Naa Ramanasrma Jeevitham    Chapters   

53. సమాధి-లింగ ప్రతిష్ఠ

7 గంటల నుండీ జనసమూహం పెరిగి హాలు చుట్టూ ఆవరించింది. రిజర్వు పోలీసులు, కలెక్టర్లు, డి. యస్‌. పీలు ఇత్యాదులు లెక్క లేనంత మంది వచ్చి ఎంత ఆపినా ఆగక సముద్రఘోషవలె జనుల ఘోష మ్రోగిపోయింది. భగవానుని పునీతదేహం హాలుముందు వరండాలోకి తెస్తే బాగుండునని కొందరు సలహా లిచ్చారు. అపరాహ్ణాత్పూర్వమే అభిషేకం ముగింపు కావాలని కర్మిష్ఠులూ అన్నారు. అందువల్ల ఉదయం 9-10 ఆ ప్రాంతాలలో భగవానుని ఆ పావన శరీరం దక్షిణ ద్వారాన బయటకు తెచ్చి ఆ దక్షిణపు వరండాలోనే ఎత్తుపీట మాద కూర్చోబెట్టి నిరంజనానందస్వామి కుమారుడు టి. యస్‌. వెంకటరామన్‌ కర్తృత్వం వహించి ధర్మపత్నీ సమేతంగా సంకల్పం చెప్పుకొని వైదిక బ్రాహ్మణుల సహాయంతో అనేక సుగంధ ద్రవ్యములతోనూ పాలూ, పెరుగూ, విభూతి, గంగాది పుణ్యనదీ జలములతోనూ పోడశాభిషేకం చేశాడు. ఆ వెనుక వైదికు లందరూ తడి తుడిచి, నూతన వస్త్రం కప్పి, విభూతి, కుంకుమ, సుగంధాదులతోనూ, పరిమళ మిళిత మగు పూలమాలలతోనూ అలంకరించారు. సహస్ర నామార్చనాదులున్నూ చేసి, టెంకాయలుకొట్టి, నివేదన చేసి, కర్పూరం వెలిగించి, హారతి ఇచ్చారు. ఈ కలాపమంతా 12 గంటల లోపల ముగింపయింది. సాయంకాలం 5 గంటల వరకూ ఆ పవిత్ర దేహాన్ని అక్కడే వుంచి, అన్ని దిక్కుల నుండీ భక్తులందరికీ నిరాటంకాంగా దర్శనం లభించునట్లు దిట్టమైన ఏర్పాట్లు చేశారు. వేలాది జనం వచ్చినా గల్లంతు ఏమీ లేకుండా దర్శన భాగ్యం అందరికి లభించింది.

సాయంకాలం 5 గంటలకు సమాధి జరుగగలదని తెలిసి 4 గంటల నుండే సన్నాయిమేళం వాయించారు. అదేసంకేతంగా జనం గుంపు గూడారు. అయిదు కాగానే సన్నాయి మేళం ఆపించి వందలాది బ్రాహ్మణులు వేదపారాయణ ప్రారంభించారు. భగవానుని పూజ్య తనువుకు లఘుపూజ గావించి, జయజయ ధ్వనులతో ఆ శరీరాన్ని ఎత్తి చలువ చప్పరం మీద కూర్చుండబెట్టి, వైదికులంతా నలుప్రక్కలా మోస్తూ వేదనాదంతోనే, భజనలతోనూ మేళతాళములతోనూ మాతృభూతేశ్వరాలయమునకు ప్రదక్షిణంగా సమాధి కట్టిన స్థలానికి తెచ్చి కొత్తగుడ్డతో కుట్టిన సంచిలో ఆ బంగారు శరీరాన్ని ఉత్తరాభిముఖంగా అంటే అరుణాచలం వైపు చూస్తున్నట్లుగా దింపి సమాధికై కట్టిన నేల బిలంలో త్రికోణాసనం మీద గంధ పుష్పాదులూ నవరత్నాలూ చల్లి భగవానుని శరీరం ఆ సంచితోసహా జయ జయ ధ్వనులతో ఆ ఆసనంమీద దింపారు. ఆ వెనుక విభూతి కర్పూరంతో ఆ సంచి నింపి, తదితర స్థలమాంతా మారేడుపత్రి, ఇటుకపొడి, నదులనుండి తెచ్చిన ఇసుక ఇత్యాదులతో నింపి సమాధిని పూడ్చి దానిమీద ఒక లింగం ప్రతిష్టించి అభిషేకం చేసి, గెంకాయలు కొట్టి మహానివేదన చేసి కర్పూర నీరాజనం ఇచ్చారు. అంతా జయజయ ధ్వనులతో ముమ్మారు ప్రదక్షిణించి, సాష్టాంగ నమస్కారములు కావించారు. ఈ విధంగా శ్రీ భగవానుని మహాసమాధి మహా వైభవోపేతంగా జరిగింది. ఆ కలాపం ముగియగానే ఎవరి కుటీరాలకు వారు చేరుకున్నారు.

Naa Ramanasrma Jeevitham    Chapters