Naa Ramanasrma Jeevitham    Chapters   

46. సహనం

1949 అక్టోబరు రెండవ వారంలో తప్పనిసరిగా మా అన్నగారి యింటికి (మద్రాసు) వెళ్ళి నేను నవంబరు 8, తేదీ ఉదయాన బయలుదేరి సాయంకాలానికి అరుణాచలం వచ్చి సామాను నా కుటీరంలో పడవేయడమే తడవుగ ఆశ్రమానికి వెళ్ళాను. 71/2 అయింది. భగవాన్‌ ఆహారం తీసుకుంటూ ఉన్నందువల్ల వసారాలో కొంచెం సేపు నిలుచున్నాను. పావుగంటలో సమీపవర్తిగానున్న సత్యానందస్వామి వచ్చి భగవా& దర్శనార్థం హాలు లోపలకు రావచ్చునన్నారు. వెళ్ళి చూసేసరికి సోఫాకు ఎదురుగా టేబిల్‌ వేసివున్నది. దానిమీదనే ఆహారం తీసుకుంటున్నారు కాబోలును. ఒక గిన్నెలో చెయ్యి కడుక్కొని తుండుతో తుడుచుకుంటున్నారు భగవా&. అర గంటలో అరుణాచల శిఖరాన్నారోహించే ఆ దృఢశరీరం ఈ విధంగా వున్నదే అన్న దిగులుతో నమస్కరించి లేచి తేఱిపాఱచూతును గదా ఒళ్ళంతా ఏదో భీభత్సంగానూ భీకరంగానూ వున్నట్లు తోచింది. అదేమని అడిగేందుకైనా లేకుండా కుశలప్రశ్నలారంభించారు భగవా&. ఎట్లాగో సందు చేసుకొని ''చెయ్యి ఎట్లాగున్నది?'' అన్నాను. ''ఏమో. ఉన్నది'' అన్నారు భగవా&. ఆ మాటల ధ్వని ఎట్లాగో వున్నది. నేను మద్రాసు వెళ్ళేనాడు ''భగవా& శరీరస్థితి ఇట్లాగున్నదే ఎట్లా వెళ్ళను?'' అంటే ''దానికేమి? ఇప్పుడేమున్నది?'' అని ఎంతో ధైర్యం కలిగేట్లు సెలవిచ్చారు భగవా&. ఇప్పటి ఈ మాటల ధ్వని వినేసరికి మనస్సులో దిగులు పుట్టింది. డాక్టర్లంతా చూస్తూ నిలబడి వుండటంవల్ల ఏమడిగేందుకు వీల్లేక కుటీరానికి వచ్చాను.

మరుదినిం ఉదయాన వెళ్ళి చూద్దును గదా ఒళ్ళంతా ఎఱ్ఱని దద్దుర్లతో పెట్లవేసి వున్నది. ఆత్రతతో ''ఒళ్ళంతా అదేమి?'' అన్నాను. ''ఏమో. అట్లా అయింది. ఏం జెప్పేది?'' అన్నారు భగవాన్‌. అటూ యిటూ చూద్దును గదా ఎలక్ట్రికల్‌ హీటర్లు రెండు పక్కలా గజం దూరమైనా లేకుండా పెట్టి వున్నవి. ఎలక్ట్రిక్‌ ఫానే భగవా& ఒంటికి అంతగా సరిపడదు గదా. ఈ హీటర్లు పెటారే. వీటివల్ల ఇట్లా పెట్లిందాయేమి? అన్న సందేహం మనస్సులో ఏర్పడ్డది. ఏమనేందుకూ తోచక అక్కడ కూర్చోరాదన్న నిబంధన ననుసరించి బయటికి వచ్చేశాను.

దైవాద్వా ఆ రాత్రికే ఎలక్ట్రికల్‌ ఇంజనీయరు నారాయణరావు భగవా& దర్శనార్థం వచ్చి భోజనానంతరం మా యింటికి వస్తే వారిని ఈ విషయం అడిగాను. అయ్యో! ఆ హీటర్లు తెఱ అడ్డంకట్టి దూరంగా పెట్టాలిగాని అట్లా పెట్టరాదమ్మా ఆ బొబ్బరింతకు అదే కారణం అయివుండవచ్చును'' అన్నారు. ''ఆసంగతి ఆపీసులో చెప్పండయ్యా'' అంటే ''ఏమో ఏమనుకుంటారోనని జంకాను'' అని అన్నారు. ఆ మరుదినం ఉదయం నాతో వచ్చి, ముందు భగవా& తో చెప్పి, ఆ వెనుక ఆఫీసులోనూ చెప్పారు. అప్పుడందరూ కూడబలుక్కొని ఆ హీటర్లు తీసి మామూలు కుంపటి పెట్టారు.

ఈ సంగతి ఆనోటా ఆనోటాపడి భక్తులందరికీ తెలిసింది. ఒక చొరవగల భక్తుడు భగవా& ను సమీపించి ''ఆ హీటర్ల వేడి తెఱ అడ్డం లేకుండా అట్లాగే పడితే ఒళ్ళంతా తాపంగా కూడా వుంటుందట గదా?'' అన్నాడు. ''అవునవును. అట్లాగే ఉన్నది'' అన్నారు భగవాన్‌. ''భగవా నిది వద్దని చెప్పలేదేమి?'' అన్నా డాతడు. ''ఏమో. మామూలు కుంపట్లయితే బొగ్గులు వేయాలి. విసరాలి, దుమ్ము పడుతుంది. ఇదైతే ఏ చిక్కు వుండదని వారంతా తెచ్చి పెట్టారు. మన మెందుకు వద్దనేది?'' అన్నారు భగవాన్‌. ''తాపంగా వుంటుందన్నారుగా?'' అన్నా డాభక్తుడు. ''దానికేమి? వుంటే వుంటుంది. మేము అంత మంచిదని పెడితే తిరస్కరించారని అనుకోరూ. పైగా ఈ కొత్తహాలులో దుమ్ముపడి పాడవుతుందేమో. ఎట్లాగన్నాకానీ అని వూరుకున్నాను. ఇప్పుడేమో ఆ నారాయణరావు కూడదన్నాడు. సరే. మన కుంపటి మనకు వచ్చింది. ఏదో ఒకటి'' అని సెలవిచ్చారు భగవాన్‌.

1946 లో గూడా ఒకసారి ఇట్లాగే జరిగింది. ఏ మంటే భగవా& భక్తుడూ ఆయుర్వేద వైద్యుడూ అయిన బెంగుళూరు రామచంద్రరావూ, సమీపవర్తిగా వున్న రాజగోపాలయ్యరూ కలిసి భగవాన్‌ కళ్ళ నొప్పులు తగ్గే నిమిత్తం ముందే చెపితే వద్దంటారిన శ్రీవారితో చెప్పక ఖరీదుగల దినుసులన్నీ వేసి ఘాటుగా ఒక తైలం తయారు చేశారు. చెప్పకుండా చేస్తున్నారు గనుక భగవాన్‌ ఉపేక్షగా వూరుకున్నారు. ఆ వైద్యులది తయారయిన వెనుక ఒకటి రెండు రోజులు వాడి సేవకులకు ఒప్పగించి వెళ్ళి పోయారు. నాల్గయిదు రోజులు వాడేసరికి భగవా& కాళ్ళు ఎఱ్ఱబడి పెట్లటానికి ఆరంభించినవట. భగవానేమి? మంట అంటారా? నొప్పి అంటారా? సేవకులు ''ఇట్లా పెట్లు తున్నదే?'' అంటే ''లోపలున్నదంతా బయటికి వస్తున్నదేమో. రానీయండయ్యా'' అని అనేవారట.

అదే సమయంలో వేరోక భక్తుడు అదేదో ఎలక్ట్రికల్‌ యంత్రం (బ్లోయర్‌) తెచ్చాడట. అది ఒక పక్కననొక్కితే వేడిగాలీ, మరొక ప్రక్కన నొక్కితే చల్లగాలీ వస్తుందట, చలికాలం గదా. ఒకటీ రెండు రోజులు అదీ భగవాన్‌ సన్నిధిలో ఉపయోగించారట. అదీ యిదీ జోడై కాళ్ళంతటా ఎఱ్ఱగా పెట్లి బొబ్బరించడంవల్ల అందరికళ్ళా పడ్డది. తైలం వల్ల నని కొందరూ, యంత్రంవల్ల నని కొందరూ గుస గుస లాడారు. చివర కొకరు భగవాన్ను సమీపించి ''అయ్యో! ఇట్లా పెట్లవేసిందే, ఆ తైలం, ఆ యంత్రపుగాలీ మానరాదా?'' అంటే ''ఖరీదు గల దినుసులువేసి ఘాటంగా తైలంచేస్తే త్వరగా పోతుందని గదా చేశారు. ఇట్లా ఫలించింది. మంచిదే గదా. మామూలు కుంపటెందుకని ఫాషన్‌ గల యంత్రం తెచ్చారు. నన్ను అడిగా చేశా రివి? అడిగితే వద్దంటానని తంత్రంగా తెచ్చారు. అయితే స్వామిని సుఖపెట్టాలని గదా! వారి తాత్పర్యం, ఉండనీయండి. అంత కష్టపడి చేశాం తెచ్చాం. స్వామి తృణీకరించారని అనుకోరూ? వారి నెందుకు చిన్నబుచ్చటం?'' అన్నారు భగవాన్‌.

''ఇదెక్కడి దాక్షిణ్యం, ఒళ్ళంతా పెట్లవేసిందే?'' అన్నారా భక్తులు, ''అయితే యేమండి? అంత ఖరీదు పెట్టింది వృథా పోదూ?'' అన్నారు భగవాన్‌. ''వృథాయేమి మరెవరైనా వాడుకుంటారు'' అన్నారా భక్తులు. ''సరి సరి మనకు సరిపడనిది ఇంకొకరి కెందుకు!'' అన్నారు భగవాన్‌. ''అయితే అట్లాగే వుంచుతా''మని భక్తులంతా పట్టుపట్టి అవన్నీ ఆపుదలచేసి ''ఇప్పుడివి మానేటందుకు భగవానే ఏదైనా ఉపాయం సెలవీయం''డని ప్రార్థిస్తే ''ఏమీ వద్దయ్యా టెంకాయనూనెలో కరక్కాయ కొట్టివేసి ఊరనిచ్చి ఆ నూనె తీసుకొని రండి'' అని సెలవిచ్చారు భగవాన్‌,

ఆ వెనుక ఆ నూనెతో ఆ బొబ్బరింతలు తగ్గిపోయినవి. ఇప్పుడున్నూ అట్లాగే భగవా& స్వయంగా ఏదైనా చెప్పి చేయించుకుంటే బాగుండునని నా ఆశ. ఎప్పుడైనా ఆ విధంగా నేను ప్రార్థిస్తే వారంతా గొప్ప గొప్ప వైద్యులు ఏదో చేస్తున్నారు గదా. కానీ, ఏదో ఒకటి'' అని అనేవారు భగవాన్‌.

Naa Ramanasrma Jeevitham    Chapters