Naa Ramanasrma Jeevitham    Chapters   

45 ఆపరేషన్‌ - స్వతంత్ర దినం

రాత్రంతా నిద్రపట్టక 7-8-49 తేదీ ఉదయాన తొందరగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని 6 గంటలకల్లా ఆశ్రమానికి వెళ్ళాను. భగవాన్‌ అల్పాహారానంతరం హాల్లోనుండి గోశాలవైపుకు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నాను. గోశాలవైపు నుండి తిరిగిరావటం ఆసుపత్రికే వెళ్ళారు భగవా&. భక్తులంతా మనస్సులో ప్రార్థన చేసుకుంటూ, ఆసుపత్రివైపే ఆర్తులై చూస్తూ మాట్లాడకుండా జూబ్లీ హాలులో కూర్చున్నారు. రాఘవాచారి మొదలైన డాక్టర్లంతా ఆసుపత్రిలోనేవుండగా 9 గంటలకల్లా గురుస్వామి మొదలియారుతో సహా మా అన్నగారు వచ్చి ఆసుపత్రిలోకి వెళ్ళారు. ఆ వెనుక అక్కడి సమాచారం నాకేమీ తెలియదు. పదిన్నరగంటలయ్యేసరికి గురుస్వామి మొదలియార్‌ తోపాటు చిన్నస్వాములున్నూ బయటకి వచ్చి ''ఆపరేషన్‌ పూర్తి అయింది. భయం ఏమీ లేదు. భగవా& సాయంకాలం అందరికీ దర్శనం ఇస్తారు. మీ రంతా ఆహారం తీసుకొని విశ్రమించండి'' అని భక్తులందరికీ ఇంగ్లీషులోనూ, అరవంలోనూ, తెలుగులోనూ చెప్పించి వెంటనే గురుస్వామి వేరొక కారులో మద్రాసు వెళ్ళారు. ఆ వెనుక భగవానుకు ఆసుపత్రి లోనే ఆహారం ఇచ్చే ఏర్పాటుచేసి రాఘవాచారీ మొదలైన వారంతా తామున్నూ ఆహారం తీసుకొని ఆ నాడంతా ఇక్కడే వుండి సాయంకాలం దర్శనం వద్దని మనవి చేస్తే భగవా& సమ్మతించక ఆసుపత్రి వసారాలో పడకకుర్చీ మీద కూర్చుని సాయంకాలం 5 గం. నుండి 6 గం. వరకూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు.

8-8-49 ఉదయం కూడా 9 నుండి 10 వరకూ అట్లాగే దర్శనం దయచేశారు. ఆ మధ్యాహ్న భోజనానంతరం డాక్టర్లంతా ''ఒక్కవారం రోజులు నడువవద్దనీ, ఆసుపత్రిలోనే వుండటం మంచిదనీ'' ప్రార్థనా పూర్వకంగా భగవానునితో మనవి చేసి తెచ్చిన సామానుతోసహా పట్నం వెళ్ళారు.

భగవా& ''తామక్కడవుంటే దర్శనార్థం వచ్చే భక్తులకే కాక మందుల నిమిత్తం వచ్చే బీదలకున్నూ కష్టం కలుగుతుందని చెప్పి డాక్టర్లు గేటు దాటారో లేదో ఆసుపత్రి నుండి కొత్తహలుకు నడిచి రావటం చూచి ధైర్యం కలిగి మా అన్న మద్రాసు వెళ్ళారు. వెంటనే ఆత్రతతో నేనున్నూ ఆశ్రమానికి వెళ్ళాను. భగవాన్‌ సోఫామీద పడుకొని వున్నారు. తలుపులు మూసి వున్నవి. ''కటకటాలద్వారా దర్శనం చేసుకోవలెనుగాని లోపలకు రావ''ద్దని సేవకు లన్నారు. ''అంతే చా''లని ద్వారం వద్ద నమస్కరించి వరండాలోనే అంతా కూర్చున్నాం. ఉదయం, సాయంకాలం కోలవెలలోనే వేదపారాయణ జరుగుతున్నది. ఎప్పటికి ఈస్థితి మారుతుందా ఈశ్వరా! అని ప్రార్థన చేసుకుంటూ వుండగా ఆగష్టు 14వ తేది వచ్చింది. మర్నాడే భారతదేశానికి స్వాతంత్ర్యం అభించినసుదినం గదా. ''ఆస్వతంత్ర దినం నాడైనా భగవానుని సమీపానికి వెళ్ళేందుకు లేదే'' అని ఆ రాత్రంతా విచారంగానే వున్నది.

తెల్లవారి ఏడున్నరకు ఆశ్రమానికి వెళ్ళాను. గేటు వద్దకే రేడియో పాట వినిపించింది. ఎక్కడినుంచా అని చూస్తే భగవానున్న కొత్తహాలు నుంచేనని తెలిసింది. ముందుకు సాగి చూస్తే ఆ హాలుని ఇనప కటకటాల తలుపులు బాహాటంగా తెఱచి వున్నవి. ఈ స్వతంత్రదినంనాడు శ్రీవారిని సమీపించే స్వతంత్రం లభించునా యేమి? అన్న ఆశతో దగ్గరకు వెళ్ళేసరికి తూర్పు ద్వారాన హాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని దక్షిణ ద్వారాన బయటికి వచ్చేట్లుగా ఏర్పాట్లు చేసివున్నవి. ఎంతో సంతోషంతో లోపల ప్రవేశించాను. బాలభానుప్రభాభాసితముఖవికాసంతో బాలీసు నానుకొని కూర్చున్నారు భగవా&. నమస్కరించి లేచి ఆ మూర్తిని చూస్తూ అట్లాగే నిలబడ్డాను. ''దర్శనం చేసుకొని వెళ్ళవలసిందేగాని కూర్చునేందుకు లేదమ్మా'' అన్నాడు కృష్ణస్వామి. వసారాలోకి వచ్చివేశాను, దర్శనార్థం వచ్చేపోయే భక్తులందరినీ కృపావీక్షణాలవల్ల ఆదరిస్తునే వున్నారు భగవాన్‌. ఈ పీడ (ఈ కురుపు) ఇంతటితో నైనా వదలిపోతే బాగుండునని ప్రార్థిస్తూ అంతా పదింటివరకూ వసారా చుట్టూ కూర్చున్నాం. సాయంకాలం మూడు నుండీ ఆరు వరకూ అట్లాగే జరిగింది.

మొత్తంమీద ఆ నాడంతా రేడియో పాడుతునే వున్నది. ఇంతకంటె వేదపారాయణ చేస్తే బాగుండును గదా అని అంతా అనుకున్నాం. కాని అది ఇంకా ఆరంభించలేదు. ఋష్యాశ్రమంలో వేదనాదం వినపడకుంటే ఎట్లాగో వుంటుంది సుమా. పూర్వం బ్రహ్మముహూర్తం లోనే వేదపారాయణ చేసేవారా? భగవాన్‌ శరీరం అస్వస్థతగా వుంటూ రావటంవల్ల కొన్ని నెలలుగా అది విరమించి ఉదయం ఎనిమిదింటికి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆపరేషన్‌ రెండు రోజులున్నదనగానే రెండు వేళలా సన్నిధిలో పారాయణ నిలిపివేశారు. ఎందువల్ల అంటే, భగవాన్‌ పారాయణం ఆరంభించినప్పటినుండీ ముగించిలేచేంతవరకూ పద్మాసనస్థులై కూర్చుంటారేగాని కాళ్ళు జాపరు. అది బాధ కలిగిస్తుందని ఆపినట్లు వినికిడి. ఏమైతే యేమి? తిరిగి ఆ రోజులు ఎప్పుడు రాగలవా అని ఎదురు చూచే వాళ్ళం.

Naa Ramanasrma Jeevitham    Chapters