Naa Ramanasrma Jeevitham    Chapters   

47. ఇప్పుడేమీ తొందరలేదు

1-9-49 నుండి భగవాన్‌ సన్నిధిలో వేదపారాయణ ఆరంభించి రెండు వేళలా పారాయణ సమయంలో మాత్రం అంతా హాల్లో వచ్చి కూర్చుని పారాయణ ముగిసిన వెంటనే బయటికి వెళ్ళేటట్లుగా ఏర్పాట్లు జరిగినవి. క్రమంగా మామూలు పరిస్థితికి వస్తుందేమో నని అంతా ఆశించాం. కాని 24-11-49 తేదీకే పుండు ఆరటం లేదని తెలిసింది. 1-12-49 తేదీనాడే ఇక్కడి డాక్టర్లు సెలవేసిన కురుపును చూచారట. ఆ సంగతి చూచాయగా నాకు తెలిసింది. ఆ నాడు సాయంకాలం వేదపారాయణ సమయంలో భగవాన్‌ వైపే పరిశీలనగా చూస్తూ కూర్చుంటే కట్టు సందులోనుంచి నల్లగా ఎదుగుతూ వున్నగడ్డ నాకంట పడ్డది. పారాయణ ముగియగానే అంతా లేచి బయటికి వెళ్ళిన వెనుక నేనూ నమస్కరించి లేచాను. సేవకులు తప్ప ఎవరూ లేరు. భగవాన్నుద్దేశించి ''అయ్యో! మళ్ళీ సెలవేసిందే? ఈసారి పైవరుసగా గూడా వున్నట్లున్నదే?'' అన్నాను. ''నీ కెవరు చెప్పారు?'' అన్నారు భగవాన్‌. ''ఎవరు చెప్పేది ఏమున్నదీ? ఆ కట్టు సందులో నుంచి నల్లగా కనుపిస్తోందే?'' అన్నాను. భగవా& కట్టు తొలగించి గడ్డను చూపుతూ ''ఊ. ఇదుగో. ఎదుగుతున్నది. చూడూ'' అంటూ తండ్రి బిడ్డను చూచినట్లు జాలిగా చూచారు నన్ను.

నా కళ్ళు నీళ్ళతో నిండినవి. ఏమీ తోచక అట్లాగే నిబడ్డాను. భగవా& నా అవస్థ చూచి ''కృష్ణా పత్రిక ఇచ్చారా? గృహలక్ష్మీ వచ్చింది. చూచావా?'' అంటూ వేరే ప్రసంగంలోకి దింపారు. ఎక్కువసేపు అక్కడ నిలువరాదని బయటికి వచ్చాను. మళ్ళీ సెలవేసిందన్న సంగతి ఇక్కడి వారు మద్రాసుకు తెలియజేస్తే యస్‌. దొరస్వామయ్యరు 12 వ తేదీ మధ్యాహ్నానికి రాఘవాచారి ఇత్యాది డాక్టర్లను తీసుకొని వచ్చారు. వా రంతా చూచి 19 వ తేదీన తిరిగి ఆపరేష& చేయటానికి నిశ్చయించుకొని వెళ్ళారని విని నాకు కంపం పుట్టింది. 13 వ తేదీన ఉదయమే శ్రీవారిని సమీపించి ''ఎన్నిసా ర్లీకోతలు? ఒక్క సంకల్పంతో పోయేదానికి'' అన్నాను స్వతంత్రంగా. ''కానీ, చూస్తాం'' అన్నారు భగవాన్‌. ''ఏం చూడటం? ఎప్పటికీ ఆ సంకల్పం రావటం? ఇంకా పని వున్నది. మాకు రెక్కలు రావద్దూ?'' అన్నాను. భగవాన్‌ ''హూ-హూ'' అంటూ జాలిగా చూచి మౌనం వహించారు.

15వ తేదీ సాయంకాలం 6 గంటలవేళ మిసెస్‌ తలెయర్‌ఖాను ఎంతో ఆర్తితో ''ఈసారి పుండు పైకి పాకింది గనుక ఆపరేష& చేయవద్దనీ వేలూరు నుండి డి. యమ్‌. ఓ. ను తీసుకొని వస్తాననీ'' అధికారు లందరితో చెప్పి వేలూరు వెళ్ళింది. 16 వ తేదీన డి. యమ్‌. ఓ. వచ్చి చూచి రాఘవాచారీ వాళ్ళ పద్థతికే ఆమోదం చూపటంవల్ల ఆపరేష& ఆగే మార్గం కనుపించలెదు. ''ఈసారి పై వరుస వచ్చింది. లోపలికంతా పాకిందో యేమో. ఈ ఆపరేష& అయి బయట పడ్డప్పటి మాట గదా? చేయకుండా వుంటే బాగుండునే?'' అని భక్తులలో ఆందోళన బయలుదేరింది. నాకేమీ తోచక 18 వ తేదీ ఉదయాన భగవాన్‌ సన్నిధికి వెళ్ళి నమస్కరించి భయంతో అట్లాగే నిలబడ్డాను. 'ఏమీ?' అన్నట్లు చూచారు భగవాన్‌. ''ప్రతి వాళ్ళూ ఈ ఆపరేషన్‌ తట్టుకొని భగవాన్‌ శరీరం బయట పడ్డప్పుడు గదా! అని అంటూ వుంటే భయంగా వున్నదే? రేపేనా ఆపరేష&?'' అన్నాను. ''ఊ, వారంతా వస్తారిప్పుడు'' అన్నారు భగవా&. నాకు వణుకు వచ్చింది. చేతులు నలుపుకుంటూ ''ఏమో భయంగా వున్నదే'' అన్నాను చల్లగా, భగవా& రవంత యోచించి జాలిగా నన్ను చూస్తూ 'హూ' అంటూ ''ఇప్పుడేమీ తొందరలేదు. ఏమీ కాదు'' అన్నారు చల్లగా. ''సరి'' అంటూ కళ్ళనీ ళ్ళాపుకొని బయటికి వచ్చాను.

Naa Ramanasrma Jeevitham    Chapters