Naa Ramanasrma Jeevitham    Chapters   

67. నీ వెవరవో తెలుసుకో

''నీ వెవరవో తెలుసు'' కొమ్మని శ్రీరమణ భగవానుడు లోకానికి అందించిన సందేశం సకల వేదాంతసారమైన ముఖ్య విషయం. తా నెవరని విచారించి చూడబోతే తానే బ్రహ్మమని తెలుసుకొంటాడు. ఆ బ్రహ్మము సర్వ వ్యాపకమైనది గనుక తనకన్న అన్యమేమీ లేదని గ్రహించి సమత్వ బుద్ధితో వ్యవహరించ గలడని దాని తాత్పరం.'' ''అది చెప్పటం సులభ##మేగాని చేయటం దుస్సాధ్యం'' అని పాఠకులనవచ్చును. కొంతవర కది నిజమే కాని మనో నిగ్రహం సంపాదించినట్లయితే ఆ ఆత్మవిచారణ లభిస్తుందని వేదాంత గ్రంథములు ఘోషిస్తూ వున్నవి. భగవానులున్నూ ''అత్యంత సులభం ఆత్మ విద్య'' అని ఒక పాట వ్రాసి వున్నారు. మనస్సును ఇంద్రియముల వెంట పోనీయక అరికట్టి ''ఈ నేను అనువా డెవరు? ఈ శబ్దం ఎక్కడ పుట్టింది? దీనికి మూలాధార మేది?'' అని అంతర్ముఖదృష్టితో విచారిస్తూ హృదయ కేంద్రమును చేరుకోవాలి. మనస్సును ఆ హృదయకేంద్రమున నిలిపి స్వస్థత నందుటయే ముఖ్య కర్తవ్యమనీ, అదియే భక్తీ, యోగమూ, జ్ఞానమూనని భగవాన్‌ ఉపదేశ సారంలో చెప్పారు.

''హృత్‌ప్థలే మనః స్వస్థతా క్రియా

భక్తియోగ బోధాశ్చ నిశ్చితం'' (ఉప=శ్లో-10.)

ఆ హృదయమున కీ శరీరంలో స్థాన మెక్కడ? అని ప్రశ్నించిన భక్తులకు ''వక్షస్థలమునకు కుడివైపున ఓజస్థానమున్నదనీ, అదియే ఆత్మకు నివాసస్థానమనీ'' భగవాన్‌ సెలవిచ్చి వున్నారు. ఆ స్థాననిరూపణమున్నూ సాధకులకు భావన వున్నంత వరకేగాని భావనాతీత సద్భావ సుస్థితినందిన యెడల, ఆత్మ నిరాధారమై, నిశ్చలమై, పూర్ణమై అంతటా నిండి, ఎల్ల లేక తాను తానుగ నుండుననిన్నీ, అవాఙ్మానసగోచరమై అనుభ##వైక వేద్యమయిన, ఆ యాత్మకాస్థాన నిరూపణయే లేదనిన్నీ భగవానే సెలవిచ్చి వున్నారు. వేదాంతశాస్త్రములున్నూ నిర్వచించినవి.

కావున ప్రతి మానవుడున్నూ జిజ్ఞాసువై ''నే నెవడను? నా యథార్థ స్వరూపమేమి'' అని విచారించి తెలుసుకొన యత్నించుట ముఖ్య కర్తవ్యము. అనంతకోటి జీవరాసులలో మానవున కొకనికే విజ్ఞానధనం లభించింది. దానిని సద్వినియోగం చేసుకొని జనన మరణ మహాంబుధిని దాటుటకై యత్నింతురుగాక. రమణ భగవానునివంటి మహాత్ములు అవతరించుట మానవులలో ఈ జ్ఞానప్రబోధం కలిగించుటకొఱకే గదా? వారి ప్రబోధములను పెడచెవిని బెట్టక విచారించి చూచి జిజ్ఞాసువులందరూ తమ యథార్థ స్వరూపమును తెలుసుకొని శాశ్వత సుఖమును పొందుదురు గాక!

సర్వం శ్రీ రమణార్పణమస్తు.

***

Naa Ramanasrma Jeevitham    Chapters