వేరనియు గ్రహించును. ముక్తుడగును. దీనిని గుణత్రయా తీత భక్తియని భాగవతము తెలుపుచున్నది.

శ్లో|| భక్తియోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే

స్వభావగుణ మార్గేణ పుంసాం భావో విభిద్యతే

-- 3-29-7

శ్లో|| అభిసంధాయ యోహింసాం దంభం మాత్సర్య మేవవా

సంరంభీ భిన్న దృగ్భావం మయి కుర్యా త్స తామసః

-- 3-29-8

శ్లో|| విషయా నభి సంధాయ యశ ఐశ్వర్యమేవ నా

అర్చాదా వర్చయే ద్యోమాం పృధక్‌ భావః సరాజసః

-- 3-29-9

శ్లో|| కర్మ నిర్హార ముద్దిశ్య పరస్మిన్‌ వా తదర్పణం

యదే ద్యష్టవ్య మితివా పృథక్‌ భావః ససాత్వికః

-3-29-10

శ్లో|| మద్గుణశ్రుతి మాత్రేణ మయి సర్వ గుహాశ##యే

మనోగతి రవిచ్ఛిన్నా యథా గంగామ్భసోమ్బుధౌ

--3-29-11

శ్లో|| లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హ్యుదాహృతం

అహైతుక వ్యవహితా యాభక్తిః పురుషోత్తమే

--3-29-12

శ్లో|| సాలోక్య సార్‌ష్టి సామీప్య సారుపై#్యకత్వ మప్యుత

దీయమానం న గృహంతి వినా మత్సేవనం జనాః

--3-29-13

శ్లో|| స ఏవ భక్తియోగాఖ్యా ఆత్యంతిక ఉదాహృతః

యే నాతివ్రజ్య త్రిగుణం మద్భావా యోపపద్యతే

--3-29-14

జ్ఞానయోగ మెప్పుడు సిద్ధించును :-

ఆత్మను గూర్చి చదివినను విన్నను దేహము ఆత్మకాదను భావము అనుభవమునకురాదు. మనస్సు నిశ్చలముకాదు. అట్లయిన జ్ఞానయోగ మెప్పుడు సిద్ధించును? శ్రీకృష్ణభగవాను డిట్లు తెలిపెను.

శ్లో|| యదాతే మోహాకలిలం బుద్ధి ర్ప్యతి తరిష్యతి

తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యప్య శృతిస్యచ

--గీత 2-52

నీ బుద్ధియందు దేహమే నే ననియెడు తలంపు ఎప్పుడు విడచి పోవునో ఆ సమయమునందు కర్మకాండచే వినదగినదానిచేతను ఇది వరకు వినినదానితోడను ప్రయోజనములేదు. కావున నీవు వినదగిన యర్థము లందును విన్న యర్థములందును వైరాగ్యము గలుగును.

శ్లో|| శ్రుతి విప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా

సమాధా వచలా బుద్ధి స్తదా యోగ మవాప్స్యపి

గీత 2-53

వేదాంత చలనముచేత చలనముబొందిన నీ బుద్ధి ఎప్పుడు సమాధియందు నిశ్చలముగా నిలచునో అప్పుడు జ్ఞానయోగమును తద్వారా దుఃఖనివృత్తి ఆనందప్రాప్తి పొందగలవు.

శ్రవణ మనన నిధిధ్యాస లనగా, ఎ) సదా హృదయ కుహరమున అహమహమని భాసించు ఆత్మస్ఫురణ నెఱుగుటయే అంతః శ్రవణమనియు, బి) దానియందు నిలకడ నలవరచుకొనుట మనన మనియు, సి) అది తానుగా నిలుచుట నిధిధ్యాసమనియు శ్రీరమణ మహర్షి వచించిరి.

సన్యాసయోగము జ్ఞానయోగ మెప్పు డగును :

ఉపనిషత్తులు చెప్పు జ్ఞానమార్గమునకును గీతతోని జ్ఞానయోగమునకును భేదము కలదు. శాస్త్రపఠనముచే ఆత్మవిషయమై వాచిక జ్ఞానమును పొంది తక్షణమే కర్మలు వదలి గురుముఖముగా శ్రవణమనన నిది ధ్యాసనములు చేయవలెనని ఉపనిషత్తుల నాధారముగాగొని జానవాదులు సూచింతురు. కాని శాస్త్రపఠనమువలన కలిగిన వాచిక జ్ఞానముచే కర్మ వదలదనియు, ఇంద్రియములను కదలింపక ఉంచినను మనస్సు నిర్విషయముగాను, నిశ్చలముగాను వాసనా రహితముగాను ఉండదనియు భగవద్గీత తెలుపుచున్నది. అందువలన సమత్వబుద్ధితో నిష్కామకర్మ నొనరించిన బుద్ధి నిశ్చలమగునని శ్రీకృష్ణుడు ఉపదేశించెను.

సన్యాసులు రెండు విధములు. ఆత్మజ్ఞానమును పొంది సన్యసించినవారు కొందరు. ఆత్మజ్ఞానమును పొందుటకై సన్యసించినవారు కొందరు. మొదటికోవకు చెందినవారికి కర్తవ్యములు విధి నిషేధములు లేవు. రెండవకోవకు చెందినవారికి వాచికజ్ఞానమేకాని ఆత్మాను భవజ్ఞానముండదు. వారు నిష్కామకర్మ నాచరింపవలయును. శ్రవణ మననాదులు చేయవలయును.

నేనను సంకల్పము త్యజించుటయే సన్యాసమగునుగాని బాహ్య విషయముల త్యజించుట గాదు. సంకల్ప వికల్పములను వదలుట సన్యాసము. సంకల్ప వికల్ప రూపమగు మనోవ్యాపారమే కుటుంబము. చిత్త శుద్ధి పరిపాకమే సన్యాస స్వీకరణమున కర్హత గూర్చును.

అందువలన శ్రీకృష్ఠు డిట్లు తెలిపెను.

శ్లో|| జ్ఞేయస్స నిత్య సన్యాసీ యోనద్వేష్టి నకాంక్షతి

నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బన్ధా త్ర్పముచ్యతే

గీత 5-3

ఒకటి ద్వేషింపక ఒకటి కోరక రాగద్వేషములు జయించిన వాడు కర్మ చేయుచున్నను సన్యాసియే. సంసారరూపమగు బంధము నుండి అట్టివాడు విడుదల యగును.

శ్లో|| సన్యాసస్తు మహాబాహో! దుఃఖమాప్తు మయోగతః

యోగయుక్తోముని ర్ర్బహ్మా నచిరేణాధి గచ్ఛతి

గీత 5-6

కర్మయోగ మాచరింపని సన్యాసము నిర్వహించుట కష్టతరము. నిష్కామ కర్మయోగానంతరము బొందు సన్యాసము వెంటనే ముక్తిని గూర్చును.

శ్లో|| అనాశ్రితః కర్మఫలం కార్యం కరోతి యః

స సన్యాసీచ యోగీచ న నిరగ్ని ర్నచాక్రియః గీత 6-1

కర్మ ఫలాపేక్ష వదలి తనకు నియమితమగు కార్యము నెవడు చేయుచుండునో అతడే సన్యాసి, అతడే యోగి. కేవల కర్మలను వదలినవాడు సన్యాసియు గానేఱడు. యోగియును గాడు.

శ్లో|| యం సన్యాస మితిప్రాహు ర్యోగం తం విద్ధి పాండవ!

న హ్యస న్న్యస్త సంకల్పో యోగీభవతి కశ్చన

గీత 6-2

దేనిని సన్యాసమని చెప్పుదురో అద్దానిని నీవు యోగమని తెలియుము. ఎవడు మనస్సుయొక్క సంకల్పములు త్యజింపలేడో వా డెన్నటికి యోగి కాజాలడు.

త్యాగోనైకే అమృతత్వ మాయసీ

త్యాగము మూడు విధములు. ''త్రివిధ స్సంప్రకీర్తితః''

గీత 18-4

కర్మత్యాగము, కర్మఫలత్యాగము, కర్తృత్వత్యాగము.

శ్లో|| ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాదిచ

కర్తవ్యానీతి మే పార్థ! నిశ్చితం మత ముత్తమమ్‌

గీత 18-6

యజ్ఞ దాన తపః కర్మలను మమత్వము ఫలాకాంక్షను విడచి చేయవలయును.

శ్లో|| ఆరు రుక్షో ర్మునే ర్యోగం కర్మకారణ ముచ్యతే

యోగారూఢస్య తసై#్యవ శమః కారణ ముచ్యతే

గీత 6-3

ప్రారంభమున ముక్తిని పొందుటకు ముముక్షువునకు నిష్కామ కర్మయే సాధనము. ముక్తి నొందినవానికి (యోగమునందు నిలకట జెందిన తరువాత, చిత్తవృత్తి నిరోధము ధ్యానస్థితి ఏర్పడిన తర్వాత) శమము లేదా కర్మనివృత్తి కారణమగును.

సామ్యబుద్ధితో నిష్కామముగా కర్మ నాచరించిన తరువాత బుద్ధి నిశ్చలమగును. అటుపై ఏకాంతమున ధ్యానమార్గము నవలంబింపవలెను. భగవంతునియందు మనస్సు లగ్నమొనర్చి ఆత్మసాక్షాత్కారము పొందవలెను. ఈశ్వరానుగ్రహము లేనిది బుద్ధిబలముచేత ఆత్మసాక్షాత్కారము కలుగదు. సూర్యు డగుపించగనే చీకటి తొలగినట్లు ఆత్మసాక్షాత్కారము లభించగనే సంసారము తక్షణమే తొలగును. క్రమేణ సంసారము తొలగునని చెప్పుట సత్యముకాదు. కాబట్టి ప్రారంభమున నిష్కామ కర్మయోగివి కమ్మని శ్రీకృష్ణు డుపదేశించెను.

జ్ఞానసాధనము - గీత:-

శ్లో|| వీతరాగ భయక్రోధా మన్మయా మా ముపాశ్రితః

బహవో జ్ఞాన తపసా పూతా మద్భావ మాగతాః

గీత 4-10

రాగద్వేషములు వదలినవాడై ప్రపంచమంతయు నా మయముగా జూచుచు, నన్నాశ్రయించుటచే అనేకులు పవిత్రులై చక్కని జ్ఞానమును బొంది నా భావమును బొందిరి.

శ్లో|| అమానిత్వ మదమ్భిత్వ మహింసా క్షాంతి రార్జవమ్‌

ఆచార్యో పాసనమ్‌ శౌచం స్థైర్య మాత్మ వినిగ్రహః

గీత 13-8

తన్ను దాను పొగడుకొనక యుండుట, తన ధర్మము తాను ప్రకాశము చేసికొనకయుండుట, హింస చేయకయుండుట, క్షమ, కృత్రిమము లేకపోవుట, గురుసేవ, బాహ్యాభ్యంతర శుచి, ఎన్ని విష్నుములు వచ్చినను మోక్ష మార్జించుటయందే స్థిరచిత్తము. మనో నిగ్రహము కలిగియుండుట.

అమానిత్వము అనగా తన్నుతాను పొగడుకొనకయుండుట. దీనికి ఉదాహరణముగా శ్రీరామకృష్ణ పరమహంస తెలిపిన ఒక కథ కలదు. అతని శిష్యులలో ఇద్దరు ఒకరికంటె ఒకరు గొప్పవారని తగవులాడి తీర్పుకొరకు పరమహంస వద్దకు వెళ్ళిరి. పరమహంసలోన నవ్వుకొని మీరిద్దరు గొప్పవారు కాదని తీర్పు చెప్పెను. అట్లయిన మాకంటె గొప్పవాడెవడని వారు ప్రశ్నించిరి. దానికి బదులుగా ''ఇతరుల గొప్పతనము గ్రహించువాడే నిజమైన గొప్పవాడని'' తెలిపెను. శిష్యులు నిరుత్తరులైరి.

శ్లో|| ఇంద్రియార్థేషు వైరాగ్య మన హంకార ఏవచ

జన్మమృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనమ్‌

గీత 13-9

విషయములయందు వైరాగ్యము అహంకారము లేకయుండుట, జన్మము మరణము ముసలితనము రోగము దుఃఖము వీటియందు దోషముల నరయుట.

శ్లో|| అసక్తి రనభిష్వంగః పుత్రదారా గృహాదిషు

నిత్యంచ సమ చిత్తత్వ మిష్టా నిష్టో పపత్తిషు

గీత 13-10

పుత్రులు భార్య గృహాదులయందు ఆసక్తి లేకయుండుట ఇష్టా నిష్ట ప్రాప్తులయం దెల్లప్పుడు సమబుద్ధి గలిగియుండుట.

శ్లో|| మయి చానన్య యోగేన భక్తి రవ్యభిచారిణీ

వివిక్త దేశ సేవిత్వ మరతి ర్జన సంపది గీత 13-11

భగవదేతరచింతలేక నేనే గతియని నమ్మి నాయందు స్థిరమైన భక్తి కలిగియుండుట, జన సమూహమునందు ప్రీతి లేక యుండుట.

శ్లో|| అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్త్వ జ్ఞానార్థ దర్శనమ్‌

ఏత జ్ఞాన మితి ప్రోక్త మజ్ఞానం యదతోన్యధా

గీత 13-12

ఆత్మజ్ఞానమునందు నిత్యభావము కలుగుట, మోక్షప్రాప్తియందే ప్రయోజనదృష్టియుండుట ఇదియంతయు జ్ఞానమని చెప్పబడినది. దీనికన్న వేఱౖ నదంతయు అజ్ఞానము.

సాత్విక రాజసిక తామసిక జ్ఞానములు :-

శ్లో|| సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్షతే

అవిభక్తం విభ##క్తేషు తజ్‌జ్ఞానం విద్ధి సాత్వికమ్‌

గీత 18-20

సర్వభూతములు బాహ్యదృష్టికి వేఱ్వఱుగా కనబడుచున్నను అందున్న నాశరహితమగు నైక్యభావ యొక్కటియే యని తెలియు జ్ఞానము సాత్వికజ్ఞానము.

శ్లో|| పృథక్త్వేన తు యజ్‌జ్ఞానం నానాభావాన్‌ పృథ గ్విధాన్‌

వేత్తి సర్వేషు భూతేషు తజ్‌జ్ఞానం విద్ధి రాజసమ్‌. గీత 18-21

సమస్త భూతములయందును వేఱ్వఱుగా దోచు భావములను బాహ్యదృష్టికి గోచరించునట్లే యాంతర్యమునందుకూడ వేఱ్వఱుగనే జ్ఞానముతో తెలిసికొనుచున్నాడో అట్టిది రాజసజ్ఞానము అని తెలియుము.

శ్లో|| యత్తు కృత్స్న వదే కస్మిన్కార్యే సక్త మహైతుకమ్‌

అతత్వార్థవ దల్పంచ తత్తామస ముదా హృతమ్‌.

గీత 18-22

ఏ జానము సమస్తమునందు వలెనే అయుక్తము నైయున్నదో అయ్యది తామసజ్ఞానమని చెప్పబడుచున్నది.

ఉపాసనకు జ్ఞానమునకు గల భేదము ;- జ్ఞానమునకు కర్మయోగము బహిరంగసాధనము.

విషయచింతనల వీడి భగవచ్చింతన యలవరచుకొనుట ఉపాసన. అనగా పరమేశ్వరుని దివ్యగుణములు నిరంతరము స్మరించుట. ఆంతరంగిక ఉపాసనమే ధ్యానము.

జ్ఞాన ధ్యానములకుగల భేదమును శంకరు లిట్లు వివరించిరి.

''ధ్యానం చింతనం యద్యపి మానసం తథాపి పురుషేణ తంత్రత్వాత్‌!

జ్ఞానంతు వ్రమాణజన్యమ్‌! ప్రమాణంచ యథా భూత వస్తు విషయం అతోజ్ఞానం కర్తు మకర్తు మన్యథావా కర్తు మశక్యమ్‌| కేవల వస్తుతన్త్ర మేవ తత్‌ | నచోదనా తంత్రమ్‌ | నాపి పురుషతంత్రమ్‌ | తస్మాత్‌ మాసత్వే7పి జ్ఞాన స్య మహద్‌ వైలక్షణమ్‌ |

మానసవృత్తులైన జ్ఞాన ధ్యానములకు భేదము కలదు. ధ్యాన మనగా క్రియ. జ్ఞానమనగా వస్తువుయెడ మనకుగలుగు ఎఱుక.

ధ్యానము పురుషతంత్రము. శాస్త్రమున తెలిపినట్లు చింతన చేయవచ్చును. వదలవచ్చును లేదా వేరొక విధముగా చేయవచ్చును. కాన అది పురుషతంత్రము (సాల గ్రమమును విష్ణువుగా చింతించుట)

జ్ఞానము ప్రమాణజన్యము, ఉన్న వస్తువును ఉన్నట్టే తెలుపునది. దానిని వదలిపెట్టలేము; మరొక విధముగా చేయలేము. అది వస్తుతంత్రము.

జ్ఞాన ధ్యానములు మనోజన్యములైనను వాని మధ్య పై భేదము కలదు.

ఉపాసనల ఉపయోగమేమి? శ్రీ శంకరులు ఇట్లు తెలిపిరి.

''తాన్యేతాని ఉపాసనాని సత్త్వ శుద్ధి కరత్వేన వస్తుతత్త్వావ భాసకత్వాత్‌ అద్వైత జ్ఞానోపకారకాణి. ఆలమ్బన విషయత్వాత్‌ సుసాధ్యానిచ పూర్వ ముపన్య స్యనై'' - (ఛాం|| భా||)

ఉపనిషత్తులలో అద్వైత జ్ఞానమునేగాక తత్పూర్వసాధనమైన ఉపాసనముకూడ చెప్పబడినది. ఉపాసనలవలన చిత్త దోషము తొలగి జ్ఞానము ముదయించును.

ఉపాసన లనగా కర్మాంగోపాసనలు, ప్రతీకోపవాసనలు, ప్రతీకోపాసనలు అహుగ్రహోపాసనలు.

జ్ఞేయ స్వరూపము :-

శ్లో|| జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యద్‌ జ్ఞాత్వా 9మృత మశ్నుతే

అనాది మత్పరం బ్రహ్మ న సత్త న్నాస దుచ్యతే

గీత 13-13

దేనినితెలిసికొనిన వానికి ముక్తి కలుగునో, యేది అనాదియైనదో, యేది పరబ్రహ్మమో,సత్తనిగాని అసత్తనిగాని దేనిని చెప్ప వీలులేదో అట్టి జ్ఞేయమును దెల్పుచున్నాను.

అతి ప్రాచీనమైన ఋగ్వేదీయ నాసదీయ సూక్తముకూడ పరమాత్మ నిట్లే వర్ణించినది.

శ్లో|| సరతః పాణి పాదం తత్సర్వతో9క్షి శిరోముఖమ్‌

సరతశ్శృతి మల్లోకే సర్వ మావృత్య తిష్ఠతి.

గీత 13-14

ఆ బ్రహ్మము అన్ని దిక్కులయందు చేతులు కాళ్ళు కన్నులు శిరస్సులు ముఖములు చెవులు గలిగినదై లోకమంతయు నాచరించి యున్నది.

శ్లో|| సర్వేంద్రియ గుణాభాపం గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమ్‌

అసక్తం సర్వ భృచ్చైవ నిర్గుణం గుణ భోక్తృచ

గీత 13-15

ఇంద్రియ వ్యాపారములచే ప్రకాశించుచున్న దానివలె నుండినను, మోక్షదశయందు సకలేంద్రియ రహితమైనది. దేనిని అంటకయున్నను సర్వమును ధరించియున్నది., గుణము లేనిదైనను గుణముల ననుభవించు నట్టిది.

శ్లో|| బహి రంతశ్చ భూతానా మచరం చరమేవచ

సూక్ష్మత్వాత్తదవి జ్ఞేయం దూరస్థం చాంతికేచ తత్‌

గీత 13-16

ఆ బ్రహ్మము చరాచరముయందు లోపల వెలుపల నుండునది. చాలా సూక్ష్మమైన రూపముగలది. కావున తెలిసికొన నశక్యమైనది. దూరముగా నుండునది. దగ్గరగా నుండనుది.

శ్లో|| అవి భక్తంచ భూతేషు విభక్త మివచ స్థితమ్‌

భూత భర్తృచ తద్‌జ్ఞెయం గ్రసిష్టు ప్రభ విష్ణుచ

గీత 13-17

ఆ బ్రహ్మము సకల ప్రాణులయం దభేదముగనున్నను ఉపాధి భేదముచేత అజ్ఞానులకు వేఱుగా విభజింపబడిన దానివలె నుండును. సృష్టి స్థితి లయములకు కారణమని ఎఱుగుము.

శ్లో|| జ్యోతిషామపి తజ్యోతి స్తమసః పర ముచ్యతే

జ్ఞానం జ్ఞెయం జ్ఞానగమ్యం హృది సర్వస్యధిష్టితమ్‌

గీత 13-18

ఆ బ్రహ్మము జ్యోతిస్వరూపులగు చంద్ర సూర్యాదులనుగూడ ప్రకాశింపజేయునది. అజ్ఞానముకంటె వేఱౖనది. జ్ఞానముచేతనే తెలియదగినది. జ్ఞాన స్వరూపమైనది. తెలిసికొనియే తీరవలసినది. సర్వ భూత హృదయముల నున్నదని చెప్పబడును.

జ్ఞానుల కర్మ చేయవలయునా? సన్యాస స్వీకరణ అధికారము :-

జ్ఞానులు రెండు తెగలు. 1) ప్రవృత్తి మార్గాచరణులు. 2) నివృత్తి మార్గాచరణులు. జ్ఞానులు కొందరు లోక సంగ్రహార్థమై నిష్కామకర్మను చేయుదురు. కొందురు శరీరనిర్వాహమునకై భిక్షాట నాది కర్మలు చేయుదురు.

శ్లో|| యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం భుధాః

గీత 4-19

అట్టివారు జ్ఞానాగ్నిచే దహింపబడిన కర్మలు కలవారగుటచేత బ్రహ్మవేత్తలని చెప్పబడుచున్నారు. జ్ఞానము కలిగన పిదప లోక సంగ్రహార్థము చేయబడు కర్మ శంకరులు దృష్టిలో కర్మకాదు.

యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః

ఆత్మన్యేవచ సంతుష్ట స్తస్య కార్యం న విద్యతే

గీత 3-17

నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన

న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః

గీత 3-18

ఏ మనష్యుడు ఆత్మయందు రమించువాడగునో ఎవడు దాని చేతనే తృప్తుడగునో మఱియు దానియందే సంతోషము బొందునో నతడు జేయవలసినది. దేదియు నుండదు. అట్టి ఆత్మనిష్ఠ గలవానికి లోకమందు ఏ కార్యమునైన జేయుటవలన ప్రయోజనము లేదు. అత డేప్రాణులను దేనికిని ఆశ్రయించవలసిన పనిలేదు.

చిత్త శుద్ధి లేనిచో విచారముచేయుటచేత మాత్రమే జ్ఞానము కలుగదు. వర్ణాశ్రమ విహిత కర్మలు చేసినగాని చిత్త శుద్ధి కలుగదని శంకరులు తెలిపిరి.

''బ్రాహ్మణా నామేవ అధికారో వ్యుత్థానే''

--- బృహదారణ్య భాష్యము

బ్రాహ్మణునకే సన్యసించుట కధికారము కలదు. అనగా ప్రవృత్తి వివృత్తుల రెండింటి యం దధికారముకలదు.

''ఇతర వర్ణాపేక్షయా వా యావజ్జీవ శ్శృతాః

నహి క్షత్రియ వైశ్యయోః పారివ్రాజ్యాపత్తి రస్తి''

--- బృహదారణ్యభాష్యము

జ్ఞాని క్షత్రియుడో వైశ్యుడో అయినప్పుడు ప్రవృత్తి మార్గమునే అవలంబించవలెను. సన్యసింపరాదు. ఈ నియమము పూర్వకాలము నుండి పాటింపబడెడిది. ఉదాహరణమునకు త్రిపురా రహస్యమను పురాతన గ్రంథమున జ్ఞానఖండమునందు ఒక రాజర్షి తాను క్షత్రియు డగుటచేత తాను సన్యసించుటయకు వీలుకాదని చెప్పికొనెను. నిష్కామకర్మ యోగాచరణముననే జనకాదులు జ్ఞానులైరని గీత తెలుపుచున్నది.

జ్ఞానాదేవహి కైవల్యమ్‌ :-

శ్రీ శంకరులు ''జ్ఞానాదేవహి కైవల్యం'' అని తెలిపిరి. ఆత్మ సాక్షాత్కారము కలిగినప్పుడే ముక్తి లభించునని అభిప్రాయము. ఆత్మ సాక్షాత్కారము కేవల ఆత్మానాత్మ విచారముచేత మాత్రమే కలుగునని జ్ఞానవాదుల అభిప్రాయము. భక్తి, ధ్యానము మంత్ర జపాదులచే ముక్తి అభింపదాయను సందేహము కలుగును. ఈ సందేహనివృత్తి కొరకు శ్రీ వాశిష్ఠగణపతిముని రమణుని ప్రశ్నించెను. తొలుత రమణ మహర్షి మోక్షమార్గమును గూర్చి ఆత్మానాత్మ విచారమును తెలిపెను. ఆపై గణపతిముని ఇట్లుప్రశ్నించెను.

క|| #9; ఈ ఆత్మ విచారముగా

కే అన్య పథమ్ము గలుగునే ముక్తికి?

దీనికి సమాధానముగా మహర్షి ఇట్లు తెలిపెను.

అతీంద్రియమును అమనస్కమును అగు ఆత్మానుభూతి 1) ఏకవస్తు చింతనముచేతను 2) మంత్ర జపాదులచేతను కలుగుననియు జ్ఞానము నే మార్గమున సంపాదించినను ముక్తి సిద్ధించుననియు అతడు తెలిపెను.

క|| ఏకమ్మును ధ్యానింపగ

నేకాకృతకి యగును జిత్త మేకాకృతిగా

నీ కరణి జిత్త మునకున్‌

సాకల్యముగా స్వరూప సంస్థితి కలుగున్‌

--- రమణగీత

క|| దేవతయో మఱి మంత్రం

బో, వేఱొక మేలి లక్ష్యమో ధ్యేయముగా

నా వస్తు వాత్మయన ఘన

మే వెలుగున దాసు లీనమగు నంత్యమునన్‌.

ధ్యాతకు కోరకయే సహజస్థితి కలుగును. ఆత్మ విచారకునకు తెలిసి సహజస్థితి కలుగును. కాబట్టి ధ్యాతకు ఆత్మవిచారకునకు గతి ఏకమే యగును.

క|| #9; కోరకయే మనుజుడు సం

స్ఫార ధ్యానమున నాత్మ సంస్థితి నొందున్‌

ధారుణిలో, నిక నాత్మవి

చారకుడో ఎఱిగి ఆత్మ సంస్థితుడ యగున్‌

క|| #9; ఈతీరున గతి ఏకమె

ధ్యాతయు స్వవిమర్శకుండు నను నిరువురకున్‌;

ఆతత శాంతిని గను నొక

యాతడు ధ్యానింప; నెఱిగి యన్యుం డడగున్‌.

é ---- రమణగీత

భారతములో మరుత్తుని చరిత్రము ధ్యాతకుకూడ మోక్షము కలుగునని సూచించున్నది. మరత్తు యజ్ఞముసేయుటకై బృహస్పతి సహాయము కోరెను. బృహస్పతి బుద్ధికి సంకేతమని భావించిన ఈ యజ్ఞము ఆత్మానాత్మ విచార మనవచ్చును. ఇంద్రుని (ఇంద్రియములు) కోర్కెచే బృహస్పతి నిరాకరించెను. బృహస్పతి (ఆంగిరసుడు) పిన్నకొడుకు సంవర్తుడు. ఆతడు కాశికాపురి బాయక వర్తించువాడు. కాశి అనగా ''వారాణ అసి'' లేదా ముక్కుకొన (భ్రూమధ్యము) శవమును జూచిన నివర్తించువాడు సంవర్తుడు. అనగా ప్రాణవాయు వని చెప్పవచ్చును. భ్రూమధ్యమున దృష్టియుంచి గురుస్థానమైన, ఉపజిహ్వమీదుగ ప్రాణగత్యాగతి ప్రత్యవేక్షణము సలిపినచో కుంభకము సిద్ధించి సమాధి స్థిత కలుగును, ఆత్మాసాక్షాత్కార మగుమ మరుత్తు సంవర్తు నాశ్రయించెను. ''సంస్తంభ విద్యావ్రశస్త వైభవమున''మరత్తు ఇంద్రుని వజ్రమును బ్రతిహతము చేసెను. యజ్ఞము నిర్విఘ్నముగా జరిగెను.

పై కథవలన ఆత్మానాత్మ విచారముననేకాక ప్రాణాయామమున కూడ ఇంద్రియజయము ఆత్మసాక్షాత్కారము పొందవచ్చునని తెలియుచున్నది.

శ్రీ రమణమహర్షి గ్రంథపఠనముచే ఆత్మానాత్మ విచారము చేయక ధ్యానసాధనచే జీవన్ముక్తుడయ్యెను. తరువాత గ్రంథములను చదివి అందులోని విషయములు తన అనుభవమునకు వచ్చియుండెనని తెలిసికొనెను.

జీవన్ముక్తి, విదేహముక్తి :-

ఈ రెండింటికి భేదములేదు. దేహముతో నున్నప్పుడు జ్ఞానిని జీవన్ముక్తు డందురు. దేహమును వదలినచో విదేహముక్తిని పొందె నందురు. జ్ఞాని ఈ భేదమును పరిగణన సేయడు. దేహము తాను కాదని జ్ఞాని గుర్తించుటచేత ఆత్మయే తానని గ్రహించును. జ్ఞానిని మనము దేహముతోనున్న రూపముగా భావింపరాదు. ఆత్మ అంతటనిండియుండుటచేత దేహమున బంధింపబడియుండదు. రమణమహర్షి దీనికొక యుదాహరణమును తెలిపెను. తాగినవానికి మేనిపై గుడ్డ ఉన్నదా లేదా తెలియనట్లే జ్ఞానికి తన దేహమును గూర్చి తెలివియుండదు. ఆత్మ జ్ఞానము పొందుటకు వేదములు ఉనిషత్తులు అనుసరించి మార్గము - అధ్యారోప అపవాద ప్రక్రియ.

&#ఆత్మానుభూతిని పొందుటకు ఉపనిషత్తులు వేరు వేరుమార్గముల సూచించినను అవి అనుసరించిన ప్రక్రియ ఒక్కటే. అది అధ్యారోపఅపవాద ప్రక్రియ. ఈ ప్రక్రియనే గౌడపాదులు శంకరాచార్యులు అనుసరించిరి. ఈ ప్రక్రియనే శ్రీ సచ్చిదానంద్రేంద సరస్వతీ స్వాముల వారు తాము రచించిన ''వేదాంత ప్రక్రియా ప్రత్యభిజ్ఞ'' అను గ్రంథ ములో క్రింది విధముగా వివరించిరి.

''The upanishads uniformly employ the method of deliberate super imposition and subsequent rescission.''

ఆత్మనుగూర్చిన నిర్వచనముగాని నిరూపణగాని అవసరములేదు.

''The Atman or self is never in need of any definition or proof of its being known''

దీనిని తెల్పుటకు శంకరుడు సర్పరజ్జు భ్రాంతిని ఉదాహరణముగా సూచించెను. ఉన్నది తాడు మాత్రమే. మన భ్రాంతివలన అది పామువలె అగుపించుచున్నది. భ్రాంతి తొలగగనే తాడుగా అగుపించును. అట్లే మనము ఆత్మను ఆత్మగా చూచుటలేదు. ఆత్మను దేహమనీ, ప్రాణమనీ, మనస్సనీ దానిపై అధ్యారోపణ చేసికొనుచున్నాము. ఇట్టి భ్రాంతిని తొలగించినంతనే ఆత్మ తానుగా భాసించును గదా? అనగా అధ్యారోపమును అపవాదముచే తొలగింపవలయునని తెలియుచున్నది. త్రాడునుగూర్చి తెలుప నవసరములేదు. అట్లే ఆత్మనుగూర్చి తెలుప నవసరము లేదు. అధ్యారోపమువలన కలుగు భ్రాంతిని అపవాదముచే (అనగా నేతినేతి మార్గముచే, ఆత్మ దేహము కాదు, ఇదికాదు, అదికాదు అను అపవాదముచే) తొలగించినంతనే మిగులునది ఆత్మయే కదా.

''Brahman being the self of everyone need not be established at all. Only the super impostitons on it have to be discarded by negation of all duality by the method of అధ్యారోప అపవాద''.

త్రాడు సర్పమను భ్రాంతి మనకు అవిద్యవలన కలుగుచున్నది. ఈ భ్రాంతి సద్గురూపదేశముతో తొలగింతనే ఆత్మ మిగులుచున్నది. ఆత్మ నిత్యము సత్యము.

Give up mental aberration due to avidya and return to our Brahmanic nature which is really ours now and for ever.

కొన్ని ఉపనిషత్తులలోని అధ్యారోప అపవాద ప్రక్రియ పరిశీలింతము. 1) మాండూక్యమునందు జాగ్రత్‌ స్వప్న సుషుప్త్యవస్థలు తెల్పబడినవి. బ్రహ్మము అవస్థాత్రయా తీతమని చెప్పబడినది. అవస్థాత్రయము అపవాదము చేయబడి దానికి సాక్షిగా నున్నది ఆత్మయని నిరూపింపబడినది. 2) కేనోపనిషత్తున నామరూపము లపవాదము చేయబడినవి. 3) బృహదారణ్యకమున వ్యతిరేకవస్తువు లపవాదము చేయబడినవి. 4) ఆత్మోపనిషత్తునందు స్థూలసూక్ష్మ కారణదేహములు అపవాదము చేయబడినవి. ఇట్లే ఇతర ఉపనిషత్తులలో పంచకోశములు పంచభూతములు అపవాదము చేయబడినవి. పైవిధముగా అధ్యారోప అపవాద ప్రక్రియచే ఆత్మవిద్య అనుచానముగా గురువులచే మనకు బోధింపబడుచున్నది.

బ్రహ్మమునకు నామరూపాదులు లేవు. నిర్గుణుడనీ నిరాకారుడనీ నిరంజనుడనీ పెక్కు నామములచే వర్ణించుచున్నాము. బ్రహ్మము అద్వితీయమైనప్పనిటికిని ఉపాసనా సౌలభ్యమునకై రూపకల్పన చేయబడినది. కొన్ని సమయములయందు ఆ పరమాత్మయే భక్త రక్షణార్థమై దేవతా కార్యసిద్ధికై మాయచేత కల్పింపబడిన అవతార మెత్తుటయు కలదు.

''From the highest stand point Brahman has no attributes, whatever of its own and has on second to it. But from the emperical stand point he is meditated upon as endowed with attributes. Even the supreme lord may at his pleasure assure a bodily shape formed of maya in order to favour his divotees.

శ్రీ శంకరాచార్యులు పరమాత్మయొక్క నిర్గుణ సగుణ అవస్థలు సూచించుటకై పరబ్రహ్మమని అపరబ్రహ్మమని రెండు నామములు వాడెను. కేవల నిర్గుణ పరబ్రహ్మమును అద్వైతభావముతో విచారించి ఆత్మానుభూతిని పొందిన సద్యోముక్తి కలుగును. సగుణుడై అవతారరూపుడగు అపరబ్రహ్మమును భక్తిభావనతో ఉపాసించిన క్రమముక్తి కలుగును. దేహాంతమున మోక్షము సిద్ధించును. భాగవతము రెండవ అభిప్రాయమును సమర్థించుచున్నది.

''The Bhagavatha School teaches that the aspirant absorbed in Brahman after death and becomes one with it as a result of continued devotion through out life. (114-147)

సత్యమైనదీ నిత్యమైనది అన్నిటికి కారణమైనదీ యేదో అది తానేనని తెలిసికొనుటయే సాక్షాత్కారము - భావనాతీత సద్భావసుస్థితి.

''One who knows it thus and has a calm mind, control of senses and forbearanace and has secured and unruffled state of mind can see the self in his own self and everything as atman.

అద్వైత భావనతో ఆత్మానుభూతి బడయుటకు నుత్తమాధికారి కావలెను. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగియుండవలెను.

శ్రీ నృసింహాతాపిని ఉపనిషత్తును పరిశీలించినచో మందమధ్యమ ఉత్తమాధికారుల ఉపాసనా విధానములు చక్కగా తెలుపబడినవి. మూల నృసింహామును పరబ్రహ్మగను, అవతారపురషుడైన సగుణుడైన నృసింహము అపరబ్రహ్మముగను, చెప్పబడినది. నృసింహమంత్రమునకు మూల నృసింహపరముగను, ద్వాత్రింశ నృసింహ పరముగను అర్థములు చెప్పబడినవి.

మందాధికారికి క్రమబద్ధమైన నృసింహ మంత్రోపాసని విధింప బడినవి. మధ్యమాధికారికి మంత్రార్థమునకు ప్రణవార్థము జోడించి ఉపాసన విధింపబడినది. ''సిం'' అనగా సంసారబంధ మని అర్థము. ''హ'' అనగా హింసించుట యనిఅర్థము. నృకారము త్వంపద లక్ష్యార్థము. సింహశబ్దము తత్పద లక్ష్యార్థము ఈ విధముగా అద్వైత భావన సూచింపబడినది.

ఉత్తమాధికారికి ప్రణవచింతనము జ్ఞాననిష్ఠ విధింపబడినది. ఇట్లధికారమును బట్టి మార్గములు చెప్పబడినవి. అట్లయిన మందాధి కారికి మోక్షము లభింపదా? యను శంక రావచ్చును. దీనికి ఉపనిషత్తు ఏమి చెప్పుచున్నదో చూడుడు.

''స్త్రీ పుంసోర్వాయ ఇహైవ స్థాతు మపేక్షతే స సర్వైశ్వర్యం

దదాతి. దేహాంతే దేవః పరబ్రహ్మ తారకం వ్యాచష్టే. ఏనాసా వమృతీ భూత్వా నోమృతత్త్వంచ గచ్ఛతి.''

అనగా నృసింహ మంత్రోపాసనచేయు స్త్రీపురుషు లెవరైనను ఇహ సౌఖ్యముల కోరినఎడల నరసింహస్వామి సకలై శ్వర్యములు ప్రసాదించును. దేహాంతమందు వారికి బ్రహ్మతారక ముపదేశించును. దానితో వారు అమృతత్త్వమును మోక్షమును పొందుదురు. ఇట్టి అభిప్రాయమునే భాగవతము సూచించినది.

భాగవత మతము మంద మధ్యమాధికారులకే తగినదనియు జ్ఞాన మారావలంబనులకు అనుకూలించదనియు చెప్పువారు లేకపోలేదు. శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వాములవారు భాగవమతమును క్రింది విధముగా విమర్శించిరి.

భాగవతానుయాయినస్తు మేనిరే జగత్కారణ బ్రహ్మణోనిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావాత్‌. జీవస్యచ తతః సృష్ఠి వచనాత్‌, సం సారిణో బ్రహ్మ విపరీత స్వభావాచ్చ ''అహం బ్రహ్మాస్మి'' ఇతిన గృహ్ణీయాత్‌ | తధా గ్రహణ దోషభాక్‌ త్వ ప్రసంగాత్‌ | అత ఏవ బ్రహ్మాపి సంసారాత్మత్వేన నైవ గృహ్ణీయాత్‌ | పుష్పోద కాంజలి స్తుతి సమస్కార బల్యుపహార స్వాధ్యా యాధ్యయన యోగాదిభి త్స్వాది రాధయిషేత | అరాధనేనచ విదిత్వా సరేశితృ బ్రహ్మభవతీతి.

తదే తన్మతం జాత బ్రహ్మవాద త్యేనా న్యూద్యఖండితం శ్రీ గౌడపాదాచార్యైః శ్రౌత సంప్రదాయ విరుద్ధ మితిచ గీతాభాష్యదూషితమ్‌ ! సృషికర్తు రేవ హి సృష్ట శరీర ప్రవేశం దర్శయంతి మంత్ర బ్రాహ్మణ వాదాః | సర్వ శ్రుతిషుచ బ్రహ్మణ్యాత్మ శబ్దః ప్రయుజ్యతే జీవ స్స చాద్వయ బ్రహ్మణా ఏకత్వం శిక్ష్యతే. ''తత్త్వమసి'' ఇతిచ సిద్ధవద్‌ బ్రహ్మాత్మైక్యం జ్ఞాప్యతె | జీవేశ్వర భేదస్య నింద్యతే | జీవానాం ఉత్పత్తి శ్రవణం త్యేకత్వ ప్రత్యయ దార్ధ్యార్థం ఘటాకాశోత్పత్తివ దౌపచారికం భవిష్యతి | ఆరాధనం నతు మందమధ్యకారి విషయోపాసనా విధ్యానుసారీ త్యనుమత మాచార్యైః

పై విమర్శనకు సారాంశ##మేమనగా జగత్కారణుడగు బ్రహ్మము నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపము. జీవు డతనిచే సృష్టింప బడెను.

''కాలాను రూపంబు గైకొను నీశుండు దనలీలకై

తాను దా సృజించె'' ---- భాగవతము 3-342

''త తస్సృష్ట్వాతదే వానుప్రావిశత్‌'' ---- వేదము

సంసారికి బ్రహ్మమునకు భేదముండుచటేత ''అహం బ్రహ్మాస్మి'' యని చెప్పుటకు వీలులేదు. షోడశ ఉపచారములచే స్వామి నారాధింపవలెను. ఇది భాగవతమతము.

భాగవతమున క్రమముక్తి చెప్పబడినది. వైదకమతమున క్షిప్రలేక సద్యోముక్తి చెప్పబడినది.

గౌడపాదుల సంప్రదాయమునకు భాగవతమతము విరుద్ధము. శ్రుతులు బ్రహ్మమువేరు జీవుడువేరు అని చెప్పుటలేదు. వాని ఏకత్వమునే ఉపదేశించుచున్నవి. తత్త్వమసి అనుట కర్థమిదియే కదా. జీవసృష్టి ఘటాకాశమును బోలినది. జీవేశ్వ రభేదమును పాచింపరాదు. ఆరాధనలో ద్వైతభావము కలదు. ఇది మందమధ్యమ అధికారులకు చెప్పబడిన విధియని శంకరాచార్యులమతము. ఉత్తమాధికారికి అద్వైతభావన జ్ఞానమార్గములే అనుష్ఠింపదగినవని భావము.

సద్గుణ పరబ్రహ్మమును ధ్యానించి బ్రహ్మాకార చిత్తవృత్తిని సాధించి బ్రతికియుండగనే జీవన్ముక్తి పొందవచ్చునని శంకరుని అభిప్రాయము. కర్మ భక్తి ధ్యాన జ్ఞానమార్గముల వరుసగా నవలంబించి సగుణోపాపనచేసి దేహాంతమున ముక్తిని బొందవ్చచునని భాగవత సందేశము. మొదటిది సద్యోముక్తి. రెండవది క్రమముక్తి.

చోదనతంత్ర మనబడు కర్మమార్గముచే ఇంద్రియ నిగ్రహము లభించును. కర్తృతంత్ర మనబడు ఉపాసనవలన మనోవ్యాపారము లరికట్టబడును. తరువాత అఖండాకార చిత్తవృత్తి చేత సర్వత్రసిద్ధమైన బ్రహ్మముయొక్క అనుభూతి కలుగును. కర్మ, ఉపాసనమార్గములు మంద మధ్యమాధికారులకే నిర్ణయింపబడినవని శంకరుని అభిప్రాయము. ఉత్తమాధికారికి జ్ఞాననిష్ఠయే కర్తవ్యము.

భాగవతమున భగవంతుడు జీవజగత్తులను సృష్టించినట్లు తెలుప బడినది. శంకరుని అద్వైతవాదమున జీవజగత్తులు సృష్టింపబడినట్లు చెప్పలేదు. (అజాతవాదము). మట్టి, కుండ రెండును వ్యవహారిక సత్యములై వేరుగా తోచినను, విచారణ సల్పిన రెండును ఒక్కటియే అని తెలియుచున్నది. కుండలన్నియు మృణ్మయములే. ఆభరణములు అన్నియు స్వర్ణవికారములే (వివర్త వాదము). అట్లే నామ రూపాత్మకమై త్రిగుణాత్మకమైన జగత్తు మాయవలన వ్యవహారిక సత్యమై తోచినను విచారించిన అది బ్రహ్మ స్వరూపమే.

జీవుడు మనః ప్రాణములతో నేర్పడెను. చిన్నదైవ ఘటాకాశము కుండ బ్రద్దలుకాగానే మహాకాశములో లీనమైనట్లు జీవునకు బ్రహ్మమునకు అభేదమని గ్రహింపవలయును. అందువలన అహంబ్రహ్మాస్మి అనుట సిద్ధమయ్యెను. నామరూపములు ఖండములు. బ్రహ్మము అఖండము. అది సత్యము. జ్ఞానము అనంతము. అఖండా కార చిత్తవృత్తిచేత బ్రహ్మానుభూతిని పొందవలయును. బ్రహ్మ మొక్కటే పారమార్ధిక సత్యము. మతములు, లోకాంతరములు జన్మాంతరములు స్వర్గ నరకాదులు వ్యవహారిక సత్యములు. పై విధముగా శంకరుడు కర్మ భక్తి జ్ఞాన మార్గముల సమన్వయ పరచెను.

ద్వైతమా విశిష్టాద్వైతమా అద్వైతమా ఏది సత్యము?

అనుభూతితో తెలిసికొనదగిన ముక్తి స్వరూపమును వాదోపవాదములతో తేల్చికొనుటకు వీలుకాదను అభిప్రాయము సూచించుటకు ఒక కథ చెప్పబడియున్నది. ఒక అద్వైతి తన ఇంటిగోడపై ''సోహం'' అని వ్రాసి యుంచెనట. అనగా నేనే భగవంతుడనని అర్థము. అది చూచిన విశిష్టాద్వైతి అద్వైతికి బుద్ధిలేదని నిందించి, ''సోహం'' పదమునకు ముందు ''దా'' అను అక్షరము జేర్చెను. అనగా ''దాసోహం'' అని మార్పుచేసెను. ''నేను భగవంతుని దాసుడ''నని దాని అర్థము. ఈ విషయము మద్వైతి కంటబడినది. అతడు విశిష్టాద్వైతికి బుద్ధి చెప్పదలచి ఆలోచించి ఆ వాక్యముముందు ''స''కారము చేర్చి ''స దాసోహం'' అని మార్చెను. అనగా ఎల్లప్పుడు ''సోహం'' అని అర్థము. అది చూచి విశిష్టాద్వైతి ఆ వాక్యముముందు ''దా'' చేర్చి ''దాసదా సోహం'' అని మార్చెను. అనగా భగవంతుని దాసునకు దాసుడ నని దాని అర్థము. ఈ విధముగా తమ మతమున కనుగుణ మగునట్లు ''దా'' ''స'' లను చేర్చుచు వచ్చిరి.

సోహం

దాసోహం

సదాసోహం

దాసదాసోహం

సదాసదాసోహం

దాసదాసదాసోహం

దీని కంతెక్కడిది. చివరకు వారిమధ్య పోట్లాటతో కథ ముగిసెను. ఏది సత్యమని నిర్ణయింప జాలరైరి.

ఈ ప్రశ్నకు సమాధానము పొందుటకు భాగవతమున కపిలుని వాక్యములను గమనింపవలయును.

''శ్రీమన్నారాయణుని బాయక నిర్హేతుకముగా తద్వ్రతైక చిరతరభక్తితో నిష్కాముడైన భక్తుడు 1)సాలోక్య 2)సామీప్య 3) సారూప్య 4) సాయుజ్యంబులను బొందగలడు.''

ఇచ్చట భక్తికిని ప్రపత్తికిని గల భేదమునుగూడ భేదమునుగూడ గుర్తింపవలయును. Sri S Radhakrishnan గారు ఈ భేదాన్ని క్రింది విధముగా వివరించిరి.

While Bhakthi requires faith and love, in 'prapathi' we simply surrender ourselves to god, place ourselves in His hands leaving it to him to deal with us as the elects. The difference in between 'bhakthi' and prapatti is symbolised by the ape way and the catway.

--- మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము

The youg ape clings fast to the mother and is saved. A little effort on the part of the young is called for. The mother cat takes the young in her mouth. The young does nothing to secure its safty. In bhakthi the grace of god is earned to an extent. In paraptti it is freely bestowed.

అందులకే భక్తుడు మర్కటకిశోర న్యాయముతో భగవతిని అనుసరించుననియు, మార్జాల కిశోర న్యాయముతో భగవతి తనను రక్షింపవలె ననియు కోరెను.

é ఉ|| #9; పాలన సేయవమ్మ! చిరుపాపని నన్ను దయాంబురాశి| మా

ర్జాలము తా కిశోరమును రక్షణ జేసెడి రీతి దేవి| నీ

బాలుని రీతి నిన్ను నెడబాయక మర్కట బాల్యచేష్టనీ

చేలము వీడ కుండెదను చేకొని గావుము నన్ను శ్రీసతీ!

మొదటిది ద్వైతము :-

మానవుడు దేహముతో ఇంద్రియములతోను సుఖమును అనుభవించును. ఇంద్రియార్థముల తృప్తి పరచుటయే కామతృప్తి, దేహత్మభావగముగల మానవుడు శ్రీహరిని పూజించి సేవించినగాని అతని ఇంద్రియము లీశ్వర విషయములు కానేరవు. అందువలన పరమాత్మ కు దాసత్వము వందన అర్చనములచేసి ఇంద్రియములు భగవతర్పము చేసి ఇంద్రియార్థములనుండి ఇంద్రియములను మరలింపవలెను. ఇట్లుకామమును జయించవచ్చును. దాసత్వములో జీవుడువేరు దేవుడువేరు అయినప్పటికిని వారు సమీపమునకు (సామీస్యము). ఉపాసన అనగా ఉప=దగ్గర, ఆసన=కూర్చుండుట అని అర్థము. సీతా రామంజనేయ సంవాదములో తారక సాంఖ్య తారకసాంఖ్య అమనస్కయోగములను గ్రహించిన ఆంజనేయుడు తన జ్ఞానమునకు పర్యవసానముగా ఇట్లు తెలిపెను.

é ''దేహ బుధ్య9స్మి దాసో7హం''

దేహాత్మభావముతో నేను రామదాసుడ నైతిని. ఇది ద్వైత పరముగా చెప్పబడినది. ఇట్టి భక్తి మందాధికారికి తెలుపబడినది. ద్వైతమత సాంప్రదయమును మధ్వగురువులు క్రింది విధముగా తెలిపిరి.

శ్లో|| శ్రీమన్మధ్వమతే హరిః పరతరః సత్యం జగత్‌ తత్త్వతః

భేదో జీవగణాః హరే రనుచరాః నీ చోచ్ఛ భావం గతాః

ముక్తిః నై జసుఖానుభూతి రమలా, భక్తిశ్చ తత్సాధనం

హ్యక్షాది త్రితయం ప్రమాణ మభిలామ్నాయైక వేద్యోహరిః

మధుసూదన సరస్వతి జ్ఞాన మేర్పడినప్పటికిని, భక్తి చే కల్పింప బడిన ద్వైతమే మధురమైనదని బావించెను. మనలో అభిమానమును తొలగించి విచారించిన ఎంతమందికి ఇంద్రియనిగ్రహము కలదు.? కామ వాసన లడుగంట లేదుకదా? అందువలన తనకుతాను ప్రశ్నించుకొన్నప్పుడు మన మందరము మందాధికారులమే యను సత్యము గోచరింపక మానదు. అందువలన తొలుత ద్వైతము నాశ్రయించ వలసినదే.

''సత్యజ్ఞానా నంతానంద మాత్రైక రసమూర్తయః అస్పష్టభూరి మాహాత్మ్యా అపి హ్యుపనిషద్దృశామ్‌ మాయ్యభ్యాయాః కామధేనో ర్జీవేను వత్సకా వుభౌయధేచ్ఛం పిబతాం ద్వైతం తత్త్వం త్వద్వైత మేనహి''.

మాయ యను కామధేనువునకు జీవుడు ఈశ్వరుడను రెండు దూడలు కలవు. అవి రెండును. ద్వైతమును యధేచ్చగా త్రాగును గాక పరతత్త్వ మద్వైతమే యగును. ఇటువంటివారు భగవంతుని సగుణస్వరూపమును గ్రహించుచున్నారు. జ్ఞానము గలుగునంతవరకు ద్వైతము మోహజనక మనియే వారు తెలసికొనవలయును. శ్రవణ మననాదులవలన జ్ఞాన మేర్పడిన పిమ్మట భక్తికై కల్పించబడిన ద్వైతతత్త్వమే అద్వైత తత్వముకంటె మధురమై యుండును. పారమార్థికముగ అద్వైతబుద్ధి నుంచుకొనుచు భజించుటకుసూత్రము ద్వైత బుద్ధిని గలియుండుట పలురకముల ముక్తులకంటె శ్రేష్ఠమైనది.

"భక్త్యర్థం కల్పితం ద్వైత మద్వైతాదపి సుందరమని " యు " ముక్తి శతాధిక మని" యు చెప్పబడియున్నది.

ద్వైతం మోహాయ బోధాత్‌ ప్రాక్‌జాతే బోధే మనీషయా

భక్త్యర్ధం కల్పితం ద్వైతమ్‌ అద్వైతాదపి సుందరమ్‌

పారమార్థికమ్‌ అద్వైతమ్‌ ద్వైతమ్‌ భజన హేతవే

తా దృషి యది భక్తిః స్యాత్‌ సాతు ముక్తి శతాధికా.

రెండువదివిశిష్టాద్వైతము:-

కామమును ఇంద్రియములను అనగా తమోగుణమును జయించి దేహాత్మభావము నశించిన తరువాత మనోవిక్షేప మడ్డుపడును.మనస్సును ఏకాగ్రత చెందించుటకు శ్రీహరి దివ్యమంగళ విగ్రహమును భావించవలెను. మనోలయమేర్పడగనే రజోగుణము నశించిపూజించువాడు. పూజ, పూజింపబడు వాడు అను త్రిపుటి నశించుటకు ప్రారంభించును. జీవుడు తాను భగవంతుని అంశగా భావించును.

మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః -గీత

జీవుడు తన అంశ అన్నాడు. గీతాచార్యుడు.

భగవంతుని కల్యాణగుణములు భక్తునకు కలుగును. ఇది సారూప్యస్థితి యనవచ్చును. విశిష్టాద్వైతులు క్రింది గోపన్న పద్యము నుదాహరింతురు.

చ|| భ్రమరము కీటకమ్ముకడ భమ్మని నాదముసేయ దానికిన్‌

భ్రమర సురూప మబ్బినటు"

తుమ్మెద పురుగుచుట్టు తిరిగి నాదము సేయగా ఆ కీటకమునకు భ్రమరరూపము కలిగినట్లు భగవన్నామ స్మరణ చేయువారికి భగవత్‌ కల్యాణగుణమలు లభించి భగవద్రూపము కలుగును.

"నీవనుచు నీవైతిని, పరమాత్మ నినుచూచి నీవైతిని"

సీతారామాంజనేయ సంవాదమున హనుమంతు డిట్లు చెప్పెను.

"జీవ బుద్ధ్వా త్వదంశకః"

ఇది సారూప్యముక్తి. ఇది మధ్యమాధికారి కర్తవ్యము.,

మూడవది అద్వైతము:-

మనోలయానంతరము ఆత్యంతిక భక్తిచే మనోవినాశము కలుగును.దేహమును మనస్సును రెంటిని జయింపగా సత్వగుణముతో అవిద్యా ఆవరణము ఆత్మకు మిగిలినది. వేదాంత విచారముచేత నీవు నేనను భేదము నశించి ఆత్మానుభూతి కలుగును. అద్వైతసిద్ధి కలుగును. సీతారామాంజనేయ సంవాదమున హనుమంతు డిట్లు తెలిపెను.

"ఆత్మ బుద్ధ్వా త్వ మేవా9హ మితిమే నిశ్చితా మతః

ఇట్టి భక్తి ఉత్తమాధికారికి చెప్పబడినది. త్రిపుటి నశింపగా సాయుజ్యముక్తి లభించును.

శ్లో|| భావాద్వైతం సదా కుర్యా త్క్రియాద్వైతం నకర్హిచిత్‌

అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహ.

ఎల్లవేళల భావమునం దద్వైత ముండవలయును. క్రియ యందద్వైతము చేయరాదు. మూడులోకములయందు అద్వైతమును భావించినను గురువునందు అద్వైతమును భావింపరాదు.

శ్రీ మధ్వ, రామానుజ, శంకరులు వరుసగా పై మార్గములను సమర్థించిరి, స్థూల సూక్ష్మ కారణ దేహముల నధిగమించు మార్గములు చెప్పబడినవి. ఇది గాక శంకరడు కర్మను భక్తినికూడ సమర్థించెను. నారాయణ షట్పదిలో నిట్లు వ్రాసెను.

శ్లో|| నారాయణ కరుణాలయ శరణంకరవాణి తావకౌ చరణౌ

ఇతి షట్పదీ మదియే వదన సరోజే సదా వసతు.

విశిష్టాద్వైతులవలె పై శ్లోకములో"శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే" అని చెప్పుకొన్నాడు కదా!

భాగవతమున కంస శిశుపాలాదుల కృష్ణపరమాత్మలో ఐక్యము పొందిరని చెప్పబడినది. శంకరాదులు జీవాత్మ పరమాత్మ ఐక్యమును అభేదమును ప్రతిపాదించిరి. ఈ కాలమున రమణాదులు దానిని సమర్థించిరి.

కొందరు ఆత్మతో ఏకత్వముపొందుట సాధ్యముకాదని అందురు. ఈగ తేనె బయటనుండియే దాని రుచి చూడగలదు. తేనెలో పడరాదు. కాని ఆత్మ ఆనంద స్వరూపము. ఆత్మ తానైనప్పుడు ఆనంద మనుభవించగలడు కదా?

శ్రీ రమణమహర్షి అద్వైతమును ఇట్లు సమర్థించెను.భక్తుడు తొలుత తానువేరు దేవత వేరని భావించును. పూర్ణ శరణాగతిలో "నేనుకాదు నీవు. నా నిశ్చయముకాదు నీ సంకల్ప" మని తెలుపును. అప్పుడు అహంకారము నశించి ఆత్మానుభూతి కలుగును. జీవుడు వేరు దేవుడు వేరను తగవు పనిలేదు. అనుభవముననే త్రిపుటి నశించును. ఆత్మ అనుభ##వైక వేద్యము. ఆత్మ ఆత్మయే. అంతకంటె చెప్ప వీలు పడదు. అది జ్ఞానాజ్ఞానములను మించిన అనుభూతి. తానుతానుగా నుండుట. ఒకటి తెలిసికొనుటగాని ఒకటి అగుట గాని కాదు. సరియైన పదములులేవు కాన ఆత్మానుభూతి,సాక్షాత్కారము, దర్శన మందురు.

శ్లో|| ద్వైత విచారే, పరమార్థ బోధే

త్వద్వైత మిత్యేష న సాధువాదః 39 సద్దర్శనము

అజ్ఞానములో ఉన్నప్పుడు ఉన్నది. ద్వైతమనీ ఆత్మాజ్ఞానము కలుగగనే అద్వైతమే సత్యమనీ చేయువాదము యుక్తి యుక్తము కాదు. ఎల్లప్పుడూ అద్వైతమే ఉన్న సత్యము.

జ్ఞానమును పొందిన లాభ##మేమి:-

శ్లో|| యజ్ఞత్వా న పునర్మోహ మేవం యాస్యసి పాండవ!

యేన భూతా న్యశేషేణ దక్షస్యాత్మ న్యధోమయి.

-గీత 4-35

జ్ఞానము బొందితివేని మరల మోహమును పొందవు. సమస్త భూతములను నీయందే చూడగలవు. పిమ్మట నాయందును చూడగలవు.

శ్లో|| అపి చేద్యపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః

సర్వ జ్ఞాన ప్లవే నైవ వృజినం సం తరిష్యసి.

-గీత 4-36

నీవు పాపాత్ములందరిలో మిక్కిలి పాపాత్ముడవైనను ఆపాపసముద్రమును జ్ఞానమను యోడచే దాటగలవు.

శ్రీ రమణమహర్షి ఇట్లు తెలిపెను. "నేను పాపిని, ఎట్లు కడతేఱగల" నను చింత వదలి స్వరూపధ్యానమున పట్టుదలగలవాడై యున్న ఎడల నిశ్చయముగా కడతేఱును.

శ్లో|| యధైథాంసి సమిద్దో9గ్ని ర్బస్మసాత్కుర తే7ర్జున

జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా.

-గీత 4-37

మండుచుండెడి అగ్నికట్టెలను భస్మము చేయునట్లు జ్ఞానాగ్ని సర్వకర్మలను నాశనము చేయును.

శ్లో|| నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే

తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనా7త్మని విందతి.

-గీత4-38

జ్ఞానము పవిత్రమైనది. శుద్ధమైనది. ఉత్కృష్టమైనది. దానితో సమాన మింకొకటిలేదు. అట్టి జ్ఞానమును బహుకాలశ్రద్ధతో పొందవలయును.

జ్ఞానమును పొందుటవల సంశయ రాహిత్యము కలుగునని రమణమహర్షి తెలిపెను. "వన్త్వంతర మెప్పాటున లేమి కలుగవే సందియముల్‌" అంతవరకు సందియములు కలుగుచునే యుండును. ఆత్మవిచారమునకు ఫలమేమి?

క|| ఇల నాత్మ విచారమునకు

ఫల మాయాసమ్ములెల్ల బాయుట; ఇదియే

ఫలముల కన్నింటి కవధి;

కలుగు, టసంభవ మితోధికము ఫలమెందున్‌

-రమణగీత

ఆత్మలాభా త్పరో లాభః క్వచి దన్య న్న విద్యతే

-సర్వజ్ఞానోత్తరము-27

ఆత్మ లాభముకన్న మించిన లాభ మెక్కడను లేదు.

శ్లో|| అవిజ్ఞాత పశు స్సోహి సృష్టి ధర్మ సమాశ్రితః

విజ్ఞాత శ్శాశ్వత శ్శుద్ధస్స శివో నాత్ర సంశయః

తస్మాదాత్మా సదా వేజ్య స్సువిచార్య విచక్షణౖః

- సర్వజ్ఞానోత్తరము - 18,19

ఆత్మజ్ఞానము లేనివాడు సృష్టిధర్మము నాశ్రయించి పశువగుచున్నాడు. జ్ఞానము పొందినవాడు శుద్ధుడు శాశ్వతుడు శివుడు అగుచున్నాడు. కాబట్టి బుద్ధిమంతులు ఆత్మను తలిసికొనవలయును.

భగవద్భక్తులలో జ్ఞాని ఉత్తముడు:-

శ్లో|| చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతి నోర్జునః

ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ! -గీత7-16

కష్టములలో నున్నవాడు, కోరిక గలవాడు, మోక్షాపేక్షగలవాడు, జ్ఞాని ఈ నలుగురు నన్ను సేవించుచున్నారు.

శ్లో|| తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి ర్విశిష్యతే

ప్రియోహి జ్ఞానినో7త్యర్థ మహం సచ మమప్రియః

-గీత 7-17

ఈ నలుగురిలో చలింపని భక్తిగల ఆత్మజ్ఞాని అందరికంటె శ్రేషుడు. అట్టివానికి నేను మిక్కిలి యిష్టుడను. వాడును నాకు ప్రియమైనవాడు.

శ్లో|| ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మ మతమ్‌

ఆస్థిత స్సహి యుక్తాత్మా మామేవా నుత్తమాం గతిమ్‌

-గీత 7-18

ఈ భక్తులందరు గొప్పవారే.వారిలో జ్ఞాని నేనే అని నా అభిప్రాయము. యోగముచేత నిశ్చలమైన మనస్సుగలిగి నన్నే ఉత్తమ గతిగా నమ్ముచున్నాడు.

శ్లో|| బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే

వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః

-గీత 7-19

అనేక జన్మలెత్తి జ్ఞానము సంపాదించి వాసుదేవుడే సర్వమని,తెలిసిన జ్ఞాని అఱుదై యుండును.

విద్యా అవిద్యలు:-

శ్లో|| విద్యాకథం భాతి నచే దవిద్యా విద్యాం, వినాకిం ప్రతిభా త్యవిద్యా

ద్వయం న కస్యేతి విచార్యమూల, స్వరూపనిష్ఠాపరమార్థ విద్యా,

అజ్ఞానము లేనియెడల జ్ఞానము ఏ విధముగా సాధ్యమగును? దానిని ప్రకాశింపజేయున దేది? జ్ఞాన స్ఫురణ లేనియెడల అజ్ఞానము ఉన్నదని తెలియుటెట్లు? ఈ జ్ఞానాజ్ఞానాలు రెండు ఎవరివో తెలిపే జ్ఞానమే నిజమైన సత్యజ్ఞాన స్వరూపము. ఆ తెలివే జ్ఞాననిష్ఠ. ఆ నిజస్వరూపుములో ముగనిగితే పరమార్థ దర్శన మగును.

అహం మూలాన్వేషణ సకలార్థ సాధనము. మిగిలినది భగవంతునకు వదలుము. భగవంతుడే కామ్యమును సమయము ననుసరించి సిద్ధింపజేయును. తన్నుతాను గన్నచో తనకన్న వేరుండదు. ఇక ప్రశ్నలు లేవు.

పుస్తక జన్యజ్ఞానము లేకున్నను జ్ఞాని కావచ్చును. శ్రీరమణ మహర్షి ఇందుల కుదాహరణము. వారికి పుస్తకమున నున్నదంతయు ముందుగనే అనుభవమునకు వచ్చినదని తరువాత గుర్తించిరి.

జ్ఞానాజ్ఞానములు:-

అంతర్ముఖమైన మనోవృత్తిని విజ్ఞానమనీ, ఆ వృత్తి బహిర్ముఖమానప్పుడు అజ్ఞానమనీ అందురు. దీనినే మనస్సనికూడ అందురు.

తెలిసికొనువా డున్నంతవరకే దుఃఖము, ఆనందము. వస్తువు సుఖ దుఃఖ అతీతమైనప్పటికిని దానికి సుఖమని పేరు. సదసత్తుల కతీతము సత్తు. జ్ఞానాజ్ఞానముల కతీతము జానము

ఆత్మవిద్య పరంపరానుగతము:-

"ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః

- భగవద్గీత 4-3

"గురు పరంపరాయాత మదృష్టం సర్వ వాదిభిః

-సర్వజ్ఞానోత్తరము-3

ఆత్మవిద్య గురువులవలన లభించునది. శాస్త్రవాదము చేయువారిచే

కనుగొ నబడలేదు.

ఇది బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారుడు అనబడు స్కందునిచే పూర్వ మనేకుల కుపదేశింపబడెను.

జ్ఞాని సత్తులో కలసిపోవును.

యోగి చిత్తును దర్శించును.

భక్తుడు ఆనందమున మునుగును.

భగవంతుడు సచ్చిదానంత స్వరూపుడు.

|| ప్రథమభాగము సమాప్తము||

Sri Bhagavadgeetha Madanam-1    Chapters