Naa Ramanasrma Jeevitham    Chapters   

61. కొలనుకొండ నివాసం

వివాహకలాపం ముగింపుకాగానే మా చిన్నన్నగారు తాను కాశినుంచి తెచ్చిన గంగ కొలనుకొండ భోగేశ్వరస్వామికి అభిషేకం చేయాలని ఒక మంచిరోజున బయలు దేరుతూవుంటే, నేనూ నా కొలనుకొండ నివాస సమాచారం వారందరికీ తెలియజేసి, భగవాను పటం తీసుకొని బయలు దేరాను. విజయవాడకు కొలనుకొండ 4 మైళ్ళు మాత్రమే వున్నది. కారులో బయలు దేరి, కృష్ణానదిలో స్నానంచేసి ఒక బిందెతో తీర్థం తీసుకొని, బ్రాహ్మణుని వెంటబెట్టుకొని వెళ్ళాం. కొండ ఎక్కి, భోగేశ్వరునకు అభిషేకం అర్చనాదులన్నీ ముగింపయిన వెనుక ఆ బ్రాహ్మణునిచేతనే మా తండ్రి కట్టిన ఆ యింటిహాలులో భగవానుని పటం పెట్టించి, అష్టోత్తరశతనామాదులతో అర్చన చేయించి టెంకాయ, పళ్ళునివేదన చేయించాను. ఆ యిల్లంతా ఆక్రమించుకొని వున్నవారందరిని ఖాళీ చేయండని చెప్పించి, విజయవాడ చేరుకొని భగవానుని ఆరాధనవేళకు ఆశ్రమం చేరుకున్నాను.

ఆరాధన ముగిసిన వెనుక కొంత సామాను బీదలకు పంచిపెట్టి, కొంత మళ్ళీ వచ్చినప్పుడు వాడుకొనే నిమిత్తం కుంజుస్వామి గదులలో పడేసి, ముఖ్యమైనవి మూటగట్టుకొని భగవాన్‌ ఫోటోలన్నీ భద్రంగా తీసుకొని, ఇల్లు ఖాళీ చేసి బయలుదేరబోతే ఎంతో దుఃఖం వచ్చింది. అక్కడి మిత్రులంతా ''ఎందుకమ్మా విచారిస్తావు? నీ వెక్కడుంటే భగవాన్‌ అక్కడే వుంటారు. అదే ఆశ్రమ మవుతుంది. నీవు ఎక్కడున్నా రమణాశ్రమ నివాసివే. జయంతికీ, ఆరాధనకూ ఇక్కడికి వచ్చివెడుతూ వుండమ్మా'' అని సలహా చెప్పారు. నా కున్న కొద్ది సామానుతో మద్రాసు, విజయవాడలమీదుగా కొలనుకొండ చేరుకున్నాను. ఉత్తరప్రక్క భాగంలో మాత్రం ఒక్క కాపురం వుంచి తక్కిన ఇల్లంతా ఖాళీ చేయించుకొని హాలులో శ్రీరమణ భగవానుని చిత్రపటాలన్నీ అలంకరించుకొని అదొక ఆశ్రమంగానే ఏర్పరచుకున్నాను. ఉదయం సాయంకాలం భగవానుని స్తోత్రపఠనాదులతో సేవ, మధ్యాహ్నం రెండు గంటలనుండీ పురాణ కాలక్షేపమూను.

భగవానుని సేవతో పాటు భోగేశ్వర, విశ్వేశ్వర, పట్టాభిరామదేవాలయ సేవగూడా చేస్తూ వచ్చాను. అరుణా చలదీపం వేళకు ఆశ్రమం వెళ్ళే అవకాశం లేక కొలను కొండ కొండమీదనే అఖండం పెట్టి భగవాన్‌ సన్నిధిలో దీపోత్సవం జరుపుకున్నాం. 1940 లో, అంటే ఆశ్రమానకి వెళ్ళక పూర్వం భోగేశ్వరుని సేవించివున్నానుగదా? ఆ భోగేశ్వరుని అనుగ్రహం వల్లనే శ్రీగురులాభం కలిగిందన్న విశ్వాసం కలిగి ప్రస్తుతం చెదలు పుట్టలతో నిండివున్న ఆ దేవాలయం, కొంచెం బాగు పరచాలన్న సంకల్పం కలిగింది. ఒక మేస్త్రీని మాట్లాడి గర్భాలంయంలో సిమెంటు చేయించుటకు తలపెట్టాను. అప్పుడు ఆ లింగంచుట్టూ కూలీలు త్రవ్వితే లింగమూల భాగం పద్మాకారంగానూ లోవరుసన స్తంభాకారంగానూ గోచరించినవి. పూర్వం మా తాత లెవరో ఆ లింగాన్ని క్రిందకు తెచ్చి ప్రతిష్ఠింతామని త్రవ్విస్తే ఎంత త్రవ్వినా అడుగుభాగం అంతుపట్టలేదనీ, అంతటితో ఆ ప్రయత్నం విరమించి అక్కడే చిన్న ఆలయం కట్టించారనీ విని వుండుటవల్ల ఎంతవరకు నిజమో చూడాలన్న కుతూహలంతో అర్చకుడు రాఘవరావనే యువకుడూ నేనూ చాలా సేపు కూలీలచే త్రవ్వించి చూచాం. ఎంత త్రవ్వినా స్తంభాకారమే కనుపిస్తుందిగాని అడుగు భాగం అంతు చిక్కలేదు. ఒక గజం లోతువరకూ అల్లాగేవున్నది. ఇక ఆ దేవ రహస్యం దుర్భేద్యమని ఆ ప్రయత్నం విరమించి సిమెంటు చేయించాం చుట్టూను.

Naa Ramanasrma Jeevitham    Chapters