Naa Ramanasrma Jeevitham    Chapters   

50. విజ్ఞానాహారం

2-3-50 తేదీ నుండి మూసుకున్నూ అధైర్యం తోచి భగవానుని ప్రార్థిస్తూ ఒక స్తోత్రం వ్రాసి 3 వ తేదీన శ్రీవారికి అందజేశాడు. ఆ నాడే మూసు విష్ణుసహస్రనామ పారాయణం చేసేందుకు ఏర్పాటు చేశాడు. కొందరు భక్తులు మృత్యుంజయ జపం ఆరంభించారు. ప్రతి దినమూ ఈ రెండు తెగల వారున్నూ తీర్థమూ విభూతీ కుంకుమ ఇత్యాది ప్రసాదాలివ్వటానికి శ్రీవారి వద్దకు వెళ్ళితే డాక్టర్ల చికిత్సలకు ''సరిసరి'' అని తలవూపి శరీరం ఒప్పగించినట్లే ఈ తీర్థ ప్రసాదాల కున్నూ సరి సరి అని తలవూపి స్వీకరించేవారు భగవాన్‌. కొందరు భక్తులు ''మృత్యుంజయ హోమం చేస్తా'' మని శ్రీవారి నడిగితే ''ఊ-ఊ మీ యిష్టం'' అని తల వూపి వారటుపోగానే సమిపంలో వున్న వెంకటరత్నాన్ని చూచి ''వారంతా మృత్యుంజయ హోమం చేస్తారటయ్యా. ఊ- చేయనీ. దీన్ని (ఈ హోమాన్ని) తెలిసిన వారంతా మరణించకుండా వుండాలి గదా. ఊహూ. అది లేదు. ఏదో చేస్తారంతే. మృత్యుంజయుడైన శివుణ్ణి శరణుజొచ్చిన వారే మృత్యుభీతి పోగొట్టుకుంటారు'' అని అన్నారు భగవాన్‌. ''దేవీకాలో త్తరంలో ముముక్షువు మంత్రము, హోమము మొదలైన వాటిలో మగ్నుడు కాగూడదని చెప్పివున్నదే!'' అన్నాడట వెంకటరత్నం. ''అవును. నిజమే. ధ్యానమే చాలు నన్నారు. సర్వజ్ఞానోత్తరంలో గూడా ధ్యాననిష్టయే సరియైన జ్ఞానము. దీక్ష, తపస్సు అని చెప్పి వున్నది'' అని సెలవిచ్చారట భగవా&.

ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒక భక్తురాలు ఆ చిన్ని (నిర్వాణ) రూములో వున్న భగవానుని ఏదో అడుగుతానని తాను ఒంటరిగా వెళ్ళి నిలుచుంటే ''ఏమి'' అన్నారు భగవాన్‌. ''మా వుళ్ళో మంత్రవేత్త ఒక రున్నారు. భగవా& అనుజ్ఞ యిస్తే వారినిక్కడికి రప్పిస్తాను'' అన్న దామె. ''ఓహో! అదా సమాచారం. అతడేం జేస్తాడు?'' అన్నారు భగవాన్‌! ''108 కొబ్బరికాయలు దిగతుడిచి ఆశ్రమం అంతటా కొడతాడట'' అన్న దామె. భగవాన్‌ మందహాసంతో ''కొబ్బరికాయలేనా? కోడిపెట్టను దిగతుడువ డన్న మాట. తురాయికట్టి విభూతికూడా పెడతాడా?'' అంటూ పరిహాసంగా మాట్లాడేసరికి ఆమె లజ్జించి ఆ ప్రయత్నం విరమించింది.

ఆ వెనుక 7-8 తేదీలకు పుండు చాలా విషమించినదన్న విషయం తెలిసి స్త్రీలలో కొందరు దేవీఖడ్గమాలాజపం ప్రారంభించారు. ఒక తల్లి, జగదీశ్వరశాస్త్రి భార్య, చండీహోమం చేయించింది. ఒక తల్లి శనిదీపాలు పెట్టింది. ఎందరో భక్తులు ఈ కైంకర్యార్థం ధనం వినియోగించారు. కొదరు అరుణాచలేశ్వరాలయంలో అభిషేకాదులు చేయించారు. ఎక్కడ చూచినా స్తోత్రాలూ, జపాలూ, హోమాలూ, వీటన్నిటితో ఆశ్రమం అంతా మారుమ్రోగుతూ వుంటే నాగుండెలో గుబులు పుట్టింది. 16-3-50 వ తేదీన ఎవరో జ్యోతిష్కుడు వచ్చి ఇక భగవా& శరీరం నిలవదని ఏమో భయకరంగా చెప్పాడు అయినా అపాయం సమీపిస్తే ఏదో సూచనగా నైనా భగవా& నాకు చెప్పరా? అన్న పిచ్చినమ్మకం నన్ను విడువక బాధిస్తూ వుండేది.

17 వ తేదీన శ్రీవారికి వాంతి అయి చాలా బాధ కలిగించిదనీ ఆ వెనుక ఆహారమే తీసుకోలేదనీ విని వారి సోదరి, అలివేలమ్మ అత్త, భగవానుని సమీపించి ఎంతో విచారంగా ''అయ్యో! ఇవాళ భగవాన్‌ ఆహారమే తీసుకోలేదటే. పాయాసం ఎంతో బాగున్నది. రవంతైనా లోపలికి పోకపోయెనే'' అని అన్నది. భగవాన్‌ ఆమె కేదో సమాధానం చెప్పి పంపి సమీపస్థులగు సేవకులతో ''పాయసం బాగున్నది. భగవాన్‌ తినలేదే అని వాళ్ళు విచారిస్తారు. వీళ్ళింకా విజ్ఞానాహారం తినరేమా అని నేను విచారిస్తాను. ఏం జేస్తాం. ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది.'' అన్నారు భగవా&.

Naa Ramanasrma Jeevitham    Chapters