Naa Ramanasrma Jeevitham    Chapters   

48. చిన్న గదిలో

ఈ ఆపరేషన్‌ సమాచారం తెలిసి 18-12-49 తేదీ ఉదయానికే మా అన్న వచ్చారు. 19వ తేదీ ఉదయం 5 గంటలకే ఆశ్రమానికి వెళ్ళి భగవాన్‌ ఆసుపత్రికి వెడుతూ వుంటే దర్శనం అవుతుందని కాచుకొని వుండి ఐదున్నరకే భగవాన్‌ ఆసుపత్రిలో ప్రవేశించటం చూచాము. ఎనిమిదిన్నరకు ఆపరేషన్‌ అయిందని తెలిసింది. ''పుండు పైకంతా పాకివుండటం వల్ల ఈ ఆపరేషన్‌ చాలా కష్టమైందనీ ఇకముందు ఆపరేషనునకు అవకాశం లేదనీ, నయం కావటం దుర్ఘటమనీ'' డాక్టర్లన్న విషయమున్నూ విన్నాము. ''వారం పదిరోజుల వరకూ భగవాన్‌ ఆసుపత్రిలోనే వుండాలనీ, ఎవరికీ దర్శనం వుండదనీ'' చెప్పి చిన్నబోయిన ముఖాలతో డాక్టర్లంతా సాయం కాలం మూడు గంటలకు వెళ్ళిపోయారు. ఎంతకాలం దర్శన భాగ్యం లేకుండా వుంటుందో నన్న విచారంతో సాయం కాలం ఐదు గంటలకు ఆశ్రమానికి వెళ్ళితే ''ఇక్కడ వున్నట్లే వుండి భక్తులకు దర్శనం అయ్యేట్లు ఏర్పాటుచేయాలి గాని అసలు చూడరాదని ఆంక్షపెట్టటం ఎందు''కని భగవాన్‌ సెల విచ్చినందువల్ల ఆసుపత్రిలోనే దర్శనానికి ఏర్పాట్లు జరగటం కూడా చూచి మా అన్న వెళ్ళారు. ఆ వెనుక పదిరోజులకు పైగా ఆ విధంగానే గడిచింది గాని ఆసుపత్రిలో చాలాకాలం వుంటే బీదసాదలకు కష్టం కలుగుతుందని అక్కడ వుండనన్నారటా భగవా&.

ప్రస్తుతం భగవాన్‌ శరీరం కొత్తహాలు నుండి దానికి ఎదురుగా కట్టిన మరుగుదొడ్డివరకూ నడిచి వెళ్ళే స్థితిలో లేనందువల్ల ఆ హాలులోనే కమ్మోడు పెడతాము; అక్కడికే దయచేయవచ్చును. అని సర్వాధికారి మనవి పంపితే ''అది కోవలె గనుక కమ్మోడు పెట్టరా''దని సెలవిచ్చారట భగవా&. ''అది కోవెలైతే పాత హాలులో తూముపెట్టి స్నానం ఇత్యాదులకు ఏర్పాట్లు చేస్తా'' మని భక్తులంతా పట్టుపట్టి భగవా& తో మనవి చేస్తే అక్కడ లైబ్రరీ వున్నందున అదీ కాదన్నా రట భగవా&. కడకు కొద్దిరోజులనుండీ విశ్రాంతి సమయంలోనూ రాత్రివేళలందూ భగవాన్‌ నివసిస్తూవున్నటువంటిది కొత్త హాలుకు ఎదురుగావున్న చిన్న గది: ఆ గదిలో జనవరి ఒకటవ తేదీ రాత్రి పది గంటలకు తమ పడక వేయించుకొని ఆసుపత్రి నుండి నడచివచ్చి అందులో ప్రవేశించారు భగవాన్‌. అప్పటికే డాక్టరు రాజగోపాలయ్యరును తీసుకొనివచ్చి హోమియో వైద్యం ప్రారంభించారు. మూడవ తేదీ బ్రాహ్మముహూర్తంలోనే నేను గిరిప్రదక్షిణానికి వెళ్ళాను. తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి ఆ చిన్నగదివరండాలో సన్ననిబల్ల వేయించుకొని ఆ బల్ల మీద కూర్చుని భగవాన్‌ భక్తులకు దర్శనం ఇచ్చే ఏర్పాట్లు జరిగివున్నవి. తొమ్మిది గంటలకల్లా భగవా& బయటికివచ్చి ఆ బల్లమీద కూర్చున్నారు. కొబ్బరియాకుల సందుల్లోనుంచి సూర్యకిరణాలు బంగారు రేకులవలె శ్రీవారి శరీరంమీద ప్రసరిస్తూ వున్నవి. చిక్కిశల్యమై పిండిబొమ్మవలెనున్న ఆదేహంలోనుండి కాంతి వెల్లివిరిసి చుట్టూ ఆవరించింది. తొమ్మిదినుండి పదింబావు వరకూ చుట్టూ అందరినీ కూర్చోనీయవలసిందని భగవదాజ్ఞ. తిరిగి సాయంకాలం ఐదు గంటలనుండీ ఆరు వరకూ అదే విధంగా దర్శనం లభించింది. 5-1-1950 తేదీన శ్రీవారి 70వ జయంతి, అంటే డెభైసంవత్సరాలు నిండినవన్నమాట. ఆ జయంతి మహోత్సవం జరిగినప్పుడున్నూ అదే విధంగా దర్శన మిచ్చారేగాని పూర్వంవలె పంక్తిభోజనానికి రావటంగాని ఎడతెగని దర్శనభాగ్యంగాని లభించనే లేదు.

భగవాన్‌, ''తాము స్కందాశ్రమంలో వుండగా వల్లిమల మురగర్‌, అమ్మ నడిగి కమండలం తీసుకొని వెళ్ళా'' రని 14-2-49 వ తేదీన సెలవిచ్చిన విషయం అప్పుడే నోటుచేసుకున్నాను గాని విపులంగా వ్రాయలేదెందుకో జయంతి సందడి తగ్గిన వెనుక 23-1-50 తేదీ వేకువన గిరిప్రదక్షిణానికి వెళ్ళాను. తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి తొమ్మిదిగంటలయింది. వల్లిమల మురగర్‌ తమ శిష్య బృందంతో వచ్చి భగవా& సన్నిధిలో తిరుప్పుగళ్‌ పాడుతూవున్నారు. నమస్కరించి లేచానో లేదో భగవాన్‌ నన్నుద్దేశించి ఆ మురగరును చూపుతూ ''ఇదిగో! వీరే వల్లిమల మురగర్‌. వీరు తిరుప్పుగళ్‌ భజన కూటములు స్థాపించిన వారు.'' అని చెప్పి ఇతరులకు కనుపించకుండా నాకు మాత్రం కనుపించేలాగున కమండలం పట్టుకున్నట్లుగా చెయ్యి ఆడిస్తూ తలవూపి చిరునవ్వుతో మౌనం వహించారు. వెంటనే నాకు గత విషయం జ్ఞప్తికి వచ్చింది. భగవాన్‌ సంజ్ఞ గ్రహించినట్లుగా తలవూపాను.

ఆ చిన్నగదిలో వుండగానే భావనగరం మహారాజా (మద్రాసు గవర్నరు) వచ్చి భగవానుని దర్శించి వెళ్ళారు.

Naa Ramanasrma Jeevitham    Chapters