Naa Ramanasrma Jeevitham    Chapters   

6. శ్రీ రమణాశ్రమ నివాసం

లోగడ నేనున్న గదిలోనే ప్రవేశించి, అది చాలా చిన్నదగుటవల్ల, ప్రక్కనే హోటలుండుటవల్ల సందడి భరించ లేక భగవానుకు 38 ఏండ్లుగా భిక్షాకైంకర్యం చేసిన ఎచ్చమ్మ గారు నివసించే కాంపౌండులో ఒక గదికి నా మకాం మార్చాను. పగలంతా భగవాన్‌ సన్నిధిలో గడుపుతూ, రాత్రిళ్ళు ఎచ్చమ్మ చెప్పే భగవా& గాథలన్నీవింటూ వుండేదాన్ని. ఆమె కెప్పుడైనా అనారోగ్యం కలిగితే నేనే అన్నం వండి భగవానుకు తీసుకు వెళ్ళేదాన్ని. శాంతమ్మ మొదలైన వంట శాలవారే వడ్డించేవారు. చిన్నస్వాములు చూచి ''ఇదంతా పెట్టుకొని ఎందుకమ్మా శ్రమపడతావూ?'' అనేవారు. అయాచితంగా లభించే ఆ సేవవల్ల నా కెంతో సంతోషం కలిగేది. భగవాన్‌ అదంతా ఒక కంట కనిపెడుతూనే వుండే వారు. కృత్తికోత్సవం సందడి తగ్గిన వెనుక ఒక దినం ఆశ్రమం లోనే భోజనం చేసి, భోజనానంతరం ఎచ్చమ్మ సలహా ననుసరించి భగవా& కొండకు వెళ్ళి రాగానే అనుచరుల అనుమతితో హాల్లోకి వెళ్ళి శ్రీవారికి నమస్కరించి చేతులు నలుపుకుంటూ నిలబడ్డాను. ''ఆమె యేమో చెప్పుకోవాలంటున్నది''అన్నాడు మాధవస్వామి. ''ఏమి?'' అన్నట్లు చూచారు భగవాన్‌. ఏం చెప్పగలను? మనస్సులో ఎన్నో వూహలున్నవి. ఒక్కటీ బయటికి రాదు. గద్గదస్వరంతో ''ఎట్లాగైనా తరిపంజేయాలి?'' అన్నాను చల్లగా. అనుగ్రహ పూరితమైన దృష్టితో చూచి ''ఊ-ఊ'' అంటూ తలవూపారు భగవాన్‌. మరి మాట్లాడలేక నమస్కరించి బయటికి వచ్చాను. ''ఏం? ఏమడిగావు? భగవా& ఏం సెలవిచ్చారు?'' అన్నది ఎచ్చమ్మ. జరిగింది చెప్పాను. ''అది గొప్ప అనుగ్రహం'' అన్న దామె. ఏమంటే ఎవరైనా శ్రీవారి నిట్లా ప్రార్థిస్తే ''ఇప్పుడేం చేస్తున్నారు?'' అని ప్రశ్నించి వారు చెప్పిన దానికి తగురీతిని భగవాన్‌ సమాధాన మీయటం సహజంగా జరుగుతుందట. నన్నా విధంగా ప్రశ్నించకుండా అభయ మివ్వటం చాలా అనుగ్రహమని ఆమె తలపు. అయితే ఒకటి. నా కదివరకు గురువూ ఉపదేశం వుంటే గదా వా రడిగేందుకు? అదే ఆమెతో అన్నాను.

శ్రీవారి ఈ అనుగ్రహం పొందిన వెనుక రామపాద ధూళిచే అహల్య మనస్సుకు జడత్వం వదలినట్లుగా నా మనస్సును ఆవరించిన తమస్సు తొలగి దృష్టి అంతర్ముఖమై ఆత్మాన్వేషణ తత్పరమైంది. ఈ అన్వేషణ మార్గం లభించిన వెనుక లోగడ ఆత్మోపలబ్ధికై నే చేసిన విధులన్నీ ఇంచు మించుగా విచార మార్గానుసారమే నడచినట్లు స్ఫుటంగా తెలిసింది. భగవానుని ఉపదేశ గ్రంథాలన్నీ శ్రద్ధగా చదివి మననం చేస్తూ దినచర్యలలో చాలాచాలం సాధనకే వినియోగించే దాన్ని. ఆ సాధనలో అప్పుడప్పుడు కలిగిన సందేహాలను చీటీ ద్వారా శ్రీవారికి నివేదించేదాన్ని. ఒక్కొక్కప్పుడు స్వయంగానే అడిగేదాన్ని. ''అదంతా గమనించటం ఎందుకు?'' అని మదలించే వారు భగవాన్‌.

Naa Ramanasrma Jeevitham    Chapters