Naa Ramanasrma Jeevitham    Chapters   

51. వచ్చిందీ వికృతి (ఉగాది)

19-3-50 తేదీన ఉగాది పండుగ అయింది. నే నిక్కడికి వచ్చినప్పటి నుండీ ఈ పండుగకు భగవాన్‌ కప్పుకునేందుకు తుండూ, కౌపీనమూ ముందునాడే యిచ్చి పండుగ నాడు వేపపువ్వు పచ్చడీ, పంచాగమూ సమర్పించటం మామూలు. అందువల్ల 18-3-50 శనివారం సాయంకాలం 7 గంటలకు పోస్టుమాష్టర్‌ రాజయ్యనుకూడా రమ్మని ఖద్దరు తుండూ కౌపీనమూ చేత పుచ్చుకొని శ్రీవారున్న చిన్న (నిర్యాణ) రూములో ప్రవేశించాను. భగవా& తేఱిపాఱ చూచారు. బట్టలు బల్లమీదపెట్టి ''రేపు ఉగాది'' అన్నాను. భగవా& ఉలిక్కిపడ్డట్టు కదలి అదొక విధమైన ధ్వనితో ''ఓహో? వచ్చిందీ ఉగాది; వికృతి వచ్చిందీ?'' అన్నారు. ఆ ధ్వని ఎందుకో హృదయవిదారకంగా తోచింది. సేవకులంతా నిశ్చేష్టులై నిలిచారు. నేనే ఎట్లాగో స్పృహ తెచ్చుకొని ''మానేద్దామా అంటే తప్పనిపించింది. ఏం చేసేందుకూ తోచలేదు. ఈ వస్త్రం మాత్రం తెచ్చాను'' అన్నాను. ''ఆ. సరి'' అంటూ పక్కనున్న ఆంజనేయులనే భక్తుని చూచి ''ఆ బట్టలు తీయవోయ్‌. నాగమ్మ తెచ్చింది. రేపేనట ఉగాది'' అని సౌమ్యంగా సెలవిచ్చారు భగవా&.

ఆ సేవకుడు ఆ బట్టలు తీస్తూవుండగా నేను భగవాన్ను చూస్తూ ''చెయ్యి ఎట్లాగున్నది'' అన్నాను. ఎట్లాగున్నదని చెప్పేది?'' అన్నారు భగవాన్‌. ''భగవాన్‌ ఎట్లాగైనా నయం చేసుకోవాలి'' అన్నాను. ''ఆ-యేమో'' అన్నారు భగవాన్‌. ''ఏమో అంటే ఎట్లా?'' అన్నాను దీనంగా. తాము విస్పష్టంగా చెపితేగాని నా ఆశ వదలదని తోచింది గాబోలును. నా వైపు జాలిగా సూస్తూ ''ఇంకా నయమేమిటి? ఏమో'' అన్నారు భగవాన్‌, ''అయ్యో! నయంకాదా?'' అన్నాను. ''హూ, నయమా, ఏం నయమో! ఏమో'' అన్నారు భగవాన్‌. ''ఫరవాలేదు'' ''ఇప్పుడేమీ కాదు'' అన్న మాటలన్నీపోయి ఈలాంటి మాటలు శ్రీవారి నోట వచ్చేసరికి నా శరీరం వణికింది. కళ్ళు నీళ్ళతో నిండినవి. కంఠం రుద్ధమయింది. భగవానున్నూ కరుణామూర్తియే తదేకదృష్టితో నా అవస్థను చూస్తూనే వున్నారు. ''అయ్యో మా గతియేమి?'' అని అడుగుదామని తోచి మనస్సును స్వస్థపరచుకొని కంఠం స్వాధీనపరచుకొంటూ పెదిమె కదల్పబోయే సమయానికి నా దురదృష్టవశంవల్ల ఆఫీసులో వుండే అధికారులు వారిలో వారు ఏదో వివాదపడి భగవాన్‌ వద్దకు పరుగు పరుగున రాసాగారు. పులుల ధాటికి బెదరిన లేడిలాగా వారి అట్టహాసానికి అదిరిపోయి అడుగవలసింది అడక్కుండానే బయటికి వచ్చి నా కుటీరం చేరుకున్నాను. భగవాన్‌ శరీరం ఇక బాగుపడదు కాబోలునన్న భయకంపంతో భళ్ళున తెల్లవారింది.

19-3-50 ఉగాదినాటి ఉదయం వేపపువ్వు పచ్చడి, కొత్త పంచాంగమూ తీసుకొని త్వరగానే ఆశ్రమానికి వెళ్ళాను. ఇడ్డెన్లు మొదలైన అల్పాహార సమయానికే ఆశ్రమవాసులకూ భగవానుకూ వేపపువ్వుపచ్చడి అందించి భగవాన్‌ బయటికి వెళ్ళి వచ్చిన వెనుక పంచాంగం సమర్పిద్దామని కొత్తహాలు వసారాలో నుంచున్నాను: భగవా9 కొత్త కౌపీనమూ తుండు ధరించి ఫలహారానంతరం బాతురూముకు పోబోతూ గుమ్మంతాకి గభీలున క్రింద కూలబడ్డారు. ''అయ్యో! భగవాన్‌ పడ్డారు'' అంటూ పరుగు పరుగున శ్రీవారిని సమీపించాను. వెనుకనే ఉన్న కృష్ణస్వామి లేవదీయబోతే 'వద్ద'ని అదలిస్తున్నరు భగవాన్‌. నేనున్నూ తాకితే ఏమంటారోనని నివ్వెరపడి నిలుచున్నాను. శ్రీవారి కౌపీనమూ పైతుండూ రక్తంతో తడిసి వున్నవి. ఇంతలో అయ్యో భగవా9 పడ్డారన్న నాకేక విని సబ్‌ రిజిష్ట్రార్‌ నారాయణయ్యర్‌ పరుగెత్తివచ్చి లేవ దీయబోతే వద్దని నివారించి వారి చేతి సహాయంతో తామే లేచారు భగవాన్‌. అప్పుడే వెన్ను పూసవద్ద చిన్న నరం తెగిందనీ ఎవరికీ తెలియనీయవద్దని సేవకులతో భగవాన్‌ సెలవిచ్చారనీ వెనుక అది చీముపట్టి బాధించిందనీ తరువాత తెలిసిందేగాని భగవాన్‌ అప్పుడు బయటపెట్టనీయలేదు. మానవమాత్రులకు ఆబాధ సహించటం అసాధ్యం.

అట్లా పడిలేచి మరుగుదొడ్డికి వెళ్ళి వచ్చి యథాప్రకారం 9 గంటలకు వసారాలో వచ్చి కూర్చున్నారు భగవాన్‌. అప్పుడు పంచాంగం సమర్పించాను. అంతే, నేను భగవాన్‌ సమీపానికి వెళ్ళ గలగటం, ఆ భగవానుని అమృతవాణి నా చెవులలో సోకడం ఆ నాటితో సరి. ''వచ్చిందీ ఉగాది'' అని అదటున భగవద్వాణి పలికింది. ఇందుకే గాబోలునని ఇప్పు డనుకుంటున్నను. ఈ ఉగాదితో నీకూ నాకూ మాటలు తీరుతవి అన్నట్లున్నది ఆవాణి.

ఉగాదినాటి దెబ్బవల్ల క్రమంగా బయటికివచ్చి కూర్చునే శక్తి తగ్గింది. అందువల్ల ఆ చిన్నగదిలో సోఫామీదనే వుండి దర్శనానికి అవకాశం కల్పించవలసిందని భగవాన్‌ ఆజ్ఞాపించడంతో ఆ యేర్పాట్లు జరిగినవి. ఆ వెనుక జనం గుంపులు గుంపులుగా రావటంవల్ల క్యూయేర్పాట్లున్నూ జరిగినవి. ఇక ఆఫీసువారికి డాక్టర్లకూ ఉద్యోగస్థులకూ తప్ప తదితరులకు అంటే నా వంటి దీన భక్తులకు దర్శనభాగ్యమేగాని దగ్గరకు వెళ్ళి మాట్లాడే అవకాశం లేకపోయింది. అందువల్ల ''మీ రెవరైనా వెళ్ళి, మా గతి యేమని అడిగి, చరమసందేశం తీసుకొని రావలసిం'' దని మా అన్నా వాళ్ళందరితోను అన్నా నేను. ఆ వెనుక ఒక నాటి రాత్రి 8 గంటలకు ఓ మాందూరు రామస్వామి రెడ్డియారూ, ఇంజనీయరు నారాయణరావు, మా అన్నా, యస్‌. దొరస్వామయ్యరు ఇత్యాది హేమా హేమీలంతా వెళ్ళి ఎంత యత్నించినా ఏమీ అడగలేక తిరిగి, వచ్చారు. నేను గేటువద్ద నిలిచి చూస్తూనే వున్నాను. ఏమయిందంటే ఏమీ కాలేదన్నారు. ''వచ్చిందీ వికృతి!'' అన్న భగవద్వాణి వికృతమే అయింది.

Naa Ramanasrma Jeevitham    Chapters