Naa Ramanasrma Jeevitham    Chapters   

9. విషయదానం

1943 లో మా చిన్నన్నగారిని సెంట్రల్‌ బ్యాంకువారు అహమ్మదాబాదునుంచి మద్రాసుకు బదిలీచేశారు. నేను ఆశ్రమానికివచ్చిన ఆ రెండేండ్లలో రెండు మూడుసార్లు నేనే దేశానికి వెళ్ళివచ్చాను గాని మా వాళ్ళెవరూ ఇక్కడికి రాలేదు. వీరు మద్రాసు రాగానే ఆశ్రమానికి వచ్చి నా యోగ క్షేమములు విచారించి వెళ్ళారు. వారు వెళ్ళిన వెనుక భగవాన్‌ నన్నుద్దేశించి ''ఈయన పెద్దాయనా? చిన్నాయనా?'' అన్నారు. ''చిన్నన్నగారే'' నన్నాను. మరి 15 రోజులకల్లా చిన్నన్నగారు కుటుంబంతో సహా వచ్చి రెండు రోజులున్నారు. ఆశ్రమంలో భోజనం గౌండరు కాంపౌండులో వున్న కుంజు స్వామి గదులలో బస ఏర్పాటయింది. నేనూ వాళ్ళతో పాటు అక్కడే వున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను గూడా

తమతో రమ్మని ప్రయాణం చేశారు. బెజవాడ రమ్మని పెద్దన్నగారి వద్దనుంచిన్నీ జాబు వచ్చింది. భగవాన్‌ గోశాల వైపు నుంచి తిరిగి వచ్చేటప్పుడు దగ్గరగా వెళ్ళి ''వాళ్ళు రమ్మంటున్నారు. వెడితే మళ్ళీ ఆ గొడవల్లో పడతానేమో నన్న జంకుగా వున్నదే?'' అన్నాను. భగవాన్‌ చిరునవ్వుతో ''అంతా వచ్చి మనలో పడితే మన మెక్కడ పోయి పడేది.'' అంటూ నడక సాగించారు. నాకప్పుడు భగవాన్‌ సాధారణంగా బోధించే ''మనలో జగమున్నది గాని జగత్తులో మనము లేము'' అన్న అద్వైతభావమే స్ఫురించినది గాని బాహ్యార్థం స్ఫురించలేదు. చిన్నన్నగారితో మద్రాసు చేరాగానే పెద్దన్న గారి వద్ద నుంచి జాబు వచ్చింది. ''మేము దంపతు లిద్దరం రెండు రోజులలో మద్రాసువస్తున్నాము. నాగమ్మ వస్తే మద్రాసులోనే వుండమను. మాతో ఆశ్రమం రాగలదు.'' అని వున్న దందులో. ఇది చదివేసరికి ఆశ్చర్యం కలిగింది. వాళ్లు ఇక్కడికే వస్తుంటె నీ వెక్కడికి పోతావన్న బాహ్యార్థం అప్పుడు గాని స్ఫురించలేదు.

సరే. వాళ్ళతో బాటు నాల్గు రోజుల్లోనే తిరిగి ఆశ్రమం చేరాను. భగవాన్‌ సమీపవర్తులతో ''అరే! నాగమ్మ అప్పుడే వచ్చిందే?'' అన్నారు. నాకెంతో సంతృప్తి కలిగింది. పెద్దన్ననూ, వదినెనూ చూపి విషయం చెప్పాను. ''ఓహో, అట్లాగా! విజయవాడ వెడతా నన్నదే, ఇదేమా?'' అనుకున్నానన్నారు భగవాన్‌. మా వాళ్ళున్న మూడు రోజులూ యథాప్రకారం ఆశ్రమంలో భోజనమూ, కుంజు స్వామి గదులలో నివాసమూను. నేనూ వాళ్ళతోనే వున్నాను. టవునులో నేనున్న చిన్న గది మా పెద్దన్న గారు చూచి ''ఇంత చిన్న గదిలో వున్నావేమి?'' అని కుంజుస్వామి గదులే అద్దెకు తీసుకొని, నా మకాం అక్కడికే మార్పించి ''నాగమ్మ ఇక్కడే వుంటుం''దని భగవాన్‌తో మనవిచేసి వెళ్ళిపోయినారు.ఆశ్రమం దగ్గరకు బస మార్చిన వెనుక రాక పోకల ప్రయాస తగ్గి ఎక్కువ కాలం భగవాన్‌ సన్నిధిలో గడిపే అవకాశం కలిగింది.

నేను ఆశ్రమానికి వెళ్ళక పూర్వం ''హిందూసుందరి'' ''గృహలక్ష్మి'' పత్రికల వాళ్ళడిగితే అప్పుడప్పుడు ఏదో వ్యాసం వ్రాసి పంపుతూ వుండేదాన్ని.వాళ్ళు ప్రతినెల గౌరవసూచకంగా పత్రిక పంపేవాళ్ళు. ఆశ్రమానికి వచ్చిన వెనుక ఏమీ వ్రాయడంలేదు. అయినా వాళ్ళు పత్రిక పంపుతునే వచ్చారు. అవన్నీఆశ్రమానికే వచ్చే ఏర్పాటు చేశాను. భగవా నవి చూచి ''ఏమీ? పత్రికలకు ఏమైనా వ్రాసే అలవాటున్నదా?'' అన్నారు. ''ఏదో అప్పు డపపుడు వ్రాసేదాన్ని. ఇప్పుడేమీ వ్రాయుటలేదు. అయినా వాళ్ళు పంపుతూనే వున్నారు. ఆశ్రమానికి వస్తే అంతా చూస్తారని ఈ ఏర్పాటు చేశాను'' అన్నాను. ''ఓహో! అదా సమాచారం. సరిసరి.'' అంటూ భావగర్భితంగా నవ్వారు భగవా&. ఆ వెనుక కొద్ది రోజులకు చింతాదీక్షితులుగారు భగవా& దర్శనార్థం వచ్చారు. నే నంతకుపూర్వం వారిని చూడలేదు. భగవా& వారిని చూపి ''వీరే చింతాదీక్షితులుగారు'' అని పరిచయవాక్యం పలికారు. ''అల్లాగా? అని కూర్చున్నాను. వెనుక ఆడవాళ్ళుండే సమయం గడచినందున బసకు వెళ్ళాలని బయలుదేరాను. దీక్షితులుగారున్నూ బయటికి వచ్చారు. కుశల ప్రశ్నానంతరం నా బసకు చేరుకున్నాను. దీక్షితులు గారు భగవా& సన్నిధికి వెళితే భగవా& ''ఇదుగో! ఈ నాగమ్మ విజయవాడనుంచివచ్చి ఇక్కడే వుండిపోయింది. ఈమె పత్రికలకు విషయదానం చేస్తుంది'' అని సెలవిచ్చారట. వారది విని సంతోషంతో రాత్రి భోజనానంతరం నా బసకు వచ్చి, పై విషయం చెప్పి భగవా& ఎంత చక్కగా సెలవిచ్చారమ్మా. విషయదానము చేస్తావట. ఎంత మృదువైన మాట.'' అంటూ అభినందించి ఆశ్రమానికి వెళ్ళారు.

Naa Ramanasrma Jeevitham    Chapters