44.htm

44. ఫరవాలేదు

31-7-49 మధ్యాహ్నం మా అన్నగారితో గురుస్వామి మొదలియార్‌ వస్తారని తెలిసి ఆ వుదయానికే శ్రీనివాసరావూ, రాఘవాచారి మొదలైన డాక్టర్లొక పది మందిన్నీ యస్‌. దొరస్వామయ్యరూ వచ్చిచేరారు. ''కా& సర్‌'' కాదని గురుస్వామి అన్నారని విని తాము చేసిన పరిశోధనావిధానం వారికి చెప్పదలచుటయే తమ రాకకు కారణమని వారన్నారు. 31 మధ్యాహ్నం గురుస్వామి మొదలియార్‌ వస్తే ఈ డాక్టర్లంతా తాము చేసిన పరీక్షలన్నీ వారితో చెప్పి ''కా& సర్‌ కాదనడానికి ఆధారమేమి?'' అని అడగటం, వెనుక మొదలియారున్నూ వారితో ఏకీభవించటం. ఆ వెనుక ప్రస్తుతోపద్రవనివారణార్థం ఏం చేయటమన్న యోచనవస్తే మొదలియార్‌ ''ఎలక్ట్రిక్‌ మిష& ద్వారా ఆపరేష& చేస్తే మంచిది. అదైతే రక్తస్రావం అంతగా వుండదు'' అని చెపితే అంతా సమ్మతించి, భగవాన్‌ తో మనవిచేసి అనుజ్ఞ పొంది 7-8-49 తేదీన ఆదివారం గనుక ఆనాడు తదితర డాక్టర్లంతా సహకారులుగా వుండేటట్లున్నూ రాఘవాచారియే ఆపరేష& చేసేటట్లున్నూ గురుస్వామి మొదలియార్‌ ఆవేళకు వచ్చేటట్లున్నూ తీర్మానించుకొని వెళ్ళటమున్నూ జరిగింది.

ఆ మరుదినమే భగవాన్‌ శరీరానికి విశ్రాంతి కావలసి వున్నది గనుక రెండు వేళలా వేదపారాయణ సమయంలో తప్ప తదితర సమయాలలో ఎవరూ హాల్లో కూర్చోకుండా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళవలసిందని ఆఫీసువారు నిర్ణయించారు. ఇట్లా క్రమంగా దూరం చేస్తున్నావా ఈశ్వరా? అని తోచి ఎంతో దుఃఖం వచ్చింది. 5-8-49 తేదీనే డాక్టర్ల బసనిమిత్తం మౌర్వీగెస్టుహౌసు బాగుచేయించారు. 6 వ తేదీ ఉదయం పది గంటలనుండీ డాక్టర్లు రాసాగారు. గవర్నమెంటు పర్మిష& తీసుకొని రాయపేట ఆసుపత్రినుండి ఎక్సరేతో సహా ఎలక్ట్రికల్‌ ఆపరేషనుకు కావలసిన సామానంతా ఒక లారీ నింపుకొని, కొంత సామాను తమతమ సొంత కార్లలో పెట్టుకొని మధ్యాహ్నం మూడు గంటలలోపలనే ఈ సేవలో సాల్గొనుటకు అవకాశం దొరకుటయే చాలునని రాఘవాచారితో సహా 30 మందికి పైగా డాక్టర్లు తయారైనారు. గవర్నమెంటు ఆసుపత్రినుండి ఈ విధంగా ఇంత సామాను బయటికి వెళ్ళటనేది ఎప్పుడూ లేదట. పైగా అందుకు గాను ఏ మాత్రమూ ధనవ్యయం లేదు. రానుపోను ఖర్చులు మాత్రం ఎంతగానీ తానే భరిస్తానని పార్థసారథి అయ్యంగారు పూనుకొన్నారు. వారున్నూ 6 వ తేదీ సాయంకాలానికే ఇక్కడికి వచ్చి చేరారు.

ఆశ్రమం ఆసుపత్రి అంతా శుభ్రపరచి ఆయుధ సామగ్రులన్నీ ఉడకబెట్టి బల్లలూ కుర్చీలూ ఏమేమి కావాలో అవన్నీ తయారుచేశారు. ఆపరేష& చేస్తే వాంతులవుతవేమోనని ఆ నాడంతా శ్రీవారికి అన్నం పెట్టక ఎక్సరేతీసి, అల్పాహార మేదో యిచ్చారు. సాయంకాలం మూడు నాలుగు లోపల ఎక్సరే తీసి, లోపలకు పాకలేదనీ, ఆపరేష& చేయవచ్చుననీ నిర్ణయించుకున్నారు. ఈ డాక్టర్లసమూహమే కాక రామచంద్రరావు మొదలైన ఆయుర్వేద వైద్యులూ మరి కొందరు భక్తులూ ఎంతో ఆత్రతతో పరుగెత్తుకొని వచ్చారు. ఆ సంఖ్యలో ఎలక్ట్రికల్‌ ఇంజనీయర్‌ నారాయణరావుగా రొకరు.

లోగడ ఏప్రియల్‌ 3 వ తేదీన జరిగిన ఆపరేష& టైములో ఆదివారం గనుక ఆపరేషను మధ్యలో కరెంటు పోతే టార్చిలూ లాంతర్లూ పెట్టుకొని ఆపరేషను ముగించారన్న సంగతి నారాయణరావుగారికి జ్ఞప్తికి వచ్చి రేపుగూడా ఆదివారమేగదా. ఎలక్ట్రిక్‌ కరెంటుపోకుండా వుండే ఏర్పాటు చేశారా అని అక్కడి వారి నడిగితే అయ్యో మరచి పోయామని అన్నారట. ఆ వెనుక రాత్రి పది గంటల వేళ మెట్టూరుకు ట్రంక్‌ కాలుచేసి ఆపకుండా వుండే ఏర్పాటు చేశారు వారు. ఎలక్ట్రిక్‌ యంత్రంతో ఆపరేషన్‌ చేసేప్పుడు ఆ స్థలానికి చుట్టుపక్కల దాదాపు నలువది గజాల దూరంలో ఎవ్వరుగానే గట్టిగా నడిచినా మాట్లాడినా భూమి అదరి ఆ అదటువల్ల ఆ యంత్రానికి కదలిక కలుగునట. అందువల్ల ఆ సమయంలో ఆపరేషనుకు సంబంధించినవారేతప్ప మరెవరినీ అటు రానీయకుండా చూచే నిమిత్తం పోలీసులనున్నూ ఏర్పాటుచేశారు.

ఉదయంనుండీ ఈ సన్నాహమంతా చూస్తూ వింటూ మధ్యాహ్నం నా కుటీరానికి వస్తే వంటరితనంవల్ల ఏమీ తోచక ఆశ్రమానికి వెళ్ళి ఆ పగలంతా అక్కడేవుండిపోయాను. ప్రొద్దు వ్రాలినకొద్దీ రాత్రి గడవాలే ఎట్లాగా అన్న చింత కలిగింది. ఇది ఇట్లావుండగా భగవానుకు విశ్రాంతి కావాలని సాయంత్రం శ్రీవారి సన్నిధిలో వేదపారాయణ వద్దని మాతృభూతేశ్వరాలయంలో జరిపించి ''ఎవరూ హాల్లోకి పోరాదనీ, బయటనే నమస్కరించి ఇళ్ళకు పోవలసిందనీ'' ఆఫీసువారు ఆజ్ఞాపించారు. భగవాన్ను సమీపించేందుకైనా వీలులేనందువల్ల ఏమీ తోచక మాధవి అమ్మతో కలిసి అటూయిటూ తిరుగుతూ వేదపారాయణానంతరం మాతృభూతేశ్వరాలయంలో దూరి ముఖద్వారంవద్ద మేము ఇతరులకు కనుపించకుండా, భగవా& మాత్రం మాకు కనుపించేలాగున ఒదిగి కూర్చున్నాం. అంతకు ముందే భగవా& ''లోపలికి రానిచ్చి దర్శనం చేసుకొని పోనీయక అందరికీ ఉపద్రవం కలిగించటం ఎందుకు? రానీయం''డని ఆజ్ఞాపించటంవల్ల హాలుకు వెలుపలవున్న వారంతా లోపలికివచ్చి నమస్కరించి వెళ్ళిపోయారట. మాకు ఆవిషయం తెలియదు. భగవాన్‌ మా వునికి కనిపెట్టి ''అరుగో, నాగమ్మ మాధవి అక్కడున్నారు. పాపం. ఈ సమాచారం వాళ్ళకు చెప్పిరమ్మనండయ్యా'' అని సేవకులొకరిని మా వద్దకు పంపారు. ఇక మా ఆత్రత ఎట్లావుంటుంతో వేరే చెప్పాలా?

ఏడు గంటలు కావచ్చింది. భగవా& సన్నిధిలోనూ వెలుపలా సేవకులు తప్ప ఎవ్వరూ లేరు. మే మిద్దరం వెళ్ళి నమస్కరించిలేచాం. మాధవమ్మ చేతులు జోడించి ''భగవానే! రేపు అంతా శుభంగా పరిణమించాలి. శుభోదయంగా దర్శనం కావాలి'' అంటూ ఏమో సణిగింది. భగవాన్‌ ''ఊ-ఊ'' అంటూ తల వూపారు. సాభిప్రాయంగా చూస్తూ నిలిచానే గాని నానోట మాట పెగలనే లేదు. భగవాన్‌ దయార్ద్రదృష్టితో చూస్తూ ''రేపు 9 గంటలలోపలనే గురుస్వామి మొదలియారుని తీసుకొని అన్నయ్య వస్తారట'' అన్నారు నాతో. ''అట్లాగా!'' అని ''భగవాన్‌ అనుగ్రహించాలి'' అంటూ దీనంగా శ్రీవారివంక చూచాను. భగవాన్‌ చిరునవ్వుతో తల ఎగురవేస్తూ ''ఫరవాలేదు'' అన్నారు స్ఫుటంగా. మా గుండెలు చల్లబడ్డవి. ఇద్దరం పునః పునః నమస్కరించి ఆ చల్లనిమాట చెప్పుకుంటూ ఇళ్ళకు చేరాం.